"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 సెప్టెం, 2012

ఈ పాట వెనక కథ ఇదే.....చివరికి మిగిలేది సినిమా

చివరికి మిగిలేది??
ఈ పేరు తో సినిమా ,నవల రెండూ ఉన్నాయి..రెండూ నాకు ఇష్టమయినవే.
చివరికి మిగిలేది సినిమా చూస్తూ , కర్చీఫ్ లు తడిపేసి ,పిండేసిన రోజు ఇంకా గుర్తే..అయితే మేం  విశాఖ పట్నం ఆంధ్ర యూనివెర్సిటీ లో చదువుతున్న రోజులలో మేం చూసినన్ని సినిమాలు, మళ్లీ జీవితం లో ఎప్పుడూ చూడలేదు.అలాంటి ,నిష్పుచి , కేరేజట్ ,మేమే ఈ ప్రపంచానికి అధిపతులు, మేమే ఈ ప్రపంచానికి పథ నిర్దేశం చేసే యువతీ యువకులం అని నిర్ద్వందం గా నమ్మి, ప్రేమించడం అంటే ,ఒక మనిషి నే కాదు ,సమస్త ప్రపంచాన్ని...
రావి శాస్త్రి , శ్రీ శ్రీ, దేవులపల్లి, కొ కు.చలం, బుచ్చిబాబు, రంగనాయకమ్మ,బీన దేవి, వీరందరూ మా గుండెల్లో కూర్చుని, ఇలా మాట్లాడు, ఇలా చేయి అని చేయి పట్టుకుని నడిపించి నట్టుండేది.
పర్సులో డబ్బులు నిల్ .దిల్ నిండా ధైర్యం ఫుల్.
అదే ఆ బంగారు రోజుల సబ్ హెడింగ్. బంగారు రోజులు రాసిన కవన శర్మ గారి కి గుర్తు గా..
నీ దగ్గర ఒక పది నా దగ్గర ఓ పది, వెరసి ఇరవై, చలో మార్నింగ్ షో ,అంటూ,జగదాంబ కి పదకొండు బస్సు ఎక్కి, అంటే నడుచు కుంటూ వెళ్లి పోవడం, ఒక మంచి సినిమా చూసి, వీర ఆవేశం తో మళ్లీ ,అప్ ఎక్కి నడుచుకుంటూ వచ్చి,హాస్టల్ లో ,అడుగు న మిగిలి పోయిన నాలుగు అన్నం  మెతుకులే ,పరమాన్నం గా తినేసి,సినిమా పారవశ్యం లో మునిగి పోవడం..
అలా ఒక రోజు చిత్రాలయ లో చివరికి మిగిలేది ? అనే అద్భుతమయిన సినిమా,అందులో సావిత్రి నటన ఇంకా అద్భుతం అని విని ,బయలుదేరి వెళ్ళాం,పద కొండు గంటల షోకి.
ఆ సినిమా ఒక సారి చూసేం..లేదా కథ విన్నాం..కాబట్టి సరిపోయింది.
లేక పోతే, ఆ రోజు, చిత్రాలయ సినిమా రీల్స్ వేసే అతని కి హాంగ్ ఓవరో ఏమో,లేదా తిక్కో, రీల్స్ అన్ని కలిపేసి, ముందుగా సావిత్రి కథ, ఆవిడ కి మతి చలించడం అంత ముందు చూపించేడు, తరవాత, మిగిలిన కథ, అంతా  అవక తవక అన్న మాట.
మాకు ఆ రోజు బాపు కార్టూన్..ఇంత అవక తవక సినిమా నేను ఎప్పుడూ చూడలేదు ...అనుకుంటాడు..తెర మీద భశుం ...అని ఉంటుంది కార్డు.
ఆ కార్టూన్..నిజం గా అనుభవం అయింది..కర్చీఫ్ లు తడిసి పోతాయి అనుకుంటే ,నవ్వులే నవ్వులు..అందరం..
అసలు సినిమా కథ ఇది.
సావిత్రి ఒక ఆసుపత్రి లో నర్సు గా పని చేస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్,మానసిక చికిత్సాలయం. ఆమె తన పని ఎంతో ఇష్టం గా చేస్తూ,అందరికి ప్రేమ పాత్రురాలు గా ఉంటుంది.
ఆసుపత్రి పెద్ద ,మానసిక చికిత్స కి కొత్త పద్ధతులు అవలంబించాలి,అని రక రకాలు గా పరిశోధన లు చేసి, చివరికి ఒక పద్ధతి .... అదే, ప్రేమ అనే మందు వాడాలని ..ఒక నిర్ణయం కి వస్తాడు.
అతనికి ,నిత్యం చిరు నవ్వుతో, అందరిని ప్రేమ గా పలకరించే మన సావిత్రి ,నర్సు పాత్ర లో, అందుకు తగునని ,ఆమె ని అడుగుతాడు..ఈ వైద్యం నువ్వు చేయ గలవా?
ఇంతలో , ఒక మానసిక రోగి కాంతా రావు ను తీసుకు వస్తారు,చికిత్స కోసం.అతను ఒక కవి.ఒక చక్కని కవి. పాటలు, పద్యాలు  రాసుకునే ఒక కళల కాణాచి. అతని కళల లోకం లో, ధనం , కాసులు కి చోటు లేదు..
ఈ కళాకారుడు తన మరదలు ని మన్స్ఫూర్తి గా ప్రేమిస్తాడు..ఆమె నే ఊహించుకుని పాటలు కడతాడు, నృత్యాలు ఊహించుకుంటాడు. అయితే మరదలు మటుకు ఈ ప్రపంచం అంతా కాసుల మాయం, ధనం లేకుంటే ప్రేమ తింటూ బతకలేం అని భావన తో, అతని ప్రేమ ని అంగీకరించదు ..ఈ తృనీకరణ భరించ లేని ఆ సున్నిత మనస్కుడు ,మతి స్థిమితం తప్పి,పిచ్చి వాడయిపోతాడు.
పిచ్చి ,పిచ్చి గా అరుస్తూ, పుస్తకాల లో పుటలు చిమ్పూస్తూ ఉండే  కాంతా రావు ని ఆ ఆసుపత్రి కి తీసుకు వచ్చి జేర్పిస్తారు..తల్లి తండ్రులు..
ఇంకా ఆ ఆసుపత్రి పెద్ద కి సంతోషం..అతను ఆలోచిస్తున్న ,చికిత్స విధానం ని ప్రయోగించ డానికి ఒక మానసిక రోగి దొరికాడు అని.
సావిత్రి ని పిలిచి, తన ఆలోచన చెప్పి, ఆమెని ఒప్పిస్తాడు. ఆమె ఒప్పుకోదు ..ముందు.నేను ఒక స్త్రీ ని, ఇలా ప్రేమ ని నటించడం అది ఎలా? ఒక మగవాని తో ప్రేమ నటించడం అదీ ,ఈ సంఘం ఎలా ఒప్పుకుంటుంది? నా భవిష్యత్తు ఏమవుతుంది? అనే ఆమె ప్రశ్న ల ని ,ఇది ఒక చికిత్స విధానం ,నర్సు గా ఇది నీ విధి నిర్వహణ తప్ప ఇంకేమి కాదు..అని ఒప్పిస్తాడు.
ఇంక  మొదలు అవుతుంది. కాంతా రావు, చిన్న పిల్లాడిలా మారాం చేస్తూ ఉంటాడు.పుస్తకాలు అంటేనే ద్వేషం.ఈ పుస్తక రచన నచ్చకే కదా, అతను తన ప్రేమ ను కోల్పోయేడు ..అందుకే..
సావిత్రి ,తన చల్లని చిరు నవ్వుతో, ప్రేమ తో, అతని కి సేవలు చేస్తూ, పాటలు కూడా పాడుతూ, అతని కి మళ్లీ ప్రేమ అంటే ఏమిటో రుచి చూపిస్తూ, తనే అతని ప్రేమ లో పడిపోతుంది.
నాకయితే..ఆ ఆసుపత్రి పెద్ద( హెడ్ ) అంటే ఎంత కోపమో ..ఏమిటి అర్ధం పర్ధం లేని చికిత్స లు? మనసు తో ఆడుకోవడమా?
సావిత్రి పాత్ర చూసి మనసు కరిగి పోతుంది..
ఒక పక్క కాంతా రావు పాత్ర , సావిత్రి ఒక్క నిముషం కనిపించ క పోతే ,పేచీలు పెట్టి, మందు వేసుకొను, ఆమె వచ్చి ఇస్తేనే మందు అంటూ, ఎంత గా ఆధార పడిపోతాడో..మనకి విసుగు వస్తూ ఉంటుంది..
కొంప తీసి ఇతను కూడా నిజం గా ప్రేమించేస్తున్నడా ? మన సావిత్రి నర్సు పాత్ర ని..మనం లీనం అయిపోయాం కదా ఆ పాత్ర లో..
అతన్ని బుజ్జగించి, పుస్తకాలు చదివించి, చెల్లా చెదరు గా పడి ఉన్న అతని కవిత్వం అంతా ఒక పుస్తకం గా ప్రచురింప చేస్తుంది..ఆమె..అప్పటికే అతని ప్రేమలో  పూర్తి గా మునిగి ఉన్న మన సావిత్రి ..
ఆ పుస్తకం ఒక పెద్ద హిట్..అంటే, ఎన్నో బిరుదులూ ప్రశంశలు..
దానితో పాటు డబ్బు..వచ్చి పడతాయి..
దానితో..పాటు..మరదలు.నా బావ అంటూ వెనక్కి వస్తుంది..
ఈ లోపల ,ప్రేమ తో పిచ్చి తగ్గించే కొత్త ,సరి కొత్త చికిత్స విధానం పని చేసి, మానసిక రోగి, కాస్తా..మామూలు మనిషి అయిపోయేడు ..
మరదలి ని చూసి, ఉత్సాహం తో పొంగి పోయేడు, గతం అంతా మర్చి పోయిన ఈ రోగి, ఇప్పుడు మరదలి ప్రేమ ని పూర్తి గా ఆస్వాదిస్తూ, అసలు తనని ఇలా చేసిన సావిత్రి ని ఒక మామూలు నర్సు గా మాత్రమే గుర్తిస్తాడు.
అయింది,అనుకున్న దంతా అయింది..సావిత్రి, మన పిచ్చి పిల్ల ,సావిత్రి, మనసు వేయి ముక్కలయింది. నిజ జీవితం లో కూడా ఆమె ప్రేమని వాడుకున్న ఒక హీరో మనకి గుర్తు వచ్చి, మనం కూడా కన్నీరు మున్నేరు అవుతాం..
ఏ కట కటా ల గదిలో కాంతా రావును ముందు బంధించి పెట్టారో,అదే గదిలో,ఇప్పుడు సావిత్రి..ఒకప్పుడు,ప్రేమ స్పదురాలు, ఒక నర్సు, ఒక స్త్రీ, ఇప్పుడు ఒక రోగి, ఒక మానసిక చికిత్స రోగ బాధితురాలు.
అవును, మన ఆసుపత్రి పెద్ద చెప్పిన రోగ చికిత్స విధానం సఫలమయి ,ఆ చికిత్స కి సాధనం అయిన ఒక స్త్రీ మూర్తి కి, ఒక ప్రేమ మూర్తి కి మతి చలించింది.
ఇది సఫలమా? విజయమా? అప జయమా??
చివరికి ఏం మిగిలింది..???
ఒక పగిలిన హృదయం మిగిలింది, ఒక స్త్రీ చేసిన త్యాగం మిగిలింది..
నువ్వు త్యాగ మూర్తి వి, నువ్వు ప్రేమ మూర్తివి అని పొగిడి, స్త్రీ ని ఎలా వాడు కుంటారో? స్త్రీ ఎంత అమాయకం గా తన మనసుని ఒక మగ వానికి ఎందుకు ,ఎలా అర్పిస్తుందో? ఆ ప్రేమ విఫలం అయితే, ఆమె కి చికిత్స గా మళ్లీ ,ఎవరు ప్రేమ ని పంచుతారు ??అన్ని ప్రశ్నలే..
చివరికి మిగిలేది ? ఒక గుండెలు పిండే దృశ్య కావ్యం..
అందానికి అందం నేనే..అనే పాట ఒక్కటే గుర్తు ఉంది, పాత్రల్ పేర్లు గుర్తు లేవు, సావిత్రి నటన ఒక్కటే అలా మనసులో ఒక చెక్కు చదరనీ రూపం తో గుర్తుండి పోయింది.
ఇలాంటి కథ తో నే, చంద్ర మోహన్ తన సొంత సినిమా ఒకటి తీసేడు, మనసే ...అన్న పేరు..పూర్తి పేరు గుర్తు రావటం లేదు.
కాని, సావిత్రి కి ఎవరూ సాటి రారు కదా..హిందీ లో కూడా ఉంది ట , ఈ సినిమా..కాని, తెలుగు లో సావిత్రి ని చూసిన కళ్ళ తో ,ఇంకెవరిని చూడలేం కదా..
అందానికి అందం నేనే, జీవన మకరందం నేనే..అనే గొప్ప ,తీయని పాట ,ఈ సినిమా లోదే..ఈ పాట ,నిన్న విన్నాకే ఈ సినిమా గుర్తు వచ్చింది..అదే ఈ పోస్ట్ వెనక కథ..
ఈ పాట వెనక కథ ఇదే..సెలవ్ మరి..ఇప్పటికి..










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి