"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మే, 2015

పూలు అమ్మే వాడు

పూలు అమ్మే వాడు
చెట్టు కింద పూలు అమ్మేవాడు
కూర్చుని
గులాబీ రెక్కల మీద
నీటి చుక్కలు జల్లుతూ 
అశాంతిగా
ఈ నాడు ఒక్క మరణమూ లేదా
ఈ గులాబీ దండల మదుపు
ఏట్లో పోసినట్టే ?
పెళ్ళి ళ్ళ సీసనూ కాదు
ఎవరూ దండ పెళ్ళిళ్ళు
చేసుకోరా ?
మల్లె పూల రాసులు
పక పక నవ్వుతూ
గుండె ల్లో గునపాలు గుచ్చుతూ
రాత్రికి పూదండ లు కొనే
మగ వారే కరువా ?
సాయి నాధుని వారమో
ఆంజనేయుని దినమో
పెద్ద మనుషుల సన్మానమో
ఏమి టీ రోజు మరీ
గొడ్డు పోయింది ?
పూలు అమ్మే వాడు
చేతికి పూల రంగు అంట లేదు
చెట్టు కింద
పూల పరిమళాలు మోస్తూ
ఎంత కాలం కూర్చుంటాడో ?
మరి ..ఆ పూలు అమ్మే వాడు .
చెట్టు నీడ ఉన్నంత వరకూ
ఉంటాడని నా నమ్మకం
ఊరికే నమ్మకం ..
హుద్ హుద్ తుఫాను కి
చెట్టు నేల ఒరిగింది
పూలు అమ్మే వాడి నీడ కూడా
పరిమళా లని నమ్ముకుని వాడు
ఇంకా పూలు అమ్ముకుంటూ నే ఉన్నాడు .
అవును వాడు ఇంకా పూలనే
నమ్ముకున్నాడు , అమ్ముకుంటూ ..

(ఎం వీ పీ కాలనీ ఉషోదయ సెంటెర్ లో
చెట్టు కూలింది ..
ఆ కూడలి లో పూలు అమ్ముకునే వారి ని
తలుచుకుంటూ )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి