"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 సెప్టెం, 2012

మహా ప్రస్థానం అను..ఓ సాయంత్రం నడక కథ.

సాయంత్రం అయిదయింది, ఆకాశం లో మబ్బులు చెల్లాచెదురుగా బడి వదిలాక ,ఎర్రగా కంది పోయి అలసిన మొహాలతో వెళ్ళే పిల్లల్లా పారిపోతున్నాయి.సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళే తొందరలో ఆకాశం నిండా రకరకాల రంగులు పరుస్తునాడు. ఏ రంగో మరిచి పోయినట్టు.
ఇలాంటి అందమయిన సాయంకాలం లో బరువయిన ' పవర్ ' బూట్లు బిగించి, నడుంకట్టి బయలు దేరాను. నా సాయంకాలం విహరమనే evening walk కి .అలవాటయిన దారి, అలవాటు అయిన నడక, ఈ అలవాటుకే ఎన్నో ఆటంకాలు.
పరిచయమయిన మొహాలు చిన్నగా నవ్వుతున్నట్టు పెదిమలు సాగదీసి, పలకని హలో లు చెపుతున్నారు.కుక్క పిల్లలు  నడిపిస్తూంటే ! కొందరు, పసిపిల్లల పరుగులు వెనక నడుస్తూ కొందరు ,రకరకాల వాళ్ళు, వాళ్ళ మధ్యలో నేనూ, అడుగులు పడుతున్నాయి,కదం తోక్కుతున్నట్టు.
నా కోసమా? తన కోసమా? నా కోసమా? తన కోసమా?? రైలు  చక్రం రిథమిక్ పాట లాగ, ఇదే ప్రశ్నవెంటాడుతూ ఉంటుంది. ఎవరికోసం అయితేనేమి ,ఈ నడక కి గమ్యం లేదు కదా..అలిసేంత వరకూ నడక, తిరిగి వెనక్కి అదే దారిలో అడుగులు కొలవడం.
అదిగో, ముసలి కంపు ని యిలా గాలిలోకి వదిలేసి, యవ్వన పరిమళం తో వెనక్కి వెళ్ళాలని ఉవ్విల్లోరే అరవై దాటిన సమూహం..గుంపు, బట్ట తలలు, చేతి కర్రలు , కళ్ళజోళ్ళు, వాళ్ళ ఆభరణాలు.
వాజపాయ్ బాంబు  పేల్చాడండి!
పాకిస్తాన్ తో యుద్ధం తప్పదు!
ధరలేమిటి ఇలా మండి పోతున్నాయి,
ఈ అయిదవ పే కమీషన్ రావాలండి,
వస్తేనా?? 
మా అబ్బాయి ,కోడలు అమెరిక లో ఉద్యోగస్తులు. మనవడిని చూడాలని ఉంది, మా వంట మనిషి సెలవు పెట్టింది,
మా డ్రైవర్ కి రోగం..
మా ఇంటవిడికి బి పీ..హుమ్మ్ 
ఇవేం ఎండలండి బాబూ, అదే మా బెజవాడ ఎండ లయితేనా ?
ఈ విసాపట్నం లో జనం ఏం సుకుమారు లండి, 
వెన్నెల కూడా  వేడే వీళ్ళకి,
ఇదే మా ఊర్లో అయితేనా !!
ఇదే నే వెళ్ళిన అమెరికా  లో అయితే ఊస్తింగ్ ,కారణాలు చెప్పరు.
inefficiency ని ఒప్పుకోరుట(tolerate) చేయరుటండి ,అక్కడ రోడ్డు  పడుకోవచ్చుట ,అక్కడ గాలి, అక్కడ నీళ్ళు  ఇలా అనంతంగా సాగిపోతూంటాయి ..వీళ్ళ కబుర్లు.
ఈ కబుర్ల కోసమే, ఎంత దూరమయినా , ఎంత ఓపిక లేకపోయినా వస్తారు కాబోలు .అదో ప్రపంచం..ఆ ప్రపంచం లోకి వెళ్ళాలంటే,
వెళుతున్నాను..నేనూ వెళుతున్నాను, ఇంకొక్క ఇరవై, ఇరవై యా ? ఇరవై ఏనా?? మనసులో కూడా నిజం వయసు దాచుకుని తగ్గించు కోవడమే..హ్మం..ఎందుకో ఈ భయం..వయసు అంటే..
ముందుకు, ముందుకు పడుతున్నాయి అడుగులు, జోరుగా,హుషారుగా అనే అడుగులు. రిథమిక్ గా ,లయ తో ,మనసులో ఏదో  ఊపు,వస్తోంది..
వయసు తగ్గిపోతోంది సంవత్సరాలు వెనక్కి ,వెనక్కి వెళ్ళిపోయి ,అరే,ఎవరీమె ? నేను లా లేనే? సరే గుర్తు పట్టనట్టు నటిస్తే ఎలా?
నేనే ,నేనే!! అడుగులు ముందుకు పడుతున్నాయి, మనసెందుకు ఇలా వెనక్కి లాగుతుంది. గతం గతః తగం తప్ప ఏముంది? తవ్వుకోడానికి ? తవ్వొద్దు, ఇదిగో గోతులు .
బీచ్ రోడ్ లో గోతులు, జాగ్రత్తలు నేర్పడానికి జీవితం లో - ఒకసారి ,ఈ రోడ్డు మీద నడిపిస్తే సరి, గోతులుంటాయి  జాగ్రత్త. పడి పోతే లేవనెత్తే వారుంటారా?ఉండరా? ఉంటే వాళ్ళే మనకి బంధువులు, మిత్రులు నవ్వే వాళ్ళంతా శత్రువులు ..సిమ్పెల్ ..సులభమయిన లిట్ముస్ టెస్ట్.
సుమతి శతకం లో ఎప్పుడో చెప్పారు.
అబ్బా..యవ్వనంలోకి నిజం గా తొయ్యబద్డానా ! గుప్పున సన్నజాజుల పరిమళం తలనిండా పువ్వులే,ఉక్కిరిబిక్కిరిగా లేత ఘాటు సన్నజాజి పరిమళం, విరజాజులా?ఏవో జాజులు ..గట్టిగా వాసన పీల్చాను.
దాటుతున్నాను..చీకటిలో ఆడో ,మగో ,ఎవరో తెలియకుండా కలిసిపోతున్నారు.ఒకే ఆకారం గా గుసగుసలతో, అప్పుడే చీకటి పడుతోందా?
అబ్బే,గుసగుసలు కావు, వేగిన శేనక్కయాల వాసన,గుటుకు మని ,టక్ ,తక మని చప్పుడు చేసుకుంటూ తింటున్నారు ఇద్దరూ..
అందమయిన సాయంకాలం బీచ్ గట్టు మీద ,సన్నజాజులు తలలో పూయిన్చుకుని ,ఊహల స్వీట్ నథిన్గ్స్ నెమరు వేసుకోకుండా యిలా ,శెనగలు పంచుకుంటున్నారు..విరుచుకుంటూ, తింటున్నారు..
పక్కనే,మొక్క జొన్నలు అమ్మే చిన్నది, బాబు గారూ కారం రాయాలా?అనడగుతోంది. అనంతం గా అలుపు లేకుండా వచ్చి పడి ,విరిగి ,వెనక్కి వెళ్ళే ఆ అలల సౌందర్యానికి ,శరీరమంతా వెనక్కి తిప్పి కూర్చుని ,కారం రాసుకుని మొక్క జొన్న పొత్తులు తింటున్నారు.
పిల్లలు కనిపించగానే ,టంగ్ టంగ్ మని గంటలాడిస్తూ ఐసు క్రీమ్ హాయ్ టెక్ బండి వాడు,అందులోనే రెండు రకాల బళ్ళు ..
గోప్పోల్లకి ఒకటి, పేదోల్లకి ఒకటి.
రెండ్రూపాయల ఐసు ఫ్రూటు తింటున్నావా?హు..నీ అంతస్తు కి తగ్గదే..
పది హేడున్నర పెట్టి ,ఇంకో పుల్ల అయిసుక్రీం తింటున్నావా? హబ్బా గొప్పోడివే ,బాగా డబ్బులున్న వాళ్ళే ఇలాంటివి కొనగలరు, తినగలరు..
సింపెల్ యింకో లిట్మాస్ టెస్ట్ !గొప్పవాళ్ళ నుండి ,పేద వాళ్ళని విభజించడానికి యిదో తెలివయిన ,తేలికయిన పరీక్ష.
అంతా మేడీజీ ! మూడు రకాల ట అసలు.అందులో త్రిశంకు స్వర్గం లో ఇంకో క్లాసు ఉంది కదా ,అదే  మధ్య తరగతి.
ఏది తినడం?రెంరూపాయలదా ?పదిహేడు న్నరదా? ఆలోచించి, తేల్చు కోలేక ,ఇంకా ముందుకు పదండి రా యింకా మంచివి ఉంటాయి అక్కడ -అని తోస్తారు తండ్రులు ,తరువాత మర్చిపోతారు అన్న ఆశ తో.
సరే ,నేను ఏ రకమో ,కొంచం ఎగబారిన మధ్య ఎగువ తరగతా? ఏమో? ఈ బరువు ,ఈ నడకలు చూస్తే ఎగువ తరగతే నేమో?
ఏమీ పని లేక ,బోలెడు డబ్బుంటేనే కదా యిలా వాకింగ్ లు అవి చేస్తారు ,కరిగించుకోడానికి ,అదే కొవ్వు ..
అబ్బ ఏం మాటలు ..ఎందుకిలా నిన్ను నువ్వు హింసించుకుంటావు.సరే ,పద..ఇదిగో వచ్చాం..ఈ నాలుగు రోడ్లకూడలి.ఇటా ?అటా ?లెఫ్టా?రైట్ ఆ ?మధ్యలో ఉన్న ఈ అప్ ఎక్కడమా?మధ్యే మార్గం..ఎప్పుడో ఉన్నదే..
ఈ సింహాచలం కొండ లాంటి అప్ ఎక్కాలి..ఎక్కితే ఆ టీ వి టవర్ కనిపిస్తుంది . అదే మా ఇంటి వేలుపు అనుకుని ,మొక్కి వెనక్కి మళ్లీ డౌన్ దిగాలి .అప్పటికి ఎన్ని కాలరీలు ఖర్చు అవుతాయో?
పొద్దున్నే తాగిన కాఫీ లో పంచదార ఇచ్చినంత కాలరీలు.
అదిగో ,పాండురంగడి గుడి .సముద్రం లోంచి రోజూ పుట్టే సూర్యుడి కి దేవుడి దర్శనం లేకుండా ఈ పిచ్చుక గూళ్ళ భవనాలు ఆటంకం.
ఆయన మొహం మీదే బట్టలు కూడా ఆరేసారు దండాల మీద..
దాటిపోయాను  అడుగులు బరువుగా పడుతున్నాయి. ఎక్కుతున్నాను ,ఎక్కుతున్నాను పైకి ఎక్కుతున్నాను ఎంత పైకి వెళితే ,అంత క్రిందకి దిగిపోతాను ..ఇదేమయినా న్యూటన్ సిద్ధాంతమా? కాదు.. వక్రీకరణ ..
చిన్నప్పుడు చదివిన ఫిసిక్స్ ,వాటి జోలికి వెళ్ళకు ..ఎవరో తలకి మాసిన వాళ్ళు, కుళ్ళు బుద్ధి వాళ్ళు అంటారు.గొప్ప వాళ్ళని చూసి.మనలని గురించి కాదులే. కానీ,నేను ఎలాగా క్రిందకి దిగక తప్పాదు.ఎక్కలేను యింకా ,యింకా పైకి ఎక్కలేను. ఆయాసం ఇందులో ఏవయినా డబెల్ ఆర్ ట్రిబెల్ మీనింగ్ ఉందా?
ఛా ,దేవుడి గుడి ఎదురుగా ఏంటి!చెత్త అంతా ,ఒక్క క్షణం భక్తి తో కళ్ళు మూసుకో ,వేడుకో ,ప్రార్ధించు మొక్కు,తల దించు.
క్షణం లో వెయ్యో వంతు కూడా నేను ప్రార్ధించ లేను .నా తల లో దీపం చుట్టూ తిరిగే లక్షలాది పురుగుల్లా ఏవేవో ఆలోచనలు.వాటిల్లో భక్తి, దేవుడు లేనే లేడు .లేకుండా ఎలా తల ఒంచను?ఎలా మొక్కను? ఎలా వేడుకోవడం?
పెదవులు పలికితే చాలునా,మనసు లో నుండి పుట్టాలి కదా ,హిమాలయాల్లో ,కొండల్లో పుట్టే ఊట లాగే ,ఈ రాయి లోంచి కూడా ఎప్పుడో పుడుతుందేమో - ఆ క్షణం వరకు ఇలాగే  ,తల వంచకుండానే ,దొంగ చూపులు చూస్తూ దేవుడి వేపు వెళ్లి పోతాను.
గుడి దాటాను.బడి వస్తుందా? లేదు బ్యాంకు వచ్చింది.గుడి -చందాలు ,అవి దాచు కోడానికి బ్యాంకు అబ్బా ! ఎంత చక్కగా కుదిరింది, ఇంకా పైకి!వరసల్లో ఎవరో పేర్చినట్టు రక రకాల సైజు లలో ,రంగుల్లో కారులు .కారులు మేలా నా? కాదు ,కాదు, ఇక్కడే అయ్యేయాస్ ఆఫీసర్ ఇల్లు -ప్రక్కనే ,అదీ సంగతి.
యింకా ,ఇంకా పైకి..అడ్డ రోడ్డులు వస్తున్నాయి..వెనక్కి తిరగమని ఆహ్వానిస్తున్నాయి. ఎంత ఆయాసం వచ్చినా సరే,యింకా పైకే వెళతాను.ఆ టీ వి టవర్ దర్శనం చేసుకు తీరుతాను. తిరుపతి కొండకి భక్తులు నడిచి వెళ్ళ్రూ, అలాగే ..పట్టుదల,పంతం..
అబ్బా నేనేనా?ఎంత ధీరత్వం ,ఎంత చక్కని వ్యక్తిత్వం,పంతం పట్టిన వసంత ఎంత బాగుందో టైటిల్ ,సరే, ఏమిటా పిచ్చి వాగుడు? పద పద..
చీకటి ఒక్కసారి మూసేసింది.అజ్ఞానం లాగ..పాత సిమిలి మార్చాలి ,అంతా మార్చాలి ,విద్యా వ్యవస్థ మార్చాలి ! ఈ వ్యవస్థే మార్చాలి ,అంత మారాలి ,తల్ల కిందులై పోవాలి ,లేదా సరి సమానం అయిపోవాలి ,దున్నేయాలి నరికేయాలి పంచేయాలి ,రాజ్య మేలాలి ..
ఎప్పుడో విన్న గొంతుకలు ,నూతి లోంచి ,మనసు నూతి లోంచి,ఇంకా యీ మూల్గులు ఏమిటి?ఎప్పుడో గట్టిగా చెప్పుతో కొట్టి చంపేసాను కదా,తేలు ని చంపినట్టు ,యివి ఉత్త నీడల్లాంటి అరుపులు.యివి ఏం ప్రాణం లేని అరుపులే ,ఊరుకుంటే అవే చచ్చి పోతాయి ,వాటి మానాన అవే అరచి ,అరచి చచ్చినట్టు చచ్చురుకుంటాయి.
ఛ ! ఏంటో సాయంకాలం హుషారు లేదేంటి?యింకేం హుషారు ,చమటలు కారి జారుతోంది.చమటలు పట్టయా? హమ్మయ్య ఫలితం దక్కినట్టే.చీకట్లో ఏదో క్లబ్ ,కారులే తప్ప మనుషుల అలజడి లేదు. గుమ్మం దగ్గర ఏవో నీడలు, చిన్నగా మిణుగురుల్లా ఏంటా నిప్పులు.భయమా? నాకేం భయం.నాకా! భయమా!
ఇంకొంచం అప్ ఎక్కాలి.అమ్మయ్య వచ్చేస్తున్నాను ,దగ్గర కి వెళ్ళాను. డ్రైవర్ల బీడీ ల వెలుగులే ఆ మిణుగుర్లు.అమ్మయ్య,ఎంటో ఈ నిర్జన కాలని మనుషులే కనిపించరు.పద .పద..
యింక వెనక్కి తిరుగు.ఇదుగో ,ఇదిగిదుగో ...మలుపు ..ఆ మలుపు దగ్గరే ఎత్తుగా ,నిటారుగా ,గుడి గోపురం లాగ హై టెక్ బాబు గుడి లాగ టీ వి టవర్ ..హమ్మయ్య ,దగ్గరగా దర్శనం అయింది.ఇంక పద ,వెనక్కి ..వెనక్కా?ఎందుకంత వ్యంగ్యం ..వెనక్కా !! వెనక వెనక వెనక్కే,పద.
జర్రున అడుగులు జారిపోతున్నాయి.అంతా పల్లమే,నిజము పల్లెమెరుగు ..మధ్యలో ఏదో ఉందిలే..నేను ఎప్పుడూ నిజమే చెప్తాను.పల్లం లోకే వెళతాను.సిల్లీ ,వెరీ సిల్లీ ,యూ ఆర్ సిల్లీ ,ప్రెట్టి సిల్లీ ! యిదేమిటిలా అరిగిపోయిన రికార్డు లాగ ,ఊరికే ఆ పదం అలా నోట్లో నానుతూంటే  'పోలో'తింటున్నట్టు తిమ్మిరిగా బాగుంది.
వదుల్తుందిలే తిమ్మిరి..పద పద..యింటికి వెళ్ళాలి, చీకటి పడింది.మూడు బెడ్రూముల ఒంటరి ఫ్లాట్ లోకి వెళ్ళాలి పద,పద!దప, దప !!తప, తప..!!!అరే చాల దూరం వచ్చేసాను.ఎంత బాగుందో!యిలా ఎక్కడం,యిలా దిగిపోవడం..రోజూ యిలాగే ఎక్కాలి..ఈ విసాపట్నం ఉన్న అప్పులన్నీ ఎక్కాలి ..
ఆశీలుమెట్ట అప్పు,(డౌను ), సిరిపురం అప్పు (డౌను),కలెక్టరాఫీసు అప్పు (డౌను),రామ కృష్ణ మిషను అప్పు (డౌను),రామ్ నగర్ అప్పు (డౌను),అబ్బ ఎన్ని అప్పులో ?చక చక ఎక్కేస్తాను,చక చక దిగిపోతాను ,అప్పుడు ఎంచక్కా తయారు అవుతాను ,సన్నగా ,రివట లాగ, ఎవరూ పోల్చుకోలేనంతగా !!
ఎవరూ? నువ్వేనా !! అని అందరూ హస్చర్య పోతారు.అమ్మయ్య..కాళ్ళు ,పాదాలు ఉండి ,ఉండి యిలా చేక్కల్లా అయిపోతాయి ,పోట్లు, నా శరీరం బరువు కి తగ్గట్టు ,నా పాదాలు పాపం వెడల్పుగా పెరగ లేదు.
ప్రేస్సుర్ డెఫినిషన్ గుర్తుంది కదా..అంతా ఏరియా మీదే ఉంది.బరువు సమంగా సర్దుకుంటే బరువే ఉండదు.ఈ సన్నని పాదాలే పెరిగి అడ్డం గా..అబ్బ ఊరుకున్డూ !!వచ్చి రాని ఫిసిక్స్ చెప్పకు, ముందు నడువ్..
అబ్బ !అందమయిన సాయంత్రం ముదిరి రాత్రి అయిపొయింది.యింత వేగంగానా? శీతాకాలపు పొద్దు ,అబ్బ యింక మాట్లాడకు పద ,పద..
ఏరీ ,జనం అంతా ఏరీ ?యింకెక్కడ యింటికి వెళ్లి భోజనాలు గట్రా చేస్తారు, టీ వి ముందు కూర్చుని నీ పిల్లలు,బాబోయ్ పిల్లలు, ఇల్లు, భోజనాలు ,చదువు,నిద్రలు ఎన్ని పనులో ,పద..ఏమిటి ఈ పెళ్లి నడకలు..
సన్నజాజుల వాళ్ళ స్థానం లో రవుడి వెధవలు కూర్చున్నారు..ఏమిటో ఎలా తెలుసు నీకు? నాకు తెలుసు అంతే..ఆంటీ, ఆంటీ !!అని ఈలలు వేస్తున్నారు.పోనీ లెద్దు ,చిన్న పిల్లలు ,(ఏదో గుర్తింపు) వాళ్ళతో నాకేమిటి? అదిగో దూరం గా లైట్లు కనిపిస్తున్నాయి.
వందల మందే  ఉంటారు ,ఆ పిచ్చిక గూళ్ళలో ,అయినా అదేమిటో సందడే ఉండదు. మవునం గా మాట్లాడ్డం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లాగ ఉంటారు.ప్రక్క ఫ్లాట్ లో ఎవరో? మనకెందుకు? మౌనం ..ఏ భాష మరి.ఇరుగు ఫ్లాట్ లో బాబోయ్ ఎవరో? ఒక్క అంతస్తు ఎక్కువ సీఎల్లో కారు .వద్దు, మనకి పొత్తు పంతం ..వాళ్ళతో మౌనం ..మౌనం .మౌనం..రాజ్యమేలుతూ ఉంటుంది.
ఏం రాజ్యమో, ఎమో దగ్గర కొచ్చేస్తున్నాను..మా ఇంటికి..
కాల్చిన చేపలు, వండిన చికను, వండని కుళ్ళు కూరగాయల వాసన,అబ్బ ఎలా తింటారో? లొట్ట లేసుకుంటూ నువ్వు తిన్నట్టే ,మర్చి పోకు,క్రిందటి శనివారం అబ్బ..వద్దులే..గతం ,గతః పద,పద..దప దప ! అడుగులు ఎంత లయ గా పడుతున్నాయి.
ఆవేశం ,ఉద్రేకం, ఉరుకులు, పరుగులు, ఓ లయ ఉంది, ఓ చైతన్యం ఉంది..ఓ ,ఓ ఓ!!
అబ్బ ..పడి పోయాను, కాలు జారాను..చీకట్లో గోతి లో కాలు వేసి ,మడత పడి పడిపోయాను.చెయ్యి లేఫ్తూ, చెయ్యి రైటూ ,రెండూ బాగానే ఉన్నాయి.దూరం గా మనుషులు కనిపిస్తున్నారు. ఎవరూ రాలేదు.
చెయ్యి అందించలేదు. చెయ్యి అందించే వాళ్ళం దరిని పోగుట్టుకున్నావు..చెయ్యి అందించే వాళ్ళు దూరం లో ఉన్నారు.చెయ్యి అందించే వాళ్ళు రాలేరు. చెయ్యి అందించే వాళ్ళు పనిలో ఉన్నారు.వేరే పని లో ఉన్నారు. వాళ్ళ కిదే పనా?
నీకు మిత్రులు లేరు, శత్రువులు లేరు, ఎవరూ లేరు, నీ ఉనికే ఓ అసత్యం ..కాదు..నిజం కాదు..కాలు మండుతోంది ,లే ,లే,లే మరి..నీకు నువ్వే లేవాలి..నీకు నువ్వే లే, నీకు నువ్వే లే..అదే నిజం..
27 october 1998..లో  రాసిన   నా లో నేను ..చైతన్య స్రవంతి అనే స్టైల్ లో రాసేను ..అని అనుకున్నాను..అన్ని,ఆ రోజు నా మనసులో మాటలే..ఇలా ..









2 కామెంట్‌లు:

  1. వసంత గారూ.. నిజంగా ..వేల మైళ్ళ ..సిద్ధాంతాల, ఆలోచనల మీ నడక కథ చాలా బాగుంది...విశాఖపట్నం ఉప్పుగాలినీ ..ఉక్కనీ,హాయినీ, రెండు నాల్కల నడతనీ కూడా మీ నడకలో చూపిచారు.. మరో మానసిక ప్రస్థానం..మచి అబస్త్రాక్ట్ రచన..

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ పద్మా..చదివి, నీ అభిప్రాయం కూడా రాసినందుకు. ఇది రాసి, పదేళ్ళు పైనే అయింది. ఇప్పటికీ ,నాకయితే కొత్త గానే ఉంది..
    మన వైజాగ్ ,ఒక పాత్రే ఇందులో, నా అంతరంగం మరో పాత్ర..నాకు నచ్చిన నా రచన ల లో ఇది ఒకటి.
    మళ్లీ మరో సారి ,నా రచన ని చక్కగా అర్ధం చేసుకున్నందుకు ..థాంక్స్..
    వసంతం.

    రిప్లయితొలగించండి