"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 ఫిబ్ర, 2013

తెల్ల సిరా సాక్షి గా

తెల్లని నా చేతికి 
నల్లటి సిరా మరక 
ఎంత విదిలించుకున్నా 
వదలదేం ?

అదిగో ఆ నీలి ఆకలి రంగు 
ఇదిగో ఈ ఎర్రటి క్రోధం రంగు 
అవేమి వద్దు అని తెల్లటి సిరా 
ఒంపుకున్నాను నా కలం లొ.. 

అక్షరాలూ అలా పరుచుకుంటూ 
వెళతాను ,నేల మీద టైల్స్ లాగ 
కుదురుగా, నలుపలకలు గా 
మరకలు గట్రా లేకుండా, 
ఆసిడ్ పోసినా చెరగవు ట .. 
ఈ అక్షరాలూ, నేను పోసిన 
ఈ అక్షరాల మడులు ... 

నా లోకం లో పూసిన పూలు 
నా లోకం లో వేసిన మారాకులు 
నాకుంటే చాలు, ఏమిటో 
అతివృష్టి ,అనావృష్టి ట 
నాకెందుకు .. ఆ వికృతి అందాలు .. 

నేను పూట పూట కూ 
నా కలం లో సిరా మారుస్తాను .. 
నవ్యత , నాణ్యత ఇవే మరి 
నా చిరునామా.. 

పేదలు, పీడితులు ,
అన్నార్తులూ , ఏమిటో అంతా 
మీడియా మిధ్య.. 
ఇరవై లక్షల కార్లు రోడ్డు 
మీద జాగా కోసం ఒరుసు కుంటున్నాయి 
ఏమిటో ,ఏదో అంటారు, అంతా మీ మాయ ..

నన్ను ఒక్క మాట అన్నా పడను 
నా మాట అంత నిఖార్సు .. ఏమనుకున్నారో?
పదహారణాల తెలుగు పలుకు నాది .. 
తప్పులు ,ఒప్పులు ,మీ దృష్టి దోషమే .. 
ఒప్పుకోండి  ... 

నా కలం లో నింపిన 
తెల్ల సిరా సాక్షి గా 
నా అక్షరాలు .. 
గిర గిర దొర్లే నాణేల 
గల గలలు... గచ్చు మీద 
ఖని మనే ఆ శబ్దం కోసమే 
ఈ మాటలు, ఈ కవితలు.. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి