"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2017

రాజస్థాన్‌ విహార యాత్ర --మూడవ రోజు , పార్ట్ 4


జైపూర్ నుంచి వీడ్కోలు తీసుకుని  తరవాత మజిలీ రణథంబూర్ కి బయలుదేరాం ,అదే కారు ,అతనే చోదకుడు. సాయంత్రం ఆరు కల్లా చేరిపోతాం అని మాకు మాట ఇచ్చాడు .

దారిలో అంతా పసుపుపచ్చని చేలు మధ్య మధ్య లో ఎండి పోయిన నేల కనిపిస్తున్నాఅంచున అంతా ముళ్ళ చెట్లూ కంచెగా వేసారు దారి అంతా చిన్న చిన్న పల్లెటూరులు , మన దేశం అసలు స్వరూపం ఇదే అనిపించింది .

ఎనభై శాతం ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంనే నమ్ముకుని ఉన్నారు అంటే మనం పట్టణాల్లో నివసించే వాళ్ళం నమ్మలేం కదా !! ఆవులూ ,మేకలూ ,గొర్రెల పెంపకాలు దారి అంతా కనిపించాయి , ఎర్రని ఓణీ తల పై కప్పుకుని స్త్రీలు ఎండిన కట్టెలుని ఇక్కడా ,అక్కడా సంపాదించి తల పై ఇంతింత పెద్ద మోపులతో ఇంటిలో పొయ్యిల కోసం మోసుకు వెళుతూ కనిపించారు , దారి అంతా   ఎర్రని ఇటుకలతో  పొలాల మధ్య కట్టిన డాబా ఇళ్ళూ , వీధి గోడలకి కొట్టిన పిడకలూ , మన దేశం లో జరుగుతున్నంత రీసైక్లింగ్ ఇంకెక్కడా ఉండదేమో ! పల్లెటూరుల్లో కంపతో పొయ్యి అంటించి వంట వండుకుంటారు వినడమే కానీ మనం చూడం కదా , బోరింగ్ పంపులు ఉన్నాయి వ్యవసాయానికి నీళ్ళూ కాలువ ద్వారా వస్తాయి అనుకున్నాను .
 
ఆవపంట చాలా ఎక్కువ గా కనిపించింది ..ఎంత పచ్చగా ఉన్నాయో ఆ చేలు . సాయంత్రం అవుతూ ఉంటే రోడ్డు వారగా సైకి ల్స్ తొక్కుతూ ఆడ పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్ళే సుందర దృశ్యం కనిపించి ,ఎంత ఉత్సాహం గా అనిపించిందో , ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టే అంటారు కదా !!

దారిలో రచ్చ బండ వద్ద తలపాగాలు కట్టుకున్న పెద్దలు తాపీగా చేతి కర్రల మీద తలలు ఆంచి ,చర్చలు జరుపుతూ కనిపించారు ..మన పల్లెల మౌలిక రూపాలు మన దేశం లో యే మూల కి వెళ్ళీనా ఒక్కటే అనిపించింది .. ఆ తల పాగాలు , పగిడీ లంటారు  వాటి రంగూ , కట్టిన విధానం బట్టి , ఎవరికీ చెప్పకనే తెలుస్తుందిట ,సమాజమ్లో వారి అంతస్తూ ,కులమూ .. రాజస్థాన్‌ లో కులాల ప్రాముఖ్యత ఇంకా బాగా బలంగా ఉన్నట్టు కనిపించింది ,అదే మాట మా గజేంద్ర చెప్పాడు . కులాల మధ్య పెద్ద గొడవలు జరిగేది ,కుల కట్టు దాటి పెళ్ళిళ్ళూ అవి జరిగినప్పుడే ట , లేక పోతే ఎవరి  పరిధుల్లో వాళ్ళు తమ కుల వృత్తులు చేసుకుంటూ ఉంటారు అని వినగానే మన పల్లెటూరుల్లో మార్పు మరెన్ని వందల ఏళ్ళు పడుతుందో అనిపించింది అయితే ఆ కుల విభజన వల్ల ,వారి రోజు వారీ పనులలో ఎటువంటి తభావతు రాదు అంటూ తన అభిప్రాయం చెప్పాడు . 

తన రాజ్పుట్ పుట్టుక గురించి చాలా గర్వ పడుతూ కనిపించాడు అతను , తన కుటుంబం లో అతనే ఇప్పటికీ పెద్ద ,కొడుకుల కి పెళ్ళిళ్ళు అయినా ,భార్య ,కోడళ్ళూ అతని ఆజ్ణ మీరరు అని మాటల్లో గొప్పగా చెప్పాడు .. నా మనసులో ఏం అనుకున్నా ,అతనిని ఆద్యంతం చాలా ఆసక్తిగా గమనిస్తూ వచ్చాను .

రాజ్పుట్ లు అని అందరిని అన్నా వారిలో  కూడా హైరార్కీ ఉంటుంది అని చాలా పేర్లు చెప్పాడు , కానీ ఆ పేర్లు అంత గుర్తు లేదు . గుజ్జర్ ,మీనా కులాలు వెనకబడిన కులాలు అని అన్నాడు ,అయితే వారికి ప్రభుత్వం ఇళ్ళూ అవి కట్టించి ఇస్తోంది అన్నాడు . వారి పరిస్థితి మునుపటి కన్నా ఇప్పుడు బాగుంది అని కొంచం తటపటాయిస్తూ చెప్పాడు . ఇదే కదా మన దేశం ,భారత దేశం , మార్పు ఇంచ్ ఇంచ్ గా వస్తోంది .

మధ్యలో టీ కని ఆగాం ,అక్కడా ఓ చిన్న షాప్ ఉంటుంది , ఆ మోహం ని తప్పించుకుని చీకటి పడుతూ ఉండగా రణ థంబోర్ చేరాం ..చాలా వరకూ రోడ్డు బాగో లేదు ,ఈ ఊరిలో మరీ దారుణం గా ఉంది .ఊళ్ళో మరొక టూర్ ఆఫీసు అతను ఎక్కి మాకు దారి చూపించాడు , మా టైగ్రెస్ హోటల్ , అది ఈ మధ్యే కొత్తగా కట్టిన హోటల్ , రాజభవనం లాగా కట్టేరు .మాకు ఆ ఆవరణ లోనే విడిగా ఉన్న విల్లాలు   ఇచ్చారు .. విశాలమైన గదులూ , కరెంట్ తో నడిచే ఫైర్ ప్లేసూ , అన్ని టాప్ క్లాస్ వసతులతో చాలా బాగుంది ..ఆ రోజుకి భోజనాలు కానించి ,పడుకున్నాం .

ఉదయం తొమ్మిదికల్లా వచ్చాడు , ఆ అడవిలో మా జీప్ టూర్ మధ్యాన్నం ఒంటి గంట నుంచి అని చెప్పారు , ముందుగా మాకు ఒక జీప్ బుక్ చేసి పెట్టారు టూర్ వాళ్ళు , ఎక్కడికక్కడ అన్ని వసతులూ వారే సమకూర్చి మాకు పెద్దగాప్రయాస లేకుండా చేసారు , ఇక్కడకి వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పారు .

మేం ఉదయం అలా చక్కరు కొట్టి వద్దాం అని బయలుదేరి ఈ అభయారణ్యం ఒక చివరకి చేరుకున్నాం ..దారిలో రోడ్డు పక్కనే ప్రశాంతంగా పచ్చిక మేస్తూ లేళ్ళూ ,జింకలూ ,చాలా కనిపించాయి ,అవి అరణ్యం గోడ దాటి వచ్చిన అల్లరి బడి పిల్లలు లాంటివి అన్నమాట ..మరొక చోట మన వారసులు కోతులు గుంపులు గుంపులుగా , మరొక నీటి సరస్సు చుట్టూ గడ్డి పొదలూ , వాటిలో కలిసి పోయి గట్టు మీదకి చేరి ఎండకి కాచుకుంటున్న రెండు ,మూడు మొసళ్ళు కనిపించాయి ,అవన్నీ వాహనం నడుపుతూ అతనికే ఎలా కనిపించాయో , అంత నిశితమైన చూపు మా గజేంద్రం ది అని మెచ్చుకున్నాం.

ఒక ప్రదేశం లో గుడి ఉంది అని చూపించాడు ,ఎత్తుగా ఒక కొండ మీద ఒక కోట ఉంది ,ఆ కోటలో దేవీ మాత గుడి ఉందిట ,అంబా మాత అని కొలుస్తారుట , ఉత్సాహం గా కొంతమంది పిల్లలు కొండ ఎక్కుతూ కనిపించారు ..మాకంత సమయమూ ,ఓపికా లేదు కాబట్టి ,వెనక్కి హోటల్ కి వచ్చి ,భోజనం చేసి మా ఒంటి గంట అభయారణ్య టూర్ కి తయారుగా కూర్చున్నాం .

మాకు ఆ వనం లో ఆరవ భాగం వచ్చింది అని చెప్పారు , నిన్న ఎవరికో పులి కనిపించింది అంటూ కథల్తో ఊరిస్తూ ,ఊరంతా తిప్పి మేం ఉండే వేపు కి వెనక వేపుకి తీసుకు వెళ్ళారు , ఆ జీప్ ,ఓపెన్‌  జీప్ , వెనక మేం ఇద్దరమే , ముందు చోదకుడూ ,ఒక గైడూ ..అడవిలోకి ప్రవేశించాం . 

ఆ జీప్లో ప్రయాణం , ఆకాశంలో జైంట్ వీల్లో రైడ్ లాగా ఉంది ..రాళ్ళ మీద నుంచి ఎక్కుతూ ,కొండలు దిగుతూ ,పులి కోసం వెతుకుతూ ప్రయాణం మొదలుపెట్టాం , కోతులూ ,జింకలూ అందులో బ్లాక్ బక్స్ , చెట్టు మీద పక్షులూ ,పిట్టలూ ,ఒక చోట గుడ్ల గూబ , అడవి దున్న ఇలాంటివే కనిపించాయి ,కానీ పులి మటుకు దాక్కుంది ..మాకు ఎదురు పడడానికి భయపడి ..అని నవ్వుకున్నాం ..

3 ,4 గంటలు అలా తిరిగి ,ఒళ్ళు హూనం చేసుకున్నాక ఇంక ఇంటి దారి పట్టాం ..ఇంక మర్నాడు మధ్యాన్నం మా తరవాత మజిలీ జోధ్ పూర్కి ప్రయాణం . 
ఉదయమే అటూ ఇటూ తిప్పి ,తన సొంత అజెండా ఒక హాండీ క్రాఫ్ట్స్ షాప్ కి తీసుకువెళ్ళాడు ,అయితే అది మహిళలు నడుపుతున్నారు అనగానే నేను చాలా విజృంభించి గాజులూ ,పూసలూ మరి కొన్ని వాల్ హంగింగ్స్ లాంటివి  కొన్నాను ..ఆవిడ తో ఓ ఫోటో కూడా తీసుకున్నాను .

ఇంక అక్కడ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి ,జోధ్ పూర్ చేరాం . ఆ రాత్రి కి మేం విడిది చేసిన హోటల్ కూడా ఒక పెద్ద పాలస్ , ఆ పాలస్ ఇంకా ముందుకి ఉందిట అక్కడ ఒక సరస్సూ , చుట్టూ తోటలూ ,చీకట్లో కూడా చెట్లూ ఆకుపచ్చగా మెరుస్తున్నాయి , భోజన శాల లో ఇంగ్లీష్ కాలం నాటి గుర్రాల ఫోటోలూ ,పొలో ఆటలు ఆడుతున్న రాజ్పుట్స్ , ఇలా అంతా ఒక బ్రిటిష్ వాతావరణం లో ఉంది .. అయితే వైటర్స్ మటుకు పగిడీలు కట్టుకుని చాలా మర్యాదగా వడ్డించారు . 

తొమ్మిది గంటలు అనుకున్న ప్రయాణం మరి కొంత ఎక్కువ సమయమే పట్టడం వల్ల ,మేమూ అలసిపోయి నిద్ర పోయాం .           ఉదయమే మరొక కొండ ఆ పైన ఒక పెద్ద కోట ,అనుకుంటూ  కాళ్ళకి మరింత బలం ఇమ్మని ప్రార్ధిస్తూ నిద్ర పోయాను .

ఈ రాజస్థాన్‌ నిజంగా రాజుల కి ఆస్థానమే , అనుకున్నాం ..ప్రతి ఊరిలోనూ కోటలూ ,పాలస్ లూ ,ఆ పెద్ద పెద్ద భవనాలూ కొన్ని ప్రభుత్వం తన ఆధీనం లోకి తీసుకుని , నడుపుతోంది ,కొన్ని మటుకు రాజుల ఆధీనం లో ఉన్నాయిట , వారికే వెళుతుందిట్ ,ఈ టికెట్లు అమ్మిన డబ్బులూ అవీ ,మరి కొన్ని సేవలని ఔట్ సోర్స్ చేసి ఈ పాలస్ లని తామే స్వయంగా నడుపుతున్నారు ట .

ఇలాంటి విషయాలే కాక ,ఆ రాజుల కుటుంబ చరిత్రలు ఎన్నో మాకు కొసరు కథలు గా వినిపించాడు. రాజ్యం చేస్తున్న రాజ్పుట్ వంశం లో పిల్లలు పుట్టరని శాపం ఉందిట , అందుకే  చాలా తరలు వరకూ దత్తత తీసుకున్న వాళ్ళే రాజ్యం ఏలారుట , ఇప్పటి రాజు గురించి చెపుతూ ,అతను ఇరవై ల లో ఉండగా పోలో ఆడుతూ గుర్రం నుంచి పడి పోయి ,తలకి పెద్ద గాయమై ,ఎన్నో నెలలూ ,ఏళ్ళు కోమాలో ఉన్నాడు ట , అమెరికా కి కూడా తీసుకువెళ్ళారు ట ,చివరకి ఆ ఊరి దేవత అంబా దేవిని కొలిస్తే , అతను కోమా నుంచి మిరకెల్ గా బయట పడ్డాడుట ,అతనికి  ఇద్దరు పిల్లలు ,అబ్బాయి విడేశాలలో చదువుకోడం ., అమ్మాయి వివాహం చుట్టూ జరిగిన వివాదాలూ అన్నీ చిలవలూ పలవలూ గా చెప్పాడు , కారులో కూర్చుని మేం ఈ కథలని విన్నాం , అప్పటికి ...మాకు అవే కాలక్షేపం మరి .

ఉదయమే మా హోటల్ ఖాళీ చేసి మళ్ళీ యాత్రీకులమై బయలుదేరాం , ఆ రాత్రి కి మా బస మరో ఊరిలో మరి . జోధ్ పూర్ లో ఉన్న మెహ్రార ఘర్ కోట దర్శనానికి బయలు దేరాం , మార్వార్ వంశం వారు జోధ్ పూర్ రాజధాని గా రాజ్యం ఏలారుట , థార్ ఎడారి మొదలయేది ఇక్కడ నుంచే .ఈ పటణాన్నే " సన్‌ సిటీ " అని కూడా అంటారుట , ఏడాది పొడుగునా ఈ ఊరి మీద సూర్య కిరణాలు పడతాయని ఆ పేరు వచ్చింది .. మరొక పేరు కూడా ఉంది , బ్లూ సిటి అని , పూర్వ కాలంలో నీలి రంగు బయట గోడలకి వేయడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది అన్న ఉద్దేశం తో అలా చేసేవారుట , కోట కింద నున్న ఊరు మటుకు అలా నీలం రంగులో కనిపించింది ,మిగిలిన ఊరు అంతా ఇప్పుడు అలా లేదు .

పాకిస్థాన్‌ కి దగ్గర గా ఉండడం వల్ల - 250 కిమి - ఇక్కడ ఎయిర్ బేస్ ఉంది , ఆర్మీ ట్రక్కులూ ,జీప్స్ ఊరంతా తిరుగుతూ కనిపిస్తాయి . 

మెహ్రాం గర్హ్ కోట అన్ని కోట ల లాగే ఒక ఎత్తైన కొండ మీద కట్టారు , శత్రు దుర్బేధ్యం గా పెద్ద పెద్ద ద్వారాలూ  ,అవి కదపాలి అంటేనే ఒక పెద్ద పటాలం కావాలి ,అంత బరువు గా ఉన్నాయి , ఆ తలుపులు , మనం మెల్లగా నడుస్తూ పైకి వెళ్ళ గానే ఒక విశాలమైన అవరణ లోకి అడుగు పెడతాం , అక్కడే పెద్ద కాన్యంన్‌ లు అంటే ఇప్పటి మన మిసైల్ వేసే టాంక్ లాంటివి ఉన్నాయి ,నాలుగు మూలలా , ఆ టాంక్ వద్దే మాకో ఫోటో , ఇక్కడా మేం ఒక గైడ్ తీసుకున్నాం . అతని సలహాపై , పై అంతస్తు కోట లోకి వెళ్ళడానికి లిఫ్ట్ వాడుకున్నాం ,కొంత రుసుము కట్టి . 

చాలా గదులు మ్యూజియం గా మార్చారు , రాజులు వాడిన వస్తువులూ ,కళా రూపాలూ ,వాళ్ళు ఎక్కిన పల్లకీలూ ,చిత్ర పటాలూ ,రాణీ వాసం గదులూ అన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ కిందకి దిగాం . ఒక్కొక్క గది లో అలంకారాలూ ,చెక్కిన జాలీ కిటికీలూ అవన్నీ చూస్తూ , వీలు ఉన్న చోట అల్లా ఫోటోలు తీసుకుంటూ , చాలా మైళ్ళే నడిచాం ఆ కోటలో అనిపించింది . 

మధ్య మధ్యలో జనానా సరదాలు తీర్చుకునే చిన్న నీటి కొలనులూ , వాటి చుట్టూ అలంకరించిన గోడలూ అన్ని అత్యద్భుతం అనిపిస్తాయి .  ఒక గదిలో మార్వారీ చిత్రాలు అపురూపం అనిపిస్తాయి ,అవి మన పురాణాలలో వర్ణించిన అనేక దృశ్యాలు .. బంగారు రంగులో మెరుస్తూ ,అవి ఎంత విలువైనవో చెపుతాయి . 

ఈ కోట కి వెళ్ళక ముందు ఒక చిన్న కొండ పై రాజుల సమాధులు ,వాటి చుట్టూ తోటలూ , నీటి మడుగులూ తో అందంగా ,ప్రశాంతంగా ఉంది .
తెల్లని పాల రాయితో చేసారు , ఈ రాష్ట్రం లో పాల రాయి చాలా ఎక్కువగా దొరుకుతుంది , మన ఇళ్ళ ల్లో వేసే పాల రాయి కూడా ఇక్కడ నుంచి వచ్చిందే . 

ఈ ఎడారి రాష్ట్రం లో పాలరాయి గనులూ , ఆఖర్కి నల్లటి పాల రాయి తో సహా ఉన్నాయి ,అవి కాక గ్రానైట్ , సున్నపు రాయి , విలువైన రాళ్ళూ , ఇలా ఎన్నో దొరుకుతాయి ట , వరీ ,గోధుమా లాంటి పంటలు పండే వీలు లేదు కానీ దాని బదులు ఈ ప్రదేశం లో ఇలాంటి విలువైన రాళ్ళ సంపద దొరుకుతుంది . ఒకటి ్ కాక పోతే మరొకటి ఇస్తుంది ,ప్రకృతి . ఏడాది పొడుగునా వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి , చాలా మంది చేతి పనులు చేసే కళ లో ఆరితేరారు , బ్లాక్ ప్రింటింగ్ , పాల రాయిలో విలువైన రాళ్ళు పొదిగే పనులూ , పూసలూ వాటితో దండలూ , ఇలా ఎన్నో హస్త కళ ల వస్తువులు చూసి ,పరవశీంచాం , నీలి రంగు పాటరీ , చేతి కాగితం తో తయరు చేసిన కవర్లూ ,సంచులూ ,చేతి కుట్టుతో , పాత వస్త్రాలు ఉపయోగించి తయారు చేసే బొంతలూ ,ప్రతీ వారూ ఏదో ఒక కళ లో నిష్ణాతులు అనిపించారు . 

ఎడారి రంగు నిస్తేజంగా ,ఇసక రంగులో ఉంటే , దానిని రంగుల మయం చేసారు అక్కడ పని వారు ,తమ కళలతో .. ఈ చేతి పనులు చూడ డానికే కొన్ని రోజులు మనం విడిగా రాజస్థాన్‌ చూడాలి అసలు , కోటలూ ,మహళ్ళు అవీ చరిత్ర ,నేటి ప్రజా జీవితం లో ఇన్ని రంగులు నిండి ఉన్నాయి ,వాళ్ళ దుస్తులు కూడా అంతే , చాలా నదురు రంగులు , ఇంక రోడ్ మీద ఏక తారా వాయిస్తూ కళా కారులు పాడే , వాయించే పాటలు విని తీరాల్సిందే , వీళ్ళ తో పాటు చిన్న పిల్లలు కంఠం లో తేనె పోసినట్టూ , రాగాలు తీస్తూ ,జానపద గీతాలు పాడుతూ ఉంటారు ,ఇలాంటి వాళ్ళ లోంచే మన అమీర్ ఖాన్‌ తన దంగల్ సిన్మా కి తీసుకున్నాడు ట ,ఇద్దరు చిన్నారి పాట గాళ్ళను . 

జన సమూహాలతో , పాటలతో ,రంగులతో ఎంత అందంగా ఉందో ఈ రాష్ట్రం ,అనిపించింది .

ఈ కోట చూసాక , భోజనాలు చేసి ,మేం రాత్రి ఎడారి లో  టెంట్ లో రాత్రి గడప డానికి ్ జై సల్మేర్ బయలుదేరాం . 

రోడ్డు ఫరవాలేదు , చాలా చోట్ల పక్క నుంచి వెళ్ళమని బోర్డులు పెట్టారు , నాలుగు లైన్ల రోడ్ ల నిర్మాణం జరుగుతోంది , మనం పూర్తిగా పశ్మిమా నికి మనం పొరుగు దేశం పాకిస్థాన్‌ వేపు వెళుతున్నాం అన్న మాట .

మా చోదకుడు చెప్పిన ఒక విషయం చాలా ఆసక్తికరం గా అనిపించింది ..ఇక్కడి రాజులు వందల ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ , ఇంకా పైన ఇరాన్‌ వరకూ విజయ యాత్రలు చేసారుట , మన దేశం మాప్ అక్కడ వరకూ ఉండేది అన్న మాట , ఇవన్నీ చరిత్ర కారులు  చెప్పాలి కానీ మన చరిత్ర లో ఎన్ని విశేషాలూ , ఆసక్తికర విషయాలు ఉన్నాయో కదా ,మొహంజాఓ దారో హరప్పా నాగరికత వెలసిన దేశమే కదా మనది ..

మొత్తానికి రాత్రి పది అవుతూ ఉండగా ఎక్కడో నడి సముద్రం లో అన్నట్టూ ఎడారి మధ్యలో ఉన్న ఆ కాంప్ కి చేరాం . ఆరు బయల ఆకాశం కింద ఆ ఎడారి లో ఒక వేదిక కట్టీ ,దాని మీద జానపద నృత్యాలు చేస్తున్నారు ..5 , 6 డిగ్రీలు ఉంటుందేమో , తారు డబ్బాలలో నెగళ్ళూ పెట్టారు , భోజనం బఫే పద్ధతిలో , మేమూ ఆ నృత్యాలు చూసి ఆనందించాం .ఉత్సాహం ఉన్నవారూ వేదిక ఎక్కి వాళ్ళతో కలిసారు ,మన బాలీవుడ్ డాంసుల కి ,ఇంతకీ ఎంతో అందంగా కనిపిస్తూ , ఒళ్ళు రబ్బరు లాగా సాగదీస్తూ నాట్యం చేస్తున్న ఆమె - అతడు ప్రింస్ హరీష్ అని ఇండియన్‌ ఐడల్ లో ఫైనల్స్ కి వచ్చిన అతనుట చాలా బాగా చేసాడు . 

రాత్రి కి ఆ ఎడారి టెంట్ లో ..అన్ని సదుపాయాలూ ,హీటరూ ఉన్నాయి , హాయిగా నిద్ర పోయి ఉదయమే చలిలో వణుకుతూ , అల్పాహారాలు లాగించి ,మళ్ళి మా సామాన్లు కార్ లో పడేసి ,జైసల్మార్ ఊరి వేపు బయలుదేరాం ..ఊరి నుంచి 40 కి మి దూరం లో ఉంది ..ఈ  రెసార్ట్ . 

దారి మధ్యలో మరో పెద్ద పాలస్ ,అదే మా హోటల్ ట ,అక్కడ సామాన్లు పడేసి ,ఊరి మధ్యలో ఉన్న మరొక కోట చూడ డానికి బయలుదేరాం .. 

ఇవాళ్టికి ఇక్కడతో కామా పెడుతున్నా ..రేపు మిగిలిన భాగం ..




2 కామెంట్‌లు:



  1. చాలా బాగుందండీ మీ ట్రావెలోగ్ ; ఈ ప్రయాణానికి యేర్పాట్లన్నీ ఎలా చేసారో ( ఎట్లా బుకింగ్ గట్రా చేసారో అవి కూడా రాయండి ఆఖర్లో చదివే వారికి ఉపయోగ కరంగా ఉంటుంది

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలండి ,జిలేబీ !
    మీ అసలు నామం తెలియనందువలన , జిలేబీ అనే సంబోధించి రాస్తున్నాను .తప్పకుండా ఆ వివరాలు ఆఖరి పార్ట్ లో పొందు పరుస్తాను ..
    మరొక మారు ,ఓపిక గా చదివినందుకు ధన్యవాదాలు .
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి