"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 అక్టో, 2012

ఓ మహత్మా ,ఓ మహర్షి..


ఓ మహాత్మా, ఓ మహర్షి, 
ఎక్కడున్నావయ్య?
ఎప్పుడో  స్వాతంత్ర్యం కోసం 
పోరాడి ,అలసి ,తుపాకీ గుళ్ళకి 
బలి అయిపోయి ,నీ మానాన నువ్వు
వెళ్ళిపోయావా?
ఇక్కడ అంతా తారు మారు అయిపొయింది.
ఒక తెల్ల వాడు పోయి, వంద మంది నల్ల 
వారు వచ్చారు, వెయ్యి చేతులతో
దోచు కోవడం ఒక్కటే, వారు చేసే సేవ
దేశానికి. పావలా ,అర్ధ భిక్షం వేసి,
కొట్లు వెనకేస్తున్నారు, హింస ప్రతి 
రోజు చేసుకునే దంత ధావనం లా
నిత్య కృత్యం అయిపొయింది,
లంచాలు, కుంచాలు కుంచాలు గా
కొలిపించుకుంటున్నారు ..
అసత్యాలు ,రక రకాలు గా వార్త
పత్రిక హెడ్ లైన్స్ ,సిగ్గు లేని 
నాయకులు ,ఎలుగెత్తి చాటు 
కుంటున్నారు,వారి సిగ్గు లేనితనాన్ని.
ప్రాంతాలు,భాషలు,కులాలు,మతాలూ,
ఏదీ కాదు హింస కి కారణం?
ఏదీ కాదు వేర్పాటు వాదాల కి?
ఒక్కటై ఉందాం అంటే ,అది ఒక ......
అయిపొయింది..
విడిపోదాం, నరుక్కుందాం, 
చెడు చేద్దాం, కోట్లడుకుందాం,
కుమ్మేద్దాం ,ఇవి మన జాతీయ 
నుడికారాలు ఇప్పుడు.
నదులు ,జీవ నదులు  కాదు 
ఇరు రాష్టాల మధ్య 
నిప్పు రాజేసే అగ్గి కుంపటులు,
విద్య ,ఆరోగ్యం అంగడి లో అమ్మే 
వ్యాపార వస్తువులు.ఎంత టి
వారి కయిన లేమి తనమే,
అది లేదు, ఇది లేదు, ఇంకా 
కావాలి, ఇంకేదో కావాలి అనేవి 
నిత్య పారాయణాలు.
పిల్లలు లో చిన్నతనం 
కొరవడింది, పెద్ద లలో పిల్లల్లాగా 
పంతాలు, కోపాలు,చేయి చేసుకోడాలు.
అంతా అస్తవ్యస్తం ,అంతా తల్లకిందులు ..

ఓ మహాత్మా ,ఓ మహర్షి,
ఇప్పుడే ,ఇప్పుడే నీ అవసరం
ఈ దేశానికి, ఈ ప్రజలకి.
నువ్వు ఆసరా కోసం పట్టుకున్న 
ఆ దండం, తీయి ,అదే నీ ఆయుధం 
గా మార్చుకో, అహింసా వాదాన్ని,
కాసేపు అటక ఎక్కించు,
సత్య వాక్కు అనే ఆయుధం ని 
నిలదీయడానికి ఉపయోగించు.
ఎదురు చెప్పిన వారిని ,కర్ర ఎత్తి
నిరోధించు, పిలక పట్టి ఝాడించు,
మంచి మాటలు, నెమ్మది గా 
బుజ్జగించడాలు, ఈ కాలం కి
సరిపడవు..యుగానికి ఒక్క
మహాత్ముడు ఉంటారని విన్నాను.
శతాబ్దం సంఖ్య మారితే యుగం
మారినట్టే కదా..ఈ ఇరవై ఒక్క 
శతాబ్దానికి మళ్లీ ఒక యుగ
పురుషుడి అవసరం..ఇప్పుడే,
ఇప్పుడే..మరి ఇంక వ్యవధి
లేదు, ఇంక ఈ దేశం కి మరో
రేపు లేదు, స్వాతంత్ర్య దినోత్సవం 
ప్రతి ఏడు, ఒక తద్దినం తంతు 
అయిపొయింది, జండా ఎటు వేపు 
ఎగరాయలో తెలియని జండా 
కొయ్యల్లాంటి నేతలు,ఒక్క భాష లో
కూడా సరిగ్గా మాట్లాడలేని నేతలు
ఇవాల్టి కలెక్షన్ ఏ చేత్తో ,అందు కోవాలి
అని ఆలోచించే చేతులతో జెండా
ఎగురేస్తే ,అది కన్నీరు కారుస్తూ
రెప రెప మని ఎగరడమే 
మర్చిపోయింది.
కాషాయం త్యాగానికి, తెలుపు 
స్వచ్చత కి , ఆకుపచ్చ రంగు 
అభివృద్ధి కి అనే సంకేతాలు కూడా
తెలియని, ఖద్దరు అంటే గద్దరి అని 
పలికే ఈ రాజకీయ భేతాళు లకి 
కుర్చీ లో కూర్చున్న క్షణం నించి
కొండలు వెనకేసు కోడానికే,రెండు
చేతులు  సరిపోవుట. తర తరాలకి
తవ్వి పోయాలి మరి, ప్రజల సొమ్ము.

జనం నిస్తేజం ,జనం మవునం 
జనం ఒక సమూహం కాదు ఒక
ఒంటరి ద్వీపం ఇప్పుడు, నా ఇల్లు
నా కుటుంబం, నా మంచి, నా చెడు
పక్కిల్లు పక్కిల్లె, పరాయి వారే,కని
పెంచిన తల్లీ తండ్రులే, భారం..
లేచాను, తిన్నాను,పడుకున్నాను,
నా గదిలో పంచ రంగుల టీ వి.
ముఖమే, నా పంచ రంగుల స్వప్నం..
మరి ఇంక ఏ స్వప్నం లేదు నాకు,
అని నిర్లజ్జగా ఒప్పుకుంటున్న 
నిఠారు గా నిలబడ లేని నేను ..
మరి కొన్ని నేను లు కలిసిన 
జనం ,జన సమూహం ఇది..

ఇది ఈ రోజు ,మన దేశ రూపం..
మీరు కలలు కన్నస్వతంత్ర 
భారత దేశం, ఎక్కడో, ఎప్పుడో  ,
సంత లో అబ్బాయి చేతిలో 
ఐస్ పుల్ల లాగ కరిగి పోయి,
ఇదిగో, ఈ పుల్లే మిగిలింది..
విలువ లేని ఓ కట్టె పుల్ల,
ఎంత నాకినా ,మాధుర్యం 
ఎక్కడినించి వస్తుంది..?

అందుకే ఓ మహాత్మా, అదిగో
నీ పక్కనే కూర్చున్నమరో 
మహా మనిషి లాల బహదూర్ 
శాస్త్రి గారిని కూడా వెంట బెట్టుకుని 
తోడుగా, ఇంకోక్కసారి, మళ్లీ 
పుట్టేయాలి నువ్వు అర్జెంట్ గా..
లేక పోతే, ఇదిగో బేరాలు మొదలెట్ట్టారు.
అదిగో ఒకటో సారి, అంటూ పాట మొదలయింది.
అయ్యో రామా,దేశ భక్తి పాట కాదు,
వేలం పాట, అంతర్జాతీయ విపణి లో
వేలం పాట మొదలయింది,
నువ్వు సాగించిన సమరం లో,
మీకు శత్రువులు ఎవరో తెలుసు.
ఇక్కడ అదేమీ లేదు, అందరూ 
దేశాన్ని ఉద్దరించాదానికే పుట్టిన 
వాళ్ళం అని నొక్కి వక్కనిస్తూ ఉంటారు.
మన లాగే నల్ల గానే ఉంటారు, తెల్ల వారు 
అయితే రంగు బేధం అయినా ఉండేది.
ఇప్పుడు దొరతనం కి రంగు నలుపే,
నల్ల ధనం కి రంగు నలుపే,
ఈ నాయకుల రక్తం కూడా నలుపే 
దోమలు కూడా ఒక రాత్రి కి ఇంక 
చాలు రక్తం అనుకుంటా ఏమో కానీ,
ఈ నాయక రాజు లకి అంతే లేదు,
తృప్తే లేదు, భయం లేదు, భక్తి అంటే,
తిరుపతి హుండీ లో వేస్తాం అదే కదా,
అన్నీ తప్పులు ఒక్క దణ్ణం తో సరి..
అని ఒక సాష్టాంగం పడతారు, పొరపాటున
నువ్వు ముందు నిల్చోకు, నీ కాళ్ళు 
పట్టుకు పడేస్తారు, అవును సాష్టాంగం 
అంటే అదే,ఇప్పుడు, ఓటరు కాళ్ళ 
మీద పడడం, ఓటు వేసాక, ఆ కాళ్ళ నే
నరికేయడం, మరి ఇంకెప్పుడు లేవడు,
మరి ఇంకెప్పుడూ, వాడి కాళ్ళ మీద 
వాడు నిలబడ లేడు,అవును వాటినే
ఇప్పుడు ఎన్నికలు అంటున్నారు..

అంతా మారిపోయింది గాంధి ,
నువ్వు ఎంత అమాయకుడివి,
శాస్త్రి గారు ,ఒక్క ఘటన కే 
రాజీనామా చేసేరు ట,అయ్యో 
ఇప్పుడు అయితే, పకోడీ లు
తిన్నట్టు ఈ వార్తలు వింటూ,
లక్షలు లెక్క పెడతారు, అవును 
మరి, పరిహారం అంటూ ఇచ్చేవి
వీరి జేబుల లోకే కదా..

అది మరి నేటి వర్తమాన 
భారత దేశ పరిస్థితి..
అయ్యో, అయ్యో అలాగ 
నీ దండం, నీ వాచీ గొలుసు,
నీ పంచ, ఒక్కటే పంచ నీకు,
పై పంచ కూడా లేదసలే,
నీ చెప్పులు, నీ మార్కు 
కళ్ళ జోడు అన్నీ వదిలేసి
ఈ గజేంద్రుడి అంటే ,ఈ జనం 
కోసం అన్నీ వదిలేసి ,పరుగులు 
పెట్టి వచ్చేయకు, కాస్త నిదానించు..

లాల్, పాల్, పటేల్ ,శాస్త్రి,
నేతాజీ లాంటి ఉద్దండులని 
మర్చి పోకు..నీ ఒక్కడి బలం
కూడా సరిపోదు ,అందరి శక్తులు
దేశ భక్తులు, త్యాగ శీలులు ,
దేశం కోసం ఉరి కంబం ఎక్కిన
మహా వీరుల గుండె ధైర్యాలు
కూడా మూట కట్టుకుని,
అప్పుడు రా..
కొంపలేం మునిగి పోవు,
అసలు స్వతంత్రం ,స్వేచ్చ 
అర్ధాలు, విలువ వీరు 
తెలుసుకుని హా హా కారాలు
పెట్టేవరకూ ఆగు సుమీ..
తొందర పడకు సుమీ..
ఈ పిలుపు ,ఇలా ఏదో 
తొందర పడి ఒక కోయిల 
ముందే కూసింది ,ఒక వసంతం
రాక ముందే కూసింది..అనుకో..
అంతే,,

ఓ మహత్మా..ఓ మహర్షి.
ఇది ఈ జన కోయిల పాడే
ప్రార్ధన గీతం..
ఒక చెవి ఇటు వేసి ఉంచు..
ఇదిగో, ఇప్పుడో అప్పుడో
రానే వస్తుంది ,నీకు పిలుపు
మరి, ఇవాల్టికి ..
ఆ దండలు అవి మెళ్ళో తీసి
విశ్రమించు ఇవాల్టికి..
ఈ జయంతి కి, మరి ఇంక 
సెలవు, మళ్లీ జయంతి కి
మళ్లీ పిలుస్తాను..ఒక చెవి 
వేసి..నిలబడో,కూర్చునో,
ఆ పార్లమెంటు లో నో, ఈ 
ఊరు మధ్య లోనో, విశ్రమించు
మరి ఇవాల్టికి..
మళ్లీ జయంతి కి పిలుస్తానే ..

ఓ మహాత్మా ,ఓ మహర్షి..
ఇది నీకు ,ఈ జయంతి కి అందించే 
ఒక చిన్న కానుక.కినుక 
వహించకు, ఇప్పటికి ఇంతే..మరి..

ఓ మహత్మా ,ఓ మహర్షి..

2 కామెంట్‌లు:

  1. >>>>>
    ఒక్కటై ఉందాం అంటే ,అది ఒక ......
    అయిపొయింది..
    విడిపోదాం, నరుక్కుందాం,
    చెడు చేద్దాం, కోట్లడుకుందాం,
    కుమ్మేద్దాం ,ఇవి మన జాతీయ
    నుడికారాలు ఇప్పుడు. <<<<<<<<


    >>>>>>
    నువ్వు ఆసరా కోసం పట్టుకున్న
    ఆ దండం, తీయి ,అదే నీ ఆయుధం
    గా మార్చుకో, అహింసా వాదాన్ని,
    కాసేపు అటక ఎక్కించు,
    సత్య వాక్కు అనే ఆయుధం ని
    నిలదీయడానికి ఉపయోగించు.
    ఎదురు చెప్పిన వారిని ,కర్ర ఎత్తి
    నిరోధించు, పిలక పట్టి ఝాడించు,
    >>>>>>

    మరి మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయేందుకు చేసిన పోరాటం విడిపోదాం నరుక్కుందాం ఎందుకు కాదో చెప్పండి.
    హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఒక ముక్కని కర్ణాటకలో ఒక ముక్కని మహారాష్ట్ర,లో మరో ముక్క తెలంగాణాని
    ఆంధ్ర లో కలపడం తెలంగాణా నిధులను, నీళ్ళని, ఉద్యోగాలని కొల్లగొట్టడం, తెలంగాణా ప్రజల సంస్కృతిని, యాసని అవహేళన చేయడం
    ఏవిదంగా సబబో వివరించండి.

    ఇవాళ ఇంత చెప్పిన మీరే అహింస సిద్ధాంతాన్ని పక్క పడేసి కర్ర అందుకుని నాలుగు తన్నమని గాంధీకే చెప్తున్నారు.
    దీనిని బట్టే అర్ధమవుతోంది కదా న్యాయం కోసం ఎంత గా పోరాడాల్సిన పరిస్థితి వుందో
    మళ్ళీ పోరాడే వాళ్ళని మీరే తప్పుపట్టడం బాగుందా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. nenu okka telangana, andhra ee udyamala ni gurinche analedu, ippudu prathi intlo unna verpatu dhorani ni gurinche, telangana gaa vidi podaam ante nakemi abhyantaram ledu..
      vasantham.

      తొలగించండి