"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 డిసెం, 2018

మరి కొన్ని మాటల మూటలు


చెట్టుకి వేలాడుతూ
చంద్రుడు
చిన్ననాటి ముచ్చట్లు
గుర్తు వచ్చాయేమో..

మబ్బులు అటూ ఇటూ
పరుగులు తీస్తూ
పోస్టుమాన్ ఆట
అడుకుంటున్నాయి..

గాలి ఈలలు వేస్తూ
గోల గోల చేస్తోంది
లాంగ్ బెల్ కొట్టాక
పిల్లల అల్లరి గుర్తు చేస్తూ ..

ఓ మొగ్గ వికసించే
పక్క పూవుని చూసి
అక్క మీద అలిగిన చెల్లి లాగా
మొహం ఎఱ్ఱబరుచుకుంది.

కాలి కింద నలిగే
గడ్డి పూవు తలచింది దయగా
నయమే నాకో ముల్లు
కాపలా లేదు , గులాబీ లాగా ..

మల్లెలు మాట్లాడుకునే మాటలు
ఏముంటాయో ? మాలలుగా
మళ్ళీ కలుసుకుని చెప్పుకుందామా 
లేదా విడిపోయి విడి పూలు గా ఉంటామా  ?

గులాబీలు , చామంతులు
ఎందుకో ఎప్పుడూ కలుసుకోవు
గులాబీ పెళుసు అని
చామంతి ఘనం అని చెప్పుకుంటాయేమో..

మరువం కలిపిన మల్లెమాల
తలలో చేరి పోటీ పడ్డాయి
నువ్వా నేనా గొప్ప పరిమళం అని
మర్నాటికి వాడి పోయి నేల పడ్డాయి.

చంద్రుడి నీల కిరణం
ఒకటి సూటిగా చేరి నీలి
కలువతో చెప్పిన ముచ్చట్లు
ఏవో సరస్సు వింటూనే ఉంది.
రాత్రి అంతా.

ఆకాశం వెండి చీర
ధరించి , చుక్కలుతో
చమ్కీలు కుట్టుకుంది
తెల్లవారేసరికి రాలి పోయాయి ..అయ్యో.

రాత్రి ఆడిన ఆటలు చాలు
ఇక పోయి పడుకో అంటూ చంద్రుడిని
అదిలించి , ధగధగలాడుతూ
పట్టు పంచె సవిరించుకుంటూ సూరీడు.

వసంత లక్ష్మి
ఉబుసుపోక రాసుకున్న మాటలు
విశాఖపట్నం
22 12 2018.

2 కామెంట్‌లు: