"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 సెప్టెం, 2012

నా ఇల్లు

హరిణి కిటికీ నించి బయటకి చూస్తోంది, ప్రశాంతం గా ఉన్న రోడ్డు , నీడ నిస్తూ విస్తరించిన పెద్ద గుల్ మొహర్ చెట్టు ,ఎర్రర్రని పూలు తో నిండి ,ఆకులు పచ్చ రంగు లోకి తిరిగి, నేడో,రేపో, రాలి పోవడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి.


నూతన వధువు గా అడుగు పెట్టిన ఈ ఇంట్లో, నాకు నచ్చినది, తోడు ఇస్తున్నది, నా కెంతో ఇష్టమయిన ఈ గుల్మొహర్ చెట్టే..


ఆకాష్ ఆఫీసు కి వెళ్లి పోయాడు..
లేచి ,ఇంక పనులు చేసుకోవాలి..


ఎన్ని రోజులు, ఏళ్ళు పడుతుందో..మరి ఇది నా ఇల్లు అనుకోవడానికి. నిట్టురుస్తూ లేచింది..


ఏదో వెతుక్కునట్టే ఉంది ,ఈ ఇంట్లో, నా గది అంటూ ఏమి లేదు ఇంకా..
బట్టలు ఎక్కడ పెట్టు కోవాలో, నా పుస్తకాలు ఏ అలమర లో సద్దు కోవాలో, ఇంకా నేను ఎన్నో ఏళ్ల నించి ఎంతో ఇష్టం గా దాచు కున్న పాటల సీ డి లు..

అసలు,పెళ్లి అయి , ఈ ఇంటికి బయలు దేరి వస్తున్నప్పుడే మొదలయింది ఈ సమస్య.ఏమేమి సర్దు కోవాలి, నా వస్తువులు ఏమేమిటి తెచ్చుకోవాలి..అని.

అమ్మ "అలా కాదే హరీ , నువ్వు ముందు ముఖ్యమయిన బట్టలు, చీరలు,నీ సూట్లు,రోజూ ఇంట్లో కట్టుకునే బట్టలు, ఇవి సద్దుకో చాలు..మిగిలినవి ,మెల్ల మెల్ల గా తీసుకు వెళ్ళ వచ్చు లే .."

అని నచ్చ చెప్పింది, అమ్మ ఏమిటమ్మా ,నేను ఇలా మిమ్మలిని, నా ఇంటిని వదిలి ఎలా వెళ్ళాను? అని బిక్క మొహం పెట్టి కూర్చుంటే..

ఆకాష్ ..చాల మంచి వాడే, పెద్దలు చూసిన సంబంధమే కాని, ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉన్నారే, అని స్నేహితులు, చుట్టాలు అందరూ అనడమే..నాకు ఎలాంటి సమస్య లేదు..

లేదా అంటే ఉంది..నాకు రాత్రి మంచం ఎక్కాక ,చేతిలో ఒక పుస్తకం పట్టుకుంటే కాని నిదుర రాదు, పక్కనే మంద్ర స్వరం లో పాటలు వింటూంటే..హ్మ్మం..అది నా గది, నా నిద్ర..కార్యక్రమం..

ఇక్కడ అదేమీ కుదరటం లేదు, పాటలు అంటే, ఏమిటి ఏదో సౌండ్ ఆపేయ్ పడుకుందాం..పద,పద, మళ్లీ ఉదయమే లేచి, ఆఫీస్ వెళ్ళాలి, అంటూ తొందర పెట్టే భర్త..

కాదు అని ఎలా ? అనగలను..మనసులో ఇంకా అమ్మ చేసిన హిత బోధ గంట మోగినట్టు వినిపిస్తూనే ఉంది.

అక్కడ,అంటే అత్త వారింట్లో ,మన ఇంట్లో లా కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండ దానికి, ఉదయమే లేవాలి, నీకు అసలే ఉదయం నిద్ర ఎక్కువ, రాత్రి ఎంత సేపయినా నిశా చరి లా మేలుకుంటావు , పగలు నిద్ర పోతావు, మన ఇంట్లో కాబట్టి సరి పోయింది, అక్కడ అత్తగారుంటారు..

హ్మ్మం..నాకే నా ఈ హిత బోధ అంతా..కోడలు వస్తే ఎలా ఉండాలో ,తన కోడుకు కి ఎవరయినా చెప్పి ఉంటారా?

పెళ్లి అయి ,ఆరు నెలలు అయింది, ఇంక,కొత్త కోడలు హోదా నెమ్మదిగా ,పోయి, అత్తా గారింటి పద్దతులు కి అలవాటు పడుతోంది.

నా మంచం నించి ఇన్ని రోజులు అమ్మ వాళ్ళింట్లో,కుడి వేపు దిగడం అలవాటు ,అంటే అప్పుడు నేను ఒక్కర్తినే కదా..ఇప్పుడు ఎడమ వేపు, అంటే గోడ వేపు దిగాలి, లేవగానే, పరుగులు పెట్టి ఆకాష్ కి డబ్బాలు అందించాలి ,ఉదయం టిఫిన్ తినడానికి కూడా సమయం ఉండదు ,మరి, మధ్యాన్నం భోజనానికి ,ఒక చిన్న డబ్బా..ఇవి అమిర్చేసరికి వంట సమయం..

విశ్రాంతి గా కూర్చుని ,హిందూ వార్త పేపర్ చదివేది ఎప్పుడు? అమ్మ వాళ్ళింట్లో ,తమ్ముడు తో ,నాన్న తో పోటి పడి ,ముందు పేపర్ చదివితే కాని,రోజు మొదలయేది కాదు.

అసలు కాఫీ ఒక చేతిలో, హిందూ పేపర్ మరో చేతిలో..మగ వాళ్ళకేనా ?ఆ సుఖం? ఉక్రోషం తో ఉడికి పోతుంది ఒక్కో రోజు..

నీకు అంతగా చదవాలని ఉంటే ,ఇంకో అరగంట ముందు లేస్తే సరి, పనులు త్వరగా అయిపోతాయి, నీకు ప్రశాంతం గా పేపర్ చదువుకునే సమయం దొరుకుతుంది..

అని నీతులు, హు,ఆ సలహాలు వినడం కన్నా..పేపర్ ఏ మధ్యాన్నమో చదవడమో నయం.

ఇలా ,ప్రతి చిన్న విషయం లోను, నేనే మారాను ,అని పించింది..అందరూ ఇంతేనా?

అత్తగారు, మావగారు ఉన్నారు..కొంచం సర్దు కోవాలి, అని అమ్మ ఏమాత్రం అసంతృప్తి ప్రకటించినా నాకు క్లాసు..

నిన్న ,నా చిన్నప్పటి స్నేహితురాలు పద్మ వచ్చింది.

నాకు అయితే మొహం వికసించి, ఆనందం తన్ను కు వచ్చింది..చెయ్యి పట్టుకుని గట్టిగా వదల లేదు, అబ్బా చేయి వదలవే..హరీ ...నీ ప్రేమ చాల గొప్పదే కాని, నా చెయ్యి నొప్పి ...అనే వరకు అంత గట్టిగా పట్టు కున్నానని నాకే తెలియదు.

ఏదో నీటిలో కొట్టుకుపోతున్న వారి కి ఊతం దొరికి నట్టు..

పద్మ..కూర్చోవే, ఏమిటో అందరూ నన్ను మర్చి పోయారా? నీకు పెళ్లి అయి ,ఈ ఊర్లోనే ఉన్నావు కానీ, ఎప్పుడూ ఫోన్ అయినా చేయవేమ్టి ? నీ సంగతులేమిటి?

అంటూ ఊపిరి సలపనీయకుండా అడుగుతూ ఉంటే ..ముందు కొంచం మంచి నీళ్ళు అయిన ఇస్తావ? అనేసరికి  అయ్యో అంటూ పరుగు పెట్టి, గ్లాసులో మంచి నీళ్ళు ఇచ్చి,

ఊ..నీ కబుర్లు చెప్పు, అంటే నీ కబుర్లు చెప్పు అని ఇద్దరం ఒకేసారి అంటూ,చిన్న పిల్లల్లాగా ఒక్కసారి గట్టిగా నవ్వుకున్నాం.
నాకు..చాలా చెప్పాలనే ఉంది..మా అత్తగారు వాళ్ళ గది లో పడుకున్నారు..లేస్తారేమో పద,నా గది లో కూర్చుందాం.అంటూ తీసుకు వెళ్ళి ఒక కుర్చీ  వేసి, కూర్చో బెట్టాను..

అదేమిటో..ఇంకా ఇది నా ఇల్లు అనిపించటం లేదు, మా ఇంట్లో అయితే,పద్మ నేను మంచం ఎక్కి కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే,అమ్మ ఒక సారి, మంచి నీళ్ళ గ్లాసు తో వచ్చి, పద్మా ,బాగున్నావా? అని పలకరించి, మరో అర గంట అయేసరికి హరీ ,ఉత్త కబుర్లేనా? అని కాఫీ కప్పులు ఇస్తే ,తాగి మంచం పక్కనే కింద కాఫీ కప్పులు పెట్టి, ఇంకో గంట అయేక అమ్మా,తినడానికి ఏమయినా పెట్టవే? అంటే ఇదిగో పకోడీలు వేసాను, అంత బద్ధకం అయితే ఎలా..వచ్చి తీసుకో, రెండు ప్లేట్స్ లో పెట్టేను ,అంటే గునుస్తూ వెళ్లి ,పెద్ద పని చేసినట్టు పోస్ ఇచ్చి..రావడం..గుర్తు వచ్చి, నాకయితే సిగ్గేసింది.

డిగ్రీ చదువుతున్నాను ,అంత చిన్న దాన్నేం కాదు, అయినా అమ్మ కూడా అంత ముద్దు చేసిందేమిటో? అంత అమ్మదే తప్పు ..అన్నట్టు..మళ్లీ నవ్వు వచ్చింది..తనకే.

పద్మ తన కబుర్లు చెప్పమంటే..ఏమిటో డల్ గా అయిపొయింది అనిపించింది ..ఇంత లోనే ,అత్తగారు లేచిన చప్పుడు.

ఉండు పద్మా..టీ కలుపుతాను..అని లేచి వెళ్లి, టీ  కలిపి ఒక ప్లేట్ లో బిస్కెట్ ,స్వీట్ పెట్టి తీసుకు వచ్చేను ..
మా అత్త గారి ని పలకరించి, మాట్లాడుతూ ఉంది, టీ తాగగానే వెంటనే బయలు దేరింది..నేను విస్తు పోయాను, అదేమిటే, కూర్చో, ఇంకా ఏమి మాట్లాడు కొనే లేదు అంటే, మళ్లీ ఇంకోసారి వస్తాను ..ప్లీస్ ,హరి..ఏం అనుకోకు.

నాకేమిటో అయోమయం గా అనిపించింది. పెళ్లి అయితే ఇంత గా మారి పోతారా? ఒకఆడపిల్ల జీవితం లో ఇన్ని పెను మార్పులు వస్తాయా??ఇది ఇలాగే సాగుతూ ఉంటుందా??

గంటలు ,గంటలు చెప్పుకునే మేము ఇలా అయిపోయేం ఏమిటో??
నేను నా కొత్త ఇంటికి అలవాటు పడుతున్నాను.మా అత్తగారు ,మెల్లిగా ఇంటి పని, నాకు అప్ప చెప్పి, పురాణాలు, గుడులు అంటూ బయటే ఎక్కువ తిరుగుతున్నారు. మావగారు చాల నెమ్మది.ఆయన కి టైం కి భోజనం పెడితే చాలు..ఇంకేమి పెద్ద గా పట్టించు కోరు.

నేనే ఇంకా ఏమి నిర్ణయించు కోలేదు, డిగ్రీ చదివాను, ఇంకా చదువు కోవాలా? లేక పోతే ఏదయినా ఉద్యోగం చేయాలా? ఒక్క సారి ,నా జీవన గమనం మారి పోయింది..

నా భవిష్యత్తు ఏమిటో? అంటా అగమ్య గోచరం గా ఉంది..

ఒక రోజు అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను.

నా పుస్తకాలు, పాటలు, నా జ్ఞాపకాలు ఎన్నో అక్కడ వదిలి వచ్చేసాను కదా..
అమ్మ హరి రా రా..నీ పుస్తకాలు లేకుండా నువ్వు ఇంకా ఎన్ని రోజులున్దగలవు?అనుకుంటూనే ఉన్నాను..నేనే వద్దాం అంటే ఏది వీలు పడడం లేదు..అంటూ ఏదో మాట్లాడేస్తోంది..

నాకేదో కొత్త గా అనిపిస్తోంది. నా గది లో ఏం మార్పులు చేసారా? అని చూస్తూ ఉంటాను..నా మంచం అలాగే ఉంది మధ్యాన్నం కాసేపు ,నా గదిలో నడుం వాలుస్తాను అనే అమ్మ ని అలాగే చూస్తూ, ప్రేమగా చేయి పట్టుకున్నాను..

ఎంటే ,అంతా బాగానే ఉందా?? ఎందుకలా డల్ గా ఉంటున్నావు నీ పై చదువు గురించి చెప్పవా ?ఆకాష్ మంచి వాడే ,అర్ధం చేసుకుంటాడు..ఏమిటో తొందర పడి పోయామా? అందరూ మంచి...

అమ్మ నేను ఇప్పుడే చెపుతున్నాను..నువ్వు నా దగ్గర కూడా ఉండాలి. నేను ఏదో వేరు అయిపోయినట్టు అలా చూడకండి, మీ ఇల్లు అంటూ వేరు గా మాట్లాడకండి..నేను ఎప్పటికి మీ హరిణి ని, ఎప్పుడయినా మీ ఇంటికి వస్తాను..

అని ఏమిటో ఆవేశం గా మాట్లాడేసాను..కళ్ళు ఎర్ర బడి పోయాయి..
అమ్మ కి గాబరా వేసి ఏమిటో ఇవాళ మాట్లాడుతున్నావు..నీకు తెలుసా? మన పద్మ వాళ్ళ అమ్మ ,సీత కనిపించింది ,బజారు లో..

ఎలా ఉంది అమ్మా? తను..అమ్మ చెప్పినది విని నేను ఆశ్చర్య పోయాను, ఇలాగ కూడా ఉంటారా మనుషులు??

పద్మ ని ఎక్కడికి వెల్ల నివ్వరుట ..ఎవరో ఒకరు నీడ లాగ తోడూ ఉండాలి ట ,వీళ్ళు వెళ్ళినా కాపలా గా ఒకరు ఉంటారుట ,ఏం మాట్లాడు కుంటారో అని, ఆ అబ్బాయి కూడా ఏమి మాటాడుట ,మా అమ్మ వాళ్ళు ఏం చెప్పిన వినాల్సిందే అంటూ పద్మ కే హిత బోధ చేస్తాడుట ..

నిర్ఘాంత  పోయాను..ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అని తెలీదు..నాకింత వరకు అందరూ మా అమ్మ ,నాన్న లాగే మంచి వాళ్ళే దొరికారు.

చాల అదృష్టమే అనుకుంటూ..
అమ్మా. నేను బయలు దేరుతాను.. నా సామాన్లు ఇక్కడే ఉండని ,మా ఇంట్లో జాగా లేదు ,ఎక్కడ పెట్టాను ఇవన్ని?

భోజనం చేసి వెళ్ళవే అన్నా వినిపించు కోకుండా..బయలు దేరి పోయాను..
రోడ్ మీదకి వచ్చి బస్ కోసం నిలుచుంటే..

నేను ఏమన్నాను..మా ఇంట్లో..అని..

ఎంత సులభం గా అనేసాను..మా ఇల్లు అని..

ఆరు నెలలు కాలేదు ఇంకా..అప్పుడే నా ఇల్లు అయిపోయిందా..

నా మనసులో , ఆ ఆలోచనే లేదు.కాని తరతరాలు గా నూరి పోసిన భావాలు ఎక్కడికి పోతాయి?

అమ్మో ఇంట్లో కూర్చుంటే ,ఇలాగే తయారు అవుతాను నేను..

ఆ సంవత్సరమే పీ జీ లో చేరి, మూడేళ్ళలో లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించాను ..మా ఊరు లోనే.

నా పుస్తకాలు, నా పాటలు ,నా జ్ఞాపకాలు ,అమ్మ ఇంటి నిండి నేను ,మరి ఏ నాడు వెనక్కి తెచ్చుకోలేదు..

నేను పుట్టి పెరిగిన ఇల్లు అది, పెళ్లి అయాక నేను వచ్చిన ఇల్లు అది..అంతే,నాకు రెండు ఇళ్లు..

పద్మ ఒక సారి నన్ను అడిగింది, నాకు రెండు ఇళ్లు అంటావు, ఇప్పుడు పద్మ నా కొలీగ్ కూడా..నీకు నిజం గా ఏదయినా కష్టం వస్తే నువ్వు ఎక్కడికి వెళతావు?అంతా బాగున్నప్పుడు ,అందరూ బాగానే ఉంటారు,నా లాగే ఇల్లు వదిలి వచ్చిన వారికి "నా ఇల్లు " అనేది ఉండాలి అందరికి ,అంటే మన ఆడ వాళ్లకి..

ఇది నిజం గా నిజమేనా?? నా ఇల్లు ...ఏమిటోఈ రెండు ఇళ్ళ లలో..??
అంతా బాగుంటుంది..ఎందుకు బాగుండదు..అని మనసు ని చిక్క బెట్టుకుంటూ హరిణి ఇంట్లో అడుగు పెట్టింది..















3 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి కొత్తగా అత్తవారింట అడుగిడిన ఆడపిల్లల మనోభావాలకి ప్రతీకలా

    రిప్లయితొలగించండి
  2. skvramesh.గారు , ధన్యవాదాలు..చదివి మీ కామెంట్ కూడా పెట్టినందుకు.
    అవును, అత్తగారిల్లు..నాది అనుకునే రోజు వరకు కష్టమే..మరి
    ఆడపిల్లకి..
    వసంతం..

    రిప్లయితొలగించండి
  3. బాగున్నది వసంతగారు . మనదేశంలో ఆడవారికి
    మూడిళ్లు మరచిపోయారా మరో ఇంటిని !!!
    భర్త , తాను పెద్దయ్యాక ఒక్కరే ఎలావుంటారు అంటూ ‘కోడలింటికి ‘ తరలింప పడతాము .
    అదే లెండి కొడుకు ఇంటికి .
    అందుకే స్వతంత్రంగా పెరగడం నేర్పాలి పిల్లలకి .
    Sandhya Gollamudi

    రిప్లయితొలగించండి