"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 అక్టో, 2013

స్మృతులు ఎన్ని రకాలు ?


చిన్నప్పుడు అయిపోతుందేమో అని దాచుకున్న పీచు మిఠాయి లా
కొన్ని దాచుకున్నా ,కరిగి పోతాయి ,
తరవాత తిందామని దాచుకున్న పీచు మిఠాయి అణిగి పోయినట్టు ..
మస్తిష్కం లో ఎన్నో పొరలు ట.. దాగుడు మూతలు ఆడుకుంటూ దొంగ కి దొరకకుండా
దాక్కున్న చోటు నుంచి ఎవరూ వచ్చి ఇదిగో అంటూ పట్టుకోక పోతే కలిగే
అసహనం ఈ దాక్కున్న జ్ణాపకం  వచ్చీ రాకుండా ఏడిపిస్తూ ఉంటే ..

మరి కొన్ని అమ్మ కొంగున ముడి వేసి దాచుకున్న చిల్లర కోసం ఇల్లంతా వెతుకుతున్న
ఘటన లాగా ,ముడి బిగుసుకు పోయి ఊడి రానివి ..
అదిగో ,అల్లదిగో ఆ చెట్టు మీదనే నువ్వు చివర వరకూ వెళ్ళి పోయి కొమ్మ అల్లాడుతూ ఉంటే
భయం తో బిగుసుకు పోయిన ముడి లాంటి జ్ణాపకం ..ముడి విడదీస్తున్నావు అనుకుంటాను
బిగదీసుకుంటున్నట్టు తెలియదా నీకు ??

సముద్రం ఒడ్డు న ఇసుకలో కాళ్ళు ఈడుస్తూ కొన్ని పగిలి పోయిన జంట గవ్వలు ,
ఆల్చిప్పల పై చిప్పలు ,తేలిక రంగులు , హరివిల్లు లోవి అంటించుకున్నట్టు , మురిపం గా రంగులు
సొంతం చేసుకునే కల ల రోజులు గుర్తు గా సొంతం చేసుకున్న ఆల్చిప్పలు
గుండ్రం గా ఉన్న రాళ్ళు అంటే ఎంత మోజు ? అన్నీ జీవితం లో అలా మృదువుగా , సిమ్మెట్రీ తో
ఉంటాయని కొండంత ఆశ కాదూ .. ఆఖరికి , గట్టిగా ఉన్నవే రాళ్ళు అని తెలుసుకోలేదూ !?

చీరలకి కూడా జేబులు ఉండాలని ,ఆ జేబుల్లో  కన్నీళ్ళు తో తడిసిన చేరుమాళ్ళు , వెనక్కి తిరిగి వచ్చిన
ఉత్తరాలు , ప్రేమలు , స్నేహాలు , తరగతి మారుతూ ఉంటే మారి పోయే స్నేహాలు , కొన్ని ,కోరికలు తీరినా ఎందుకని కలగదు సంతోషం అనే అయోమయాలు ...పడేయొచ్చు ..మా లేడీస్ బాగ్స్ సరిపోవా ?

సరిపోవు .. అంతే ..

కొన్ని జ్ణాపకాలు ,స్మృతులు , గుర్తులు కి ఎన్ని పొరలూ సరిపోవు అంతే ..
ఒక చిన్న గడ్డి పోచ ,ఒక రుమాలో ,ఒక అట్ట పెట్టో ,ఒక చిన్న పూసల గొలుసో ..ఆలంబన గా
గుచ్చు కుంటాం ..

ఎన్ని స్మృతులో .ఎన్నీన్ని గుర్తులో ..అన్నిటికీ ఒక్క జీవితం ..సరిపోతుందా ? ఏమో ??


2 కామెంట్‌లు:

  1. కొన్ని జ్ణాపకాలు ,స్మృతులు , గుర్తులు కి ఎన్ని పొరలూ సరిపోవు అంతే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రహ్మతుల్లా గారూ ..
      ధన్యవాదలు అండీ .
      నా కవిత చదివినందుకు ..
      నచ్చినందుకు ..
      వసంతం .

      తొలగించండి