"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 అక్టో, 2012

భయం .భయం..

రాణీ , నువ్విలా భయ పడితే నేను నా కంపని పని మీద ఇలా టూర్ కి వెళ్ళడం కష్టం అయిపోతుంది.
అవుననుకో, ఈ ఇల్లు ఊరికి దూరంగానే ఉంది, అయినా నీ మనసులో భయంకి అర్ధమే లేదు, నేను ఊరు వెళ్లి నప్పుడల్లా ,నువ్వు ఇలా దిగులుగా మొహం పెట్టుకుని, విచారంగా ఉంటే నేను నిన్ను ఎలా వదలను?

అలా అని, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోలేను కదా? ఆఖరి మాటకి రాజా రావు కంఠం లో కాస్త కరకుతనం ధ్వనించింది.

రాణి బెదురుగా..అదేం లేదు, నువ్వు వెళ్ళు,నేను తలుపులు అన్ని గడియ పెట్టుకుని, ఉంటాను..అంది .

ఇదిగో ,రాణీ ,నువ్వు మీ పుట్టింటికి ఫోన్లు కూడా తగ్గించాలి, మొన్న నెలలో ,చాంతాడంత పొడుగు బిల్లు వచ్చింది ,నా జీతంలో సగం అయిపోయింది, ఆ బిల్లు కట్టేసరికి అన్నాడు రాజారావు .

అయినా, పెళ్లి అయి, రెండేళ్ళు అయినా నీకు చిన్న పిల్లలా అంత బెంగ ఏమిటి? పుట్టింటి మీద..పోనీ ఏదయినా సైకాలజిస్ట్ దగ్గరికి వెళతావా?

"హు.అదేం అక్కర్లేదు ,ఇదేమిటి ,ఏమయినా పిచ్చా ఏమిటి? భయం అంతే, ఇది మామూలే , 
భయంకి చికిత్స ఏమిటి " కోపంగా రాణి రుసరుసలాడింది .

 " సరే,సరే,అయినా నీ కోసమే కదా, ఆ రివాల్వర్ కూడా తీసుకున్నాను జాగ్రత్త "అంటూ  " అయినా ఇది చిన్న టూర్, త్వరగానే వచ్చేస్తాను తలుపు వేసుకో "
అంటూ రాజా రావు వెళ్లి పోయాడు.

రాణి, ఒక సారి తలుపులు అన్నీ చెక్ చేసింది, గడియలు జాగ్రత్తగా ఉన్నాయి కదా ఇదేమిటో? తనకింత భయం..

అమ్మ ,నాన్నలతో రోజుకెన్ని సార్లు మాట్లాడుతుందో.. వాళ్ళు కూడా ఎప్పుడూ, అమ్మా, రాణి, జాగ్రత్త , ఒక్కర్తివి ఉంటావు  అంటూ ఉంటారు .

అలా అనగానే నాకు కళ్ళు తడి అయిపోతాయి..

ఫోన్ చేయాలని తీసింది, నంబెర్ కలుపుతూ ఉంటే , ఎంగేజేడ్ అనే ధ్వని..విసుగ్గా ఈ లైన్స్ ఎప్పుడూ ఇంతే..అంటూ పెట్టింది..

ఇంతలో ఏదో అలికిడి, కరకరమని, ఏదో చప్పుడు..అమ్మో, ఎవరు?ఇంత రాత్రేవరు? వస్తారు, అందులో ఈ ఇల్లు ఊరి చివర ఉంది..
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ, ఆ మెట్ల గది వేపు వెళ్ళింది..
ధబ్ అని చప్పుడు..అమ్మో అని అరిచింది..గుండెల మీద కి చెయ్యి..అమ్మో..
మియం..మియాం..హ్మ్మం పిల్లి పిల్లేనా? హమ్మయా.గుండెల  మీద చెయ్యి కిందకి దించి, ఏయ్ నువ్వెలా  వచ్చావ్ ?
అంటూ పలకరించే లోపల, కిటికీ ఊచల మధ్య నించి మాయం అయిపోయింది నల్ల పిల్లి.
అబ్బ ఎంత భయ పెట్టింది?
మెల్లగా హాల్ లోకి అడుగులు వేస్తూంటే..
నివ్వెర పోయింది, చీకటి మూలలో ఒక మనిషి . 
గోడ మీద ఉన్న స్విచ్ వేసింది, గుర్తు వచ్చినట్టు, ఇక్కడ లై ట్ బల్బ్ ఉంది కదా..
అతను ,నలిగి పోయిన దుస్తులలో, చెదిరిపోయిన జుట్టుతో దీనం గా ఉన్నాడు.

అసలే రాణికి జాలి ఎక్కువేమో అయ్యో పాపం అనిపించింది.
మాడమ్ ,నేను, ఈ రాత్రి కి ఇక్కడ ఉండి, రేపు ఉదయమే వెళ్లి పోతాను ,పరుగులు పెట్టి, పరుగులు పెట్టి అలసి పోయాను..
ప్లీస్..అంటూ నా కళ్ళ ల్లోకి చూసేడు..
సరే, ఇలా హాల్లోకి రా..కాసేపు ఇలా సోఫాలో కూర్చో, అలసిపోయి నట్టున్నావు , రెస్ట్ తీసుకో..
అంటూ...మర్యద చేస్తున్న రాణి ని వింతగా చూస్తూ,
మీకు నన్ను చూస్తే భయం వేయటం లేదా? అందరూ నన్ను పిచ్చి వాడు అంటారు.. నన్ను పిచ్చాసుపత్రి లో పడేసారు.
"నేను పారి పోయి, ఇలా బయట తిరుగుతూ, మీ ఇంట్లో కి వచ్చాను అలసి పోయాను చాలా, కాసేపట్లో ,పోలీసులు అంటే, హాస్పిటల్ గార్డులు వస్తారు, వాళ్లకి తెలుసు, నేను ఈ చుట్టు  పక్కలే ఉంటానని " అన్న అతని మాటలు పట్టనట్టే 
రాణి "ఎంత అలసటగా ఉన్నవో? వేడి గా ఒక గ్లాసు పాలు తీసుకు రానా " అనేసరికి 
" అయ్యో అదేమీ వద్దు, ఇలా కూర్చోండి , 
నన్ను చిన్నప్పటి నించి ఏదో భయం..ఎవరో వెంటాడు తున్నట్టు , ఏమిటో భయం, భయం..నేను ఏం చేసానో, ఏం మాట్లాడానో నాకు గుర్తుండదు..మాడమ్ " 
రాణి, అతని వేపు చూస్తూ,  "నాకు ఎందుకో భయం, ఎందుకో తెలీదు, చిన్నప్పటి నించి ఉంది, నాకు మా నాన్న ఒడిలో కూర్చుంటే ధైర్యం గా ఉండేది, బాగా చిన్నప్పుడు, అంటే అయిదేళ్ళే మో ,ఒకసారి తప్పిపోయాను, వీధిలో ఏడుస్తూ తిరుగుతూంటే, ఒక పోలీసుకి దొరికాను.
అప్పుడు మా నాన్న,నన్ను  ఒళ్ళో కూర్చో బెట్టుకుని ,రాణి,నీకేం కాదు, నేనున్నాను కదా, అంటూ నన్ను లాలించడం నాకు ఇంకా గుర్తు ఉంది.మా నాన్న ఆస్థి అంతా పోయింది, రాజా రావు నన్ను చూసి, పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నాకు మా నాన్న వాళ్ళని కూడా ఇక్కడికే తెచ్చి నా దగ్గరే పెట్టుకోవాలని ఉంటుంది. కానీ, కుదరదు.నాకు మా నాన్న ,అమ్మ ఉంటే బోలెడు ధైర్యం " అని తనలో తను మాటలాడుకుంటున్నట్టు, రాణి..

అతను, "నాకు రోజూ నిద్రలో ఏవో పిచ్చి పిచ్చి కలలు వస్తూంటాయి.ఉదయం లేవగానే, ఒక్కటి గుర్తుండదు.. నాకు కలలంటే భయం..ఒక్కటి గుర్తుండదు..
 ఈ కలలే నన్ను పిచ్చివాడిని చేసాయి " 
రాణి, : హు..నాకూ  రోజూ, రాత్రి ఒక కల వస్తుంది..రోజూ ఒక్కటే కల " 
మీకు గుర్తుంటుందా?
"ఆ ,నాకు గుర్తుంది , రోజూ ఒక్కటే కల కదా..
అందులో, నేను నా మంచం మీద, నా బెడ్ రూం లో పడుకుని ఉంటాను..నా గది మేడ మీద ఉంది కదా , ఇంతలో మెట్ల మీద ఒక చప్పుడు, ఎవరివో అడుగుల చప్పుడు టక్ ,టక్ మంటూ, బూట్ల చప్పుడు , ఇంతలో నా గది తలుపు మెల్లగా తెరుస్తారు ఎవరో ,అంతే ,ఇంతలో నాకు మెలకువ వచ్చేస్తుంది "
హమ్మ్ నిట్టూర్చింది రాణి  .

అతను, "నయమే కదా, రోజూ ఒక్కటే కల మీకు. నాకు ఎన్నెన్నో కలలు "
ఇంతలో తలుపు దబదబ బాదుతున్న చప్పుడు..
అతను లేచి, బాబోయ్, వాళ్ళే ,నాకోసమే, అంటూ అటూ ఇటూ ,పరుగులు పెడుతూంటే " హుష్..నెమ్మది, ఇలా రా, ఈ మెట్ల గదిలో  దాక్కో , నేను వాళ్ళని పంపించేస్తాను, ఏదో చెప్పి..నీకేం భయం లేదు "అంటూ రాణి 

తలుపు తెరిచింది , ముగ్గురు గార్డులు, ఖాకీ దుస్తుల్లో వచ్చేరు.

మాడం ! మీ ఇంట్లోకి ఒక మనిషి ఏమయినా వచ్చేడా?
అతను చాల ప్రమాద కరమయిన పిచ్చి వాడు పారిపోయాడు..మా ఆసుపత్రి నించి..
మీ వీధి తలుపు గొళ్ళెం ఊడి పడి ఉంది జాగ్రత్త..అంటూ 
ఒకసారి మేం వెతుకు తాం ..మీ ఇంట్లో మీకు తెలియకుండా ,ఎక్కడయినా దాక్కున్నడేమో 
అని చొరవగా హాల్ లోకి అడుగు పెట్టారు..

రాణి తొణక్కుండా, "అబ్బే లేదండి..ఎవరూ రాలేదు..నేను చెప్తున్నాను కదా "
అనేసరికి, వాళ్ళు ఇంకేం చేయ లేక ,వెనక్కి నడుస్తూ, తలుపు లు గట్టిగా మూసుకోండి మాడం అంటూ వెళ్ళిపోయారు..హమ్మయ్య..అంటూ అలసటగా మెట్లు ఎక్కి, తన గదిలో మంచం మీద వాలి పోయింది , రాణి..
ఇంకోసారి, ఫోన్ చేసింది , లైన్స్ బాగోలేవు అని అదే సందేశం..
హు..ఈ ఫోన్ లైన్ ఎప్పుడూ ఇంత నాన్నగారి ఊరుకెప్పుడూ కలవదు ..
మంచం మీద వాలడం , నిద్ర పట్టడం ఒక్కసారే..
గాఢ నిద్రలో, ఏదో అలికిడికి మెలకువ వచ్చింది రాణికి .
వీధి దీపం వెలుతురు గుడ్డిగా పరచుకుని ఉంది.
టక్ ,టక్ మని ,బూట్ల చప్పుడు, మెట్ల మీద నించి, ఎవరో పైకి ఎక్కుతున్నారు ఎవరో??
అచ్చం కలలో లాగానే..
తలుపు తెరుచుకుంటోంది నెమ్మదిగా..
రాణి లేచి, మంచం పక్కనే టేబెల్ కి ఉన్న సొరుగు లాగి, రివాల్వర్ బయటకి తీసి గురి పెట్టింది..
తలుపు తెరుచుకుని రాజ రావు లోపలికి వచ్చేడు
"ఏయ్ రాణీ ,నేను , ఆ చేతిలో ఆయుధం ముందు పడేయ్ నేనే , భయం లేదు "
అంటూ ముందుకి అడుగు వేసాడు..
రాణి గురి చూసి, ఛాతి మీద కి కాల్చింది.
హబ్బా..అంటూ కూలిపోయాడు రాజ రావు..

రాణి, నెమ్మదిగా ,రివాల్వరు మంచం మీద పెట్టి, ఫోన్ కలిపింది.
హమ్మయ్య కలిసింది లైన్ ..
"నాన్నా, నేను రాణి ని, ఇంకేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి అందరూ కలిసి ఇక్కడే ఉందాం " 
ఇది జరిగి చాల ఏళ్ళే అయింది..రాణి మానసిక చికిత్సాలయంలో ఉంది. అతను  కూడా అక్కడే,  కలిసిందో లేదో మరి..


ఇది ఒక హిచ్కోక్ ఎపిసోడ్ కి రచన కల్పన...













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి