"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 సెప్టెం, 2012

అటక లు సద్డడం

చాలా రోజులు.ఊహు కాదు, రెండేళ్ళు అయిందేమో?  మళ్లీ అటక సద్దుద్దాం అని తిథి ,వారం ,వర్జ్యం ..అంటే పిల్లలు లేనప్పుడు, భర్త ఊరులో లేనప్పుడు, బయట వారు ఎవరూ తలుపులు తట్టని ఒక ఆదివారం ,మొదలు పెట్టేను .
అటక అంటే ....ఒక దాపరికం..
మనకి అక్కర్లేని వస్తువులు, పాత అయిపోయినవి అయినా పడేయ లేనివి,పదును కోల్పోయిన పాత కత్తులు, ఏమో ఎప్పుడో పనికి వస్తాయి, అంటే మన ఇంట్లో ఏదయినా శుభ కార్యం అయితే, ఓ పది మందో, ఇరవై మందో వస్తే,రెండు కత్తి పీటలు ఉంటే , ఎంత ముందు చూపో ,అని నేను అనుకోవడమే..నీకు ఏ వస్తువు పడేయలేని బలహీనత ,అని వెక్కిరింపులు .
ఎవరో అన్నారు అని కాదు కాని, ఈ అటక మీదకి ఎక్కి చూస్తూంటే, ఏమిటి కలగల్పు ,చెత్త చెదారం..హు..లాభం లేదు, ఇవాళ అన్ని పడేయాల్సిందే..మా విసాపట్నం లో జరిగే ఏ వస్తు ప్రదర్శన (exhibition) నేను ,నా స్నేహితురాలు తోడు గా వెళ్లి,వంటింటి లో పనికి వచ్చే ,ఏ ఉపకరణం అయినా సరే,మా వంటల నైపుణ్యాన్ని పెంచేవి ఇవే అని ఘట్టి నమ్మకం తో కొని పడేసే వాళ్ళం..అయితే తరవాత ,తరవాత తెలిసింది, మా వంటల నైపుణ్యం కి తోడ్పడేవి..ఏమిటో? అడక్కండి..అది రహస్యం..
చక చకా బంగాళ దుంపలుని చిప్స్ లా కోసి పడేస్తుంది, అని ఓ హిందీ అబ్బాయి చేసి చూపిస్తూంటే,మేమూ కొన్నాం..అయితే మాకు ఇంట్లో మటుకు, అది, చేతులు చెక్కడానికే ఎక్కువ ఉపయోగ పడింది, మరీ ,ఇలా రక్తాలు కారుకుంటూ,వంటలు చేయాలా అని, మూడో ,నాలుగో వందలు పెట్టి కొన్నాం , డస్ట్ బిన్ లో ఎలా పడేస్తాం..ఇదిగో, ఇలా అటకెక్కింది.
ఇంకా మా అమ్మ వాడే  ఆ పాత నల్ల జంతికల గొట్టం ఏం బాగుంటుంది, కొంచం కొత్త గా వాడుదాం అని,ఒక తళ తళ లాడే స్టీల్ గొట్టం కొన్నాను, పిండి లో ఉప్పు ఎక్కువ వేసి,చేతులు నొప్పి పెడుతున్నది దీనితో, అని అది అటక మీదచేరింది, తన అక్క చెల్లళ్ళ తో  పాటు..అన్ని మరి, ఒకే చోట కొన్నవే కదా..
అబ్బ ఎన్ని రంగులో, ఎంత బాగుందో? అంటూ ముచ్చట పడి ,డేకోలాం అంటించిన చపాతీలు వత్తే పీట కొన్నాం..మంచి నీలం రంగు ఎంచుకుని..అమ్మా! మన గట్టు గ్రాన్యట్ రాయి కదా,వేరే ఏం పీట లు అక్కర్లేదు అనే మా అబ్బాయి జయంత్ ,మాట పెడ చెవిన పెట్టి..
నాలుగు నెలలు వాడానో లేదో,  అంటించిన డెకొలం, నీరు లోపలి వెళ్లి పోవడం వాళ్ళ కాబోలు,అప్పడం లాగ పైకి లేవడం ప్రారంభించింది.
అసలే మన చపాతీ లు భారత దేశం పటం లాగ వస్తాయి, ఇంకా ఈ పీట మీద వత్తితే ,అమెరిక పటం లా అయిపోయే ప్రమాదం ఉందని ,హమ్..చూస్తూ, చూస్తూ,బయట ఎలా పడేస్తాం..పోనీలే ఎప్పుడయినా..దీని కింద ఒక అండర్ లైన్ గీయండి, గవ్వలు అవి చేస్తే ,పనికి వస్తుంది..ఎప్పుడయినా చేసారా?అని అలా నిల దీయకండి..చేసుకున్న భర్తే ఇలాంటి ప్రశ్నలు వేయడం మానేసాడు. ఫలితం..ఇదిగో, ఇలా అటకెక్కింది..బుజ్జి ముండ..ఎంతబాగుందో? ఆకాశం నీలి రంగు..
అమ్మా ,అలా రంగులు చూసి కొనకమ్మా ,ఉపయోగం ఉంటుందో లేదో చూసి కొను, అని మా చిన్న వాడు, చిన్న వాడయినా నాకు కొంచం బుద్ధి ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు..కాని, బలం కోసం సెలైన్ చేతికి ఎక్కించి నట్టు, బుద్ధి కూడా ఇలా మాటలతో ఎక్కించలేం ..అని హు..చిన్నవాడు కదా ఇంకా తెలియదు పాపం..
అదేమిటో ఈ ప్రదర్శన శాల లో, అందమయిన హిందీ అబ్బాయిలని పెట్టేస్తారు, ఆ కొట్ల మీద..ఉల్లిపాయలు కళ్ళ లలో నీళ్ళు రాకుండా ,ఎలా కోయాలో, చేసి చూపించేడు, నాలుగు పెద్ద ముక్కలు చేసి ,అందులో పడేస్తే చాలు ,చక చక, చిన్న చిన్న ముక్కల్లగా చేసి పడేస్తుంది.
ఇది మటుకు ,చాల ఉపయోగం..అని  పది మంది ని విచారించి, లోచించి,తీర్మానించి,   అందరూ మన లాంటి వాళ్ళే, కొనేసాను..భయం భయం గానే..
ఈ సారి, మంచి బేరమే..చాలా బాగా పని చేస్తోంది..ఉదయమే, పెసరట్లు పెట్టుకుని, ఆఖరున ఉల్లి పాయలు కోసే కార్యక్రమం పెట్టుకున్నా ..తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు ..అని ఊరికే అన లేదు పెద్దలు.
కరెంట్ కట్..కరెంట్ ఉంటే గాని పని చేయదు మరి. మన అంజలి కట్టర్ ,ఎప్పుడూ ఇలా చేయివ్వదు..అని మళ్లీ మన చేతి వాటం..అంటే ఇంకో అర్ధం లో..పైగా ఒక్క ఉల్లి పాయ ,ఒక నిముషం లో కోసి పడేసినా, ఆ పరికరం కడగడానికి అయిదు నిముషాలు పైగా పడుతుంది అని స్వయం గా పరిశీలించి ,తెలుసు కున్నాను..దాంట్లో ఉండే పదునయిన స్టీల్ బ్లేడ్ ని కూడా కడగ బోయి,మళ్లీ  మామూలే  వేళ్ళు కట్..
సరే ,ఉందిగా మన అటక ఇలాంటి వాటికే..క్షేమం గా కథ కంచి కి చేరినట్టు,అది కూడా తన గూడు చేరింది.
ఇంకా తోడుతూంటే ,జ్ఞాపకాలు ఊరినట్టు ,సామాన్లు అలా బయట పడుతూనే ఉన్నాయి.
కాఫీ చిక్కగా రావడానికి ఒక నాలుగు రకాల సైజుల ఫిల్టర్లు, ఇప్పుడు వాడేది,ఒక్కటి, కుక్కర్ గిన్నెలు దొంతర ఒకటో రెండో, ఇంకా స్టీలు గిన్నెలు ఎన్ని రకాలో, పోపు మూకుడు బుల్లి సైజు తో మొదలు, ఓ పది మంది కి సరిపడా ఓ పెద్ద మూకుడు వరకూ, అర డజను రకాలు, అలా దిగులు గా చూస్తూ మమ్మల్ని ఎప్పుడు వాడతావమ్మా?అంటూ..
ఇంకా చపాతీలు కాల్చడానికి ,కొన్న నాన్ స్టిక్ పెనాలు, స్టిక్ పేనాలు గా మారిపోయినవి ఉన్నాయి..మన వీర జవాన్లకి ,డాలు లాగా పనికి వస్తాయేమో అడగాలి..ఎలాగో ఒక లాగ ఉపయోగించడమే కదా నేటి మేటి సందేశం...అబ్బే..మా ఇంట్లో ఆ అవసరం లేదు లెండి, నిజం..మనది గాంధి గిరి, అహింసా వాదమే, మా సిద్ధాంతం.
మూతలు లేని సీసాలు, ఎప్పటికయినా వాటిలో మొక్కలు పెంచేసి, మా ఇల్లు బృందావనం చేసేయాలని నాకు ఒక రహస్య కోరిక..బయటకి చెపితే, అది ఒక జోక్ అయిపోతుంది.
నేను వనం, పూల వనం అంటూ పాటలు రాయగలను కాని, ఒక చెంబుడు నీళ్ళు పోయలేనంత బద్ధకం ..నాకు ..అని ఇంట్లో అందరికి అనుభవమే మరి, అందుకే కొన్ని రోజులు ఎడారిలో పెరిగే ముళ్ళ మొక్కలు పెంచుతాను అని ముచ్చట పడ్డాను, కాని, ఎవరో,అరిష్టం అంటూ భయ పెట్టేరు..ఆ మొక్కల కే..
ఈనాడు పేపర్ లో ఒక మూల ఫుడ్ ప్రాస్ సర్ ఫర్ సేల్ అని ఉంటె, పని లేని నేను వెళ్లి ,చాల ఊహల తో కొనుక్కుని వచ్చెను..అది మరీ .ముందు.అంటే చపాతీ పిండి కలపడం ఎలా? అన్న దగ్గరే, ఒక అరగంట ఆలోచించే రోజులప్పుడు .ఆ పరికరం తో యిట్టె కలిపేయవచ్చు చపాతీ పిండి అని ఏవేవో ఆశలు పెట్టి కొనిపించేరు.
ఈ లోపలే, నాకు చటుక్కున ఒక రోజు, సైకెల్ తొక్కడం ఎలా వస్తుందో, ఒక్క క్షణం లో ఆ బాలన్సు తెలిసి పోతుంది అలా ,ఒక రోజు, గోధుమ పిండి లో, నీళ్ళు పోసి కలిపితే ,అలా కలుపుతూ ఉంటె, పిండి రెడి అని ఒక సుముహుర్తాన తెలిసి పోయింది ఇంకా ఈ దెయ్యం లాంటి , చాల పెద్దది, లాప్ టాప్ రాక ముందు డెస్క్ టాప్ అంత పెద్దది, వంటింటి గట్టు మీద దీనికి జాగా ఏది? అన్న వంక తో, అట్ట పెట్టె తో సహా ,అటక ఎక్కి కూర్చుంది..
ఇలాంటి అట్ట పెట్టే ..ఇంకోటి..ఇది మటుకు నా తప్పు లేదు..
ఇలాగే ఈ నాడు పేపర్ లో చదివే, కేక్ లు ,పిజ్జాలు ,పిల్లలికి ఇంట్లో నే చేసి పెట్టేద్దాం అని ఒక మంచి ఊహ తో, వెళ్లి బేకింగ్  తరగతి లో చేరి మరి ,నేర్చుకున్నాను ..
ఒక సారి చేసేను..కూడా..ఇంట్లో ఉంటె ఎంత సుఖమో అని ఊహించి మరి కొనేసాను, ఒక పరికరం..దాంట్లో బేకింగ్, ఇంకా ఏవో గ్రిల్లింగ్ అవి కూడా చేయవచ్చుట..
ఈ లోపల హాట్ బ్రేడ్స్ అంటూ ఒక బేకరి ,తెరిచేసారు..అమ్మా..నువ్వు కష్ట పడకు అనేసారు పిల్లాలు..
సరే అని..పెట్టె తో సహా చేరింది ..ఈ అటక మీదే..
ఇదిగో, ఎప్పటికయినా మళ్లీ ,మా ఇంట్లో చిన్న పిల్లలు రాక పోతారా? అని ఒక కోరిక ..వాళ్లకి చేసి పెడదాం ..అని..
ఇంకా అటక సగమే అయింది.అమ్మో, నీరసం వస్తోంది..ఇంకా ఎప్పటివో..చాల వస్తువులే కూడాయి, ఇవేమయినా పిల్లలు పెడుతున్నాయా? ఏమిటి? అలాగుంది..ఇంత సంత..వసంతా..నీ పని అంతే .
మొదలు పెట్టెను పడేయాలి..కాని, ఏమిటో మొహం..ఈ పనికి రాని,పని చేయని వస్తువుల మీద కూడా ఇంత మోజు ఏమిటో? ఇవి నావి ,నా సొంతం..అని ఒక అధికారం..ఒక బలహీనత ..
ఆరు నెలలు వాడక పోతే, ఇంకా అది పనికి రాదు అని పడేయాలి ట ..అదీ రూల్ ..హోం రూల్..స్వీట్ హోమ రూల్..
లాప్ టాప్ లో కూడా ఈ సౌలభ్యం ఉంది, మనకి పనికి రానివి తీసుకు వెళ్ళి ,ఒక్క క్లిక్ తో ట్రాష్ బిన్ లో పడేయ వచ్చు..కాని, ఉంది ఒక మెలిక..మళ్లీ ,ఎప్పుడో ఒక రోజు, నాలిక్కర్చుకుని ,మనకి కావలి అంటే..బయటకి తీయవచ్చు..
చూసారా? మన మానవుల బలాలు, బలహీనతలు తెలిసిన వాళ్ళు కనుకే, ఈ ట్రాష్ బిన్..మళ్లీ  బయటకి తీయడం..అన్న సౌలభ్యం కలిపించేరు.
ఈ వంటిట్లో ,నిచ్చెన ఎక్కి ,నిల్చుని ,నిల్చుని నాకూ జ్ఞానోదయం అయింది..
నాకు అక్కర్లేని ,నచ్చని ,మనసు ని నొచ్చే విషయాలు, జ్ఞాపకాలు ,నేను ఎక్కడ దాస్తున్నాను..నా ఓటములు, నా  రహస్య ప్రేమలు..అందరికీ ఉంటా యి, బయటకి చెప్పలేనివి, ఒప్పుకోండి ...బాధపెట్టే  మాటలు, నేను మరొకరిని బాధించి బాధపడిన ఘటనలు, ఎక్కడ దాస్తున్నాను?
ఏ అటక మీద? ఏ మనసు అరల లో? చిన్న మెదడు లోనా? పెద్ద మెదడు లోనా?? ఎక్కడ దాస్తున్నాను..
మరి ఎందుకీ అవస్థ ? హాయిగా ఆదివారం టీ .వి. లో జెమిని సినిమా ఓ,మా సినిమా ఓ ఉంటుంది గా..సరే మరి దిగిపోతాను..
ఈ అటక లు సద్డడం ..ఎప్పుడూ ఏదో మనసు ని భారం చేస్తుంది..
అని నాకు నేనే సద్దుకుని ...మనసు ని సద్ది పుచ్చుకున్నాను..
చివరి మాట..మా ఇంట్లో ఈ నాడు పేపర్ మాన్పించేసారు....









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి