"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 సెప్టెం, 2011

వలస పక్షులు


రమేష్ తన సీట్ నంబరు చూసుకుని కూర్చోబోతున్నాడు. 
"బాబయా ! చూడండి,ఇదీ నేను ఎక్కడ కూర్చోవాలో ?," అంటూ ఓ కంఠం వినిపించింది. వెనక్కి తిరిగాడు. ఒక నడివయసు స్త్రీ ,ఒక మూట లాంటి సంచి పట్టుకుని తన వెనకే నిలుచుని ఉంది.


అమ్మో, తన ప్రక్కనే ఈవిడ, లోపల కిటికీ సీటు కూడా, తను ఆ ప్రక్కనే కూర్చోవాలి, మధ్య సీటులో ఇరుకుగా , కొద్దిగా అసహనంగా అనిపించింది. తప్పదు కదా ..
"ఇక్కడే." అని తెలుగులో చెప్పగానే ఆవిడ మొహం వికసించింది.


హమ్మయ్య అన్నట్టు నిట్టూర్చి ," ఈ సంచి కాస్త పై అరలో పెట్టండి బాబయా ! "
తప్పుతుందా అన్నట్టు చేతిలోకి తీసుకుని తన విలువయిన లాప్ టాప్ సంచి.. ఛ..ఛ అదే బాగ్ ప్రక్కనే పెట్టాడు. ఈ సంచి కూడా.
హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్ళే విమానం అది.గల్ఫ్ కి వెళ్ళే డైరెక్ట్ విమానం అది.రమేష్ ఆవిడకి లోపల సీటు చూపించి ,తనూ ప్రక్కనే కూర్చున్నాడు. తెలుగు వాళ్ళే అని తెలియడంతో ఆవిడ ఇంకాస్త చనువుగా మాట్లాడుతుంది కాబోలు.అసలే ,తను తన చికాకులో తను ఉన్నాడు.


"మొదటి సారి బాబయా! ఈ విమానం ఎక్కడం, ఇలా మా ఊరు వదిలి వెళ్ళడం కూడా.." అదిగో అప్పుడే మొదలుపెట్టింది ఈవిడ..అనుకుంటూ రమేష్ లోలోపల విసుక్కున్నాడు
పావుగంటలో అందరూ ఎక్కి,సర్దుకోవడం అయింది. ఎయిర్ హోస్టెస్ టపటప మని పైన అరల తలుపులు మూసాక , ఎదురుగా  ఉన్న చిన్న టీవి తెఱ మీద ఇంకొక ఆవిడ వచ్చి బెల్ట్ పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు    చెప్పడం  మొదలు పెట్టింది. "ఏంటయా? ఏం చెపుతోంది పిల్ల ? ఆ టీ వి లో ?" అని ప్రక్కనుంచి ప్రశ్న ,అమాయకం గా.


బాబోయ్ ఇదేదో నా సహనానికి పరీక్షే అనుకుని మనసులో ,పైకి మటుకు ఓపిక గా కనిపిస్తూ, ఆవిడకి మళ్లీ తెలుగు లో చెప్పాడు.తలుపులు మూసి,నెమ్మదిగా విమానం కదలడం మొదలు అయింది.


అమ్మోయ్ కదులుతోంది !! అని చిన్న కేక పెట్టి, కిటికీ లోంచి చూస్తూ ,"అమ్మాయ్! జాగ్రత్త అమ్మా! చంటాడు జాగ్రత్త ,"అంటూ పైట తో కళ్ళు తుడుచుకుంటూ చేతులూపుతోంది.


రమేష్ ఈసారి ఎటో చూస్తూ ,ఈవిడ నా ప్రక్కనే కూర్చోవాలా?అని నిట్టూరుస్తూ ,ఒక్కసారి శోభ ,పిల్లలని తలుచోకోగానే ,అనుకోకుండా ,అతని కళ్ళూ చెమర్చాయి.


ఈ ఫ్లైట్ బయలు దేరే సమయం ,మరీ అటూ ఇటూ కాని అపరాత్రి సమయం ,మళ్లీ ఒక్కరే వెనక్కి వెళ్ళాలి ,చంటి వాడు బబ్లూ లేచి ఏడుపు మొదలు పెడితే ,ఈ శంషాబాద్ అంతా మారు మోగుతుంది. వాడు మరీ నాన్న కూచి. నన్ను వదలడు ఒక్క నిముషం కూడా,ఇంట్లో ఉన్న కాస్సేపు.


తనే రావద్దు అన్నాడు. వాళ్ళని ఎయిర్ పోర్ట్ కి. శోభ వస్తాననే అంది, పిల్లలని ఇంట్లో వదిలి పెట్టి, కానీ తను ఒప్పుకోలేదు.


ఈ రోజు నుంచి శోభ ఒక్కర్తి అన్నీ తానై చూసుకోవాలి. అమ్మాయి స్వాతి నాలుగో తరగతి చదువుతోంది, బబ్లూ అంటే సౌరభ్ మరీ చిన్న వాడు,మూడో ఏడు నడుస్తోంది. వీళ్ళని వదిలి, తను కూడా మొదటిసారి గల్ఫ్ వెళుతున్నాడు.


శోభ కి అస్సలు ఇష్థం లేదు, కానీ తనే ఒప్పించాడు.నాకు వచ్చే లక్ష రూపాయల జీతం తో ఎప్పటికి మా ఇంటి మీదున్న అప్పు తీరేనూ,అమ్మో ఇంకా ఎంత ఖర్చుందో ముందు ముందు.


పిల్లల స్కూలు ఫీసు వేలల్లో,ఇంటి మీద అప్పు, అదే మూడు బెడ్ రూం ల ఫ్లాట్ తెసుకున్నాం, అది తడిసి మోపడై నలభై లక్షలయింది. నెల నెలా ముప్ఫై వేలు, కట్టాలి,బ్యాంకు కి.మనం తిన్నా తినక పోయినా,ఇది కాక కారు మీద అప్పు,ఇంకా ఆరు నెలలు కట్టాలి.


ఏంటో ఉద్యోగం వచ్చినపుడు లక్ష రూపాయల జీతం అంటే ఏమిటో అనుకున్నాను, చాల పెద్ద జీతం అని. పెళ్లి అయింది.పిల్లలు పుట్టారు, ఇద్దరు ..జీతం పెరిగింది, ఈ పది ఏళ్ళల్లో, ఖర్చు కూడా అలాగే పెరిగింది. కట్టింగ్ లు పోను, చేతికి వచ్చే జీతం తో గడవడం ఎంత కష్టం గా ఉందో?


కంపెనీ లో అందరూ గల్ఫ్ కి వెళ్ళిపోతున్నారు ,ఆఖరికి తను కూడా అందరి మార్గం పట్టాడు. జీతం రెండున్నర లక్షలు,కానీ పన్నుల బాధ లేదు, తను వీలైనంత త్వరగా ఇంటి మీద అప్పు తీర్చేసి, వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ,ఈ లోపల శోభ ,పిల్లలు ఒక్కరూ ఉండాలి.

చూడాలి,అంతా బాగుంటే వాళ్ళనే అక్కడికి రమ్మన వచ్చు, కానీ ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఫ్లాట్, అద్దె కి ఇచ్చేయడమా? అమ్మో ! మనం అనుభవించకుండా ఎవరో ,ఆ ఇంట్లో ఉండడమా?


ఏదో అద్దె యింట్లో ఉన్నా సరి పోయేది, ఇప్పుడు ఈ ఇంటి కోసం, ఇంటినీ, ఇల్లాలు ని, పిల్లలని వదిలి ,ఇలా దేశం వదిలి వెళ్ళాల్సి వస్తోంది, వెంట పడి అప్పులిచ్చిన బ్యాంకు లని తిట్టుకున్నాడు కాసేపు.
ఏమిటో అంతా చికాకు గా ఉంది.
"బాబయా"!ప్రక్కన ఆవిడ పలకరింపు. ఈసారి విసుగు మొహం మీద కనిపించేలా చూసాడు, అటు.
అటు చూసే సరికి, ఆవిడ కళ్ళ లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
"బాబయా, నేను వెళ్ళ లేను, నా వల్ల కాదు, నా మనవడు నన్ను వదిలి పెట్టి ఉండలేదు," అంటూ ఏడుస్తోంది
నాకు కొంచం జాలి వేసింది, " ఏడవకండి" అన్నాడు. ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు.
ఆడవాళ్ళు ఇంత ఫ్రీ గా ఎలా ఏడుస్తారో? అని లోపల కొంచం అసూయగా ..అనుకున్నాడు.నేను అలా ఏడవలేను కదా బయటకి..

కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ," బాబయా! మాది తణుకు దగ్గర చిన్న పల్లెటూరు, హై వే రోడ్డు మీద టిఫినీ దుకాణం అదే ఓటలు నడిపే వాళ్ళం, రోజుకీ అయిదారు వందలు మిగివేవి, ఖరుసు పోను..మా ఆయనకి తాగుడు మాప్పేరు, ఊరులో ఆసామీలు , కుల్లుబోతోల్లు ,కొత్త ఓటలు వచ్చి ,బిగినేస్స్ పడిపోయింది, అలవాట్లు మటుకు మిగిలేయి. నష్టాల్లో ఓటలు మూత పడింది.
పదారేల్లకే కూతురి పెళ్లి సేసాం, అల్లుడు కి కూలి పని,పట్నం లో,ఆడికీ ఒళ్ళు బలిసి ,మందు కి అలవాటు పడ్డాడు. మావా అల్లుళ్ళు కల్సి ఇద్దరూ తాగడ, తన్దనాలాడ్డం ,ఒళ్ళు గుల్ల చేసుకుంటే ,బాగు చేయించాను. ఆసుపత్రి కి తీసుకెళ్ళి, మనవడు కూడా పుట్టేసాడు.


మా తోటికోడలు గల్ఫ్ కి పనికత్తె గా వెళ్ళి ,డబ్బు పంపిస్తోంది.ఇక్కడి మొగోల్లకి ఇంక మా ఆయన ,అల్లుడు, నన్ను కూడా వెళ్ళమని పోరు మొదలు పెట్టారు. మా ఆయన సుస్తీకి ,ఆసుపత్రి ఖరుసుకి, అప్పు చేసాం..భూవి, పుట్రా, ఏమి మిగల్లేదు, ఈ మగోల్లు సరిగ్గా ఉంటే, సక్కగా మేం తల్లీ కూతుళ్ళు ,ఎలాగో ఆలాగు బతికేస్తాం, ఈ అప్పు తీర్చాల, నా టికెట్ తీయడానికి , ఖరుసు ఇంకో లచ్చ అయింది..


ఈ అప్పులన్నీ నేను తీర్చాల ఉప్పుడు. పిల్ల ఇంకా సిన్నది, మనవడు ఇంకా తల్లీ కొంగు వదలడు. అందర్నీ వదిలి, నేను ఇలా ఎలుతున్నాను, ఏమిటో ఈ బతుకులు? బాబయా??"

అంటూ కన్నీళ్ళతో తన కథ అంతా నాలుగు ముక్కల్లో చెప్పింది ఆమె.

నా గొంతు లో ఏదో అడ్డం పడింది. రెండు లక్షల అప్పు తెర్చడానికి ఆవిడ, రెండు లక్షల జీతం ఇస్తున్న ఉద్యోగం వదిలి నేను, ఈ దూర దేశాలకి బయలు దేరాం..బహుదూరపు బాటసారులం.


సహచరులే లేని ఒంటరి ప్రయాణం.


వలస పక్షులు కూడా ఏవో దూర తీరాల్ నుండి, అనుకూల వాతావరణం వెతుకుతూ వలస వస్తాయి, కానీ తిరిగి వెళ్ళిపోతాయి అవి, కాలం అనుకూలించ గానే..


కానీ మేమో??ఎప్పటికైనా వెళ్లగలమా?
స్టాప్..స్టాప్..వెనక్కి తిప్పండి.. ఈ ఫ్లైట్ ..నా శోభ,నా పిల్లల దగ్గరకి వెళ్ళాలి నేను .. అని అరవాలని ఉంది.
విమానం రెక్కలు విప్పుకుని, ఆకాశంలో ఎత్తుకి ఎగురుతూ, మబ్బుల్లోకి మాయమయింది.











.












11 కామెంట్‌లు:

  1. దూరపు కొండలు నునుపు అని భావిస్తారు కొందరు .
    మరి కొందరు పోగొట్టుకున్నది అక్కడే ఉండి వెతుక్కుంటారు.
    పదిమందిని కలుపుకుని విజయాన్ని సాధిస్తారు...

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారండి. వలస పక్షులు కొంతకాలం ఇతరప్రాంతాలకు వలస వెళ్ళినా తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేస్తాయి.

    రిప్లయితొలగించండి
  3. మీ కథనం నాకు బాగా నచ్చింది. మనిషికి ఎదగాలని ఆరాటం. ఆ ఆరాటములో మళ్ళీ సంసారం. 'నా తరమా భవసాగరమీదను' అని రామదాసులవారు అంటే ఏమిటో అనుకున్నా మొదటిసారి విన్నప్పుడు. కాస్త అనుభవం వచ్చే కొద్దీ ఆ మాటల వెనుక ఎంతటి అర్థం ఉందో తెలిసొస్తూంది. ఎన్ననుకున్నా చివరికి మళ్ళీ మన పరుగు తప్పదు.

    రిప్లయితొలగించండి
  4. చాల బాగుంది. ఈ రోజున పెరిగిన ఖర్చులను బరించలేక అధిక సంపాదన కోసం వలస పోతున్నారు కాని ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం జరగడం లేదేమో...!

    రిప్లయితొలగించండి
  5. అవునండి..ఇది నిజం, రెండు లక్షల జీతం, వాళ్ళు, రెండు లక్షల అప్పున్న వాళ్ళు,అందరికి కావాలి,డబ్బు, ఇక్కడ అందరు సమానమే..అంతస్తు తేడాలు లేవు..అని చెప్పడమే..నా కథ.

    నా కథ చదివి,ఓపిక గా మీ అభిప్రాయం రాసినందుకు మీకు నా ధన్యవాదాలు. రాజేష్ గారు, అచంగా గారు,గోపాల కృష్ణ గారు.

    రిప్లయితొలగించండి
  6. వలస గురించి బాగా చెప్పారండి. మీ కథల నేపద్యం చాల్లా బావుంది.

    రిప్లయితొలగించండి
  7. థాంక్స్ అంది జ్యోతిర్మయి గారు..నేపధ్యం ..మాదీ కొంత కలిసింది.
    వసంత లక్ష్మి.

    రిప్లయితొలగించండి