"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 జూన్, 2014

పనస పొట్టు కూర ..పూర్ణా మార్కట్

నిన్న ఎవరో మితృలు పనస పొట్టు కూర అని చెప్పేసరికి ,నా మనసు నందు మెదిలే ..ఈ పూర్ణా మార్కట్ చిత్రం ..
మా ఇంటినుండి బయలు దేరి ,అలా సిరి పురం కూడలి లో ఎడమ పక్క తిరిగి, పూర్వం ఎల్లీస్స్ గార్డెంస్ అన బడే ఎల్లమ్మ తోట, ఇప్పుడు జగదాంబ కూడలి లో ఎక్కడా ఆగక, అలా ముందుకు వెళుతూ ఉంటే టర్నర్‌ సత్రం వస్తుంది ,ఆ ప్రక్కనే మన విశాలాంధ్ర పుస్తక నిలయం ఉంటుంది, మరి అక్కడ తొంగి కూడా చూడకూడదు , ఆ మాయ లో పడితే మరి లేవను , ఇంకా ముందుకు తిన్నగా అలా వెళుతూ ఉంటే ,మా పూర్ణా మార్కెట్ వస్తుంది ..పూర్వం ఇక్కడే పూర్ణా థియేటర్ ఉండేది ,పాత హాలు లో మరి చాలా పాత సిన్మాలు కూడా చూసిన జ్నాపకాలు వేలాడుతూ వెంబడిస్తాయి , ఎదురుగా పూర్ణా ఆప్టికల్స్ ,నడిపేది ఎవరనుకున్నారు ? ముస్లిం ఫామిలీ ,మూడు, నాలుగు తరాలుగా ఏమో నడుపుతున్నారు ఆ షాప్ లు . వాచ్ రెపేర్ కూడా వారి దే ..
ఆ అంచునే మొదలు అవుతుంది ,పూర్ణా మార్కెట్ సందడి .
పాదాచారులు నడవడానికి మిగిల్చిన దారిలో ఏమో ప్లాస్టిక్ సామాన్లు అమ్మే దుకాణాలు, అక్కడ దొరకనివి లేవు ..
మగ్గులు, బకెట్లు , చాటలు ,కాదేది ప్లా్స్టిక్ కి అనర్హం ? అని సమస్తం కళ్ళ కి పసుందు గా కనిపిస్తాయి , పాత తాళాలు , ఇనప సామాన్లు, స్టీలుసామాన్ల కొట్లు , పూజ సామాను , ఇత్తడివి . స్టీలువి ..ఒకటేమిటి ? మనకి ఏం కావాలి అన్నా ,ఈ మార్కెట్ కి వస్తే సరిపోతుంది ..
ఇంక కుడి వేపు తిరిగితే మొదలవుతుంది ,ఎంత జీవన వైవిధ్యమో , బుట్టలు ,తట్టలు ,పట్టుకుని ,కొప్పులు ముడి వేసి ,కుడి పైట వేసిన మన అప్పలమ్మ లు, అప్పాయమ్మలు ,నూకాలమ్మలు ,ఇంతింత పెద్ద కుంకుం బొట్టులు తో , కాలి కి బరువైన వెండి కడియాలు కంఘ్ మని మోగుతూ , ఐదు రూపాయలకి ఐదు కట్టలమా ! అంటూ కొత్తిమీర పరిమళం , ముక్కు కి ఆనించి లాగేస్తారు ,మొదట్లో తెలియక ,ఆ పరిమళ మాయ లో పడి ముందే ఈ ఆకు కొనేసి ,ఇంకా తక్కువకి కూడా అమ్ముతారని ..ఓ బాధ పడి పోయాక ,ఇప్పుడు తెల్సింది లెండి ,ఆకు కూరలు ఆఖరున కొనాలి అని ,నలిగి పోతాయి కదా ..
మనం కారు లో వెళితే కనుక ,ఈ బుట్టల వాళ్ళు అందరూ ఒక నిముషం లో బుట్ట తట్ట ఎత్తి పట్టుకుని , మనకి చోటు చేసి ,మళ్ళీ వారి జాగా లో వారు కూర్చుంటారు , సహ జీవన సౌకర్యం ..ఎంత బాగా నేర్చితిరో కదా ? ఔరా ?? అని ఆశ్చర్య పడిపోతాను ..నేను ..
ఒక వర్స పాటించాలండీ ,ఎలా పడితే అలా ప్రవేశిస్తే ఎలా ? రండి చూపిస్తాను ,నాతో పాటు మా పూర్ణా మార్కెట్ .. రంగుల హంగులు ..
ముందు రోడ్డు వైపు నుంచి చాకచక్యం గా ,ఆవులు ,గేదెలు రాకుండా అమర్చిన ఇనప పట్టి ల ను దాటి ,అడుగు పెట్టామా ?? పెద జాలారి పేట అమ్మణి లు, అమా బత్తాయి ,కమలా ,ద్రాక్ష ,అంటూ నాలుగేసి తీసి మన చేతిలో పెట్టేస్తూ ఉంటారు, అబ్బో ,ఏదో పేరంటం అనుకునేరు సుమీ ,రేటు కట్టి ..ఇవ్వాల్సిందే ,ఎంత ? అంటూ అడిగామా ? ఎంత ..వంద అంటూ ఒక పెద్ద అంకె చెప్పి గుండే గుభేల్ మనిపించాక , వారిని తప్పించుకుని ఆ మయ సభ లో ముందుకు అడుగు వేయాలి అంటే ,ఒకటే దారి ..పది కి ఇస్తావా ?
హు ..పళ్ళు కొనే మొహమే నా ఇది అంటూ ,చూపులతో ,మాటలతో మొహం ఈడ్చేస్తారు ,దుర్యోధనుడి కైన గర్వ బంగం తల్చుకుని ... థూ అంటూ మనమూ దులిపేసుకుని ముందుకు అడుగు వేయాలి అన్న మాట ,,
అటు మళ్ళీ ఎడమకి తిరిగితే పాత కరాచీ దుకాణం ..అందులో సరుకులు అన్నీ టొకున అమ్మేలా ,బస్తాడు మిరపకాయలు ,అలా పెట్టి ఉంటాయి ,ఇవి మనకి అక్కర లేదు కదా ,ఎదురు బొదురుగా ,చింతపండు ,పిక్క తీసింది, తీయనది ,మిర్చీ ,అప్పడాలు ,వడియాలు , ఇంకా ఎన్నో బస్తాల బస్తాల తో కనిపిస్తాయి ..
మనం ఇవన్నీ దాటుకునీ ముందుకు వెళ్ళామా ? లాంతరు చిమ్నీలు, అప్పడాల పీటలు కర్రలు ,అమా ం దస్తాలు , పెనాలు , కుంపట్లు , దేవుడి దీపాల సమ్మెల లు . గులాబీ స్వీట్ చేసూనే గుత్తులు , జంతికల గ్ట్టాలు అన్నీ పాత మోడలు వి ఇలా సమస్తం ..మన పాత వంటిల్లు ని గుర్తు చేస్తూ కనిపిస్తాయి ,ఓ సంబరపడి కొనేసి ,అటక ఎక్కించినవి ఎన్నో ,
అందుకే ముందుకు పదండి , ఆ ఒంపులో ,తమల పాకులు కట్టలు, కట్టలు , అరటి దూట , అరటి ఆకులు ,ఇలా పచని దుకాణాలు , కనిపిస్తాయి , మరి ముందుకు తోసుకు వెళ్ళాలి ,ఎందుకంటే ఈ కూరల దుకాణాల దగ్గర విపరీతమైం రష్ ...
ఉత్తరాది వారు చక్కగా భార్యా భర్తలు ఇద్దరూ ,పెద్ద పెద్ద సంచీలు మోసుకుని వారం పది రోజులకి సరిపడా కూరలు కొనుక్కుని వెళతారు ,వాళ్ళ కి కావల్సిన కూరలు నూల్ కోల్ , గోబీ , ఇలాంటివి ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి మరి ..
మరి మనమో ,నిన్ను ఇక్కడ దింపేసి నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను ..ఇంత గొప్ప సాయం చేసాను ,తీసుకు వచ్చి ,నాకు ఊపిరి ఆడదు బాబూ , అంటూ సూకరాలు పోయే మగ మహారాజులు మన వారు కదా ,అందుకే ఒక సంచీ చేతిలో పట్టుకుని నేను ..అలా ముందుకు సాగుతున్నానూ ...
ఆ మలుపులో చూస్కోండి ఇంక ,బఠాణీలు, ఉప్పు బఠానీలు , అటుకులు , మర మరాలు ,చిన్న బిస్కెట్లు ..ఇల చిరు తిండ్లు మనలని నోరు ఊరిస్తూ ..
అబ్బ..ఇవి తర్వాత , కొంచం ముందుకు వెళితే ,అమ్మా ,ఫ్రెష్ ..చుక్క కూర ,తమరికి ఇష్టం కదా ,ఆరు నెల్లకి ఒకసారి వెళ్ళినా ,వారి జ్నాపక శక్తి అమోఘం .చదువుకుని ఉంటేనా రాజ్యం ఏలేసే వారు కాదూ ,
ఆకు కూరలు చూడగానే ఒళ్ళూ మరచి ,పాల కూర ,పుదీన ,చుక్క కూర అంటూ లిస్ట్ చెపుతూ ఉండగా ,ఏమండీ మీరు కూరలు కొనడాని కే వచ్చారా ? అంటూ , నిల్చుని ,నిల్చుని ఇంక ఆగలేక పలకరించిన ..అతను ..కూరల ఆవిడ నా ముసి ముసి నవ్వులు చూసి అయ్యగారా ? అమ్మ అంటూ మరో రెండు కట్టలు కొసరు వేసింది .ఎంత అంటే ఇంద అని చెప్పి బేరం ఆడ్డమే మర్చిపోయాను ..
సరే వచ్చావి కదా ,ఈ సంచి నువ్వు పట్టుకొ అంటూ ,మరో సంచి కొని మరీ ,ముందుకు వెళితే నా అంత ఎత్తున అరటి గెలలు ,సపోటా , ఇంకా ఏవేవో పళ్ళు ..
మరో ప్రక్క అల్లం ,ఉల్లి పాయలు ..ఇవి ఆర బోసి .
కింద నేల చిత చిత , ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ చిర చిర, అమ్మి కొప్పు లో దోపిన చామంతి చూడగానే అమ్మో పూలో గుర్తు వచ్చింది ..
నాలుగు మూరలు అంటూ అంట కట్టే పిల్లడిని కాదు అనలేం , కొసరుగా రెండు మూరలు కొని , ఇంకా నా వల్లా కాదు ,అంటూ ముఖం లో రంగులు మారుస్తున్న అతనిని చుస్తూ ..
సరే పద ,ఇంకా చాలా ఉంది ,ఆ వెనక కుండలు ,కూజాలు , బుట్టలు ..అమ్మా ..నువ్వు అచ్చ్నం విశాపట్నం దానివి అని నేను ఒప్పుకుంటnను .ఇంక చాలు ,ఈ రోత నా వల్ల కాదు భరించడం ..అంటే ..
భరించలేక ,పూర్ణా మార్కెట్ లో అందాలు చూడాలి అంటే వైజొగ్ వాడివి అయి ఉండాలి అనే ఫండా తెలియ చెప్పి ,ఇంకా దొండకాయలు , అరటి కాయలు , పొట్ల కాయలు అన్ని ఇప్పుడే కోసుకు వచ్చినట్టూ నవ నవ లాడుతూ ..చెయ్యి లాగేస్తోందే ..
రెండు అల్లా నాలుగు సంచీలు అయాయి ..అంతే అవి అలా పి్లలు పెట్టేస్తయయి ..
ఇంకా బయట పడుదాం అనుకుని మళ్ళీ ట్రెల్లిస్ దగ్గర ,ఆగి విన్యాసాలు చేస్తూ ఉంటే అక్కడ కనబడుతుంది ...పనస కాయ పొట్టు ..చింత చిగురు ..రెండూ ,జంట కవుల లా గే ప్రక్క ప్రక్క .. ఒకటే ఆత్రం ..కొనేసుకోవాలి అని ..ఎలా చేయాలో ఏమిటో ?
పోనీ అమ్మకి ఇచ్చేద్దామా ?? ఆమె వండి పెడుతుంది .. అమ్మో అమ్మ కి పని కాదూ ..ఎలా ? టు బై ఆర్ నాట్ టు బై అని ధర్మ సందేహం లో రెండు నిముషాలు ఆలోచించి ఇది వాతం అంటూ ఎప్పుడో అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని ,చింత చిగురు ..కూడా మరోసారి అంటూ ...అడుగులు ముందుకు వేస్తాను ..
ఇది మా పనస పొట్టు కథ ..కథో కార్యమో అవుతే ,తినేది ,ఈ కూరే కదా ,మనం ఎందుకు ఊ హైరానా పడి పోవడం అంటూ ,తేలికగా ఏ బీరకాయో , దొండ కాయో వండడం వచ్చు కానీ ,ఇవన్నీ చేయడానికి ..నేనే మైనా నలుడా భీముడి నా ??
అనుకుంటూ ..నాలుగు సంచులతో ఇంటి మొహం పట్టమా ?? ఏమేం వండను  ? ఏమేం ఫ్రిజ్ తినేసింది అని మటుకు అడగ కండి ..మరో మూడో యుద్ధం కి కారణం అవుతారు మీరు ..మా ఇంట్లో ..అదీ సంగతి ..

4 కామెంట్‌లు:

  1. మన పూర్ణామార్కెట్ గురించి కళ్ళకి కట్టినట్టు రాసారు..ధన్యవాదాలు..కాని ఇప్పుడు రైతు బజార్లు వచ్చాక ఎక్కువ ధరలు చెప్పి మోసపుచ్చే గడుసు వ్యాపారస్తుల నుండి బయటపడ్డాం..అప్పలమ్మలు, అప్పాయమ్మలు, నూకాలమ్మలు వాళ్ళవెనకాల వుండే అప్పారావులు, నూకరాజులు చేసే మోసాలు రాయలంటే పెద్ద పోస్ట్ అవుతుంది..మన పరువు మనమే తీసుకున్నవాళ్ళము అవుతాము..
    2.మీరన్న పనసపొట్టు కూర సీతమ్మధార రైతుబజార్లో గిరిజన సోదరులు అమ్ముతున్నారు.. ఒక్కసారి రుచి చూడండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓలేటి గారూ !
      ధన్యవాదాలు , పనస పొట్టు రైతు బజార్లో కూడా అమ్ముతున్నారు అన్న మాట ,అప్పుడప్పుడు వీధి లోకి కూడా అమ్మొస్తారు , పూర్ణా మార్కెట్ మీద అభిమానం పొంగి పొ్ర్లింది, విశాఖ కి దూరం గా ఉండడం వల్లా .జ్ణాపకాలు ,,వల్లే వేసుకున్నా ..అంతే ..థాంక్ యూ ,మరొక సారి ..మీ స్పందన కి ..
      వసంత లక్ష్మి .

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. వాణీ గారూ ..
      ధన్యవాదాలు ..చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ..
      వసంత లక్ష్మి










      తొలగించండి