"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 నవం, 2012

సూర్యోదయం చూస్తాను..

సూర్యుడు తూర్పునే 
ఉదయిస్తాడా ?
తెల్ల బోయేను నేను..
నా కిటికీ ఎప్పుడూ 
తెరిచే ఉంటుందే ?
మరి నాకు ఎప్పుడూ 
వెలుతురు తప్ప సూర్యుడు 
ఉదయించడం  ఎందుకు కనిపించదు  ?

ఏమో మరి..మాకూ అంతే 
తలుపులు తెరిచే ఉంచుతాం..
కాని, ఎర్ర గా, చురుకు చురుకు 
కిరణాల తో గుచ్చుతూ ..మాకూ 
ఎప్పుడూ కనిపించడు ..

వెలుతురు ఉంటే చాలదా?
అని ఒక విసుగు..
రోజూ జరిగేదే కదా 
ఏమిటా మిడిసిపాటు..
ఏమిటో ,ఏదో ఎప్పుడూ 
కోల్పోయిన మొహాలు మావి..

సూర్య కాంతి కి ఒక 
అర చెయ్యి కళ్ళ మీద 
ఎప్పుడూ అడ్డం పెట్టుకుంటాం..
గుచ్చే కాంతి ఎవరికీ కావాలి?

పల్చని తెరలు వేసుకుంటాం 
రంగుటద్దాలు తగిలిస్తాం..
ఒక్కోసారి ఏకం గా 
తలుపులే బిగిస్తాం..

అయినా ,ఏదో సందు 
చూసుకుని ఒకే ఒక 
సూర్య కిరణం ,సూటి గా 
వజ్రం లా మెరుస్తూ కొడుతుంది..

కళ్ళు మూసి ,నిద్ర నటిస్తున్న 
మాకు ,ఇది ఒక కొరడా 
వెలుతురు కొరడా..
అయినా ఎద్దు నడ్డి మీద 

కొరడా దెబ్బ, తర తరాలు గా 
పడుతూనే ఉన్నా,అది ఒక 
హాయి..గా అలవాటు పడ్డాం..
నొప్పి లో కూడా హాయి ట ..

అర్ధం అవలేదూ ? పిప్పి పన్ను 
నొక్కినా, నొక్కక పోయినా ఒక 
హాయి నొప్పి, నొప్పి తో 
సహజీవనం ఒక హాయి..ఒక అలవాటు..

సూర్య కాంతి ని ఒక 
ప్రిసం లో బంధించేం ,చూడండి 
సప్త వర్ణాలు ని తూకం గా 
అమ్మేస్తున్నాం..కొనే వాళ్ళు రండి..

మా ఇంటి కి ఒక సూర్యుడు..
మీ ఇంటికి ఒక చంద్రుడు..
విడి విడి గా విడి పోయి..
పంచుకుందాం..మనం ఒక్కోరు 
ఒక ద్వీప దేశాలం ..మరి..

సూర్యుడు అస్తమించే వరకూ 
వెలుతురు చిమ్మే ఒక బింబం 
ఒకటుందని గ్రహించం..
చీకట్లో వెతుకులాట రోజూ 
తప్పదు మరి..మనకి..

సూర్యుడి ని దేవుడు చేస్తాం..
మన లో దేవుడు ని తరిమేసి 
ఎప్పుడూ వెతకడమే ,ఉన్నది 
పడేసి, ఏమిటో మనం ఇంత 
కళ్ళు మూసుకుని దారి వెతుక్కునే 
మూర్ఖులం..అని అనిపించదూ..

కొంచం కొంచం గా తలుపులు 
తెరచి, అంచెలు అంచెలు గా
కాంతి కి స్వాగతం చెపుదామా?
ఒక్కసారి ఎలాగు 
మనం చూసే శక్తి ని కోల్పోయాం ..

ఒక్కో రోజు అనుకోకుండా 
సూర్యోదయం చూస్తాను..
అలాంటి ఒక రోజు..
తలుపులు తెరిచిన ఒక రోజు ..







2 కామెంట్‌లు:

  1. సూర్యుడి ని దేవుడు చేస్తాం..
    మన లో దేవుడు ని తరిమేసి
    ఎప్పుడూ వెతకడమే ,ఉన్నది
    పడేసి, ఏమిటో మనం ఇంత
    కళ్ళు మూసుకుని దారి వెతుక్కునే
    మూర్ఖులం..అని అనిపించదూ

    నాకు ఈ లైన్లు బాగా నచ్చాయండీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుభ గారు,
      నాకు కూడా నచ్చేయి అండి,
      అంటే , మనం చేసే పనులు
      ఎందుకు ఇలా మూర్ఖం గా
      ఉంటాయని ...నాకూ ఎప్పుడూ
      సందేహం..మీకు కూడా నచ్చింది
      అంటే, కొంత అర్ధవంతం అన్నమాట.
      మన మాట ఎవరికి అయినా నచ్చితే
      ఆ సంతోషమే వేరు అండి..
      నాకు ఆ సంతోషాన్ని కల్పించిన మీకు
      మరి ధన్యవాదాలు..
      వసంతం.

      తొలగించండి