"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

10 సెప్టెం, 2015

కాందిశీకులు


  • అమ్మ ఒడి నుంచి జారాడేమో మరి
    పాలు కారు బుగ్గలని
    గరుకైన ఇసకలో తల ఆంచి
    నిదుర పోతున్నాడు ..శాశ్వతంగా ..
    మనకెందుకు లెండి ?
    మన జీతాలూ ,జీవితాలూ
    ఇవే పెద్ద సమస్యలు మనకి 
    శ్రీమంతుడు తరవాత మహేష్ బాబు
    సిన్మా పేరేమిటో ?

    మన ఇంటి ముందు చెత్త బుట్ట
    తీయించి పక్క ఇంటి ముందు
    పెట్టించేవరకు నిద్ర పోను అని శపధం చేసావు
    కుక్కలకి శాశ్వత నిద్రా ? కుటుంబ నియంత్రణా ?
    ఎన్ని సమస్యలు మనకి .

    అగ్ర రాజ్యాల చదరంగం లో
    పక్కన పడేసిన బంట్లు , తెలుపో నలుపో
    అన్నీ ఒక్క సారే ఇల్లే లేని కాందిశీకులు
    కాదు కాదు దేశమే లేని కాందిశీకులు
    అయిపోయారు .. మనకెందుకు ?
    అసలా సిరియా మాప్ లో ఎక్కడుందో ఇన్నాళ్ళూ
    మేమెరుగం ..అసలా దేశం ఉందా ?

    సరిహద్దులు గీసారు ,
    ఇదే నీ దేశం అన్నారు ..
    పట్నాలూ ,పల్లెటూర్లు మీ ఇష్టం అన్నారు
    ఫలానా వీధిలో నాలుగో నంబరు ఇల్లు నీది
    అన్నారు , పోస్ట్ మాన్‌ కూడా వచ్చేవాడు
    చిన్న ఇల్లు ,ఇంటి చుట్టూ గోడలు ,
    ఇంటికి చిన్న ద్వారాలూ ,కిటికీ లు
    ప్రపంచం అంతా కిటికీ లోంచి చూసే పసిదనం .

    ఓ నాడు మా గూడు
    భస్మీపటలం అయింది ,
    అల్లా ! అని మొర పెడుతూ
    నాలుగు మూటలు వీపున
    మోస్తూ ఎడారి దాటి ,ఈ
    ఓడ ఎక్కాం , సముద్రాన్ని దాటిస్తాను
    అని మాట ఇచ్చిన సరంగు ఏమయాడో

    ఓడ మునిగింది , పసి ప్రాణం నిద్రలోనే
    జల సమాధి అయి ,అలా ఒడ్డుకి ఒచ్చి పడ్డాడు
    అవును , మన ఇంట్లో పసి పిల్లాడిలాగే ఉన్నాడు ..
    అవే రెండు కళ్ళు ,రెండు కాళ్ళు ,రెండు చేతులూ
    మతం అని ఏమీ ప్రత్యేక అవయవం కనిపించలేదు .

    బంతి ని అటు వేసి ,ఇటు వేసి కోర్టు లో
    బంతాట ఆడినట్టూ , దేశాలు ఆడుకున్నాయి .
    మాకొద్దీ రెఫ్యూజీలు ..మాకొద్దీ ఓడ నిండా ప్రాణులు
    అంటూ సముద్ర పాలు చేసారు ..

    మీరు మొదలు పెట్టిన ఆట కదర్రా ఇది ,
    అని ఎవరూ కర్ర పట్టుకుని చెప్పేవారు లేరా ?
    శాంతి సంఘం కళ్ళూ ,ఊపిరి మూసుకుని
    మెడిటేషం చేస్తోందా ? మానవ ప్రాణాలు ..
    ఒక తిమింగలమో ఒక కోరల్‌ వృక్షమో పాటి
    చేయవా ?  ఏవీ శాంతి మంత్రం జపించే దొంగ పిల్లులు?
    కంట నీరు పెట్టి , ఏం లాభం ? 
    పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ? 
    హే భగవాన్‌ ! ఇంత మూగవై పోయావా ? 
    ఏ పేరుతో కొలుస్తారు అని ఎదురు చూస్తూ 
    మూగవాని వయ్యావా ?

    అభివృద్ధి చెందిన దేశాలుట
    వారి ప్రాణాలు మటుకు బాంకులకి
    తణఖా పెట్టారు , ఎన్ని శవాల మీద చిల్లర
    ఏరుకుంటే ఆ ప్రాణాలకి ఊపిర్లు వస్తాయో !

    సిరియా ... నీ ఎడారి ఇసకలే నయం ..
    ఈ సముద్ర ఒడ్డు న మటుకు ఇంక
    ఎదురు చూడ్కండి ..ఇక్కడ ఎవరూ
    మానవతావాదులు లేరు ,ఇక్కడ అందరూ
    దేశభక్తూలూ ,దేశ పౌరులూ అంతే ..
    సరిహద్దులు మధ్య బిగించుకున్న పౌర సమాజం .మాది ..
    మా తలుపులు మరి తట్టి , మాకు విసుగు
    తెప్పించకండి ..మీ చావు మీరు చావండి ..
    మీ చావు మీరు చావండి ..అంతే ..

2 కామెంట్‌లు:

  1. Things every human must understand.

    ఓడ మునిగింది , పసి ప్రాణం నిద్రలోనే
    జల సమాధి అయి ,అలా ఒడ్డుకి ఒచ్చి పడ్డాడు
    అవును , మన ఇంట్లో పసి పిల్లాడిలాగే ఉన్నాడు ..
    అవే రెండు కళ్ళు ,రెండు కాళ్ళు ,రెండు చేతులూ
    మతం అని ఏమీ ప్రత్యేక అవయవం కనిపించలేదు .

    రిప్లయితొలగించండి
  2. మనోహర్ చెనికల గారూ !
    ధన్యవాదాలు ..నా కాందిశీకులు కవితకు మీ స్పందన చూసాను ..మీకు నచ్చినందుకు సంతోషం ..మానవతా వాదం అత్యవసరం అయిన కాలం ఇది ..
    వసంత లక్ష్మి .

    రిప్లయితొలగించండి