"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 డిసెం, 2018

హేమంతం


నా కిటికిలొంచి నాకు చంద్రుడు కనిపించి
కుశలం అడుగుతున్నాడు ..
కింద నల్లటి చీకటి దుప్పటి కప్పుకున్న సముద్రం
పైన పలచటి మబ్బు చీర ధరించి ఆకాశం ..
అమ్మ బోర్లించిన వెండి బువ్వ పళ్ళెం లా చల్లగా చంద్రుడు
అమ్మ ఆరేసిన చీర మీద ఒడియాల్లాగా మిణుకు మిణుకుమంటూ తారలూ ..
సన్నగా మెలి పెడుతూ చెవి అమ్మ కసిరే మాటల్లా కోస్తూ చల్లని రివ్వున ఇంకా చలి గాలి కాని గిలి గాలి ..

శీతా కాలం మరి ఆ చివర ,ఆ వీధి చివరే ఆగింది బిడియంగా ,
ప్రేమ నిండిన పెళ్ళి కూతురి లా మొహం దించుకుని ..
మెల్లగా ,శుభంగా అడుగు పెట్టమ్మా ! అని మరి ఆహ్వానించాలా !!
ఆయత్తమవుతున్నాం ... అందుకే ,చిట్టి చామంతులూ , బొద్దు బంతి పూలూ , ముద్దు ముద్దు రంగుల పూలు ..అలంకరించి ధరిణికి ..

ఆకశాన ఎవరి కబురో అందాలి మరి ఋతువుల రాణి .ఊరికే వస్తుందా?
పిలిస్తే వస్తుందా ? పిలవాలా అసలు ..
గుమ్మం వరకూ వచ్చిన వారికి ఇంకా పిలుపులేమిటి ? అని అశ్రద్ధ చేయకు సుమీ ..మనింటికి వచ్చిన మన పిల్లైనా సరే , ఆహ్వానించాల్సిందే ..

శోభాయమానంగా అలంకరించిన గృహం కాదనుకునే రాణి కలదా ? ఇలపై ..
మన ఇల పై ..

పూల దారి ఏర్పరిచాను , చెట్టు ఆకులు రాల్చి ,ఒత్తున ఆకుల దారీ పరిచింది ..
ఆకుపచ్చని ఆకులూ రంగులద్దుకున్నాయి ..ఈ మహోత్సవం లో
తామూ పాలు పంచుకోవాలని ..
రాలిన ఆకులకే మాత్రం దిగులూ బొగులూ లేదు ..
తమ జీవితం ధన్య మయాయయని ఒక పులకింత తప్ప ..

శీతాకాలం ఆసన్న మవుతోంది , ప్రభూ అని నలు దిశలా ప్రభలు ఎత్తుకున్నట్టు సంధ్యాకాశం రంగుల హంగులు ఆరబోస్తోంది ..

మరి మనం సమాయత్తం అవుదామా ?
ఈ ఆఖరి శిశిర రాత్రి పారవశ్యానికి ?
హేమంత ప్రభువు పంపించిన కానుకలు
స్వాగతిస్తూ చాపుదామా హృదయ గవాక్షాల తలుపులు ?

చంద్రుడు నా కిటికీ ముందు స్థిరంగా నిలిచి
ఇలా ఎన్ని కబుర్లు చెప్పాడో ..ఈ హేమంత చంద్రుడు ..
ఉదయం సూర్యోదయానికి ముందే ..
ఈ సమాగమానికి ..నా హృది అదుపు తప్పిస్తూ
ఈ రాత్రికి మరి సెలవు తీసుకోనా ? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి