"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 జన, 2013

సంక్రాతి పండగ....

తెలి తెలి మంచు బిందువులు 
నులి వెచ్చని సూర్య కిరణాల కి 
కరిగి పోతూ, ఒక వెండి మెరుపు 
కాంతి కాన్క గా సమర్పించాయి..

నిలువెల్లా మంచు దుప్పటి కప్పుకున్న 
ధరణి, కాంతి చిల్లుల మధ్య నించి తొంగి 
చూస్తోంది , నిజం గా నిద్ర లేచే సమయం 
ఆసన్నమయిందా ? అంటూ..

ఎర్రెర్రని ,కాంతి గోళం, మకర రాశి లో కి 
ప్రవేశం అట, అంటూ భూగోళం గిర గిర 
తిరుగుతూ చెప్పుకుంటోంది, అవునుట 
అంటూ చామంతులూ, బంతి పూల 
అమ్మలక్కలు విరబూసిన మొహాలతో 
కబుర్లు ఆడుకుంటున్నాయి ..వినబడ లేదా?

ఇంటికి చేరిన పంట, చెంత కి చేరిన చెలి 
వెచ్చని చలి , గోడ మీద అద్దిన గొబ్బెమ్మలు 
తెల్లవారితే భోగి అని హరిదాసు అరుపులు ,
ఇంటి లో చేరిన కంప ,రండి రండి వేయాలి 
భోగి మంట, కక్షలు ,కార్పణ్యాలు పిడకలు 
చేసి పడేయండి, కాస్త అసూయ, ద్వేషాలు 
దిష్టి తీసి పడేయండి, మంటల్లో కాలి పోయేలా 

చుక్కలు ,చుక్కలు ,చుక్కలు ,హ్మ్మం..
ఆకాశం కిందకి దిగిందా? కాదే 
మా ఇంటి ముందు రంగ వల్లులు 
పసుపు, ఎరుపు, తెలుపు, 
ఎన్ని కలలో ,అన్ని రంగులు..

షడ్రుచుల పిండి వంటలు, బావ ల 
పరాచకాలు, మరదళ్ల అల్లరి ఆట లు,
నాన్నల జీరాడే పంచల , హుందా తనం,
అమ్మ పట్టు చీర కొంగు హంగులు,
పిల్లల ఆశల లాగ ఎగిరే గాలి పటాలు 

అబ్బ బ్బ ..మా పల్లె టూరుల 
పండగ హడావిడి చూడాల్సిందే..
ఎక్కడెక్కడో పట్టణాల లో ,
ఉరుకులు పరుగుల హడావిడి 
ఉద్యోగాల కొలువులు చేసుకునే వారు,
దిన కూలి పనులో, ఇంటి పనులు 
చేసుకునే వారు కూడా ,మా ఊరు 
మా పండగ అంటూ ఇంటికి పరుగులు 
తీసే సంబరాల సమయం..ఈ పండగ.

మన సంస్కృతీ ,సంప్రదాయం అంటూ 
ఉన్నాయా అసలు అని ప్రశ్నించే వారికి 
చూపించండి ,పండగ సంబరాలు ..
సంక్రాతి పండగ తర తరాల గా 
అందరూ కల్సి చేసుకునే పండగే మరి..




2 కామెంట్‌లు: