"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 అక్టో, 2012

ఆలస్యం గా నయినా ,నేను మేలుకున్నాను..

'అవని 'కరాచి వాలా షాప్  నించి రెండు సంచుల నిండా సరుకులు మోసుకుని వస్తూ ,లిఫ్ట్ దగ్గర ఆగి ఉండగా, మమత కనిపించింది.
రెండు చేతుల లో, నాలుగు చామంతి పూల దండలు పట్టుకుని, మమత దాస్ ఆవిడ అసలు పేరు, ఒరియా అనుకుంటాను, ఒకే బిల్డింగ్ లో ఉంటారు..ముఖ పరిచయమే..

ఆవిడ చాటంత మొహం తో, నేను రోటరీ లేడీస్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయాను, మా వాళ్ళు అంటే ఒరియా లేడీస్ సంఘం వారు సన్మానం చేసేరు అంటూ , లిఫ్ట్ పైకి ఎక్కుతూండగా, తను తల పెట్టిన సేవా కార్య క్రమాలు గురించి రెండు మాటలు చెపుతూ, అవనీ ,అదే కదా..మీ పేరు, మీరు కూడా రోటరీ మహిళా సంస్థ ఇన్నెర్ వీల్ లో జాయన్ అవకూడదూ ? అన్న ఒక ఆహ్వానం కూడా ఇచ్చింది  ,నేను దిగిపోయేను నా అంతస్తు లో,ఆవిడ ఇంకా పైకి వెళ్ళిపోయింది.

రెండు సంచుల నిండా, పప్పులు, ఉప్పులు, ఇంటికి కావాల్సిన సరుకులు తో నేను, హు..చామంతి పూల దండ ల తో ఆవిడా??

ఏమిటి ? ఈ అన్యాయం..నేను ఇంత చదువు కున్నాను, ఇంత బాగా ఇల్లు నడుపుతున్నాను, ఇన్ని డిగ్రీలున్నాయి ,అయినా ఏమిటో ఇలా ఇల్లు,పిల్లలు, భర్త అనుకుంటూ, ఎందుకిలా ఉంటున్నాను..

ఇంట్లోకి విసురు గా వచ్చి,సంచీలు ఒక మూల పడేసి..

గది లోకి వెళ్లి చీర కూడా మార్చు కోకుండా, మంచం మీద అడ్డం గా పడుకుని..కళ్ల మీద చేతులు వేసుకుని, దీర్ఘం గా ఆలోచిస్తూ ఉండి పోయింది అవని.

అమ్మా..అంటూ ఇద్దరు పిల్లలు స్కూల్ నించి రావడం, వాళ్ళ భోజనాలు అవీ చూసి, టేబల్ సర్ది, కంచాలు, గిన్నెలు సింక్ లో పడేసి, సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చే సమయానికి ఏదో ఒక టిఫిన్ ఉండాలి, ఆడు కోడానికి వెళ్ళిన పిల్లలు వచ్చేసరికి, రాత్రి కి మళ్లి వంట..ఇలాగే రోజులు గడిచి పోతున్నాయి.

నేను ఉద్యోగం చేయాలా ? అనే ఆలోచనే రాలేదు ఇప్పటి వరకు, ప్రభాకర్ బ్యాంకు లో బాధ్యత కలిగిన ఉద్యోగం..మానేజరు. ఒక్కో రోజు రాత్రి అయిపోతుంది, ఇంటికి వచ్చే సరికి.

నువ్వు ఇంట్లో ఉండి ,అన్ని చూసుకుంటున్నావు కాబట్టి, నాకు హాయిగా ఉంది.పిల్లల చదువు, స్కూల్ ఫీసులు కట్టడం, వాళ్ళ టెన్నిస్ , చెస్ ఆటల కి తీసుకు వెళ్ళడం, ఇద్దరు మగ పిల్లలే, బంటి ,చింటూ అంటాం..

అనంత్ ,సుమంత్ వాళ్ళ పేర్లు..వాళ్ళ ఆట పాటలు, చదువులు అన్నీ నువ్వు చూసు కుంటున్నావు కాబట్టి, నేను ఈ బ్యాంకు ఉద్యోగం ఇంత ప్రశాంతం గా చేసుకో గలుగుతున్నాను,ఇది పని ని షేర్ చేసు కోవడమే కాని, నువ్వు చేయలేవని కాదు, ఇంటిని ఇంత బాగా మానేజ్ చేస్తున్నావు, నువ్వు మన ఇంటి కి సి ఎం డి వి,అంటే పరిపూర్ణ అధికారాలు నీకే, మన బ్యాంకు లో బాలన్స్ ఎంతో, నాకంటే నీకే బాగా తెలుసు అంటూ నన్ను మాయ మాటతో గెలిచేసే ప్రభాకర్ మీద కోపం ముంచుకు వచ్చింది.

ఏమిటి ఈ ఇంటి పని ఎంత చేసినా ఒక తృప్తి ఉంటుందా? బీరువాలు అన్నీ సర్డుకుని, ఒక పని చేసాం అనుకునే సరికి వంటింట్లో అలమరాల లో అడుగు న వేసిన పేపర్ లు మార్చాలి అని గుర్తు వస్తుంది, పిల్లల పుస్తకాలు  చిందర వందర గా పడేసి ఉంటె, అవి సర్డాలి ,బట్టలు ఇస్త్రీ లకి పంపించాలి, శుక్రవారం కి వైట్ డ్రెస్ లు తయారు గా ఉంచాలి, అమ్మో, నేను ఇంట్లో లేక పోతే ఇవన్ని ఎవరు చేస్తారు?

ఇల్లు తాళం పెట్టి వెళ్లి పోతే మధ్యాన్నం ,రెండున్నర కి పిల్లలు ,ఇంట్లోకి వచ్చి భోజనం సరిగ్గా చేస్తారో? చేయరో? ఇప్పుడు నేను సంపాదించే పది వేలో,ఇరవై వేలో ,అవసరమా? ఇంటికి నా అవసరమా? అని పరి పరి విధాల ఆలోచించి ,పోస్ట్ గ్రాడ్ అయి ఉండి కూడా, ఇంటికే పరిమతం అయిపొయింది అవని.

ఇదిగో ఇలా ఎవరినయినా చూసినప్పుడు, కొంచం ఉక్రోషం కలిగి, నేనెందుకు ఇలా బయటకి రాలేక పోతున్నాను..అని ఒకటే బాధ నలి బిలి చేస్తుంది..

సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రభాకర్ కి అర్ధం అయింది, వాతావరణం లో మార్పులు వచ్చేయి అని..ఇది రేడియో వాళ్ళు చెప్పే మార్పులు కావు, అవని మనసులు రేగే సుడిగుండాల ప్రభావం.

భోజనాలు మవునం గా అయి పోయాయి..ఏమయింది? ప్రభాకర్ ..

అవని, విసురుగా..నేను రోటరీ ఇన్నెర్ వ్హీల్ లో సభ్యురాలు అవుతాను..
ఉద్యోగం అంటే రోజంతా పని కాని, ఇదేదో ఆది వారాలేనట ,మన పైన ఉండే ఆ మమత దాస్ చెప్పింది..

నీ ఇష్టం అవనీ  నిన్ను ఎప్పుడయినా ఇలా వద్దు, ఇలా చేయి అని చెప్పానా 
అంతా నీ ఇష్టమే, నీకు నచ్చితే మెంబెర్ గా అవు ,కాని ఆదివారాలు నీకు ఇంట్లో బోలెడంత పని అంటూ ఉంటావు..ఒక్క సారి ,ఆలోచించుకో..తరవాత నీ ఇష్టం..

అవని, ఆ రోజు కి తృప్తి పడిపోయి , మర్నాడు, మధ్యాన్నం ,మమత ఇంటికి వెళ్ళింది. వివరాలు కనుక్కుందాం అని..

మమత రండి అంటూ ఆహ్వానించింది..

చాల మంచి పని చేస్తున్నారు..నేను అన్నీ వివరం గా చెపుతాను కూర్చోండి, అని, రాణి చాయ్ తీసుకు రా, ఇద్దరికీ అని ఒక కేక వేసింది, ఒక పదేహేను ,పదహారు ఏళ్ళ అమ్మాయి, వచ్చి. ఒకసారి ఇద్దరినీ చూసి, చేతులు పరికిణి కి తుడుచు కుంటూ లోపలి వెళ్లి పోయింది.

పని పిల్ల అనుకుంటా..అవని 

మమత చెపుతోంది, మనం ఆదివారాలు ,ఏదో ఒక స్లం ఏరియా కి వెళ్లి, అక్కడ ఉన్న ఆడ వారికీ, తల్లులకి ,పిల్లలకి, మంచి చెడ్డ వివరించడం, సానిటేషన్ , ఆరోగ్యం వాటి మీద వివరణ లు చేయడం, చంటి పిల్లలకి పొలియో అవి ఇప్పించారా లేదా చూడడం..ఇలాంటి పనులు చాల ఉంటాయి..మన లాంటి వాళ్ళు ,అదృష్ట వంతులం ,మనకి కష్టం అంటే ఏమిటో తెలీదు. మన కన్నా అన్ని విధాలుగా కష్ట పడుతున్న అల్ప ఆదాయ వర్గం వారికీ ,మనం ఇలాగ ఏదో ఒక లాగా ఉపయోగ పడితే మంచిది కదా..

అందరూ, ఆడ వారు, ఇంట్లో ఏమి తోచక ఇలా సంఘ సేవ అంటూ బయలు దేరుతారు అంటూ, ఎద్దేవా చేస్తారు..అవనీ ,నేను చెపుతున్నాను విను..మనం ఇంటికి ఎంత చేసినా, దానికి అంతు ఉండదు.

నువ్వు ఇంత గొప్ప దానివి, అంత గోప్పదానివి అంటూ మునగ చెట్టు ఎక్కించి, వాళ్ళ పని కానిచ్చు కుంటారు..

కానీ, నీకు తృప్తి ఉందా?? నీకు విలువ ఉందా? అవనీ ఆలోచించు..

మమత కి 'టీ'కి, ఆమె మాటలకి ధన్యవాదాలు చెప్పి, బయట పడిన అవని,కిందకి ఒక అంతస్తు దిగే లోపలే, ఆలోచనలో పడింది.

ఆదివారం..అందరూ కలిసి ఉండే ఒకే ఒక రోజు..గుండె ఘల్లుమంది,ఆ రోజు నలుగురు ఇంట్లో ఉంటారు కదా అని, పూరీ ,కూర లాంటివి ఉదయం, అందరికి ఇష్టం అని, ఒక స్పెషల్ బిర్యాని, రెండు కూరలు ,మరో పచ్చడి,ఈ పచ్చడి ,తన కి ఇష్టం..రోజూ ఇన్ని వంటలు చేసే, తినే సమయమే ఉండదు, అందుకే ఆదివారం తనకి ఎక్సట్రా పనే మరి..

ఇంకా సినిమా లు అయినా ,సాయంత్రం పార్కులు, బీచ్ రోడులో డ్రైవ్, స్నేహితుల ఇంటికి వెళ్లడమో, వారు రావడమో.. అమ్మో ఇవన్ని కాదనుకుని,నేను ఇప్పుడు, బయటకి వెళ్లి ఎవరిని ఉద్ధరించాలి ?అయినా ఆ మమత ఏమిటి ? ఇంట్లో పని పిల్ల ని పెట్టుకుని హాయిగా, బయటకి వెళ్లి ఉద్ధరిస్తోంది..తనకి ఒక పనమ్మాయి ఉంది, కానీ ఇలా ఇంట్లో ఉండదు, ఉదయం ఒక్క సారి వస్తుంది, నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను..ఇది చాలదా?

ఆ రోజు నించి మమత కనపడి ఎక్కడ అడుగుతుందో? అవనీ ,ఎప్పుడు వస్తున్నావు మా క్లబ్ లో కి అని..హడలి పోయి, ఓ పదిహేను రోజులు కిందకి వెళ్ళడమే మానేసింది.

ఒక నెల రోజుల తర్వాత మమత మళ్లీ లిఫ్ట్ దగ్గరే కనిపిస్తే, తల దించుకుని ,నవ్వ నైనా నవ్వ కుండా వచ్చేసింది. తనకే సిగ్గు వేసింది లో లోపల ఏమిటి చిన్న పిల్లలాగ అని..మమత ఎప్పటి లాగానే హాయ్ ,బాయ్ అంటూ చెప్పింది..

ఇలా ఎన్నో సందర్భాలు, వచ్చాయి, వెళ్ళాయి..తన ఇల్లు ,తన పిల్లలు, తన వాళ్ళు..ఇదే లోకం..

అవని ,అద్దం  ముందు నిల్చుని నెరిసిన జుట్టు మరీ కనిపిస్తోందా? ఫరవా లేదా?రంగు వేసు కోవాలా?అక్కరలేదా?
అని దిగులు గా ఆలోచిస్తోంది..

పిల్లలు పెద్ద వరయిపోయి దూరం గా ఉన్నారు, ఇప్పుడు ఆదివారం ,అయినా సోమవారం అయినా ఒకటే వంట..క్లుప్తం గా, ఉడికించిన కూరలు, రెండు పుల్కాలు ,ఆరోగ్యం కోసం..

ప్రభాకర్ ఇంక రిటైర్ అయిపోతాడు ,ఒక్క ఏడాది లో..

తనకి బోలెడన్ని పనులు, వ్యాపకాలు, స్నేహితులు ..నిమిషం ఖాళీ ఉండదు, నాకు తెలుసు..

నా ఒంటరితనం రెట్టింపై నట్టు, దిగులు గా అనిపించింది.

కాసేపు బయటకి వెళదాం ,మార్పుగా అని, ఏవో చీరలు మీదకి మాచింగ్ అని కార్ లో బయలుదేరి, జగదాంబ సెంటర్ లో షాప్ చేరింది..
ఈ మధ్య ఇలాగే ,ఏదో పని పెట్టుకుని బయటకి వెళ్ళడం ఏవో కొనుక్కుని రావడం..ఏమిటో ఈ ఖాళీ ..రోజు లోనా?? జీవితం లోనా?? తెలియదు..

తల దించుకుని, మాచింగ్ సరి చూసుకుంటూ, చూడలేదు, ఎప్పుడు వచ్చిందో మమతా దాస్..భుజం మీద తట్టింది..అవనీ ..ఎన్నేళ్ళకి ...??

నాకు గొంతు లో ఏదో ఉండ కట్టినట్టు, మాటలే పెగల లేదు, ఆ రోజు లలో కలిగిన సంకోచం..ఇంకా నాలోంచి పోలేదు..సిగ్గుగా అనిపించింది..

పాపం, ఆవిడ అదేమీ ,పట్టించుకోలేదు, అవని ఫ్లాట్స్ లో అందరూ బాగున్నారా? మేము ట్రాన్స్ ఫేర్ అయి బొంబాయి వెళ్ళిపోయాం, అక్కడ నేను టాటా వాళ్ళు నడిపే కాలేజ్ లో  వొమన్ స్టడీస్ లో మాస్టర్స్ చేసాను..
మళ్లీ మేము ఇక్కడికే వచ్చేం , ఈ మధ్యనే..

అవనీ ,నిన్ను ఇలా కలవడం భలే సంతోషం గా ఉంది,తెలుపు నలుపు సమం గా కలిసిన షార్ట్ కట్ తల తో, ముందు నేను పోల్చుకోలేదు, కాని గాలి దుమారం లాంటి మాటల తో,మమతే అని వెంటనే పోల్చుకున్నాను..

ఇక్కడికి వచ్చి వారమే అయింది, నేను ఎందుకో ,నీ గురించే తలుచు కున్నాను, నువ్వు కనిపించవు మీ ఫ్లాట్స్ లో ఖాళీ లు ఉంటే చెప్పు, ఇదిగో నా సెల్ నెంబర్ రాసుకో, అవును అన్నట్టు రాణి ,గుర్తుందా? మా ఇంట్లో పని చేసేది, నేనున్డగానే టెన్త్ పరీక్షల కి కట్టించేను..

చాల కష్ట పడి చదివేది, పట్టుదల గా..

అయినా అన్ని సబ్జెక్ట్స్ ఉండాలా? ఏమో ,ఈ విద్య వ్యవస్థ ఒక టి..

సరే, ఆ.. ఏం చెపుతున్నాను..ఆ రాణి ఇప్పుడు ఒక కమపనీ లో డెస్క్ జాబు అంటే చిన్న దే కాని, ఉద్యోగం చేస్తోంది, రోజూ నన్నే తలుచు కుంటాను అని చెప్పింది, ఫోన్ లో..

ఒకింత గర్వం ఆ గొంతులో, తొనికిస లాడింది..

మాడం ,ఇంకా ఏమయినా కావాలా? సేల్స్ మాన్ అడుగుతున్నాడు, అసహనం గా..

సరే అవని, నా పని అయిపొయింది, ఇదిగో, ఇవే ..

నువ్వు మటుకు నాకు ఫోన్ చేయి, మర్చిపోకు..

అంటూ వెళ్ళిపోయింది ..

నేనూ, ఇంటికి వచ్చి, ఆలోచిస్తూనే ఉన్నాను..మా ఇద్దరికీ టీ పట్టుకు వచ్చిన పని పిల్ల రాణి, ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది..

నేను మా పిల్లలిని చదివించు కున్నాం ,అంటే అదేమీ పెద్ద విషయం కాదు, అలీ కి కూడు పెట్టడం, ఊరికి ఉపకారమా?? అన్నట్టు, మన పిల్లలని మనం పెంచి ,విద్య వంతులని చేయడం. పెద్ద విషయం కాదు, కాని, మనకి ఏమి కాని ఒకరికి ఇలా సాయం చేయడం, అది ఏదో ఇంత డబ్బు ఇచ్చేసి,గొప్ప ఘనకార్యం చేసాం ,అనుకుంటాం..డబ్బు కాదు, మనిషికి కావాల్సింది, బతక దానికి ఒక మార్గం చూపడం..

నా తెల్ల జుట్టు కి రంగు వేయడం..మాచింగ్ జాకెట్లు కుట్టించడం..ఇవన్ని ఇప్పుడు ముఖ్యం గా అనిపించటం లేదు..

వారం లోపే మళ్లీ  మమత ఫోన్..

అవనీ ,ఆ రోజు నీకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి ,అని నేను కూడా బలవంతం చేయలేదు, ఈ రోజు పిల్లలు దూరం గా ఉన్నారు, నీకు సమయం గడపడం కష్టం గానే ఉంటుంది..

నేను ,ఇక్కడ, ఒక మహిళా హెల్ప్ ఫోన్ ,నడపాలని అనుకుంటున్నాను, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయి, అయితే చూసేవు కదా ,నా తెలుగు అంతంత మాత్రం, నువ్వు కొంత సమయం ,ఈ హెల్ప్ లైన్ కి అందించాలి..అని మమత అడిగేసరికి, ములిగి పోతున్న వారికి ,గడ్డి పోచ దొరికినంత ,బలం వచ్చింది..

ఇంకేమీ ఆలోచించ లేదు ,ఇల్లు,ప్రభాకర్, పిల్లలు..ఎవరూ గుర్తు రాలేదు,నా జీవితం ఇంక ఇది, నాకు నచ్చినదే చేసే సమయం..రోజులు వచ్చాయి..నా జీవితం లోకి, ఆలస్యం గా నయినా ,నేను మేలుకున్నాను..

అవని, ఆ రోజు నిశ్చింత గా నిదుర పోయింది..












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి