"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 అక్టో, 2010

మన నూకాలమ్మ దెబ్బ.. గోలి సోడా దెబ్బ చూపిద్దామా?

 మన వీధి చివర కిరాణా కొట్టు తో మనకి ఎంత అనుబంధం ఉంటుందో? రాత్రి పది గంటలకి, కోఫీ  పొడి అయిపోయిందని గుర్తు వస్తే, ఎవరు తెస్తారు?  అమ్మా! పొద్దున్నకే రంగు పెన్సిల్స్ కావాలి అనో, ఇండియా మ్యాప్ అనో, ఏవో సరిగ్గా పడుకునే ముందు గుర్తు రావడం. వీధి చివర , మన కొట్టు ఒక కల్ప వృక్షం లా అని పిస్తుంది. అప్పుడు. ఇప్పుడు అయితే ఫోన్ సదుపాయం కూడా ఉంది, పిల్లల చిన్నప్పుడు, చెప్పుల్లో కాళ్ళు పెట్టి, చీర సవిరించు కుంటూ, ఆ రాత్రి పరుగులు పెట్టడమే. దేవుడు ఇలాగ కూడా కని పిస్తాడు ఈ కలి యుగం లో అను కునేదాన్ని.ఆ కొట్టు అతని ని తలుచుకుని. పిల్లలు స్కూల్ బస్సు దిగి, నేను వెళ్ళడం ఆలస్యం అవుతే ,అక్కడే కూర్చు నేవారు.. అమ్మ కోసం దిక్కులు చూస్తూ. 
అవును వీధి చివర కిరాణా కోట్లు.. మన జీవితం లో భాగం అయి పోయాయి.
మన తో పాటూ, కొట్టు, ఆ కొట్టు స్వంత దారు, పెద్ద వాళ్ళం అయి పోయాం. పిల్లలు ఇప్పుడు కూర్చుంటున్నారు 
మన దేశం లో ఇలాంటి అనుబంధాలు చాల ఉంటాయి, కూరలు ఇంటికి తెచ్చి అమ్మేవారు, ఉదయానే ,తాజాగా ఆకు కూరలు అమ్మే వారు, ఇంకా మా విసాపట్నం   సముద్రం ఒడ్డునే కదా, మత్స్య పుష్పాలు, అవే చేపలు, రొయ్యలు కూడా అమ్ముతారు  వీధిలో కి తీసుకు వచ్చి. చింత చిగురు అమ్మే అమ్మి గొంతులో అయితే, ఎన్ని స్వర విన్యాసాలు ఉంటాయో? సింత సిగురు అమ్మా ,సింత సిగురు.. నండూరి వారి ఎంకి ని గుర్తు చేస్తూ..
ఈ దేశం లో ఉన్నానా? ఆకు కూరలు తాజా గా కొనుక్కోవడం ఎంత మిస్ అవుతానో? మన దేశం, పేద దేశమని, ఏవో రాక రకాల పేర్లు పెట్టారు, కాని ఇంత సజీవ మైన , జనం తో నిండిన , ప్రేమ నిండిన దేశం నాకు ఇంకొకటి కనిపించలేదు.
మన దేశం స్పెషాలిటి బడ్డి కోట్లు. వీధి కి ఒకటో రెండో బడ్డి కోట్లు ఉండాల్సిందే.మగ పిల్లలు కి ఇంకా బాగా తెలుస్తుంది, అమ్మాయిలు కోసం , ఏదో ఒంకన కాపు కాయడం ఇప్పుడు కాదు లెండి, ఇప్పుడు మెసేజెస్ - సెల్ ఫోన్ ల కాలం, మా కాలం లో.. అన్నీ రకాల పత్రికలూ, ఆ రోజు వార్తా పత్రికలూ, ఓ దండ గుచ్చి, వేలాడేసి, రా రమ్మని స్వాగతం పలుకుతూ,  ఓ పక్కన నిండుగా అరటి గెల, రంగు రంగుల సీసాల్లో నోరూరించే చోకాలేట్లు ,నోరు జివ్వమన్పించి  , కమ్మని రుచి తో పిప్పెర్ మెంట్ బిళ్ళలు, చక చక మని కిళ్ళీ లు కట్టే చేతులు, ఒక్క సిగేరెట్టే కొనుక్కుని, హస్కు కొట్టే పని లేని  మగ రాయుళ్ళు, తల నొప్పి కి  సారిడొన్ బిళ్ళల నుంచి, జ్వరం మందు వరకు, అత్యవ సారానికి,  క్షేమం గా ఉన్నావా? అని రాసి పక్కనే డబ్బాలో పడేసేందుకు, పోస్ట్ కార్డులు, ఇంకా పెద్ద విషయాలు రాయడానికి ఇన్లాండ్ కవర్లు, వీధి రాజకీయాలు నుంచి దేశ రాజకీయాలు వరకు నలిగే తాజా , వేడి, వేడి, కబుర్ల విందు, అప్పుడప్పుడు, ఇంటాయన ని ఇంటికి పంపించి, రూపాయి కాసంత బొట్టు, ముక్కు కి మక్కేర, ఓ కాలి కి అర వీసెడు వెండి కడియం ,గళ్ళ చీర కట్టుకుని, మా విసాపట్నం నూకాలమ్మో , సింహాచలమో, గల్లా పెట్టి దగ్గర   కూర్చుందంటే, ఇంకా చూడ డానికి రెండు కళ్ళు చాలవు, రావి శాస్త్రి కథ ని తెచ్చి కూర్చో బెట్టినట్టే.
ఆహా మన దేశం, మన ఊరు ఎంత గొప్పవో కదా? 
 ఇప్పుడు, అమెరికా లాంటి గొప్ప దేశాలు కి సమానం గా మనకి వచ్చేసాయి మాల్స్. విశాలం గా, శుభ్రం గా, రంగు రంగుల అద్దాలు, మెరుపులతో అన్నీ రకాల షాప్స్ అంటే, కూరగాయలు, టీవీలు, బట్టలు, బంగారం, కార్లు, సినిమాలు, హోటల్స్, అన్నీ ఒక్క చోటే ఉంటున్నాయి.
లోపలి వెళితే కనీసం ఒక్క వెయ్యి రూపాయలు అయినా ఖర్చు, మన ప్రమేయం లేకుండా ఆ జిలుగు జిలుగు వ్యామోహం లో పడి పోతాం. 
ఊరికినే కూడా ఏమి కొనకుండా ,కాళ్ళు నొప్పి పుట్టేవరకు తిరగ వచ్చు కాని, చాల స్థిత ప్రజ్ఞత , చాల పర్సు కంట్రోల్ కావాలి, అది ఇప్పుడే రాదు మనకి, నాకు.
ఒక కేజీ పప్పు కోసమో, ఒక అర డజను అరటి పళ్ళ కోసమో, మనం ఈ మాల్స్ కి పరుగులు పెట్టం. మన వీధి చివర ఒక కిరాణా కొట్టు, ఒక బడ్డి కొట్టు లేని రోజు ఊహించుకోండి. ఎంత కళారహితం గా బోసి పోయి ఉంటాయి, మన వీధులు, మన ఊర్లు.
అందుకే, మన వీధి కొట్లు అని చిన్న చూపు చూడకండి, సజీవ మైన మన వీధులు, మన ఊర్లు ని ఎవరో బయట అమ్బానిలో, వాల్ మార్ట్ వాళ్ళో, వచ్చి, దర్జా గా ,ప్రభుత్వం సాయం తో కబ్జా చేస్తూంటే ,చూస్తూ ఊరుకుంటామా? మన నూకాలమ్మ దెబ్బ.. గోలి సోడా దెబ్బ చూపిద్దామా?  





4 కామెంట్‌లు: