"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

15 ఫిబ్ర, 2010

ఉత్తరాల యుగం ముగిసినట్టేనా ???

 పోస్ట్ అన్న కేక తో సుభద్ర ఇంట్లోంచి బయటకి వచ్చింది. యీ వాక్యం తో, పేర్లు తేడాతో ఎన్ని కథలు ప్రారంభం అయి ఉంటాయి. మన రోజు జీవితం లో పోస్ట్ మాన్ కి ఎంత ప్రాముఖ్యం ఉండేది. పోస్ట్ మాన్ ఇంటికి రాని రోజు, ఒక  దుర్దినం. సూర్యుడు ఉదయించని దినం. బంధువుల క్షేమ సమాచారాలు, ప్రియ మిత్రుల కులాసా కబుర్లు,   సెలవుల్లో ఊరికి వెళ్ళిన మిత్రురాలి  పలకరింపులు, నాన్నగారు క్యాంపు నుంచి రాసే కుశలమా ,నేను కుశలమే అన్న రెండు ముక్కల కార్డు తెచ్చే ఆనందం, అన్నయ్య ఇంటర్వ్యూ బాగా జరిగిందని,  రాసి పడేసిన కార్డు, తమ్ముడు పుట్టాడని, తాత గారి ఇంటి నుంచి వచ్చే కార్డు, అత్తయ్య కి పెళ్లి కుదిరింది అని శుభం తెలిపే కార్డు,    ఏదో దుర్వార్త అని చింపి పడేసే కార్డు, పెళ్లి అయిన అక్కయ్య కు, బావ గారు వ్రాసే కవర్ లో పెట్టిన ఉత్తరం, ప్రేమ లేఖ అంటారు,  అక్కయ్య మిల మిల లాడే కళ్ళు ఆ కళ్ళు చెప్పే   కథలు, కబుర్లు, అన్నీ  ఇంకా నిన్నో, మొన్నో అన్నట్టు ఉన్నాయి నాకైతే.
బీరువా లో దాచుకున్న చిక్కని ప్రేమ లేఖలు, అవీ తెచ్చే అనర్ధాలు, పెళ్లి ఒక చోట, ప్రేమ ఒక  చోట అయిన కథల లో, హిందీ సంగం సినిమా లో, రాధ(వైజయంతి మాల)  దాచుకున్న ప్రేమ లేఖలు ఎంత తుఫాను సృష్తిస్తాయి. ఆఖరికి ప్రేమికుడు రాజేంద్ర కుమార్ ప్రాణం తీసుకున్నాయి.  
మన తెలుగు లో కూడా ప్రేమలేఖలు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లా డిలీట్ సదుపాయం లేదు కదా.. చింపడానికి చేతులు రావు కాబోలు.   రోజు లో పోస్ట్ మాన్ కోసం ఎదురు చూడడం ఒక పని. మనకి ప్రత్యేకం రాక పోయినా ,ఇంటికి రాగానే, పోస్ట్ వచ్చిందా అని అడగడం ఒక ఆనవాయితి.
ఎవరికీ పోస్ట్ వస్తే వాళ్ళు ఒక గొప్ప ఫీలింగ్ తో, వెలిగి పోవడం, మనకి రాలేదే పోస్ట్ అని మిగిలిన వారు, కుంగి పోవడం.. ఎంత చిన్న ఆనందాలు, ఎంత చిన్న సరదాలు, ఎంత చిన్న నిరాశలు. 'స్నైల్ ' అని చిన్న చూపు ఇప్పుడు యీ ఈమెయిలు సదుపాయం వచ్చాక. చలం ప్రేమలేఖలు, నెహ్రు గారు తన కూతురు ,ఇందిరా కు రాసిన ఉత్తరాలు, ఇంకా ఎంతో లేఖా సాహిత్యం వెలిసింది, యీ ఉత్తరాల కాలంలో, ఆఖరికి, తెలుగు, ఇంగ్లీష్, ఏ భాష పరీక్ష అయిన సరే, నూటికి నూరు మార్కులు తెచ్చే ప్రశ్న, లేఖ రాయండి.   సెలవుల్లో మీ ఊరి నుండి నీ స్నేహితుని కి ఒక లేఖ రాయి.. అన్న ప్రశ్న చదివి, ఎలా విజృంభించి  రాసే దాన్నో, ఉత్తరం.   పోస్ట్ మాన్ ఇప్పుడు తెచ్చే వి అన్నీ బిల్లులు, రసీదులు, చందా కట్టండి అనే నిస్తేజ, జీవం లేని ఉత్తరాల కట్ట.
ఎవరు అయినా మిస్ అవుతున్నారా , ఈ ఉత్తరాల కాలం ను. ఇప్పుడు ఇన్స్టంట్ మెయిల్ తో ఆ ఎదురు చూడడం, ఆ ఆశ, నిరాశ, ఆ ఉత్సాహం, ఆ ఉత్తరాలు, చక్కగా పెన్నుతో,  చక్కని పూలు, ఉన్న కాగితం మీద పెట్టడం, ఆ లేఖ ల కోసం, అందమైన లెటర్ పాడ్స్ కొనడం, tequila రంగు ఉన్న ఇంకు , సముద్రం నీలం రంగు తో  ఎంత మురిపం గా ఉండేదో, ఎవరికీ అయినా గుర్తు వస్తున్నాయా ఆ రోజులు??
ఇంకా పేజీలు, పేజీలు కథలే ఉత్తరాలు గా రాసి, మూడు, నాలుగు కవర్లు లో పెట్టి, సీరియల్ లాగా, 1 ,2 ,3 , అని పైన రాసి, పోస్ట్ చేయడం ,అవీ అందు కుని చదివే వాళ్ళ కి పిచ్చి ఎక్కించడం, ఇలా ఇన్ని ఒకే సారి రాస్తే ఎలా అమ్మయీ అని..తంటాలు పడడం.. ఈ రోజులు ఎంత మంది మిస్ అవుతున్నారు.
 చదివిన పుస్తకం, చూసిన సినిమా, కొత్త ఫ్రెండ్ తో కబుర్లు, కొత్త గా వచ్చిన టీచర్లు ,  వెళ్ళి పోయిన టీచేర్లు, పరీక్షల్లో మార్కులు, రాంకులు, అబ్బాయిలు, చూపులు, ఎన్నో, ఎన్నెన్నో, కాదేది లేఖ కి అర్హతి?  అన్నట్టు, మదిలో పుట్టే ప్రతి ఆలోచన, ఆవేశం ఒక లేఖ రూపం లో పెడితే గాని మనసు కుదుట పడేది కాదు.లేఖలే మనసు కి ఊతం ఇచ్చేవి, కష్ట
కాలం లో. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ తో ఊరట పడుతున్నట్టు. నాకు ఒక ఈమెయిలు అడ్రస్ ఉంది ఇప్పుడు. ఇరవై నాలుగు గంటలూ, ఆన్ చేసి ఉంచి కంప్యూటర్ ఇన్బొక్ష్ లో  టపా  కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పాత అలవాటు, పోస్ట్ !!! అని ఒక కేక కూడా పెడితే బాగుండును, ఈ మెయిల్ బాక్స్ లో .
ఉత్తరాల , లేఖల యుగం, మెయిల్ బాక్స్ యుగం లోకి మారింది. పోస్ట్ మాన్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు... ఇంగ్లాండ్ లో ,అమెరికా లో, పచ్చళ్ళు , అవీ కూడా పోస్ట్ చేయ వచ్చుట. అలాగే చేయాలి మన దేశం లో కూడా ఇంక.. అమ్మ పెట్టె పచ్చళ్ళు పోస్ట్ లో అందు కోవచ్చు. పోస్ట్ మాన్ మటుకు ఉండాల్సిందే.
పోస్ట్ అన్న కేక కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అని నా నమ్మకం.మీరేమంటారు.
                                                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి