"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 సెప్టెం, 2010

మన పయనం ముందుకే.


ఏలూరు లో రామకృష్ణా పురం లో ఉన్న రోజులు. చుట్టూ అరుగులు, మధ్యలో ఓ పెంకుటిల్లు, ఆరుగురు పిల్లలు, ఇంటి నిండా ఎప్పుడూ స్నేహితులు, చుట్టాలు, వచ్చి పోయేవాళ్ళు, వీళ్ళు చాలక , వీధి చివర పాపాయి రచన ని తెచ్చి ముద్దు చేసే అమ్మా -నాన్న గారలు, ఇంటి కి తలుపులే లేవు,ఎప్పుడూ తెరిచే ఉండేది ఆ ఇల్లు,  ఇంట్లో మనుషులం కూడా అలాగే  ..తలుపులు తాళాలు వేసుకుని దాచుకునేందుకు అంతా విలువైనవి ఏమి లేవు కదా అని నిశ్చింత.. 

ఇప్పుడు మనుషుల్లో ఎంత మార్పు. ఇంట్లోకి రాగానే, అదేదో ద్రిష్టి యంత్రాని చూడమని ఒకరు, చిన్న పిల్లలకి జ్వరం వస్తే, ఎవరో ద్రిష్టి పెట్టారని, భయపడే వాళ్ళు, వ్యాపారం లో నష్తం వస్తే, ఏదో శని గ్రహం అని రేకులు తెచ్చి కట్టడం, ఇవి నిజం గా నమ్ముతున్నారా ప్రజలు? లేక పోతే టీవీ చానెల్స్ లో ఇన్ని రకాలు  ద్రిష్టి యంత్రాలు, శని తాయత్తులు జనం ఎలా నమ్ముతున్నారు? మనం ముందుకు నడుస్తున్నామా? లేక వెనక్కి పరుగులు పెడుతున్నామా?


ఒక పక్క చంద్రుడు మీద కాలు పెడతాం ,రాకెట్లు పంపిస్తాం అంటున్న  శాస్తజ్ఞులు, మరో పక్క అనారోగ్యం అంటే తాయత్తులు అంటూ, వ్యాపారం లో నష్టాలు వస్తే ద్రిష్టి తగిలిందని యంత్రాలు కట్టుకుంటూ, మూఢ నమ్మకాలతో జనం కాలం నడుపుతూంటే ప్రభుత్వం ఏం చేస్తోందో అర్ధం అవటం లేదు.


పూర్వం ఈ మూఢ నమ్మకాలు కి నిరక్షరాస్యత్ తో సంబంధం ఉందని నమ్మే వాళ్ళం. చదువు కున్న వారే నేడు ఈ యంత్రాలు, తంత్రాలు ని నమ్ముతున్నారంటే, చదువు ,ఈరోజుల్లో ఎంత వికాసాన్ని ఇస్తోందో అర్ధం అవుతున్నది. టీవీ చానల్స్ లో భారిగా ప్రకటనలు, రాష్ట్రాన్ని బట్టి వివిధ భాషల్లో ప్రకటనలు, వాటినే శాస్త్రీయం గా చూపడానికి మోస పూరిత ప్రకటనలు,ఎంత వ్యాపార దృష్టి తో చేస్తున్నారో, ఎంత లాభాలు అర్జిస్తున్నారో, ఎంత పక్క గా వ్యవస్థి కృతం చేస్తున్నారో ఈమోసాన్ని, ప్రజలకు  వివరించ వలసిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వం కి.


చేతబడులు చేస్తున్నారు అంటూ అమాయక స్త్రీలని కొట్టడం, కొట్టి చంపడం, చిల్లన్గులని, మందు పెట్టారని, మాయలు చేస్తున్నారని, నమ్మడం, నమ్మించడం, టీవీ లో కూడా వీటిని కథలు కథలు గా ప్రచారం చేయడం, అన్నీ చూస్తూ,కూడా, ఎవరూ ఖండించక పోవడం, ఇవన్నిచూస్తూ ఉంటే మనం ఇరవై ఒకటో శతాబ్దం లోకి నిజం గా అడుగుపెట్టామా అని అనుమానం వస్తున్నది.


చదువు మానసిక వికాసం, ఆలోచన, అవగాహన, శాస్త్రీయత లను  పెంచి, నవ్య సమాజం లో నవ నాగరికులను తయారు చేయాలి, కాని, నేడు, వ్యాపార ధోరణి లో సాగే ఈ చదువులు ఒక వస్తువు ను తయారు చేస్తున్నాయి. ఈ వస్తువు వ్యాపార ధోరణి తో అలోచించి, జనం మూర్ఖత్వాన్ని పెట్టుబడి గా ఈ యంత్రాలు తయారుచేసి, కొల్ల గొడుతున్నారు. ఒళ్ళు జలదరించేలా  ఉన్నాయి ,ఈ ప్రకటనలు.


ఎవరో   ఒకరు మన ఇంటికి రావడం, ఒక  చెడు దృష్టి తో చూడడం, ఏదో నష్తం కలగడం, ఈ యంత్రం కడితే అన్నీ పోవడం, ఎలా సంభవం..జీవితం లో ఒడిదుడుకులు ఉంటాయి. ధైర్యం గా ముందుకు సాగడానికి, ఆలోచన, సమయమం అవసరం.అంతే కాని, ఎవరో వీటికి బాధ్యులు అని, అప నమ్మకం తో, ఏవో యంత్రం మరేదో తంత్రం ని నమ్మడం.. అంటే మన జేబులో చిల్లు, వారి చేతిలో ఘల్లు ఘల్లు ..ఇప్పటికైనా జనం మేలుకుని ఈ టీవీ ప్రకటనలని నమ్మడం మాని, వారి వ్యాపారం ని మూత పరిస్తే , జనం కి మేలు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలే, ప్రజలు మేలుకుంటే, ప్రభుత్వాలు కూడా ఉలికి  పడతాయి, ప్రజలకు అనుకూలం గా పని చేస్తాయి.


మనసు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండండి, మూఢ నమ్మకాలని వదలండి..మీ ఆరోగ్యం, మీ రక్షణ, మీ చేతిలోనే ఉన్నాయి. పత్రికలూ, మీడియా కూడా ఈ విషయాలను బల పరిచి,ప్రజలకు నిజమైన మేలు చేస్తాయి అని ఆశ పడుతూ..


విజ్ఞానం అనే ఒక చిన్న దీపం వెలిగించండి, అజ్ఞ్ఞానం ని తొలగించండి అని వేడుకుంటూ ,


చదువు, సంస్కారం, విజ్ఞానం అనే వెలుగు లోకి మన నడక అని మళ్లీ మళ్లీ పిలుపు నిస్తూ,


ఎందఱో మహానుభావులు మనకి దిశా నిర్దేశంచారు,  మరి వెనక్కి ఇంక చూడకండి,


మన పయనం మరి ముందుకే.. ముందుకే.. ముందుకే.....















      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి