"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 నవం, 2009

మా బాదాం చెట్టు చెప్పే కథ.

ఒక పెద్ద అరుగు  దాన్ని కాపాడుతూ నేను ఒక పెద్ద బాదాం చెట్టు. ఎప్పుడు చూసినా, గలగలా మని ఒకటే మాటలు, నన్ను నిద్ర పోనివ్వకుండా  ఒకటే    మాటలు. ఒకరా, ఇద్దరా నలుగురు ఆడ పిల్లలు,వాళ్ళ స్నేహితురాళ్ళూ,తలో మూల కూర్చుని ఒకటే కబుర్లు. కాఫీలు, టిఫిన్లు, కబుర్లు అన్నీ అక్కడే ఆ అరుగు మీదే. నా నీడనే . నాకు చాల రహస్యాలు తెలుసు. వాళ్ళ భయాలు, బెంగాలు, నవ్వులు, తుళ్ళింతలు, స్నేహాల లోతులు, అనుమానాలు,అనుబంధాలు, ప్రేమలు,విడిపోవాడాలు, అక్క చెల్లెళ్ళ కబుర్లు,కలహాలు, కలసి పోవడాలు, తమ్ముళ్ళు తో తగవులు, చెల్లళ్ళ కి  అన్నయ్య తో గొడవలు, ఒకే పెన్ను కోసం కీచులాటలు ఇంకో రబ్బర్ కోసం సాగులాటలు, నా చెట్టు నుంచి కాయలు కోస్తూ , ఒక అమ్మాయి పడిపోయింది పాపం, పన్ను కూడా విరిగింది.
అప్పుడు, ఆ అబ్బాయి  అరిచాడు, అమ్మా , రేణు పడిపోయింది, పన్ను విరిగింది అంటూ నాకు చాల నవ్వు వచ్చింది. మగ పిల్లలు కూడా ఉన్నారు లెండి ఆ ఇంట్లో, ఇద్దరు, కానీ వాళ్ళ మాటలు ఈ ఆడపిల్లల నయాగరా హోరు లో వినిపించేవి కావు. ఇలాగ అప్పుడప్పుడు నవ్వించేవాడు, వాళ్ళని ఏడిపించి.ఇంకో అబ్బాయి కారంస్ బోర్డు మీద ఎక్కి కూర్చుని ఆడేవాడు, ఎప్పుడు నేనే గెలవాలని గోల చేసేవాడు, ఆఖరి వాడు కదా అని ఊరుకుంటీ, అని అక్కలు గొడవ..
మంచాలు మీద పడుకోవడం, చదువుకోవడం, పరీక్షలని బెంగలు , టీలు తాగడం, రాత్రి ఆకలని అమ్మని లేపడం.. అన్ని చూస్తూనే వుండే దాన్ని.
ఒక రోజు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి అనుకుంటా,  నా చెట్టు నీడలో ,మంచం మీద పడుకుని, పైకి ఆకాశం లోకి చూస్తూ, ఏదో చలం పుస్తకం లో లాగా ఆకాశం ముక్కలు చేసినట్టు , ఎంత బాగుందో ,అని మురిసి పోతుంటే, ఇంక చెల్లెళ్ళు చేరారు, మేము చూస్తాం అంటూ
అదిగో ఇప్పుడు చూడు ఆ మబ్బు ఎంత బాగుందో? ఇదిగో ఈ మబ్బు చూడు ఇంకా బాగుంది అంటూ మురిసి పోతున్నారు. నేను కూడా చూస్తున్నాను కదా , మామూలు గా ఆకాశం ,అందులో మబ్బులు ఏముంది గొప్ప ,  అదే మాట అన్నాడు ,ఆ పెద్ద అబ్బాయి.
సరే, వచ్చి చేరాడు, తను కూడా అలాగే మంచం పైన వాలి, పైకి చూసాడు..
అదిగో అక్క ఎంత బాగుందో అని వంత పాడాడు.
అందరు ఎంత నవ్వారో??? నేను నవ్వాను.
మబ్బులో, ఆకాశామో, నక్షత్రమో , చందమామో ,ఈ అబ్బాయి ని పిలిచింది , వెళ్ళాడుట..
ఈ పిల్లలని మరి ఎప్పుడు చూస్తానో???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి