"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 అక్టో, 2011

ఎన్నారై.

ఇద్దరు పిల్లలు శృతి ,లయ ల తో ఆరు సూట్ కేసులు మూడు చేతి ్సంచులు  పట్టుకుని, అమెరికా నించి చచ్చి చడి, ముప్ఫై ఆరు గంటలు ప్రయాణం చేసి, రాజీవ్ గాంధి విమానాశ్రయం లో దిగాను . నేను  బయలు దేరి వెళ్లి నప్పుడు ,బేగంపేట విమానాశ్రయమే..ఊరు మధ్యలో ఉండేది,ఇప్పుడు ఓ ఇరవై మైళ్ళ దూరం లో ఉంది.


అయినా ,తను వెళ్లల్సినది విశాఖ పట్నం కి, హమ్మయ్య పక్కనే ఉందిలే జాతీయ విమానాశ్రయం అని సంతోషిస్తూ, అయినా ఎన్ని ఏళ్ళు ఇంకా ఎదురు చూడాలో ,మా విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అవడానికి, నేను ఆరేళ్ళు కింద అమెరికా వెళ్ళేటప్పుడు ఎవరో ,రాజకీయ వేత్త , నా ప్రధమ కర్తవ్యం ,మీకు అంతర్జాతీయ విమానాశ్రయం సదుపాయం కల్పించడమే, అప్పటి వరకూ ,నేను నిద్ర పోను..అని ప్రతిజ్ఞా చేసినట్టు గుర్తు, పాపం, కళ్ళు కాయలు కాసాయో, ఏమిటో? ఇన్ని రోజులు నిద్ర పోకపోతే ఏమవుతుందో?


ఎన్ని లాప్ టాప్ లు? ఇవేంటి? అంటూ ప్రశ్నించే అధికారుల అవక తవక ప్రశ్నలని తప్పించుకుని, బయట పడి, సామాన్ల  బండి తోసుకుంటూ, పిల్ల శాల్తీలు ఉన్నారా ? లేదా? అని మధ్య మధ్య లో, చూసుకుంటూ, మజిలి లో మూడో ,విమానం ఎక్కి, మొత్తానికి నా  కెంతో ఇష్టమైన విశాఖ చేరుకున్నాను .


హమ్మయ్య ..ఇల్లు చేరాను ..ఇంక అమ్మ దగ్గర హాయిగా తన కిష్టమైన కందిపొడి, ముక్కల పులుసు, కొత్త ఆవకాయ లో  నెయ్యి పోసుకుని,వేడి వేడి అన్నం, గుత్తి వంకాయ కూర..ఊ  ..నోరు ఊరుతోంది.


అక్కడ మా ఊర్లోనూ దొరుకుతాయి, కాని, ఏమిటో ఇంత రుచి ఉండవు.


అమ్మా..అమ్ముమ్మా ..అంటూ నేను, పిల్లలు చుట్టేసాం. నాన్న గారు ,సామాన్లు సర్దించడం, మా గది లో అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అయినా ,మా ఇల్లే కదా.నాకేమైన కొత్తా ఈ ఇల్లు?

అనుకుంటూ ఒకసారి గబగబా తిరిగేసింది, ఏమేమి మార్పులు వచ్చాయా అని చూసుకుంది. ఇల్లు కొంచం బాగుపడినట్టే ఉంది.

అన్నయ్య ఆ మధ్య వచ్చి  ఏవో మార్పులు ,చేర్పు లు చేయించాడుట. తను దేశ రాజధాని ధిల్లీ లో ఉంటాడు.


నేను ఉండేది రెండు నెలలు, కలవడం అవుతుందో అవదో అన్నయ్య ని, ఈ రోజే చెప్పాలి, ఒకసారి రా ,విశాఖ పట్నం..అందరూ కలవొచ్చు అని.

హమ్మ్..పుట్టిన దేశం .పుట్టిన ఊరు అంటారు ..అందుకే.


పెట్టెలు తెరిచి, అమ్మ ,నాన్న లకి, పిన్ని వాళ్లకి ,వాళ్ళ పిల్లలికి అందరికి తెచ్చిన చిన్న ,చిన్న కానుకలు, పంచేసాను .


అదేమిటో, ఒక్కరికి పెద్ద గా నచ్చలేదు, అన్నీ ,ఇప్పుడు ఇక్కడే దొరుకుతున్నాయి అక్కా..అని చెప్పేసేరు..పిన్ని పిల్లలు, జ్యోతి, జగన్. ఉస్సూరుమనిపించింది ..


ఈ కానుకలు కొనడానికి, సేల్ పెట్టిన మాల్స్ అన్ని పగలు రాత్రి ఎలా తిరిగానో  గుర్తు వచ్చి.


స్నేహితులు అందరూ, ఎక్కడెక్కడో ఉన్నారు, పిల్లలని తిప్పడానికి జ్యోతి, జగన్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేక పోతే బోర్ అమ్మా..అని పాట మొదలు పెడతారు.


శనివారం ,ఓ రోజు అందరం కలిసి తినేద్దాం..అని అనుకుని, పిన్ని వాళ్ళ కుటుంబం, మేమూ బయలు దేరాం..


దసపల్ల లోనో, డాల్ఫిన్ లోనో, మసాల దోసె తినాలని నాలుక పీకింది, అమ్మో కాలరీలు అను కున్నా సరే, ఆ రుచే వేరు.


అబ్బే,దోశ..మేం రాం, పిజ్జా హాట్ కి వెళదాం అన్నారు, పెద్ద పిల్లలు, ఇంక శృతి లయ ఊరుకుంటారా? వాళ్లకి అలవాటు అయిన ప్రాణం..,అమ్మా వాళ్ళు కూడా సరే లేమ్మనారు.


నాకు ఆశ్చర్యం ..వేసింది, నేను ఈ దేశం వదిలి వెళ్లి ఆరేళ్ళు అయింది.ఇంతలో ఇన్ని మార్పులా?


జగన్ పుట్టిన రోజు పండుగ, పద్నాలుగో పుట్టిన రోజు, ఇంకా తరువాత మనం ఏమి చెయ్యం కదా అని, కొంచం భారీ గానే ఏర్పాట్లు చేసారు, పిన్ని, బాబాయి.


శృతి, లయ ,చిన్న పిల్లలు, నాలుగు, మూడేళ్ళు అప్పుడు  ప్రభాకర్ కి అమెరికా ఉద్యోగం రావడం తో వెళ్లి పోయాను  ఒక్కర్తినీ  పిల్లలతో ఎన్ని అవస్థలు పడ్డానో  నాకే తెలుసు.


అమెరికా కలల ని సాకారం చేసే దేశం అంటారు కాని, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, ఇక్కడ మన దేశం లో ఉన్నవారికి తెలీదు.

ప్రభాకర్ కి ఉద్యోగాలు  పోయాయి, మళ్లీ వచ్చాయి. తూర్పు తీరం వదలి పశ్చిమం , ఐ టి కి కేంద్రం కదా అక్కడికి వచ్చేము ..ఈ ఉద్యోగాల అనిశ్చిత లో, నాకింక ఇంక ఇటు వచ్చే ఆలోచనే చేయ లేక పోయాను . 


ఇప్పుడు, ఇన్నాళ్ళకి, పిల్లలి కి తొమ్మిది ,పది ఏళ్ళు వచ్చాక వచ్చాను, వాళ్ళకి  అయితే ఊహ తెలిసాక ఇదే మొదటి సారి అవుతుంది.


తెలుగు బాగానే మాట్లాడుతారు, మేం ఇంట్లో అదే మాట్లాడుతాం కదా,పిల్లలు కి అలవాటే అయింది. నేను, నా పిల్లలకి సంగీతం ,నృత్యం కూడా నేర్పుస్తున్నాను, బాల వికాస్ తరగతులకి వెళతారు ,ఆదివారాలు ప్రభాకర్ తో, శ్లోకాలు అన్నీ చక్కగా చెపుతారు.


జ్యోతి, జగన్, నోరు వెళ్ళ బెట్టారు, మాకు రావు అక్కా అంటూ.


సాయంత్రం పుట్టిన  రోజు పండుగ పార్టీ, ఇంట్లోనే, విశాలం గా ఉన్న ఇంటి ముందు ఏర్పాటు చేసారు. ఏమైనా సాయం చేయనా అంటే, ఎందుకమ్మా ? అన్నీ కేటరింగ్ కి చెప్పేం అనేసారు.


మేం ,అక్కడ మా ఊర్లో ఎంత కష్ట పడుతామో గుర్తు వచ్చింది.వారం రోజుల ముందు నుంచి వంటలు, పిండివంటలు తయారు చేస్తాం. స్నేహితులు, ముఖ్యమయిన ,వాళ్ళు వచ్చి తలో చెయ్యి వేసి  సాయం  చేస్తారు.


పిల్లలు కూడా సంబర పడిపోయారు, పార్టీ అంటే.. ఎవరో, ఇండియా వెళ్ళుతూంటే తెప్పించి, కుట్టించిన పట్టు పరికిణీలు, వాటికీ కుదిరే  చిన్న నగలు, గాజులు, తల లోకి, క్లిప్ లతో సహా అన్ని పెట్టె నించి తీసి,సాయంత్రానికి  అలంకరించుకున్నారు.
నేను కూడా, నా పట్టు చీర, కట్టుకున్నాను, నా ద్రిష్టే తగిలే లాగ ఉంది ,నా పిల్లలకి అనుకుంటూ బయలు దేరి వెళ్ళాం,ఆటో లో.
లయ కి ఎంత నచ్చిందో ఆటో, భలే ఉంది కదా అమ్మ..గాలి వచ్చేస్తోంది   , అని చాలా సంతోషించింది.
శృతి, కి రోడ్ మీదే గేదెలు, ఆవులు అడ్డం గా నిల్చోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరికీ చాల నచ్చింది..విశాఖ పట్నం, ఇండియా..
తను ఎన్నో కబుర్లు, కథలు చెపుతూ ,మన దేశం గురించి పిల్లల్ని ఊహల లో దగ్గర చేసింది..మాధురి ..నిట్టూర్చింది.
డాలర్లు కోసం వెళ్ళేరు కాని, మన దేశం లో ఉన్న అనుభూతి, కొండంత అండ ఎక్కడ ఉంటుంది ఆ దేశం లో?
చల్లని సాయంత్రం..అయినా విశాఖ లో ఉక్క..తెల్సిందే కదా..అయ్యో పట్టు చీర కట్టుకున్నానే ,పిల్లలకి ఇబ్బందే అనుకుంది. కాని, ఏదో సరదా ..
పిల్లలందరూ చేరేరు, హడావిడి గా కేక్ కోయడం, ఆటలు ,పాటలు తో హడావిడి గా ఉంది, ఏవో ఇంగ్లీష్ పాటలు వస్తున్నాయి, ఏమిటో ఎంత మారిపోయింది మన దేశం? అనుకుంది.
పిన్ని వచ్చి, మాధురి ,ఎంత చక్కగా ఉన్నారే నీ పిల్లలు, బాగా పెంచేవు అమ్మా అని అభినందించే సరికి, సంగీతం కూడా నేర్చు కున్నారు అని ,ఒక రకమైన గర్వం తో అనేసరికి..
పిన్ని,పిల్లలూ ఒక్క నిముషం గోల ఆపండి, శృతి ,లయ పాట పాడుతారు ఇప్పుడు అనేసరికి, సద్దు మణిగింది.
ఆ ఇంగ్లీష్ పాటలు ఆపండి, అంటే, ఆగాయి.
నా పిల్లలు, నా వేపు ఒక్కసారి చూసి, నేను పాడండి అనగానే..ఇద్దరూ మఠం వేసుకుని కూర్చుని, తాళం వేస్తూ..
వర వీణా మృదు పాణి, అని వర్ణం, కృష్ణ నీ బేల..అని ఇంకో పాట పడేసరికి చప్పట్లు తో మరు మోగింది. చక్కగా కలిసాయి ఇద్దరి గొంతులు.
నాకు ఎంత గొప్పగా అని పించిందో, మిగిలిన పిల్లలు కూడా మేమూ పాడుతాం అంటూ, సినిమా పాటలు పాడారు..ఏమిటో, నేను మన సంస్కృతి ,మా పిల్లలు ఎక్కడ మరిచి పోతారో అని, మైళ్ళు, మైళ్ళు, ప్రయాణం చేసి, పిల్లలిని అక్కడ దింపి, మళ్లీ నా పనులు చూసుకుని ,వాళ్ళని తీసుకు వచ్చి, ఎంత కష్ట పడి, ఈ సంగీతం అవి, నేర్పిస్తున్నాను. ఏమిటో మరి ఇక్కడ పిల్లలు ఎవరూ నేర్చు కుంటున్నట్టు లేరే..
శృతి, లయ ఇద్దరే పరికిణి లలో బుట్ట బొమ్మల్లాగా ఉన్నారు, మిగిలిన పిల్లలు, ఆడ పిల్లలు, పాంట్లు అవీ టైట్ వి, పైన ఓ షర్టు వేసుకుని, అచ్చం మా అమెరిక పిల్లల్లాగా ఉన్నారు.
మాధురి కి నిజం గా ఏమి తోచటం లేదు, ఇక్కడ..స్నేహితులు అందరూ దూరం గా ఉన్నారు. అమ్మా ఏమిటో, మాట్లాడటమే లేదు, ఎంత సేపూ  సీరియల్స్ అంటుంది, వాళ్ళు ఎవరో ఇంట్లో మనుషుల్లాగా మాట్లాడుతుంది.
నిన్నటికి నిన్న వర లక్ష్మి వ్రతం.., నేను, ఎక్కడో, ఏడు సముద్రాల అవతల, నాలుగు చోట్ల తిరిగి, మైళ్ళు కి మైళ్ళు కార్ లో పడి తిరిగి సంపాదిస్తాను, పూజ సామాగ్రి.
లాప్ టాప్ ముందు పట్టుకుని, మరీ పూజ చేస్తాం మేం అక్కడ. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు అయితే సెలవు పెట్టి మరీ చేస్తారు ఇలాంటి పండగలు. అమ్మ,మా చిన్నప్పుడు ,ఎంత బాగా చేసేదో, నాకు గుర్తుంది. మా పిల్లలు కి ఈ  సంప్రదాయాలు ,నేర్పించాలని నా తాపత్రయం.
మొన్న లక్షిమ్వారం  ,అమ్మ తాపిగా సేరియల్స్ చూస్తూ కూర్చుంది, అమ్మా..రేపు పూజ కదా, అంటే ఒక్క ఫోన్ చేసింది, అన్ని సరుకులు వచ్చి పడ్డాయి, పూలు తెండి, అని నాన్నగారికి ఒక పురమాయింపు.
వంటలు ఏం చేద్దాం? అని నేను ఉత్సాహ పడుతూంటే, అబ్బా ,ఇప్పుడు ఆ కష్టాలు ఏం పడక్కర లేదు అమ్మాయ్..అని ఏమండి, ఆ బెజవాడ హోం ఫూడ్స్ వాడికి ఫోన్ చేయండి, మీ పేరు చెబితే ఇంటికే పంపిస్తారు, పిల్లలు తింటారు, ఒక డజను పూర్ణాలు, ఓ అర కేజీ పులిహోర, కొంచం కేసరి ,ఓ పావు కేజీ మురుకులు, అంటూ లిస్టు చెపుతూ ఉంటే, తెరిచిన నోరు తో వింటూ ఉండి పోయాను. 
పూజ కూడా ఇంక ఒక్కటే హడావిడి, అమ్మాయ్ ..ఇంత చాదస్తం ఎప్పుడు వచ్చిందే నీకు? మీ మామ్మ దగ్గర నుంచా? అని ఎప్పుడో పర లోకం లోకి వెళ్లి పోయిన తన అత్తగారిని గుర్తు చేసుకుంది.
అయ్యో, నాకా చాదస్తం? నిజమేనా? అని నేనూ ఆలోచనలో పడ్డాను.
ఈ రోజు పండగ స్పెషల్ నాగార్జున సినిమా వేస్తారే, పాటలు ఎంత బాగుంటాయో? మీ ఊరు లో చూసావో లేదో? నువ్వు చూడు..అని పూజ అయింది అనిపించింది అరగంట లో.
ఇదేమిటి? ఈ టీ . వి. లు, సినిమాలు ఇవే మన దేశం సాంప్రదాయమా ఇప్పుడు? నేను ఏదో కోల్పోతున్నాను, దూరం గా ఉన్నాను అనుకునే దాన్ని. కాని, ఇక్కడ అంతా ఎంత మారిపోయిందో?
శ్రుతి ,లయ అడగనే అడిగారు, అమ్మా ఇక్కడ ఎవరు పరికిణీలు వేసు కోవటం లేదేమిటమ్మా..అని,మరీ నేను ఎంతో ముచ్చట పడి కుట్టించాను, ఇక్కడ చూస్తే, అందరూ జీన్సే.
నేను అక్కడ అవి వేసుకున్న,ఇక్కడికి నా పాత సల్వార్ కమీజ్ లు తెచ్చు కున్నాను, చీరలు    ఇక్కడ కొనుక్కుందాం అని.
ఏమిటో? నాకు కొంచం అయోమయం గా నే ఉంది..నేను ఊహించుకున్నంత గొప్పగా లేదెందుకు? నా ఊరు..లేకపోతే నేనే ఎక్కువ గా ఊహించు కుంటున్నాన ?
రాత్రి ప్రభాకర్ తో ఇదే మాట్లాడేను. కదిలి పోతున్న, చైతన్య వంతమైన సమాజం, తనలో కి ఎన్నో మార్పులు చొప్పించు కుంటుంది, అది ఒక సజీవ ప్రవాహం..నువ్వు, దానిలో ఎప్పుడో ,ఉన్న ఒక పార్శ్వం మటుకు నీతో తెచ్చుకున్నావు. అది ఎక్కడో అంతర్లీనం గా ఉంటుంది.
ఆరేళ్ళ తరువాత వచ్చి, నువ్వు ఒక జరిగి పోయిన  గతం వెతుక్కుంటున్నావు. సమాజం అలా జడ పదార్ధం లాగ ఉండదు కదా, నువ్వు ఎందుకు మారలేదు? అని అక్కడ వాళ్లకి నిన్ను చూసినా అలాగే ఆశ్చర్యం గా ఉంటుంది.
సరే, మరీ ఎక్కువ ఆలోచించకు, రేపు మీ అన్నయ్య వస్తున్నాడు కదా, హాయిగా గడపండి, పిల్లలందరిని, కైలాస గిరి, జూ,రిషి కొండ బీచ్ కి తీసుకు వెళ్ళండి ..అంటూ గుర్తు చేసాడు . 
ఈలోగా నువ్వు   విశాలాంధ్రకి వెళ్లి బుడుగు పుస్తకాలు,ఓ పది కాపీలు ,రాజాజీ 
రామాయణం ,మహాభారతం ..ముళ్ళపూడి వారి కోతి కొమ్మచ్చి, వేమన పద్యాలూ,
సుమతి శతకం, పెద్ద బాల శిక్ష..అంటూ ఇంత లిస్టు చెప్పేడు.

మన తెలుగు వాళ్ళ పిల్లల పుట్టిన రోజులు అయితే, పిల్లల కానుక లతో పాటూ మేం ఒక తెలుగు కథ ల పుస్తకం ఇవ్వడం అలవాటు చేస్కున్నాం.
ఏముంది ఇంత లోనే రెండు నెలలు అయి పోతాయి. రెండు నిముషాల్లగా.
మళ్లీ ఎప్పుడు వస్తామో? ప్రభాకర్ చెప్పినట్టు ఈ దేశం, మన వాళ్ళు, నాన్ రెసిడెంట్ భారతీయులు గా మారి పోతున్నారు..
ఆ పేరు మాకు పెట్టేరు కాని, మేమే నిజమైన భారతీయులం..నాన్ రెసిడెంట్ భారతీయులం..ఇక్కడ ఉన్న వీళ్ళే..
ఏమిటో నా ఆలోచనలు అన్ని ఇలాగే ఉంటాయి.
మళ్లీ ,నా ఇద్దరు పిల్లలు, ఆరు సూట్ కేస్ ల నిండా మన దేశీయ వస్తువులు, పచ్చళ్ళు,పట్టుచీరలు, పూజ పుస్తకాలు, సంగీతం సీ డి లు,లేపాక్షి లో బుట్ట బొమ్మలు, ఏటి కొప్పాక చెక్క బొమ్మలు, చందనం పొడి సాషే లు, మెత్తని మన కాటన్ నైటీ లు  ,చెప్పులు, నృత్యానికి గజ్జెలు, కూచిపూడి నృత్య సంబంధిత పుస్తకాలూ, కుంకుం, పచ్చటి దంపించిన పసుపు, అప్పడాలు, విజయ నగరం వి, ఇంకా పిల్లలు బీచ్ ఇసకలో ఏరి తెచ్చుకున్న గవ్వలు, రాళ్ళు, ఒక్కటి మర్చి పోయినా ఊరుకోరు,చివర గా అటూ ఇటూ ఊగి, ఎంత డాలర్లు సంపాదించినా ,ఇంత ఖరిదా అను కుంటూ కొన్న రాధా కృష్ణ ల చందనం బొమ్మ, సూట్ కేస్ అంతా ఎంత సువాసనో?
ఎన్ని వాసనలు, పరిమళాలు, స్మృతులు, జ్ఞాపకాలు  ..
ఈ ఎన్నారై ఎన్నని మోసుకు వెళ్ళగలదు ..మాధురి..అయ్యో,ఎంత కష్టం నీకు  అని కళ్ళు తుడుచు కుంటూ, తిరిగి ప్రయాణం అయాను  శ్చిమ దేశానికి,ఇంక సూర్యుడే అస్తమించలేదు అక్కడ..
మనకి అప్పుడే తెల్లవారింది.. కను కొనలు నించి రాలి పడ బోయిన కన్నీరు చుక్క ని మీటుతూ పయన మయాను ..నేను ..ఎన్నారైను ....

11 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వ్రాసారు . మేము ఇక్కడే ఉంటాము అయినా మన సంస్కృతి అని అమ్మా నాన్న అని మా అమ్మాయికి నేర్పుతున్నాము . చాల మంది స్నేహితులు మెచ్చుకుంటున్నారు . కాని మమ్మీ డాడీ సంస్కృతి ఎంతగా ఉందంటే అడుక్కునే వాళ్ళు/ కూరగాయలవాళ్ళు /పనిమనిషి కూడా మీ మమ్మీని/ డాడీని పిలువు అంటూ మా పాపకు నేర్పుతున్నారు . మా పాపకు స్వచ్చమైన తెలుగు నేర్పలంటే అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాము

    రిప్లయితొలగించండి
  2. ఎంతబాగా రాసారండి.ఐదు ఆరేళ్ళ వ్యవధి తరువాత ఇండియా వచ్చిన నా స్నేహితులు చాలా మంది కనపడ్డారు ఈటపాలో. అక్షరమక్షరం సత్యం. నేను ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పి ఎన్ని మూతి విరుపులు ఎదుర్కున్నానో!ఎంతమందికి కోపమొచ్చినా వర్చువల్గా ఇండియాలో ఉండి అమెరికాలో బ్రతుకుతున్నారు.అక్కడ పిల్లలూ కంఫ్యూజ్ అవుతారని శ్రద్ధగా అన్నీ నేరిపిస్తారు పిల్లలూ నేర్చుకుంటారు. ఇక్కడ చదువు తప్పితే ఇంకేమీ ఉండదు. మా పిల్లలకి సగం విష్ణు సహస్రనామం వచ్చాక ఇండియా వచ్చాము. ఇప్పుడు మా పిల్లలకు ఓ రెండు శ్లోకాలు తప్పితే ఏమీ రావు.మా చిన్నది పాట పాడితే ప్రైజు రావాలిసిందే ఇక్కడ నోరు విప్పితే ఒట్టు. అమెరికా అలవాటయ్యేందుకు ఓ రెండేళ్ళు పట్టింది అదీ ఓ దశాబ్దం కింద కనుక. ఇప్పుడైతే అసలు బెంగే ఉండకపోను ఇండియా గురించి.ఏంటో నాకు చాలాసార్లు అమెరికా మీదే బెంగ వస్తుంది ఎలాఉండె దేశం ఎలా ఐంది అనుకుంటే. గత 12 ఏళ్ళల్లో అక్కడ వచ్చిన అన్ని మార్పులూ గమనించాను. పిల్లలూ ఇష్తపడటంలేదు ఇక్కడ బ్రతకటానికి. ఏంటో??సారీ, చాలా పెద్ద కామెంటే వచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. థాంక్స్ అండీ.

    @rajasekhar Dasari,garu,@ sunita garu.

    నేను ఒక గల్ఫ్ ఎన్నారై ని, మూడు నెలలు కి ఒకసారి ఇండియా వెళ్లి ఆ గాలి పీలుస్తే గాని, నాకు ఊపిరి ఆడదు..ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారో చూస్తున్నాను, మన దేశం లో ఎలా ఉంటారో? చూస్తూనే ఉన్నాను..అన్నిటి ని చూసి రాసిన చిన్న కథ.మీకు నచ్చినందుకు చాల సంతోషం.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  4. సునీత గారు,

    మీరు రాసినది కోరేక్టే ..పిల్లలికి మనం ఎక్కడ అలవాటు చేస్తే, అదే అలవాటు అవుతుంది..మీరు ఎక్కడ ఉన్నా.మీ పిల్లలికి అన్ని నేర్పండి, నిరుత్సాహ పడకండి, పిల్లలు చక చక నేర్చుకుంటారు. మీ అమ్మాయికి సంగీతం మళ్లీ నేర్పించండి, విష్ణు సహస్రనాం కూడా..నా చిన్న కథ..మీకు నచ్చినందుకు..మరి ఒకసారి ధన్యవాదాలు..

    వసంతం.

    రిప్లయితొలగించండి
  5. ఎంత బాగా చెప్పారండీ......
    ఈరోజుల్లో ఇది ప్రతివారు ఎదుర్కొంటున్న పరిణామమే.....నిజంగా .......
    ఇక్కడ తెగ తాపత్రయపడిపోయి వ్రతాలు , నోములు చేసుకుంటుంటే.... అక్కడేమో అసలా ఊసే ఉండదు....

    తిథులు , నక్షత్రాలు కూడా మనం ఫోనులో చెప్పే దాకా తెలీదు.... అవునా అంటూ ఆశ్చర్యపోతుంటే.... నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి...

    రిప్లయితొలగించండి
  6. అవునండి మాధవి గారూ. ఒక పెద్ద నవల రాయొచ్చు, ఈ విషయం మీద. మనం చూస్తున్న దేశం, మన ఊరు..ఇలా ఉన్నాయి ఏమిటి? అని ప్రతి సారి ఆశ్చర్య పడడమే,అంతెందుకు, నేను కూడా ,మా ఊరు లో, పూజలు అవి, పెద్దగ చేయను, కాని, ఇక్కడ వాళ్ళని చూసి ,కొంచం బుద్ధి తెచ్చుకుని, కామ్పుటర్ ముందు పెట్టుకుని చేస్తున్నాను. ఎప్పుడూ చేయని వంటలు, అరటి పువ్వు కూర, పప్పు, ఇలాంటివన్నీ ఇక్కడ (గల్ఫ్) లో చేస్తున్నాను. మనం ,ఇక్కడ భారతీయత ని నిలుపుకున్తున్నాం. అక్కడ భారతీయత ని పారేసుకుంటున్నారు..అలా కాదు..అది మారుతున్నా కాల పరిస్థితి ..(transitional stage) అంటారు..ఏమో..చూద్దాం..
    vasantham.

    రిప్లయితొలగించండి
  7. Excellent గా రాసారండి.. మీరు రాసిన ప్రతి మాట నిజం...

    చాలా బాగుంది..

    రిప్లయితొలగించండి
  8. థాంక్స్ అండీ,రాజేష్ మారం గారూ, నచ్చినందుకు, మీ అభిప్రాయం కూడా రాసి పెట్టినందుకు.

    నిజమే, నేను చూసినవే ,అనుభవించినవే ఇవి, అందుకే మరి నిజం..

    అందరికి నచ్చినదుకు, పేరు పేరునా మళ్లీ ఒక సారి ధన్యవాదాలు.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  9. ఏంటండీ, మీరీమధ్యన అస్సలు రాయటం లేదు!!

    రిప్లయితొలగించండి
  10. రాజేష్ మారం గారు.
    చాల ,ధన్యవాదాలు, నా రచనల ని గుర్తు చేసినదుకు, మా ఊర్లో, మా ఇంట్లో ఉండేసరికి, పెన్ అదే కలం, మూగబోయింది,
    మీ లాంటి వాళ్ళు ,అడుగుతే, రాయాలని మళ్లీ కోరిక పుడుతుంది.
    మీ అభిమానానికి ,మళ్లీ చాల థాంక్స్..
    వసంతం.

    రిప్లయితొలగించండి