"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

1 ఫిబ్ర, 2010

పాతిక కేజీల బరువు

పాతిక కేజీల బరువు .. అంతే .. ఒక దేశం నుంచి ఇంకో దేశం కి మనం మనతో పాటూ మోసుకుని వెళ్ళగలిగేది అంతేనుట. ఒకటి పెట్టడం, పది తీసేయడం, అయ్యో అనుకోవడం, బెంగ గా చూడడం ఆ వస్తువుల వంక. పసుపు కుంకుం, ఉసిరి కాయ పచ్చడి,మెత్తని బంగారం లాంటి బెల్లం, ఎర్రని కారం గుండ, అమ్మ చేసిన కంది గుండ, కొత్త చింత పండు, పిక్క తీసింది, బ్రూక్ బాండ్ కాఫీ పొడి,( ఫిల్టర్ లోకి ) మాగాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, ఇంకా వేయించు కోవడానికి వడియాలు, అప్పడాలు, ఊర మిరపకాయలు,అన్నీ పెట్టె లో సర్ది, మళ్లీ, బయటకు తీసి, ఉసురు ఉసురు అనడం, ఇంకా ఊదా రంగు పట్టు చీర, గోధుమ రంగు నూలు చీర, ఇష్టం గా కుట్టించు కున్న కొన్ని చుడి దారులు, లోకెర్ లో పెట్టి, వెలుగు చూడని కొన్ని ఓల్డ్ మోడల్ నగలు, మళ్లీ ఇప్పుడు ఫ్యాషను ట, అవీ పెట్టడం, తీయడం.. అచ్చం బంగారు గాజుల్ల గా మెరిసే యీ రాళ్ల గాజులు ఎంత మోజు పడి కొన్నాను, వాటి మధ్యలో వేసుకోవడానికి మళ్లీ, పచ్చ గాజులు, ఎర్ర గాజులు, తెలుగు క్యాలెండరు, పండగలు అవీ చూసు కోవడానికి, మళ్లీ కొన్న ఒక వ్రతాల కథల పుస్తకం, (ఏమో ఏ నిముషం లో నాకు దేవుడి మీద బుద్ధి కుదిరి, పూజలు వ్రతాలు ,ఇక్కడ వాళ్ళ లాగ చేయడం మొదలు పెడతానో అని, ముందు చూపు గా)కువైట్ లో దేవుడు కోసం చిన్న వెండి కుందులు, ఎవరో ఇచ్చ్హిన డాన్స్ పళ్ళెం, దేవుడి ఫోటో, మందులు, మాకులు, ఇవి అన్నీ తప్పవు. బీరువా లోంచి తీసిన చీరల కట్ట, మళ్లీ అలాగా లోపల పెట్టడం, కలరా ఉండలు పడేయడం, రెండు చీరలు, రెండు డ్రెస్సులు పడేసరికి, గుండె ఝల్లు మంది, నా దిగులు అంత  యీ పెట్టె లో చేరి, ఇంత బరువు      గా ఉందా అని, ఒక పాతిక ఏళ్ళు, యీ ఇంట్లో, యీ ఊరులో గడిపి, ఇప్పుడు ఒక్క పాతిక కేజీల తో, ఎలా వెళ్ళడం, ఏది వదిలేయడం. అన్నీ ఇష్టం  గా నన్ను చూస్తున్నాయి, ఇంకా ఒక సంచి లో పడేసి, దారి లో పంటి కిందకి అన్నట్టు, నాలుగు పుస్తకాలు కూడా ఉంటాయి. అల్లుద్దిన్ మేజిక్  కార్పెట్ ఏదైనా ఉంటే బాగుండును. గంట గంట కూ, బెంగ పెరిగి  వంద కేజీలు  అయింది. టెన్షను తట్టుకోలేక, అవీ ,ఇవి తిని, నేను ఇంకో నాలుగు కేజీలు పెరిగాను. కువైట్ నుంచి ఇంకా లిస్టు పెరిగి పోతోంది, ఇంజనీరింగ్ పుస్తకాలు, వాళ్ళకి మందులు, వీళ్ళకి  మంచి ముత్యాలు, అనీ ,అంత కలపి మళ్లీ ఆ పాతిక కేజీలు ఉండాలి ట. బెంగతో మొహం పీక్కు పోయింది. ఎందుకమ్మా ఇన్ని చీరలు, అక్కడ బోలెడు ఉన్నాయి కదా అని అబ్బాయి సాధింపులు, కార్బోన్ జాడలు మనం తక్కువ  వదలాలి అమ్మా ! తక్కువ బరువు తో ప్రయాణం చేయాలి, అని, పాఠాలు, నాకు.. అమ్మకి.అందరికి నేనే దొరికానా?? అసలు నేను ప్రయాణం చేయను అని రాత్రి అనుకుని, మళ్లీ పొద్దున్నే లేచి, మళ్లీ పెట్టె సర్దడం,  ఎందుకు వచ్చిన బాధ, ఎవరి ఊరులో, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండ వచ్చు కదా అని మనసులో అనుకోవడం, మళ్లీ ఇంత జీతాలు    ఎవరు    ఇస్తారు  ,  అనుకుని మనసు కి సర్ది చెప్పు కోవడం, ఇంట్లో ని ప్రతి మూల నుంచి, ఏదో కని పిస్తుంది, ఇది అక్కడ ఉండాలి, అని పిస్తుంది, మనసుని రెండు ముక్కలు గా చేసి, ఒక ముక్క అక్కడ వదిలి, ఇక్కడ కి ఇంకో ముక్క ని గట్టిగ పట్టుకుని, కువైట్ లో ఉన్నా సహచరుని వద్దకు, చివరి ఆఖరకి, బిజినెస్ క్లాసు కి మార్పించుకుని, ఒక నలభై కేజీల బరువు తో క్షేమంగా చేరాను.
ఇంకా పెరిగిన నా నాలుగు కేజీల బరువు ఎలా తగ్గుతానో???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి