"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2017

రాజస్థాన్‌ విహార యాత్ర , రెండో రోజు .. 3 వ భాగం .


జైపుర్ లో రెండవ రోజు అక్కడకి 11 కిలోమీటర్ల దూరం లో ఉన్న అంబర్ కోట చూడాలని నిశయించుకున్నాం , ఉదయం తొమ్మిదికల్లా మేం తయారయి , బయటకి వచ్చాం .. మా వాహన చోదకుడు గజేంద్రన్‌ కూడా సరిగ్గా సమయానికి వచ్చి పదండి అంటూ ఆహ్వానించాడు ..
ఇప్పటి వరకూ మేం చూసిన జైపూర్ అంతా కొత్త గా అభివృద్ధి చేసిన ఊరేమో , 4 వరసల రోడ్డు తో అటూ ఇటూ పచ్చదనం ,మధ్యలో కూడా పూల మొక్కలతో అందంగా ,విశాలంగా ఉంది అని మేం సంతోషించాం. జైపూర్ని పింక్ సిటి అంటారు అని విన్నారు కదా .అసలు జైపూర్ ఊరు మటుకు స్వచ్చ్ భారత్ లేమి కనిపిస్తూ ,ఇరుకు ఇరుకుగా జన సందోహాలూ ,బజార్లూ , రకరకాల వాహనాల రొదలతో పాత పట్టణం పోకడలతో కనిపించింది .
ఈ పింక్ సిటి మహరాజా జై సింఘ్ 2 అనే రాజ్పుట్ రాజు గారు నిర్మించారు . ఈ ఊరు చుట్టూ పెద్ద గోడ నిర్మించారు , లోపల ఉన్నది అంతా పింక్ సిటి అన్న మాట . మరి గోడ అన్నాక దర్వాజాలు ఉండాలి కదా ,ఈ ఊరిలోకి ప్రవేశం కొరకు ఏడు విశాలమైన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . 
సూర్యుని పూజించే వంశం అనీ ,వారి పూర్వీకులు సూర్య వంశం వారనీ వారు ఈ ప్రవేశ ద్వారం ఒక దానికి సూర్య పోల్ అనీ ,మరొక దానికి చంద్ర పోల్‌ అని పేరు పెట్టారుట , ముఖ్యంగా సూర్యుని ఎదురుగా అంటే తూర్పు దిక్కున ఉన్న ద్వారానికి అలా పెట్టి ఉంటారు .ఇదేదో గోడ అంటే మనం చూసే మామూలు గోడలు కావు సుమండీ ,ఆరు మీటర్ల ఎత్తూ ,మూడు మీటర్ల వెడల్పూన ఉండే ఈ గోడల మీద సైనికులు హమేషా కాపలా తిరిగే వీలు ఉండేది అన్న మాట .
ఆ ప్రవేశ ద్వారాలు కూడా విశాలంగా ఏనుగులు ఆ పై అంబారీలు కూడా తిరిగే వీలుగా ఉన్నాయి , ఇప్పుడు మటుకు ప్రస్తుతం ,మన వాహనాలు ఎడ తెడిపి లేకుండా అటూ ,ఇటూ తిరుగుతున్నాయి , కాలం ఎంత మారిందో ,ఈ ద్వారాలుకే నోరు ఉంటే ఎన్ని కథలు చెప్పేవో అని నాలోని రచయిత్రి నిట్టూర్చింది .. :) 
మా వాహనంని మెల్లగా తోలుతూ ,మా చోదకుడు అలా ఊరి చరిత్ర అంతా చెపుతూ ఉండేవాడు , హవామహల్ అని ఎంతో ప్రాముఖ్యత పొందిన పెద్ద భవంతి అసలు ఉత్త గోడ లాంటిదే , రాణీ వాసం వాళ్ళు చూడ డానికి వీలుగా వందల కిటికీల జాలం తో నిర్మించారు అని తరవాత మాకు తెలిసింది . ఆ గోడ అంతా పింక్ సిటీ చుట్టూ కట్టబడిన గోడ అన్నమాట . బజారు వేపు వరసగా చిన్న చిన్న కొట్లుగా ఇచ్చారు ,అవి రాజుగారి కాలం లో అద్దె కిచ్చిన కొట్లు ట ,ఒక్కోదానికి పది రూపయిలు ట అద్దె , అందుకే అవి పాత గా కొంచం జీర్ణ స్థితి లో ఉన్నాయి ,కానీ ,జైపూర్ పట్టణానికి కావల్సిన ముఖ్యమైన వర్తకం అంతా అక్కడే జరుగుతున్నట్టు కనిపించింది . హోల్ సేల్ వర్తకం అంతా అక్కడే జరుగుతున్నాట్టుంది , రంగు రంగుల బట్టలూ , ఆభరణాలూ , బాగా విలువైన రాళ్ళతో తయారు చేసిన వెండి నగలూ ,జరీ చెప్పులూ ,మధ్య మధ్యలో పతంగ్ లూ ,చేతి కాగితం తో తయారు చేసిన సంచులూ ,కవర్లూ , ఒకటేమిటి , ఆ రోడ్డు నిండా అటూ ,ఇటూ దుకాణాలే , కొనడానికి వచ్చిన వారూ ,ఆ దుకాణం దారులూ ,మధ్యలో మన వాహనాలూ తో కిక్కిరిసి పోయి ఉంది ,వీరికి తోడు వెల్లువలా వచ్చి పడే టూరిస్ట్స్ , అందులో మళ్ళీ ఎన్ని వైవిధ్యాలో ,కార్ల లో ,బస్సులో , లోకల్ గా నడిచే మెట్రో ఆటో ల లో , ఆటోల లో ఇలా రక రకాలుగా వచ్చి పడి పోతున్న టూరిస్ట్స్ ని ఆకట్టు కోడానికి ,చిరు తిండ్లూ , విసనకర్రలూ , ఐస్ ఫ్రూట్లూ ,ముక్కలు కోసి అమ్మే పండ్ల ముక్కలూ ,లస్సీలూ , మురీ మిక్సరూ , బాబోయ్ ఎన్ని రకాలో నేను వర్ణించలేను ..
వీరందరి మధ్య హవాయ్ చెప్పులూ ,రంగు రంగుల స్కర్ట్ , పైన ఓ జైపూర్ కుర్తా , భుజాన ఓ జోలీ ,కళ్ళకి నల్ల కళ్ళ జోడూ , చేతిలో జైపూర్ టూర్ గైడ్ పుస్తకం ,నడుముకి కట్టుకున్న తోలు పటకాలో బంధించిన రూపాయిలూ ,డాలర్లూ ,ఇంకెవరూ విలాయత్ టూరిస్టులు ,వారి కళ్ళ పడాలి అని బెల్లం చుట్టూఉ మూగే ఈగల్లాగా గైడ్లూ ,మిగిలిన అమ్ముకునే వాళ్ళూ, అంతా ఓ రంగుల హేల ,మానవ సముదాయ మనుగడ లో వైవిధ్యత అంతా అక్కడే ఉంది ..కారులోంచి తొంగి చూస్తూ ,కమెరా సంగతి తరవాత అంటూ నా కళ్ళ తో చూస్తూ అన్ని చిత్రాలను నా మనసులో పదిల పరుచుకున్నాను .
నన్ను అక్కడ వదిలేస్తే ఓ వారం ,పది రోజులు ఆ దుకాణాల గుమ్మాలూ ఎక్కుతూ ,దిగుతూ ,ఓ గూడ్స్ బండికి సరిపడా వస్తువులు కొని పడేసి ఉండే దాన్ని ,ఇలాంటప్పుడే తను నాలో భావావేశం గమనించి ,ఎంతో ప్రేమగా నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపుతాడు ..( ఈ విషయం ఇదీ అని అర్ధం అవడానికి ,నాకు ఓ పాతికేళ్ళు పట్టింది ) 
అలా ఆ బజారు వీధీ చంద్ పోల్ అనే ద్వారాలు దాటుతూ ,మేం ఆ కోట మార్గం పట్టాం . దూరంగా కొండలూ ,ఆ కొండ పై హారం లాగా అమర్చిన గోడా కనిపించాయి , ఈ కొండలన్నీ ఆరావళి పర్వత శ్రేణి లో భాగం అని చెప్పారు ,గుజరాత్ నుంచి మొదలయి ,ఈ పర్వత శ్రేణి దిల్లి వరకూ ఉన్నాయి .
ఉత్తర భారతం అంతా శత్రు దేశాల రాక పోకలకి అనువుగా ఉంటాయి ,ఈ పర్వతాలూ ,మరొక వేపు హిమాలయాలు మనకి సహజమైన రక్షణ ఇచ్చినా రాజ్పుట్ రాజులు తమ కోటలు ఎత్తైన పర్వతాల మీద కట్టుకుని ,ఇంకా రక్షణ కోసం ఆ కొండల పై ఇలా పెద్ద గోడలు కూడా కట్టారుట , ఎంత మంది కూలీలు ,ఎంత వ్యయం పెట్టి కట్టి ఉంటారో కదా , అయితే ఆ కొండ లపై దొరికే రాయినే కొట్టి వాటినే ఉపయోగించి కట్టినట్టు తోస్తుంది . 
అమెర్ కోట కూడా అలాగే ఓ ఎత్తైన కొండ పై కట్టారు , ఆ ప్రదేశం లో మీనా కారీ అని మనకి పరిచయం అయిన చేతి పనులు చేసే వారు ఉండే వారు ట ,వాళ్ళు ఆ కొండ జాతి వారు , వారి ఊరు ,దేశం అది .. అయితే రాజా మాన్‌ సింఘ్ అనే రాజ్పుట్ ,ఓ నాడు వేట లో అలసి పోయి ,ఆ కొండల లో విశ్రమిస్తూ ఉండగా అతనికి ఓ సిద్ధువు చెప్పాడుట ,ఇక్కడ నీ కోట కట్టుకో అని .. రాజు తలుచుకుంటే అన్నట్టూ ,అతను ఆ మీనా జాతి వారితో యుద్ధం చేసి ,వారిని ఓడించి , ఆ కొండ పై కోట మొదలుపెట్టి అంచెలంచలు గా 150 ఏళ్ళూ నిర్మించారుట ..
మీనా జాతి వారిని అతి కిరాతకంగా చంపేసిన ఓ రాజు గురించి వింటే ఆ కోట లో ఎంత మంది కన్నీళ్ళూ ,రక్తమూ కలిసిందో అని చాలా బాధ కలిగింది .
ఒక తరం తరవాత ఒక తరం అలా విస్తరించుకుంటూ కట్టారు ,అన్నమాట ఈ కోట .

సూరజ్ పోల్ అనే ద్వారం దాటి వెళీతే ఓ విశాలమైన జలీబీ చౌక్ అనే ప్రాంగణం వస్తుంది , ఒక వేపు గుర్రాల ,ఏనుగుల  శాల లూ ,మరొక వేపు ,అక్కడ పని చేసే సైనికులూ , సేనాధిపతులకూ నివాస గృహాలూ , వస్తాయి . గుండ్రంగా ఉన్న ఈ ప్రాంగణం కి అందుకే జిలేబి చౌక్ అని పేరు .

గణేష్ పోల్ అనే ద్వారం గుండా ,విశాలమైన మెట్లు ఎక్కి, రాజా వారి నివాస గృహ సముదాయానికి ప్రవేశించాలి . కాళీ మాతని కొలిచే గుడి కూడా అక్కడే ఉంది , దసరా సమయలలో బలులు ఇచ్చేవారుట ,ఈ మధ్య వరకు .
దివాన్‌ ఎ ఆమ్‌ అంటే ప్రజల కోసం దర్శనం ఇచ్చే ప్రదేశం అని ..రాజు గారు అక్కడకి వచ్చి ప్రజల సమస్యలు వినే వారుట , దివాన్‌ ఏ ఖాస్ అంటే ముఖ్యమైన వారికోసం ఈ హాల్స్ అన్నీ సుందర మైన చెక్కడాలు తో కళ్ళు చెదిరే సౌందర్యం తో ఉంటాయి , జనానా చూసేందుకు ,వెండి , పాలరాయి జల్లెడ లాంటి జాల చెక్కడాలతో నింపిన గోడలూ , కిటికీలూ ,ఇవన్నీ మనం కంటి తో చూడ వల్సినదే కానీ ,వర్ణించాలి అంటే మాటలే దొరకవు .
అలా అంచెలు అంచెలుగా రాజా వారి నివాస భవంతులు అన్నీ చూస్తూ పై వరకూ వెళతాం ..అక్కడ నుంచి చూస్తే దూరంగా కొండల పై పాము లాగా చుట్ట చుట్టలుగా నిర్మించిన గోడ కనిపిస్తుంది ..ఈ ఫోటోలు అన్నీ జైపూర్ యాత్ర అనే ఆల్బం లో పెట్టాను . 

మేం ఓ గైడ్ సహాయం తీసుకున్నాం ,అతను ఆ కోట చరిత్ర అంతా వివరిస్తూ ,ముఖ్య స్థలాలలో మా ఇద్దరికీ ఫోటోలు తీయడం నాకు చాలా నచ్చింది ..లేక పోతే ఇద్దరికీ కలిపి ఎవరు తీస్తారు ..అక్కడకి వచ్చిన వారందరూ ఇదే పని లో ఉంటారు ..ఫోటోలు తీసుకుంటూ ,పైగా మనకి ఆ స్థలం ప్రాముఖ్యం అంతగా తెలియదు కదా , ఆ గైడ్ ముత్తాతలు ఈ కోట లోనే నివసించేవారుట ,ప్రస్తుతం మటుకు మీనా వృత్తి వారి కోసం కేటాయించిన ఊరిలో ఉంటున్నాడుట. ఈ మీనా కారీ కళాకారులే బ్లాక్ ప్రింటింగ్ , పాల రాయి మీద విలువైన రాళ్ళు పొదిగే పనులూ ,ఇలాంటి అందమైన హస్త కళలూ చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారుట , వాళ్ళందరికీ ఒక సహకార సంస్థ  ఏర్పాటు చేసి ఓ పెద్ద దుకాణాల సముదాయం కట్టారు , వెనక్కి వెళుతూ మమ్మలిని అక్కడ దింపేసి అతను వెళ్ళి పోయాడు ..
ఒక్కసారి చూడండి అంటూ మా చేత చాలా కొనిపించడం లో విజయం సాధించారు ,అక్కడ వ్యాపారస్తులు ,తమ మాట్కారితనంతో ,అయ్యో పాపం ,మరి వాళ్ళు బ్రతకాలి కదా అంటూ నేను వంత పాడుతూ ఉంటే ,గోళ్ళూ కొరుక్కుని ,బీ పి తెచ్చుకుని ,నన్ను బయటకి తోసాడు తను .
ఎవరి ధర్మం వాళ్ళు నెర వేర్చాలి అని రాసి పెట్టి ఉంది కదా మరి ..మన వివాహ వ్యవస్థ లోనే ,ఒకరు కొనడం ,మరొకరు కొనడంకి అడ్డు వేయడం ..

జల్ మందిర్ అని ఓ విశాలమైన సరస్సు మధ్యలో ఓ భవంతి ని దాటి వెళుతూ ,భోజనం కోసం ఓ హోటల్ ముందు ఆగి ,సాయంత్రం మూడు కల్లా మా హోటల్ చేరాం , ఆ కోట లో ఎక్కీ దిగీ మా ఇద్దరికీ కాళ్ళూ నొప్పులు అప్పుడు తెలిసి వచ్చాయి ..అబ్బ ..ఆ రాజులూ ,రాణులూ ,ఈ కోటలో ఎలా తిరిగే వాళ్ళు బాబూ ,అనుకుంటూ మా థ్రీ బెడ్ రూమ్‌ ఫ్లాట్ తలచుకుని అమ్మయ్య అనుకున్నాం ..

ఆ రోజుకి మా విహారం పూర్తి అయినట్టే అని మా చోదకుడిని పంపించేసి ,సాయంత్రం అలా నడుచుకుంటూ ఆ రోడ్ ల మీద కాస్త తిరిగి ,ఓ సాండ్ విచ్ తో డిన్నెర్ అయింది అనిపించి ,అలసి పోయి ,హాయిగా నిద్ర పోయాం ..

రాజులైనా తినేవి అన్నమో ,చపాతీలో ,సాన్విచ్ లో కానీ బంగారాలూ ,ముత్యాలూ కాదు కదా ,రాత్రి అయేసరికి విశ్రమించేది మెత్తని ఓ పరుపు మీదే కానీ ,పాల రాయి బల్ల మీద కాదు కదా !! అన్న ఆఖరి ఆలోచనలతో నిద్ర హాయిగా కమ్మేసింది ..

పాల రాయి కింద విశ్రమించేది మటుకు ..జీవం పోయాకే .. ( కొసరు ఆలోచన ) 

జైపూర్ లో మా రెండో రోజు అయిపోయింది ..మరొక రోజు మరిన్ని విశేషాలు తో మళ్ళీ వస్తాను 


2 కామెంట్‌లు:



  1. ఆహా ! జైపూరు లో మా పేరు మీద చౌక్ కూడా ఉందన్న మాట ! అదురహో మీ కథాకమ్మదనం , రాజస్థాన్ ప్రయాణం లో పదనిసలు !


    ---) గుండ్రంగా ఉన్న ఈ ప్రాంగణం కి అందుకే జిలేబి చౌక్ అని పేరు .


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ ..భలే గమ్మత్తుగా ఉంది అండీ మీ పేరు . ధన్యవాదాలు ..నా పోస్ట్ చదివి , ఓపికగా ,మీ స్పందన తెలియ చేసినందుకు .

    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి