"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 ఫిబ్ర, 2013

మరే..అలవాటు పడిపోతాం ట

ఒక సారి కట్టి విడిచిన కొత్త 
చీర, మడతలు పెడుతూ 
అబ్బ ,నలిగి పోయిందే 
అంటూ విసుగ్గా మొహం 
పెట్టి ,బీరువాలో పడేసాను..

కాలి కి చెప్పు ,సరే సరి, 
వాడుతూ ఉండండి, మీ 
పాదం కి సరిగ్గా సరి పోతుంది 
అంటూ ,అంటకట్టేడు, నేను 
చూసుకోవద్దూ, ఇప్పుడు 
కరుస్తున్నాయి,సరే చూద్దాం 
అని ఒక మూల దాచేను..

నిన్నటి ,గుబాళింపు మల్లె 
మాలేనా? అసహ్యం గా ఎలా 
ఉందో ? దారం ఒక్కటే వేలాడుతూ 
నాలుగు మాసిన పువ్వులు..
ఒక్క రాత్రేనా మల్లె జీవిత కాలం..
హు..నిట్టూర్పు .నా జీవితం  లాగే..

ఏమిటో ? ఎందుకో ? ఇలాగే 
ఉంటోంది, ప్రేమించి చేసుకున్న 
కాపురం, ఎవరి పోరు లేదు,
మాలో ను, పోట్లాటలు లేవు..
పెద్దగా, అంటే నాకు నీలం 
రంగు పెద్ద ఇష్టం లేదు అనగానే 
నేను లోపలి వెళ్లి చీర మార్చేస్తా మరి ..

నాకు గళ్ళ షర్టు భలే ఇష్టం 
అంటే అతను వేసుకున్న లేత 
గోధుమ రంగు షర్టు కేసి చూసి 
దీనికేం బాగానే ఉంది గా అంటూ
పద ,పద అంటూ నాకిష్టం లేని 
హిందీ సినిమా కి వెల్తామ్ .

ఏముంది ఆ తెలుగు సినిమాల్లో 
అంటూ క్రిటిక్ అయిపోతాడు..
ఏముందో, ఏమిటో మరి ఎందుకో 
నాకు తెలుగు సినిమాలే ఇష్టం..

నాకు ఇవాళ ఇంట్లో తినాలని లేదు..
పద ,పద మని తొందర పెట్టేడు.
ఇంట్లో వండిన వన్నీ ,రేపటికి సద్దె 
నాకు నీరసం గా ఉంది, బయట 
నించి ఏమయినా తెండి అంటే,
రోజూ బజారు తిండి, అందుకే 
ఆరోగ్యాలు ఇలా తగలడ్డాయి 
అంటూ రుసరుసలు..

నా నీరసం పైకి ఎగిరి పోయి,
వంటిట్లో గిన్నెల మోత ,
తిరగమోత తప్పదు నాకు..
మనసులో నలత కి పేరే లేదు..

అమ్మో ,ఇంకా వందేళ్ళు కాపరమా ?
నీరసం అప్పుడే, నలిగిపోయిన చీర 
నయితే ఒక మూల పడేసాను..
కరిచే చెప్పు ని అటక ఎక్కించెను..
ఇంకా మల్లె మాల అయితే ఊడ్చిన 
కసవు లోకి చేరింది..ఈ పెళ్లి 

మంత్రం ని ఏం చేయాలి?
నిత్య నూతనం గా ఉండాలి ట ..
దీవెనెలు గుర్తు వచ్చాయి..
చప్పట్లు కయినా దాంపత్యానికయినా 
ముచ్చటగా రెండు చేతులు, 
రెండు మనసులు ఉండాలి కదా..

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టినట్టు 
ఈ వోటి సంసారం కుండ లో 
తియ్యని నీళ్ళు ఎలా వస్తాయి?
అతలాకుతలం గా కుతకుత లాడింది 
మనసు, తెలియని బాధ తో 
నీరసించింది మనసు..

సంసారలన్నీ  ఇంతే అమ్మ 
తేల్చేసి చెప్పేసింది ,సినిమాల 
లాగ ఉండవే ,ఎప్పుడూ డ్యుఎట్ 
లో అవేవో ,పాడుకుంటూ ఉంటారా?
అవ్వ..సద్దుకుపోవాలి అంటూ 
అమ్మ గీతోపదేశం..

అదే ఆ సద్దుకు పోవడమే, 
ఆ సద్దుకు పోవడమే, ఎప్పుడూ 
నా వంతేనా ? అంటూ నొసలు 
చిట్లిస్తే .అదిగో అలా మొహం పెట్టకు 
అంటూ చివాట్లిసింది..

అదిగో అక్కడే మరి అమ్మ కి 
అతని కి తేడా? నా మనసులో 
పుట్టిన ,పుట్టబోయే ప్రతి 
ఆలోచన కి మాట రూపం ఇస్తుంది 
అమ్మ, మరి ఎందుకో? ఈయన 
మాటల్లో చెప్పినా అర్ధం చేసుకోడు?

మరి నేను ఇష్టపడ్డ అతనే గా?
నవ్వు వచ్చింది, వాడ గా వాడ గా 
పాదం కి సరిపోతాయి ,అని చెప్పుల 
షాప్ వాడు చెప్పినట్టు, కలిసి 
ఉండగా, ఉండగా,సరిపోతాడు 
నాకు అనుకున్నానా? నేను..
ఏమో ....అనుకున్నానేమో..
మూల పడేసిన చెప్పుల జత 
తిరిగి వాడడం మొదలు పెట్టింది..

అదో హాయి..ఆ కరవడమే ఒక 
హాయి..అంతే..ఎంతలో ..ఇంతలో 
చెప్పులు అలవాటు పడిపోతాయి ట ...
మరే..అలవాటు పడిపోతాం ట ..















2 కామెంట్‌లు:

  1. చెంప చెల్లుమనిపించి, చెర్నాకోలతో కొట్టినట్టు ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. డేవిడ్ గారు.
      ఇంకా ఎన్ని సార్లు చెంప ని చెళ్ళు మనిపించాలో .ఈ సమాజం లో మార్పు రావడానికి, ఆడ వారు అంటే చిన్న చూపు, పుట్టిన క్షణం నించి నూరి పోస్తుంది ఈ సమాజం..ఆ మైండ్ సెట్ మార్చడానికి చాలా కాలం పట్టే లాగే ఉంది..ఎక్కడో ఒక్కరు ఉన్నా స్త్రీలని నిజం గా సమానం గా చూడ గలిగే వారు...అది ఒక మొదలే, పెను మార్పు కి..ధన్యవాదాలు.
      వసంతం.

      తొలగించండి