"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 అక్టో, 2018

బాల్యం

ఇన్ని సంపెంగలు
గుప్పెట్లో పోసినట్టు
బాల్యం గుర్తు వస్తే..

పరుగులు ఆపకు.. ఆపితే
దొంగాట లో ఔట్ చేస్తారు
చిన్నప్పటి స్నేహితులు.

కరిగిపోయింది ఐస్ గడ్డ
పుల్ల మటుకు చేతిలో
జిల్ మనే అనుభూతి కోసమే.

అడుగులో అడుగులు వేస్తూ
వెళ్లినా స్కూల్ ఎంత దగ్గరో
ఎన్ని అడుగులు వేసినా ఎంత
దూరమో ఇప్పుడు.

హోంవర్క్ చేస్తే చాలు
ఆటలు ఆడుకోవచ్చు
ఎంత వర్క్ చేసినా
ఆటలు లేవేమిటి ?

సుదూర స్వప్నం సెలవులు
ఇప్పుడు సెలవంటే శిక్ష
ఎన్ని డబ్బులు ఒంపాలో
ఒక్క సెలవు కి.

పరుగులు తీసి కింద పడితే
చెక్కుకు పోయేది మోకాళ్ళ చిప్పలు
జీవితం బ్యాలన్స్ తప్పితే చిక్కులే చిక్కులు.

ఏడాది చివర పరీక్షలు
పాస్ అవుతే చాలు ప్రమోషన్
ఈ పరీక్షలు ఏమిటో చెప్పి రావు..

పాములు తప్పించుకుని
ఎక్కితే పంటే పాముల పటం ఆటలో
నిచ్చెనలు కూడా పాములే ఈ ఆటలో .

మూడు కాళ్ళ బండి లాగుతూ
నడక నేర్చుకున్నాను .
కర్ర సాయంతో ఇప్పుడు అదే ఆట.

బోసి నవ్వులు ఎంత ముద్దో
ఇప్పుడెందుకు అంత దైన్యం
నవ్వుకుంటూ నువ్వే
అప్పుడూ ఇప్పుడూ..

23 10 2018
వసంత లక్ష్మి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి