"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 జన, 2013

స్త్రీ

అమ్మా ....బాత్ రూం లోంచి అరుపులు..
సంధ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయింది..
ఈ క్షణమే తను భయపడుతున్న క్షణం  .. ఒళ్లంతా గజ గజ ..ఒక వణుకు పాకింది.
'సన్నిధి' కూతురు అమ్మా అని పిలిచిన ప్రతి సారి ,ఇలాగే జరుగుతుంది.
దుబాయ్ లో ఉన్నాము మేము..రోజూ ఏదో ఒక సంఘటన.. పేపర్ లో చదవడం..లేదా ఎవరో చెప్పడం..అనలేని, వినలేని వార్త లు..నోటి తో పలక లేని భయంకర మైన విషయాలు.

తన కూతురు ,మల్లెలు ,మందారాలు కుప్ప పోసినట్టు ,చక్కని అందమయిన  విగ్రహం..కళ్ళు చెదిరే అందం కాక పోయినా ,నిండుగా ఆకట్టు కునేటట్టు గా ఉంటుంది..ఇంకా పదేళ్ళే ..అప్పుడే పన్నెండు ,పదమూడు ఏళ్ళ అమ్మాయిలాగా ..

సన్నిధి ..ఏమయింది...ఎందుకలా ??అరుస్తావు? ఇప్పుడేమయింది..

అయింది...అనుకున్నదే అయింది..ఇంక ఈ చిన్న పిల్ల, మొన్న ,మొన్నే కళ్ళు తెరిచి, నా మొహం లోకి చూసి, నాకు అంతులేని ఆనందం కలిగించిన నా బంగారు పాప ,అప్పుడే మొగ్గ వికసించే వయసు లోకి ప్రవేశించింది.

అమ్మ గా నాకు సంతోషం కలిగించే విషయమే అయినా, ఏదో తెలియని భయం తో ఒళ్ళు జలదరించింది.

ఇంక ఆ రోజు నిండి నా ఒళ్ళంతా కళ్ళే, అనుక్షణం నా చిన్నారి కి ఏదో అవుతుందేమో అని , ప్రకాష్ కి ఎలా చెప్పను? నా భయాలు, నన్ను కుదిపి వేసే పీడ కలాలు? నీదంతా చాదస్తం..నీదంతా విపరీతం అంటాడు.

స్కూల్ బస్సు ఏడు గంటలకి ,మా ఇంటి ముందు ఆపుతారు, ఒక ఆరేడు మంది పిల్లలు ఎక్కుతారు. మా ఇంటి ముందు బస్సు స్టాప్ లో.

నేను కూడా సన్నిధి తో పాటు, ఏదో  పని ఉన్నట్టు వెళ్ళడం మొదలు పెట్టెను, మొదట్లో, నిజమే అనుకుంది, ఒక వారం రోజుల్లో అర్ధం అయింది, అమ్మా, నేను ఇంత పెద్ద దాన్ని, ఆరో తరగతి చదువుతున్నాను, ఇంకా ఏమిటమా? చిన్న పిల్లలాగా చూస్తావు? 

ఇంటి ముందు ఆగే బస్సు ఎక్కించడం ఏమిటి? అందరూ నవ్వుతున్నారు..

నవ్వితే నవ్వని, వాళ్ళ కేమిటి తెలుసు? నాకు తెలుసు ,ఈ దుబాయ్ లో ఎన్ని వింటున్నాము? నువ్వు చిన్న పిల్లవిరా..నీకు అర్ధం అవదు..

అంత కన్నా ఎలా చెప్పను?

ఎలా వివరించను? నా భయాలని..

స్కూల్ కి వేసుకునే డ్రెస్ కూడా ఒక అంగుళం కిందకే కుట్టిస్తాను..అప్పుడప్పుడు గొడవ పెడుతుంది..అమ్మా.ఏమిటమ్మా? మరి ఇంత పోడుగేమిటి ? అందరూ నవ్వుతున్నారు..

నవ్వితే నవ్వని ..అని తోసి పడేసాను..
అమ్మ మా ఫ్రెండ్ నవ్య పుట్టిన రోజు అమ్మా..నేను వెళ్ళాలి, ప్లీస్ అమ్మా అంటూ బ్రతిమాలింది.

కాదు కూడదు అంటే గొడవ, నేను నిన్ను దింపి వస్తాను, మళ్లీ నిన్ను తీసుకుని రావడానికి ఒక గంట లో వస్తాను ..అలా అయితేనే ఒప్పుకుంటాను అని నా అమ్మ స్టాంప్ అధారిటి ఉపయోగించి , ఒప్పించాను.

ఒక్కోసారి ,ఏమిటి నేను ఇంత విపరీతం గా ఆలోచిస్తున్నాను ఏమిటి? 
అనుకుంటాను..అలా అనుకున్న మర్నాడే ,పేపర్ లో ఏదో వార్త కనపడుతుంది ..నేను చేసేది సరి అయినదే అనిపిస్తుంది.

పుట్టిన రోజు పార్టి కి వెళ్లి వచ్చేక ,సన్నిధి చాలా ముభావం గా కనిపించింది. ఎంత అడిగినా ,ఏం లేదమ్మా , అంటూ తోసి పుచ్చింది.

మూడో రోజు అనుకుంటా, చెప్పింది, తను వేసుకునే పొడవయిన డ్రెస్ గురించి ,రక రకాల కామెంట్స్ చేసి, ఏడిపించారు ట ..పోనీలే సన్నీ, నువ్వు బాధ పడకు, అంతా మా అమ్మ ఎంపిక అని తప్పు అంతా నామీదే పెట్టు..

"నన్ను ఎన్ని అనుకున్న నాకు ఏమి కాదు, ఏమి అనిపించదు..

సన్నిధి, ఇది నీకు ఇప్పుడు అర్ధం కాదు లే అమ్మా.".

నా ఆరోగ్యం లో ఏవో మార్పులు..అస్తమాను ,ఏదో జరిగి పోతుంది, నా పాప కి ఏదో కీడు కలుగుతుంది, బయట అందరూ, తోడేళ్ళు, పులులు, సింహాలు, మగ వారే ..ఆ మొహాల తో తిరుగుతున్నారు..
అలాంటి అడవిలో ,నా చిట్టి తల్లిని నేను ఎలా వదలను? 
తిండి సయించదు, నిద్ర పట్టదు ..నా పాప ని నేను రక్షించు కోగాలనా?

పక్కింటి కి వెళితే అక్కడ అంకెల్ ..ఉంటాడు, ఎదురింటికి వెళితే అక్కడా వారి అబ్బాయి, పది హేడు ఏళ్ళ అబ్బాయి, చుట్టాలింటికి వెళితే, అక్కడ మరో తాత గారుంటారు..ఎంత మంది నిండి కాపాడ గలను? నా పువ్వు పాప ని..

నాకు తీవ్రమయిన అనారోగ్యం ..ఆసుపత్రి లో అన్ని పరీక్షలు జరిగాయి, ప్రకాష్ విసిగి పోతున్నాడు, ఆఫీసు కి సెలవు పెట్టి ,నన్ను ఆసుపత్రి కి తీసుకు వెళ్ళడం, ఆ పరీక్ష ఫలితాలు కోసం ఎదురు చూడడం..అలసి పోయాడు ప్రకాష్ కూడా..ఒక రోజు, బలహీనమయిన గొంతు తో, నా భయాలన్నీ చెప్పేను ..నిర్ఘాంత పోయాడు. 

"సంధ్యా ,ఇలాంటి భయాలతో మనం ఇక్కడ మన పాప ని పెంచలేం  పద, మనం ఇండియా వెళ్లి పోదాం..పోనీ ,అక్కడ అయితే నీకు ధైర్యం గా ఉంటుంది, మన వాళ్ళు అందరూ ఉంటారు..ఏమంటావు" ?

"ప్రకాష్, నీకేమయినా మతి పోయిందా? అక్కడ జరిగే వార్తలు వింటున్నావు కదా...మన దేశం లో అయితే కోర్టులు , వాయిదాలు అంటూ అసలు శిక్ష ఎప్పుడు పడుతుందో తెలీదు..ఇక్కడ చూడు, మొన్న వాడి ని ఉరి తీసేసారు, అంత ఒక నెల లో అయిపొయింది విచారణ, శిక్ష"

"కాని,..సంధ్యా. ఇతను రేపు పొద్దున్న అమాయకుడు అని తెలిసిన తెలియవచ్చు, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, అతను ఇక్కడ పని చేసే ఎక్ష్ పాట్..అంటే, వేరే దేశస్తుడు, పైగా పేద వాడు, అతనికి అన్యాయం జరిగిందేమో కూడా, మనం ఏం చెప్పలేం."

"సంధ్యా ! మీరు నలుగురు ఆడ పిల్లలు, మీరు ఎలా పెరిగారు.. మర్చిపోయావా? "
"అవును..ప్రకాష్, నేనూ అదే అనుకుంటాను, మేం అందరి ఇళ్ళకి వెళ్లి ,అబ్బాయిల తో సమానం గా ఆడే వాళ్ళం, చెట్లు ఎక్కే వాళ్ళం, క్రికెట్ ఆడే వాళ్ళం, సైకెల్ తొక్కుకుంటూ, స్కూల్ కి వెళ్ళే వాళ్ళం..కాని, ఎంత ధైర్యం గా ఉండేది మాకు, అమ్మ వాళ్లకి కూడా నిశ్చింత, చుట్టూ పక్కల అందరూ తెలిసిన వాళ్ళే"

ఊపిరి పీల్చుకుని, " అమ్మ ఎప్పుడూ ,వంటింట్లో పనులతో బిజి ,మా చదువులు మేం చదువుకునే వాళ్ళం, ఎప్పుడూ ,చదువుకోవే అని చెప్పిన గుర్తే లేదు"

"కానీ ,ఇప్పుడో, ఎంత టెన్షన్, ఈ  చదువుల టెన్షన్, నాకు మన చిట్టి తల్లి మీద చాల నమ్మకం, బాగా చదువుకుంటుంది, ఆ విషయం లో నాకు బెంగే లేదు, వద్దే అన్నా రాత్రి మేలుకుని చదువుతుంది, అయినా ఒక్క పాప తో సరిపెట్టి ,తప్పు చేసేమేమో ప్రకాష్.."

"ఇంకేమిటి? నీ బెంగ, మన సన్నిధి కి యే  కీడు వాటిల్లదు, నేను చెబుతున్నాను ,నువ్వు ధైర్యం గా ఉండు ,సంధ్యా, ఇక్కడ ఉండే ఉద్యోగ బాధ్యతలు, కష్టాలు ,నీకు తెలుసు గా, నువ్వు కూడా ఇలా బెంగలతో ,నాకు మరింత కష్టం తెచ్చి పెట్టకు, ప్లీస్ ఇది నా విన్నపం " అని ప్రకాష్ మృదువు గా కోరేడు నన్ను..

కొన్ని రోజులు నేను కోలుకున్నట్టే ఉన్నాను..ఇంతలో మరో సంఘటన ,మా వీధి లోనే, ఒక మెయిడ్ ని ,కొంత మంది పట్ట పగలు ,నడుస్తున్న కార్ లోకి లాక్కు వెళ్లి, ఆమె ని రకరకాలు గా హింసించి దారుణం గా చంపి పడేసారు..అని..

నాకు పూర్తిగా మనశ్శాంతి కరవయింది, సన్నిధి మీద విసుక్కోవడం ఎక్కువ అయింది, స్కూల్ బస్సు రావడం ఒక్క పది నిముషాలు ఆలస్యం అవుతే చాలు, నాకు ఇంక బి పి పెరిగి, తల తిరగడం, తల నొప్పి, విపరీతం గా రావడం, ఎవరికీ చెప్పకుండా నాలో నేనే భరిస్తున్నాను..ఎవరికీ, ఏం చెప్పను ఈ దిన దిన గండం..దిన దిన టెన్షన్ ...గురించి..

పెద్ద క్లాస్ లోకి రావడం తో ట్యూషన్ తప్పనిసరి అయింది. వీధి చివర నాలుగు బ్లాక్స్ ,అవతల ,మహిళా టీచరే , కాని ,ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఒదిలి పెట్టాను, ఒక గంట లో హాజరు అక్కడ నేను.

అక్కడ మరెవ్వరు అమ్మలు ఇలా, నాలా రావటం లేదు, ఇది నాలో ఏమయినా రోగమా? నిజం గా అనిపించింది, సన్నిధి కూడా చాల గడవ పెట్టింది. "అమ్మా నన్ను ,నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు..నువ్వు ఇలా నన్ను దించడం అది ,ఇంకా చాలు అమ్మా" అని..

సరే అని ఒప్పుకున్నాను, నువ్వు ఈ మోబైల్ ,పట్టుకు వెళ్ళు, మీ టీచర్ ,తలుపు తీయగానే, నాకు ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు, నువ్వు ఒక్క రోజు మర్చి పోయినా ,నేను వెంటనే  వచ్చే  వచేస్తాను ,నా సంగతి నీకు తెలుసు కదా ..

ఇష్టం లేక పోయినా ,నా మొండితనం తెలిసి ఒప్పుకుంది, సన్నిధి కి తెలుసు అమ్మ బస్సు స్టాప్ వరకూ వచ్చి ఎక్కించక పోయినా, అమ్మ ,కింద సెల్లార్ లోనే తన బస్సు కదిలే వరకూ వేచి ఉంటుంది అని, ఒక్కోసారి కోపం, విసుగు వస్తాయి, కాని అమ్మ కదా, నా కోసమే ఈ తాపత్రయం అని మళ్లీ సద్దుకుంటుంది.

ఒక రోజు..ఆ రోజు సంధ్య ఎప్పటికి మర్చి పోలేదు..

సన్నిధి మామూలుగానే వచ్చింది స్కూల్ నించి..

"అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, కూర్చో అంటూ కూర్చో బెట్టి,
అమ్మ ఇవాళ మాకు  సైన్స్ క్లాస్స్ లో ,మా శరీర మార్పులు గురించి, సృష్టి కార్యం గురించి చెప్పేరు, అదే, పిల్లలు ఎలా పుడతారో "అని, నా మొహం లో మారే రంగులు ని చూస్తూ ,చెపుతోంది.

"అమ్మ నువ్వు ,ఎందుకు భయపడుతున్నావో , నాకు ఇప్పుడు బాగా అర్ధం అయింది, కాని ,ఇంకొకటి కూడా నాకు బాగా తెలిసింది, మన శరీరం లో భాగం కి ఏదయినా ఘటన లో, దెబ్బ తగిలితే మనం ఎలా వైద్యం చేసుకుని కోలుకుంటాం అమ్మా..ఇది కూడా అంతే.."
నా శరీరం ని నా ఇష్టం లేకుండా , బలవంతం గా టచ్ చేస్తే ,ఏం చేయాలో ,నాకు బాగా తెలుసు..నా బలం అంతా ఉపయోగించి పోరాడుతాను.."

"ఒక వేళ ,జరగకూడనిది ఏమయినా జరిగితే అది దురదృష్టం..నా తప్పేమీ లేదు అందులో, అది ఒక దుర్ఘటన ..నా ప్రమేయం లేకుండా జరిగిన దాడి అది, ఒక టెర్రరిస్ట్ దాడి లాంటిది..అది, వాడికి మరణ శిక్ష పడే వరకూ పోరాడుతాను నేను.."

నా శరీరం ఏమి మైల పడి పోదు, నా కారక్టర్ కూడా ఏమి పోదు, పోయింది ఆ అత్యాచారం చేసిన వాడి శీలం..నాది కాదు. ఇంక నేను ఈ హింస ,రోజు రోజు, నీ కాపలా, నా భయం, నా శీలం గురించి ,ఎవరో చేసే దుర్జన్యం గురించి భయం తో ,ఇంకా ఇలా రోజు చస్తూ ,నేను బ్రతక లేనమ్మా.."

అంటూ భోరున ఏడ్చింది...నేను నిస్చేష్టు రాలినయాను..

నా కూతురేనా? నేను దానిని ఎంత హింస పెట్టేను, కనిపించని భూతం గురించి గజ గజ వణికి పోతూ, దానికి జీవితమంటే భయం, భయం అని నేర్పించాను, నేను ఒక తల్లినేనా అసలు..

ఈ రోజు అదే ఒక తల్లి లాగ నాకు ధైర్యం అంటే ఏమిటో నేర్పించింది, 
జీవితం అందరికి ఒక్కటే ,స్త్రీ కాబట్టి ,నీకు కొర జీవితం ఏమి ఇవ్వలేదు, అందరికి సృష్టి ఒక్కలాగే ఒకే జీవితం ఇచ్చింది.

నా భయాలు, దిగుళ్ళు, నా చిన్న ఊహలు అన్ని ఓఫ్ అని ఎగిరి పోయినట్టయింది..

నా పాప ,సన్నిధి ,నాకు కళ్ళు తెరిపించింది..నేను ఒక సగాన్ని, ఆకాశం లో సగాన్ని..నేను స్త్రీ ని...నా జీవితానికి నేనే అర్ధాన్ని, నేనే ఒక సంపూర్ణ స్త్రీ శక్తి ని..అని. ...

ఆ రోజు నించి ,నా అనారోగ్య సమస్యలు చేతి తో తీసినట్టు పోయాయని వేరే చెప్పాలా? 










2 కామెంట్‌లు:

  1. చదువుతుంటే బాధ కలిగింది....కళ్ళకు ఒక పొర అడ్డు వచ్చింది....ఎడమ కన్ను నుంచి ఓ నీటి చుక్క కిందకు జారింది....ఎమని చెప్పమంటారు ఇక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ గారికి ,
      నా రచన ,ఒకరి కంటి నుండి ఒక చుక్క కన్నీరు కార్పించింది అంటే..నా రచన లో హృదయం ఉన్నట్టే..ఇంత కన్నా ప్రశంశ ఇంకేం కావాలి అండి..మన్స్ఫూర్తిగా మీకు నా నమస్సులు..
      వసంతం.

      తొలగించండి