"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మే, 2015

శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

  • శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

    పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ
    ప్రపంచం చివరికీ
    ఆకాశం గీసిన హద్దు వరకూ
    అర్రులు చాచి
    పయనించీ

    ఆ కొసన , ఆ అంచున
    ఓ మారు తొంగి చూసి
    వెను తిరిగి వద్దామని
    ఊహతో , వెనకకి చూస్తే

    పెద్ద గాలి దుమారం
    కళ్ళు గప్పి అంధుడ్ని చేసింది
    నా అడుగులోనే మరో అడుగు
    వేస్తూ అక్కడే గిర్రున తిరుగుతూ

    నే కనుగొన్నాను
    కులం ,మతం నా వెంట
    తోకల్లా ఎంత దూరం అయినా
    వస్తాయని
    తోకలు కత్తిరిస్తే , నే జంతువుని
    కోతి నుండి వచ్చిన మానవుడిని
    అయిపోతానని

    నాగరికత తెచ్చిన ఈ తోకలు మటుకు
    మోయాల్సిందే , రోదసీ నుంచి
    చూసినా అల్పమైన జంతువుల్లా
    ఏవో తోకలు మటుకు కనిపించాయిట

    సందేహం లేదు ,మన ఉనికి ఎంత దూరమైనా
    కనిపిస్తుంది .
    కనిపిస్తుంది మన చరిత్ర
    అంతా కనిపిస్తుంది
    ఎంత భారమైనా ఈ తోకలు
    మటుకు మోయండి , అపెండిసైటిస్ ని
    మోయటం లేదూ , నరుడు ..

    మరో ప్రపంచం నుంచి
    శ్రీ శ్రీ చూస్తున్నావుగా
    మా ఘనమైన మానవ చరిత్ర
    ఖణ ఖణ ల్ , సంకెళ్ళ సవ్వడి
    వినిపిస్తున్నాదా ? మరి
    జయంతులూ వర్ధంతులూ
    సవ్యంగా నే జరుపుతున్నాం

    ఈ ప్రపంచం అంతా శాంతి సౌబాగ్యాలు తో
    కళ కళ లాడుతోంది ? ఎవరీ శాంతి ??
    మంత్రి వర్యుల ఆరా !!
    అంతా క్షేమం ..క్షామాలూ వడగళ్ళూ
    మార్చి మార్చి వస్తూ ,పని లేని ప్రజలు
    మరి తల ఎత్తిచూడకుండా
    ఇక్కడ అంతా క్షామం ..అక్కడ క్షేమ మేనా ?

    శ్రీ శ్రీ ..మరో ప్రపంచం కబుర్లు
    అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండు మీ
    మేము మటుకు ఆ దరిదాపులలో
    ఉండమని గీత మీద ప్రమాణం చేసి చెపుతున్నాం
    ఇంక నువ్వు నీ ప్రపంచం లో నిష్పూచీ గా దమ్ము లాగూతూ
    హాయిగా నిదురించు ..

    అసహాయత , నిరాశ నిండిన ఈ కవిత
    ని మటుకు ఎవరికీ అంకితం ఇవ్వను ..
    శ్రీ శ్రీ కి మటుకు అసలే కాదు ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి