"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 మే, 2013

టచ్ మీ నాట్ ...

ముట్టుకుంటే ముడుచుకు పోతుంది 
ఆత్తి పత్తి , టచ్ మీ నాట్ అంటారు,  
ముచ్చట పడి ముట్టుకంటే ,సిగ్గుతో 
బిడియం తో ఎర్రగా కంది పోతుంది 

మనకి కూడా అలా ముడుచుకు పోయే 
గుణం ఉంది కాని, మొరటు చేతులు 
ఎక్కడెక్కడో పాకి, అసహ్యం ని చిందిస్తాయి . 
నా ఒళ్లంతా ముళ్ళై పోతే బాగుండును 
వాడిని రక్కి, రక్తాలు కారించి, హింస కి 
అర్ధం  చూపిస్తాను , నేను గులాబి బాల నే 
కాదు, ముళ్ళ కవచం ధరించిన బాలను ,
నా ఒంటి మీద చూపు పడినా ఖబదదార్ 
అంటూ ఒక్క పిడికిలితో మట్టి ని కరిపిస్తా . 

నేను ఆకాశం లో సగాన్ని కాదు ,ఆకాశం ని 
నన్ను తాకితే తగిలేది విద్యుత్ ప్రవాహం 
నీ ఒళ్లంతా కాల్చి, మసి చేసే వేయి వోల్టుల షాక్ 
మాడి మసి అయితే నీ బూడిద కూడా నల్లటి మసి . 

ఎందుకింత చులకన ? ఎందుకింత పలచన ?
నువ్వు ఎక్కడినించి పుట్టావో, అదే నీ జన్మ స్థలం 
అదే నీ అమ్మ ,నీకెందుకు జన్మ నిచ్చనా ?అని 
పరితపించే క్షణం . . మృగం కూడా సిగ్గు పడి ఛి 
అని చీత్కారించే అధముడివి నీవు. మదమెక్కిన మగవాడా ! 

వావి లేదు, వరస లేదు, పచ్చి మొగ్గ, పసి కందు 
పాలు కారే బుగ్గలు, ఎలా చేయి వేస్తావు అసలు ?
నీ గుండెలో ప్రవహించేది రక్తం కాదురా ,
నీ సిరల లో ప్రవహించేది కుళ్ళుకాలువ కచడా 
ఎత్తి పోసి, తొక్కి పెట్టి, నిలువునా చంపినా 
మా కసి తీరదు, మా ఆవేశం రంగు చూసి ,
నీ కలలో కూడా భయపడాలి నువ్వు...

అత్తిపత్తి లా ఇంకేమాత్రం ముడుచుకోం మేం 
ముళ్ళ కవచం మా ఒళ్లంతా కాచుకో మరి 
నీ ఒంటి మీద పడే ప్రతి ముళ్ళ గుర్తు ఇంకా 
నీ జీవితాంతం ,నీ అమానుష సాక్షులు ... 






26 మే, 2013

సంకెళ్లం మేమే.. విముక్తి ప్రదాతలం మేమే!




మాతృధినం... మహిళా దినం అంటూ
మాకొద్దీ ప్రేరిత తద్దినాలు
మాతృమూర్తివంటూ పొగిడి
త్యాగమే గుణం అంటూ ఉబకేసి
ఒక ముద్ద తక్కువ తినే అమ్మవంటూ
తను వండిన వంటలోనే వాటా తగ్గించి
ఎంతకాలం ఈ మోసం
ఎవరు వేస్తున్నారీ గాలం?
కడుపున పుట్టిన కూతురినే
తక్కువగా ఎందుకు చూస్తానో
అత్తారింటి కోసమే కన్నానా ఈ పిల్లని
నాచేతే నీతుల పేర తలవంచమని చెప్పించడం
ఇంకానా...
కూతురు అందంగా తయారయి
బయటికి వెళ్లిన రోజు
నా కడుపులో జరిగే
అతలాకుతలానికి అంతం ఎప్పుడు?
కన్న కలలు చెదిరిపోయినా
కూతురి కలలని కూడా నేనే ఎందుకు చెరిపేస్తున్నట్లు?
ఎవరు చెప్పారు ఇలా చేయమని?
ఎవరు చేయిస్తున్నారీ అఘాయిత్యాలు?
అంతా నీ మంచికే అమ్మా అంటూ
నాచేత అనిపిస్తున్నారెవరు?
ఒక ఒప్పందం చేసుకున్నామా?
నాలాంటి మరికొంతమంది కలిసి
ఏ ఆడపిల్ల కలలూ నిజం కాకూడదని?
ఏమో, నిజమేనేమో...
ఊచల జైలుకి మేమే కాపలాదారులం ఇప్పుడు
మా కాళ్లకి, మా నోళ్లకి మేమే సంకెళ్ళం...
నువ్వు... నేను...
మనం ఈ కుట్ర అర్థం చేసుకున్న క్షణంలోనే...
అవును ఈ కుట్రని ఇంక ఛేదించాలి మనమే...
ఎప్పటికో, మరి ఎప్పటికో ఈ సంకెళ్ళు తెగేను?
సంకెళ్లు తెగడమంటే
స్వీయపక్షంగా శిక్ష పడాల్సిందే
సంకెళ్లు తెగడమంటే
ఆధిపత్య కనుసన్నలని
కటకటాల వెనుక కుక్కేయ్యాల్సిందే
అన్ని రకాల దినాలకి
తద్దినం పెట్టాల్సిందే!
- పి.వసంతలక్ష్మి
ఆదివారం ఆంధ్ర భూమి వార్తా పత్రిక లో ప్రచురించిన నా కవిత 

21 మే, 2013

ఓరగా వేసి ఉన్న తలుపులు

ఓరగా వేసి ఉన్న తలుపులు 
నాకు ఎప్పుడూ ఇష్టమే ,
ఓరగా తెరిచిన పుస్తకం 
పక్క వాడి పుస్తకం లో కథ 
ఊహించడం ఎంత బాగుంటుందో ?

నా మానాన నేను ఎత్తుగా ,
కిటికీ దగ్గర దొరికిన సీటు లో కూర్చుని, 
సుదూరం గా ఎగురుతున్న పక్షుల ఇళ్ళు 
ఎక్కడో ? ఎలా చేరుకుంటాయో ? ఏ వేళ కో 
అనే ఆలోచనల చిక్కు లో చిక్కుకుని ఉంటే 

ఓరగా తలుపులు మూసి, పల్చని తెరలు 
ఎగురుతూ, పచ్చని గోడల మీద ఏదో ఒక 
జంట ఫ్రేం లో గోడ మీద ఒక క్షణం లో ఎంత 
చూడగలనో అంతా చూసేను . 

ఇంక రాత్రి అంత కలలు ,ఆ ఇంట్లో ఎవరుంటారో?
సంతోషం గా ఉంటారా? గోడ మీద జంట ఎవరో?
పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయారా ?
ఎక్కడో కొట్టుకుంటూ ,చూడమ్మా తమ్ముడు అనే అక్క ఉందా?

ఓర గా వేసిన తలుపులు వెనక ఎన్ని కథలో 
నాకెంత ఇష్టమో ? నేను రాయని కథలు అన్ని ఇక్కడే 
నాకు చెప్పని కథలు ,ఈ తలుపులు పోనీ చెప్పకూడదూ 
నిర్దాక్షిణ్యం గా రాత్రి అయేసరికి మూసుకుంటాయి తలుపులు 
దానితో బాటు నా కథలు ,నిద్రపోతాయి .. 
ఓరగా తెరిచినా తలుపులు ,కథలు చెపితే ? ! ?


19 మే, 2013

నది

కరిగి పోయిన నాగరికత కోసం 
వెతుకుతూ నది పరుగులు ,
ఒక్కసారి వెనక్కి చూసి వద్దాం 
ఏవి ఆ సింధు ,హరప్పా నాగరికతలు ?
ఏవి ఆ మానవ సముదాయాలుమిగిల్చిన
నది ఒడ్డున ఆనవాలు ?


సముద్రాలు నదిని మింగి అంతా 
కన్నీటి సముద్రాలు చేశాయా ?
ఉప్పు పాతరలు కడుపులో దాచుకుని 
సముద్రం, నీటి మేఘాలు పైకి పంపితే 
మానవ నాగరికత లో మానవత్వం 
ఆవిరి అయిపోయి, ఆమ్లాలను వదులుతున్నారు .. 

పసి మొగ్గలని చిదిమే పూల బేరగాళ్ళు 
విచ్చలివిడిగా బజారు లో పూల బేరాలు ఆడుతున్నారు 
పువ్వు అయతే చాలు నలిపేయాలని ఉత్సాహం 
చప్పట్లు కొడుతూ ఉత్తేజపరిచే నర సమూహాలు .. 
నరమాంసం రుచి చూసిన మృగానికేనా ,
ఆకలి తీరితే జాలి కలుగుతుంది, ఈ నరుల తీరే వేరు . 

నాగరికత నదుల వెంట వెలిసిందిట , 
నది మొహం చాటేసింది , ఈ రోజు 
నరుడు వదిలేసిన నానా చెత్త ,రొచ్చు 
భరిస్తాను కాని, ఈ రొచ్చు మానవుడి నా పక్క వద్దు 
అంటూ ,నది రోజు రోజు కి చిక్కి సల్యం అయిపోతోంది . 
నది నాగరికత అడుగు జాడలు కోసం వడి వడి గా 
ఎటు ప్రవహిస్తోంది? తనలోకి తనే ,అంతే మరి ,మరో దారి లేదు .. 



16 మే, 2013

ప్యూపా దశ

కవిత్వం రాయాలి అని కూర్చుంటే 
చీమలు నడుస్తున్నట్టు అక్షరాలు 
పరుచుకున్నాయి, పంచదార ని 
మోసుకెళుతున్న చీమల్లగా ,
అర్ధం, పరమార్ధం పెద్దగా లేదు . 

తీయగా ఉండాలా? కొంచం ఉప్పగా 
కన్నీళ్ళు చిలకరించాలా ?
కాసిన్ని వక్కపలుకులు పంటి కింద 
కఠినం గా పదాలు అల్లేయనా ? 

కుదురుగా కూర్చుంటే కదా పదాలు 
మస్తిష్కం లో కుదురుకుంటాయి ,
ఎప్పుడూ పరుగులే ,అటు ఇటు 
ఎటు వెళ్ళాలి అని ఆలోచనలు 
పాదరసం లా జారిపొతూ , కూర్చుంటే 
స్థిమితం గా అమ్మో జీవితం , దాటి పోతుంది . 
ఎండమావి వెంట పరుగులు పెడుతూ 
ఇదే కదా జీవితం అనుకోవడం  ... 

నేను చినప్పుడు సీతాకోక చిలుకల వెంట 
పరుగులు తీసేదాన్ని, రంగులు ఒక్కొక్కటి 
నేనే ధరించాను ఇప్పుడు .. 
రోజుకో రంగు ముచ్చటగా ,ఎప్పటికప్పుడు రంగు 
కొత్త కొత్త గా , నా పై చిలకరించుకుని , ప్రకృతి కెంత 
దగ్గరో అనుకుంటూ మభ్య పెట్టుకుని ,నేనుమళ్లీ 
నా గొంగళి పురుగు దశ లోకి హాయిగా గూడు కట్టుకుంటూ 

ఇంక ప్యూపా దశ లో హాయిగా కుదురుగా కూర్చుని 
కవిత్వం రాస్తాను ,ఉండండి , ఉందండి .. 





8 మే, 2013

ఇది అంతం మటుకు కాదు.

మనసు పొగిలి పొగిలి ఏడుస్తూ 
రంగు రంగుల స్వప్నాలు చెరిపేసి 
నల్లటి కఫాన్ కప్పేస్తోంది ఆశల పై 
కనుచూపు మేర ,కనిపించదు ఒక్క మెరుపు 
మైమరుపు , ఇదేమి జీవితం అంటూ 
కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చున్న 
దుస్వప్నం లో మెలకువ లా .. 

చిన్న ,మామూలు అతి చిన్న కోరిక 
నేను చదువుకోవాలి , నువ్వు మాకు భారం 
నిన్ను అంగడి లో అమ్మేస్తున్నాం అంటున్నారు 
కన్నవారే,  ఇక్కడ కలలు కొంటున్నాం అంటూ 
అంగళ్ళు తెరిచారుట , టోకున కాని ,చిల్లర గా కానీ 
చిల్లర నాణాల తో, తూకం వేసి ,పాత పత్రికలూ ,
న్యూస్ పేపర్లు తూకం కి కొన్నట్టు ,మాలాంటి 
ఆడ పిల్లలని కొనే దుకాణాలు , తెరిచే ఉన్నాయిట . 

అందం ,చందం తో పని లేదు ట , బలం గా 
ఇంటిల్లపాది కి వండి పెట్టి, పిల్లలని కనీ ,
కడుపు ని చిన్నది చేసుకుని , ఆఖరుకి మిగిలిన 
నాలుగు మెతుకులు తో కడుపు నింపుకునే 
ఆడది అయితే చాలుట , నా చదువు అక్షరం 
కూడు వండి పెడుతుందా ? పిల్లలని కంటుందా ?

రాత్రి వచ్చే కలలే కదా ,పగటి కలలు గా మార్చుకో 
రంగులే కదా, ఒకే ఒక నలుపు రంగు పూసేస్తే 
అంతా నలుపే ఇంకా, ఇంక ఏ రంగులు ఉండవు 
అంటూ అమ్మ సలహా చెప్పింది ,నేను ఉండట్లేదూ 
నన్ను చూడు, కడుపులో ఆకలి ఒక్కటే నిజం 
అంటూ అమ్మ నన్ను ఒప్పించి ,నా చేతిలో 
కలలు తుడిచే డస్ట్ బోర్డ్ చేతిలో పెట్టింది ,
నా బ్లాకు బోర్డు మీద ఎప్పటికి నల్లటి నలుపే 
ఇంకా ఏ రంగులు కనిపించని నలుపు బోర్డు . 

నా పాఠశాల కి బీగాలు పడింది ఆ క్షణమే 
నా రంగుల కలలకి చీకటి కమ్మింది ఆ క్షణమే .. 
నా ఆశల గాలి బూరాలని గాలికి ఒదిలింది ఆ రోజే 
నా కోటి మురిపాలు సిరా నేల లో ఇంకింది ఆ ఘడియనే 
నా చదువుల పరుగు లకి కాళ్ళు విరిగింది ఆ సమయం లోనే 
నా ఆట పాటల సందడి ఐస్ క్రీమ్ కరిగిపోయింది ఆ ఎండలోనే 
నా జీవితంమొగ్గ లోనే తుంచి వేయబడిన , ఎండి పోయిన పూల మాల . 

నా జీవితం మీద సర్వ హక్కులు మీవే ,
నా చదువు మీద హక్కు మటుకు నాదే 
ఆఖరి పోరాటం కి దిగింది ఆ ఆడ పిల్ల  
మొలక పోసుకుంది , పున్జీడు ధైర్యం గుండెగల ఆడపిల్ల .. 
ఇది ఇంకా మొదలే ఇది అంతం మటుకు కాదు.