"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 నవం, 2012

వృత్తాలు ...


నాకు  వృత్తం అంటే భలే ఇష్టం..
చిన్నప్పుడు గిర గిర తిరిగి, 
పరికిణి లో కూర్చుంటే వచ్చే 
బుంగ లాంటి వృత్తం భలే ఇష్టం.

చేతులు ,చేతులు కలుపుకుని 
ఆడ పిల్లలం అందరం, పాట లు 
పాడుతూ, ఒక్కసారి వృత్తం లో 
కిల కిల నవ్వులతో కూర్చోడం..

అదేమిటో ఆ ఆట పేరు లేదు,
ఆట ,పాట కలిసిన చిన్నారి 
చిలిపితనం ,చురుకుతనం 
కల గలిపి ఒప్పుల కుప్ప ఆటేనా ?

ఇంకా అక్షరం కూడా ఒక వృత్తం..
అమ్మ లో అ ఒక వృత్తం..
ఒక సున్నా చుట్టి, అందులో 
అక్షరాలు వెతుక్కో మన్నారు..

ఆశ్చర్యం గా ప్రతి రోజూ ఒక 
వృత్తం, పుట్టిన సూర్యుడి తో 
మొదలు, రాత్రి అంతం ఒక 
ఉదయం కి ప్రారంభం..ఎక్కడ ఆగదు.

వసంత కాలం, మరో కాలం తో
చెట్ట పట్టాలు కట్టి ఆడుతూ,
గ్రీష్మాలు ,వర్షాలు హేమంతాలు 
ని చుట్టి, మళ్లీ వసంత కాలం కే ..

ఎన్ని ఆటలు ఆడినా ఆ వృత్తం లోనే 
నాకు వృత్తం అంటే అందుకే ఇష్టం..
మొదలు ,తుది కలిసి పోయే 
పరుగు కి అంతం అంటే అలసటే..

కాలం ఒక వృత్తం, తన చుట్టూ తాను 
తిరిగే భూమి ఒక వృత్తం, ఘనిభవించిన 
వృత్తం..మూడు వందల అరవై ...ఒక 
వృత్తం లో కోణాలు, రోజులు కూడా..

చంద్రుడు కూడా ఒక ఆట ..
కరిగి పోయే తనని పట్టుకునే ఆట 
ప్రతి పున్నమి కి తనని తాను 
చేరుకుని, అమావాస్య కి దొంగ అవుతాడు..

కాలాలు, ఈ జగం ,ఈ ప్రకృతి అంతా 
ఒక వృత్తం లో ఇమిడి పోయాయి చక్క గా..
ఎంత పెద్ద  వృత్తమో, మొదలేదో 
తుది ఏదో ,తెలియదు ..నేనేక్కడో ?

గెలుపు,ఓటమి లు ఉండవు..
ఈ పరుగు పందెం లో,
మొదలు చేరుకోడానికి,
చివర చేరుకోడానికి అట్టే తేడా లేదు.

అందుకే నాకు వృత్తం అంటే ఇష్టం..
ఈ జగతి అంటే ఇష్టం..ఈ ప్రకృతి 
అంటే ఇష్టం..అంతా ఈ వృత్త 
పరిధి లోనే, ఈ పరిధిలోనే...అంతం..





1 కామెంట్‌:

  1. కాలం ఒక వృత్తం, తన చుట్టూ తాను
    తిరిగే భూమి ఒక వృత్తం, ఘనిభవించిన
    వృత్తం..మూడు వందల అరవై ...ఒక
    వృత్తం లో కోణాలు, రోజులు కూడా..అద్బుతం... నాకు కూడా వృతం అంటే ఇష్టం పూర్ణం బూరిలు కూడా...మీ భావనకు ఒకటి+ రెండు వృతాలు....ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి