"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 మే, 2013

సంకెళ్లం మేమే.. విముక్తి ప్రదాతలం మేమే!




మాతృధినం... మహిళా దినం అంటూ
మాకొద్దీ ప్రేరిత తద్దినాలు
మాతృమూర్తివంటూ పొగిడి
త్యాగమే గుణం అంటూ ఉబకేసి
ఒక ముద్ద తక్కువ తినే అమ్మవంటూ
తను వండిన వంటలోనే వాటా తగ్గించి
ఎంతకాలం ఈ మోసం
ఎవరు వేస్తున్నారీ గాలం?
కడుపున పుట్టిన కూతురినే
తక్కువగా ఎందుకు చూస్తానో
అత్తారింటి కోసమే కన్నానా ఈ పిల్లని
నాచేతే నీతుల పేర తలవంచమని చెప్పించడం
ఇంకానా...
కూతురు అందంగా తయారయి
బయటికి వెళ్లిన రోజు
నా కడుపులో జరిగే
అతలాకుతలానికి అంతం ఎప్పుడు?
కన్న కలలు చెదిరిపోయినా
కూతురి కలలని కూడా నేనే ఎందుకు చెరిపేస్తున్నట్లు?
ఎవరు చెప్పారు ఇలా చేయమని?
ఎవరు చేయిస్తున్నారీ అఘాయిత్యాలు?
అంతా నీ మంచికే అమ్మా అంటూ
నాచేత అనిపిస్తున్నారెవరు?
ఒక ఒప్పందం చేసుకున్నామా?
నాలాంటి మరికొంతమంది కలిసి
ఏ ఆడపిల్ల కలలూ నిజం కాకూడదని?
ఏమో, నిజమేనేమో...
ఊచల జైలుకి మేమే కాపలాదారులం ఇప్పుడు
మా కాళ్లకి, మా నోళ్లకి మేమే సంకెళ్ళం...
నువ్వు... నేను...
మనం ఈ కుట్ర అర్థం చేసుకున్న క్షణంలోనే...
అవును ఈ కుట్రని ఇంక ఛేదించాలి మనమే...
ఎప్పటికో, మరి ఎప్పటికో ఈ సంకెళ్ళు తెగేను?
సంకెళ్లు తెగడమంటే
స్వీయపక్షంగా శిక్ష పడాల్సిందే
సంకెళ్లు తెగడమంటే
ఆధిపత్య కనుసన్నలని
కటకటాల వెనుక కుక్కేయ్యాల్సిందే
అన్ని రకాల దినాలకి
తద్దినం పెట్టాల్సిందే!
- పి.వసంతలక్ష్మి
ఆదివారం ఆంధ్ర భూమి వార్తా పత్రిక లో ప్రచురించిన నా కవిత 

2 కామెంట్‌లు: