"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 మార్చి, 2010

చిన్నప్పట్టి తుఫాన్లు...

బాల్యం అంతా బంగారు అందరికి ,  మాకూ అంతే. చీకు, చింత లేని బాల్యం అంటే ఎవరికి మురిపెం గా ఉండదు? అందులో, ఈ తుఫాను రోజుల గురించి ప్రత్యేకం చెప్పాల్సిందే. 
పొద్దున్న లేచినప్పట్నించి దట్టం గా మబ్బులు పట్టిన ఆకాశం, ఏనుగుల గుంపు వెళుతున్నట్టు  నల్లని ఆకాశం, అయినా బడి కి వెళ్ళడం లో ఆనందం, చల్లని గాలులు వీస్తూంటే, క్లాసు రూం లో చీకట్లు కమ్మి, టీచర్  కి బోర్డు కనిపించక, ఏం పాఠాలు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక, ఏవో కథలు చెపుతూ, బెల్ ఎప్పుడూ కొడతారా అని ఎదురు చూడ్డం,మేము ఈ లోపల, గల గల మని కబుర్లు పోగేయడం, సైలెంట్ అని అయిష్టం గా అప్పుడప్పుడు అరుస్తూ, ఇంతలోనే, భోరున కుంభ వృష్టి మొదలు, మాకూ ఎక్కడ లేని ఆనందం, ఆకాశం లో మెరుపులు మా మొహాల్లో నే విలసిల్లేవి , కబుర్ల, కేకల ఉరుములు క్లాసు రూం లో ,ఇంత లోనే ఎదురు చూస్తున్నసర్కులర్ వచ్చేసింది, వర్షం తుఫాను గా మారుతుంది అని వాతావరణ సూచన లో చెప్పారుట, స్కూల్ కి సెలవు ప్రకటించారు. బెల్ కూడా మొగక ముందే, పొలోమని అందరం పరుగులు, ఆ వర్షం లో ఎలా వెళతాం ఇంటికి, అన్నాలోచన స్కూల్ వాళ్లకి ఉండేది కాదు ఏమిటో?  ఫోన్లు, సెల్ ఫోన్లు లేని కాలం అది. అందరం, పుస్తకాల సంచి ని జాగ్రత్తగా , గుండెలు కి హత్తుకుని దాచుకుంటూ, మెల్లగా, పూల వాన లో నడుస్తున్నట్టు, కబుర్లు చెప్పుకుంటూ,హాయిగా వర్షం లో తడుచు కుంటూ, ఇంటికి చేరడం. పూర్తిగా తడిసి పోయిన ఆ స్కూల్ డ్రెస్ ఒక మూల విడిచి,పొడి బట్టలు కట్టుకుంటే కలిగిన ఆ వెచ్చని , భద్రత స్పర్స ఎప్పటికి మరిచి పోలేను. 
దారిలో మేము చూసిన గాలి విసురు, ఊగిపోతున్న చెట్లు, రోడ్లు ఎలా మునిగి పోయాయో, అన్నీ అమ్మకి కథలు, కథలు గా చెప్తూంటే, అమ్మ పట్టె మంచం కింద  బొగ్గులు నిప్పు చిన్న కుంపటి లో పెట్టేది, జలుబు  చేస్తుంది, ఇంతలా తడిసి ముద్ద అవాలా ఎక్కడో ఆగొచ్చు కదా అని సుద్దులు చెపుతూ, వేడి వేడి  కాఫీ కప్పు  చేతికి అందించి సేద తీర్చేది అమ్మ. ఇలాగ నేను ఒక్కర్తిని కాదు, ఇంకా అయిదుగురం మేము. 
ఇంక మొదలు ఇంట్లో నే ఆటలు, చీకట్లో  దుప్పటి కప్పుకుని దాక్కోడం ,చీకటి గది ఆట, దొంగాటలు, ఇంకా ఏవేవో ఆటలు, ఇల్లంతా చిందర వందర చేసే ఆటలు.కరెంట్  ఉండదు, కొవ్వుత్తులు, కేరోసేనే లాంతరు వెలిగించి, ఇల్లంతా ఏదో దీపావళి పండుగ వచ్చినట్టు, ఒకటే సంబరం. చీకట్లో ,వండ డానికి అమ్మ ఏం కష్టపదేదో, ఏమిటో అమ్మా ఆకలి అంటే, పకోడీలు, ప్రత్యక్షం. మళ్లీ ఆటలు, చీకట్లో ఏం వండుతాను అని రెండు కేజీల అన్నం వార్చి, అందరికి  కలిపి, కంది గుండ అన్నం కలిపి చేతిలో పెట్టడం, మేము గుటుకు గుటుకు మని మింగేసి, మళ్లీ చెయ్యి చాచడం. మజ్జిగ  అన్నం కూడా అలాగే, జుర్రుకుని తినేసి, ఇంక పక్కలు పరచుకుని, నేలమీదే ఒకరి పక్క ఒకరు, ఏవేవో కబుర్లు చెప్పుకుని పడుకోవడం, మధ్యలో చిరు జల్లు కొట్టేది, పక్కలమీదకు గిలిగింతలు పెట్టే ఆ వర్షం జల్లు కి కిల కిల నవ్వుకోవడం...అవే కదా తీయని, బంగారు గుర్తులు అంటే..
రెండో  రోజూ కూడా ముసురు పట్టి ఉంటే, ఇంక కష్టాలు మొదలు, తడిసి పోయిన స్కూల్ బట్టలు ఒక పక్క, రాత్రి వర్షానికి ఓ మూల తడిసిన దుప్పట్లు , కూరా  నార లేదు, ఏం వండడం అని అమ్మ ఆలోచన, ఇవాళ కూడా స్కూల్ లేదు, ఎలా కాలక్షేపం అని బెంగ మాకూ, రెండో రోజూ మా ఆటలు, పిడి గుద్దులు, కీచు లాటలు, అమ్మా చూడు అని, ఒకరి మీద ఒకరు చాడీలు, ఆడపిల్లలు అంతా ఒక గ్రూపు గా మగ పిల్లలు ఒక గ్రూపు గా కొట్టుకోవడం ఒక ఆట, తలగడ లు పెట్టి యుద్ధం చేసు కోవడం, ఇంక ఆగని వర్షం లో, పిల్ల కాలువలు ప్రవహించేవి  రోడ్డు మీద, పుస్త కాల లో నుంచి, కాగితాలు చింపి నిర్ధాక్షిణ్యం గా ,జంట పడవలు, కత్తి పడవలు, మామూలు పడవలు చేసి, నీటి లో వదలడం, ఎంత దూరం వెళతాయో అని, వాటి వెనకాల పరుగులు తీయడం, మళ్లీ తడుస్తున్నారా అని అమ్మ అరుపులు, ఒక చెవి లో విని ఇంకో చెవిలో నుంచి వదిలేసి, మాకూ ఆట విడుపు కదా.. అమ్మకి ఎప్పుడు  ముసురు విడుస్తుందా, ఎప్పుడూ, ఈ పిల్ల రాక్షసలు బడి కి వెళతారా అని ఆరాటం, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో. ఆకాశవాణి లో వచ్చే వార్తలే ప్రపంచం తో సంబంధం నిలిపేవి, నాన్న గారు వార్తలు విని, రేపటికి తీరం దాటు తుంది ట అని అంటే, అయితే మాకు స్కూల్ ఉంటుందా రేపు అని కోరస్ గా అడిగే వాళ్ళం. ఆ తుఫాను ఏమో గాని, ఇంట్లో మీ తుఫాను ఎప్పుడు దాటుతుందో  తీరం అనే వారు. ఇంట్లో ఆరుగురు పిల్లలతో, ఎలా పెంచారో, మా తల్లి తండ్రులు అంత ఓపికగా?? ఇప్పుడు ఉన్న సౌకర్యాలు లేవు, ఫోన్లు లేవు, టీవీ లేదు, ఫ్రిడ్జే లేదు ,  అందరు కలిసి హాయిగా ఉన్నంతలో సంతోషం గా గడిపేం.
తుఫాన్లు కూడా ఇంత ఆనందం ని ఇస్తాయి అని మా చిన్నప్పుడే తెల్సింది. 
ఇప్పుడు అనుక్షణం టీవీ లో వార్తలు వింటూ, మన పిల్లలు ఏమి మిస్ అవుతున్నారో, వారికే తెలియదు. ఈ టెక్నాలజి అంతా మనషులని ,మనసులని దూరం చేసిందా?? అనిపిస్తున్నది ఇప్పుడు. చిన్నప్పట్టి తుఫాన్లు కథలు ఇంకా చాల ఉన్నాయి.. ఉంటాయి, మరో సారి...

3 కామెంట్‌లు:

  1. entha baga chepparandi.....meeru rasindi chaduvutunte ma chinnapati jnapakalu gurtostunnai.....very nice

    రిప్లయితొలగించండి
  2. నేను కూడా vizag బీచ్ దగ్గర వుండే వాళ్ళం...ప్రతీ ఏడూ నాలుగయిదు...తుఫానులు వచ్చేవి..మబ్బు వాతావరణం...పెద్దవర్షం...రేడియొలో వార్తలు..పేపర్లో తుఫాన్ విశేషాలు..రాత్రి పూట సముద్రపు అలల శబ్దం..మేము townhall దగ్గర వుండడం వల్ల వర్షంలోనే బీచ్ కి వెళ్ళేవాళ్ళం...అప్పట్లో vizag ని ఆంధ్రా ఊటీ అనే వారు...ఎప్పుడూ చల్లగా సాయంత్రమయితే చాలు చిన్నపాటి వర్షం తో చాలా ఆహ్లాదంగా వుండేధి..అప్పుడు వర్షంతో తడిచేవాళ్లం...ఇప్పుడు చెమటల్తో తడుస్తున్నాం...

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయి తుఫాను కబుర్లు.ఆబ్బ మొత్తానికి చిన్నతనపు రోజులు గుర్తు చేసేసారు. బాగా చెప్పేరు చిన్ననాటి కబుర్లు. :-)

    రిప్లయితొలగించండి