"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 సెప్టెం, 2011

బొమ్మల కొలువు..దసరా పండగ..

రంగు రంగుల బొమ్మలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, తల  ఆడిస్తూ నాట్యం చేసే బుట్ట బొమ్మలు, పిట్టలు, పొలానికి వెళ్ళే రైతు, అతని భార్య, తిరగలి తిప్పుతూ స్త్రీ  బొమ్మ, వేలి  కింద గోవర్ధన గిరి ఎత్తిన కృష్ణుడి బొమ్మ, దశావతారాలు, ఎన్ని రకాల బొమ్మలో? మన దేశీ కళాకారుల చేతిలో లాఘవం గా రూపు దిద్దు కున్న బొమ్మలు, ఎంత అందంగా మనసుని ఆకట్టుకుని  ఆహ్లాద పరుస్తాయి. మన పల్లె ప్రజల  తీరు తెన్నులు, వారి రోజు వారి పనులు  వారి వృత్తి  పనులు అన్నీ బొమ్మల్లో ఆవిష్కరిస్తారు.

మన దేశం లో ఎనభై శాతం ప్రజలు పల్లెల్లో నివసిస్తారు.. అధిక శాతం పొలం పని, మిగిలిన వారు చేతి పనులు , లేదా చేనేత పనులు లలో నిమగ్న మై ఉంటారు. ఈ వృత్తి పనులు ,వంశ పారంపర్యం గా కుటుంబాల కి ఆధారం గా నిలిచి ఉన్నాయి. మట్టి తో, లేదా చెట్టు లనుండి లభ్యమయ్యే చెక్క తో చేసే ఈ బొమ్మలు సజీవం గా కని పించడానికి , వారు వాడే ప్రకృతి నించి లభించే రంగులు ఒక కారణం. భూమి కి దగ్గర గా బ్రతికే వీరి జీవన విధానం మరో కారణం.

ఏటి కొప్పాక బొమ్మలు , కొండ పల్లి బొమ్మలు, మన రాష్ట్రం లో తయారు అయే ముచ్చటైన బొమ్మలు. లక్క పిడతలు తో ,చిన్న చిన్న బువ్వలు వండి,ఇంటిల్ల పాది కి,అన్నాలు పెట్టే బాల్య స్మృతులు ఎంత మధుర మైనవి.తిరుపతి వెళితే, పెద్దలకి పుణ్యం, చిన్న పిల్లలికో నల్లగా నిగ నిగ లాడే చేయంత పొడుగు ఉన్న చందనం బొమ్మలు, ఒకటి ఆడ, మరోటి మొగ..ఇంక మనం వాటికి చంకి ,చంకి పరికిణీలు, జుబ్బాలు కట్టి..వాటికి పెళ్లి చేయడం..అబ్బ ..ఎంత సందడో.(ఇప్పటి బార్బీ డాల్స్ వీటి ముందు దిగ దుడుపు).

ఏ పుణ్య క్షేత్రం కి వెళ్ళినా ,అక్కడి బజారు లో దొరికే, బొమ్మలు, ఫోటోలు, దేవుడి బొమ్మలు, పూజ సామాను, ఇవి కొనుక్కు వస్తాం. మన లాంటి యాత్రికుల నే నమ్ముకుని ఉంటారు కదా అని, నేను పదే, పదే కొంటూ ఉంటాను.

ఇంకా ఇవి కాక ఏ సప్తాహం లాంటి వో అయితే, ఇంక ఎన్ని రకాల మట్టి బొమ్మలో, చేతిలో మురళి తో, చిరునవ్వుతో చేయంత కృష్ణుడు, పాకుతున్న బాల కృష్ణుడు, తంబూర మీటుతూ,పరవశం లో ఉండే మీరా,చేతిలో విల్లుతో అందాల రాముడు,పక్కనే లక్ష్మణుడు, సిగ్గుల మొగ్గ సీత, కాళ్ళ దగ్గర నమ్మిన బంటు హనుమంతు, ఒకటేంటి మన పురాణ గాధలలో బొమ్మలన్నీ అక్కడే..కూడా బెట్టిన డబ్బులన్నీ అక్కడే అయిపోయేవి.

ఇప్పుడయితే, ఇవన్ని మన లేపాక్షి లో ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి.కానీ, మా చిన్నతనం లో సంవత్సరానికి ఒక్కసారే ఈ సప్తాహం లో దొరికేవి.లేదా రామ కోటి అని ఇంకో సారి జరిగే ఉత్సవం లో దొరికేవి.

ఇవి కాక ,రక రకాల జంతువుల బొమ్మలు ..పక్షులు, బొమ్మలు..ఎన్నో,ఎన్నెన్నో..
ఇంక ఈ బొమ్మలు అన్ని అందరికి చూపించే రోజు కూడా ఒకటి ఉండాలి కదా..దసరా వచ్చిందంటే..
పెట్టెల్లో సర్ది పెట్టిన బొమ్మలు అన్ని తీసి, దులిపి,ఇంట్లో ఉన్న పెట్టెలు,బల్లలు, మెట్లు మెట్లు గా అమర్చి, నాన్నగారి పట్టు పంచో,అమ్మ పట్టు చీరో, వాటి మీద కప్పి,మూడో ,ఐదో మెట్లు గా అమిర్చి , ఆ పై బొమ్మలు అమర్చడమే...నలుగురం..ఆడ పిల్లలు ఉన్న మా  ఇల్లు...అల్లరి,తగువులు ,అలకలు, తో కళ కళ లాడుతూ , నలుగురం కొత్త బట్టలు వేసుకుని,రిబ్బన్లు కట్టుకున్న జడలతో ,మేము నలుగురం ఇంట్లో తిరుగుతూ ఉంటే, మా ఇల్లే ఒక బొమ్మల కొలువు లాగుండేది.


మన రాష్ట్రం లో మనం దసరా కి చేసుకుంటే,మన పొరుగు రాష్ట్రం తమిళ్ నాడు లో బొమ్మల కొలువు సంక్రాంతి కి చేసుకుంటారు. తమిళులు వారి సంస్కృతిని చక్కగా మర్చిపోకుండా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇంటిటికి కాక పోయిన వీధికి ఒకటైన ఉంటాయి..ఈ బొమ్మల కొలువులు.మన ఆంధ్ర లో తరిగిపోతున్నట్టు అనిపిస్తోంది.
అమెరికాలో ఉండే మా చెల్లెలు మటుకు దసరాకి తను లేపాక్షిలో ఎటేటా కొని పట్టుకు వెళ్ళే దశావతారాలు, కొండ పల్లి, ఏటి కొప్పాక ,ఎక్ష్హి బిషన్ లో కొనుక్కున్న ఇతర బొమ్మలు అన్ని అమర్చి తన కూతురుకి చెప్తూ ,చూపిస్తూ  మన సంస్కృతీ నిలబెడుతోంది.
ఇద్దరు అబ్బాయిలు ఉన్న మా ఇంట్లో,నా సంగతంటారా ..మా డ్రాయింగ్ రూం లో ఉండే గాజు అలమరాల నిండా ఇవే బొమ్మలు..వీధి లో కనిపించే ,పేవ్ మెంట్ మీద అమ్మే బొమ్మలు, వచ్చి, మా ఇంట్లో కూర్చుంటాయి.ఇంక ఎక్కడ పెడతావు?అన్ని నిండి పోయాయి కదా అంటే..అందుకే కదా ,ఇంకా పెద్ద ఇల్లు..అంటున్నాను..ఉండేది ఇద్దరం..పిల్లలు బయటకి వెళ్లి పోయారు ఇంకా నాకు, నీకు,ఈ బొమ్మలికి, పుస్తకాలి కీనా ఇంకో ఇల్లు..అని అరిస్తోటల్ లాగా చింతన భంగిమ లో..ఆయన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి