"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 అక్టో, 2013

నాకు రాజకీయాలు వద్దు..

తామరాకు మీద నీటి బొట్టులా 
నాకు ఏమీ అంటకుండా ఈ ప్రాపంచిక విషయాలు 
బ్రతికేయాలని రోజూ అనుకుటాను , అనుకోవడం కాదు 

నేను నడిపే నాలుగు చక్రాల బండికి ,నల్లటద్దాలు వేసి ,
నాలుగు రోడ్ల కూడలి లో బిచ్చగాళ్ళ అడుక్కునే చేతులు 
కనపడకుండా ,ఎదురుగా అంతులేని వాహనాల వెనక భాగాలు చూస్తూ ..
వాహనం నడిపేందుకు కావల్సిన ఇంథనం , అయిదు వందల రూపాయలకి 
అయిదు లీటర్లు కూడా రావా ? ఐతే సరే , రేపు మరో వంద ఎక్కువ పెడతా జేబులో 

ఏమిటి ,ఇదంతా కూడా రాజకీయాలేనా ? ఎక్కడో అమెరికా లో ద్రవ్య నిధి లోపమా ?
ఇక్కడ నా జేబు కి చిల్లు పడడమా ? ఇదంతా రాజకీయమేనా ?
నాన్సెన్స్ .. వార్త పత్రిక లో ముందు స్పోర్ట్స్, తరవాత సినిమా విశేషాలు ,చూసి 
విసిరి కొట్టెస్తాను వార్త పత్రిక .. నాకెందుకు రాజకీయాలు ? 

మా ఇంటి చుట్టూ చూసారా హై వోల్టేజ్ కరెంట్ తీగలు ..
మా ఇంట్లోకి యే దొంగా రాలేడు, నలు దిశెలా కమెరా కన్నుల కాపలా .
ఇంక రాజకీయాలు ఎలా తొంగి అయినా చూడలేవు ..కాస్కోండి ..
నా ఇల్లే స్వర్గం ..నా పిల్లలు ,నా భార్యలు...ఒహ్ సారి భార్యా నా స్వర్గం ..
ఇందులో ఎవరూ నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా గాలి కి కూడా అనుమతి లేదు . 

ఏమండీ ,మీరిచ్చిన వంద రూపాయల నోటు తో ఒక్క ఉల్లిపాయలే కొనగలిగాను ,
మరి కూర ఏం చేయమంటారు ? హహ్. 
ఎవరో అరుస్తున్నారు , వీధిలో ఉల్లిపాయల ధరలని దించలేని ప్రభుత్వం దిగి పోవాలి ,చా 
అన్నిటికీ వీధి కెక్కుతారు , అలగా జనం ,ఇదిగో మరో వంద ,,మరో కూర కొని వండు 
నాకు కూర లేనిదే ముద్ద దిగదు అని తెలుసు కదా .. 
అయినా అదేమిటి ? మొన్న తెచ్చిన కాష్ అప్పుడే అయిపోయింది పర్సులో 
అప్పటికీ ,భార్య దుబారా చేయదు, ఆమె చేతిలో అందుకే కాష్ ఉంచను కదా ?

కొంపదీసి ఇదంతా రాజకీయమా ??? నన్ను అలజడి పరిచే ,నా గుప్పెట్లొ ,నా అధికారం లో లేని ఈ పరిస్థితులు ?
కొంపదీసి రాజకీయమా ?? అమ్మో . మా ఇంట్లోకి వచ్చేసింది.. పెద్ద తాళం వేసేయాలి ..
నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నా మానాన నన్ను వదిలేయండి.. నాకు రాజకీయాలు వద్దు.. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి