"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 జూన్, 2019

వాన వచ్చే ముందు..



నీలాకాశం మాయం అవుతుంది
ఎక్కడినుంచో వచ్చిన  నీటి మబ్బులు
నీలి రంగుని పీల్చి
దట్టమైన మబ్బు రంగులోకి
మారుస్తాయి
పల్చటి నీలి రంగు ప్రమేయమేమీ లేదు
పింజెలు గా తిరగాడిన మేఘాలూ
మరి మాయమయ్యాయి నిన్నటిలోకి
అప్రమేయ ఆనందమా ?
అంతు పట్టని ధుఖమా ?

వాన వచ్చే ముందు
పట్టే మబ్బులకేం తెలుసు
తను రాల్చే నీటి ధారలు
ఏ రైతు కంటి కన్నీరు కారణమో
ఏ పసిపిల్ల కేరింతలకో
ఏ నవ వధూవరుల ముసిముసి నవ్వులకో
ఏ గృహిణి పరుగులో ,
ఏ మనిషి అంతరంగం ఆల్చిప్ప లో
మేలిమి ముత్యమో ? ఆ చినుకు ప్రయాణం
ఎవరికి ఎరుక ?

వాన వచ్చే ముందు
పట్టిన ముసురు ఒక్క గాలి దుమారం
ముందు వీగిపోవచ్చు
నిన్నటి వాగ్విదాం ,ఇవాళ్టి చిరు పలకరింపుతో
కొట్టుకుపోయినట్టు
వాన ఎక్కడ ఎలా కురుస్తుందో
ఎందుకో ఎవరికీ అర్ధం కాని ఒక పెద్ద మిస్టరీ
కన్నీరు ఆడవారికే ఎందుకు ? అన్నది కూడా

చెట్లూ వాగులూ  పిపీలకాదులూ
ప్రార్ధిస్తాయా ? వాన కోసం
ఏమో పూలు పూయించి
చిరు కెరటాలు కదిలించి
అటు ఇటూ కదిలే అతి చిన్న ప్రాణులు
ఏ కార్యాచరణమైనా పూజే కదా
త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించే కార్యం ఏదైనా

వానలు అందుకే అడగని వరాలు
మనం కోరితే వచ్చాయని మురిసిపోకు
మనం ఏం వ్రతాలు ఆచరించామని ?
వాన వచ్చే ముందు
మబ్బు కీ తెలియదు ,ఏ ప్రాంతం ఏ భాష ? అని
వాన వచ్చే ముందు ..
మబ్బులు మబ్బులు మబ్బులు
గుంపులు గానే వస్తాయి .
చినుకు చినుకు చినుకు్లుగా
విడిపోతాయి ,
మానవ సమూహం లో వ్యక్తి ప్రతీకలా
వాన వచ్చే ముందు
నువ్వు నువ్వు గా ఎదురు రా !
వాన వచ్చే ముందు ..
నువ్వు నువ్వుగా తడిసి ముద్దై పోడానికి తయారుకా
కన్నీరు అంతా బయటకి ఒంపేస్తే
ఆఖరున మిగిలేది తడి కనుల ప్రశాంతత
ఆ అనుభవం మటుకు నీకు నీవు ఎప్పుడూ
దూరం చేసుకోకు ..

వాన వచ్చే ముందు
నువ్వు ఏం చేస్తున్నావు ?
సమాయత్తం అవుతున్నావా ??
వాన వచ్చే సూచనలు వస్తున్నాయి మరి .

వసంత లక్ష్మి .

2 కామెంట్‌లు:

  1. ఇంత మాంచి వాన కవిత చల్లటి ప్రతీ చినికుల అన్ని అక్షర ఆణి ముత్యముల మా లక్ష్మీ వసంత మాత్రమే రాగలదు ఎందుకంటే తెలుగులో ఈకవి రాయలేని భావాలు ఆణి ముత్యపు అక్షరాలు ఆమెకు మాత్రమే సొంతం ముమ్మాటికీ

    రిప్లయితొలగించండి