"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

7 ఫిబ్ర, 2013

నాకు రాజకీయాలు అంటే చిరాకు ...

ఆమె తన క్యూట్ ఇంటిలో బందీ 
ఈ పూల గుత్తి ఇలా అమర్చాలి 
ఈ సోఫా సెట్ ఇలాగే ,ఈ మూలే 
ఒక్క అంగుళం కదిలినా అంతా 
అపసవ్యం ..అసహనం..

పొద్దున్న హిందూ పేపర్ మధ్య 
బల్ల పై చక్కగా ..మడత నలగదు 
ఇల్లంతా ,అలా ఎగురుతూ ,నాకు 
నచ్చదు..నా ఇల్లు ఎంత క్యూట్ ..

నా పిల్లలు ఎంత క్యూట్ ..అల్లరి 
అంటే , ఏమిటమ్మా అంటారు..
కాళ్ళకి మట్టి అంటదు, బట్టలు 
నలగవు, చిరగవు..బుద్దిమంతులు ..

నాకు రాజకీయాలు అంటే చిరాకు 
ఏ పార్టీ అయినా ఒకటే నాకు ..
నా ఇంట్లో కి ఆ రాజకీయాలు 
తేకండి..నా ఇల్లు నా స్వర్గం..

నా స్నేహితులు అంతే , అంతా 
నా లాంటి వారే, ఏ వస్తువు కొన్నా 
దాని ఖరీదు బట్టే విలువ ..
ఆ మూలాన అమర్చిన పూల 

గుత్తి విలువ తెలుసా ? మీకు..
ఇంటి నిండా చెత్త పుస్తకాలు 
గుట్టలు ,గుట్టలు గా , నాకసలే 
ఇష్టం ఉండదు, కాఫీ బల్ల పుస్తకం 

ఒక్కటి చాలు ,వెయ్యో 
రెండు వేలో, మా ఇంట్లో పని 
చేసే మనిషి కూడా సినిమా 
స్టార్ లా అందం గా ఉంటుంది..

వంటిల్లు అసలు ఎప్పుడయినా 
వంట చేసాన? అన్నట్టు మెరిసి 
పోతూ ఉంటుంది, నాకంతే 
అంతా నీటు..క్లీను..

ఏమిటి ? గాస్ తెచ్చు కోడానికి 
ఆధార్ కార్డా ? ఆ లైన్ లో నేను 
ఇప్పుడు నిల్చోవాలా? అందరూ 
తప్పనిసరా? ఏమిటి ఈ కొత్త 

రూల్స్..అయినా ఎవరు పెట్టేరు 
ఇలాంటి పనికి రాని...పధకాలు..
ఎవరో..అదే నా రాజకీయాలు అంటే 
అవేనా ..మా ఇంట్లో కి రాజకీయాలు 

వద్దు అనుకున్నానే, ఇలా 
కిటికీ సందుల్లోంచి వంటిట్లోకి 
తోసుకుని వస్తున్నాయి ,పాడు 
రాజకీయాలు, నేను వద్దు అంటూనే 

ఉన్నాను, అయినా, నాకిష్టం లేదు 
అయినా ,ఏమిటి ,ఈ రాజకీయం 
ఇలా గాలి లా వ్యాపించి ,ఇలా 
నా ఇంటిని ,దుర్గంధమయం 

చేస్తోంది? ఇదిగో పని వాళ్ళు 
ఇలా వచ్చి, కొంచం డెట్టాల్ వేసి 
కడగండి, నా ఇల్లు ఒక స్వర్గం ,
నా ఇల్లు ఒక ద్వీపం..నన్ను ఏ 

శక్తి తాకలేదు, నన్ను ఏ రాజకీయం 
అంట లేదు, నేను ఇండియా లోనే 
మరో దేశాన్ని, నేను వేరు ,నా 
ప్రపంచం వేరు,అని చెప్పాలా..

తోసుకుని, తోసుకుని ,ఇలా 
రాజకీయం చేయకండి నా 
మాటలని..నా స్వర్గం లో 
ఇలా విషాలు చిమ్మకండి ..

నా ఇంటి ని ఇలాగే 
క్లీన్ గా, నీట్ గా, తళ తళ 
మెరవనీయండి, ఆ రాజకీయం 
మురికి నాకు అంటించకండి..

చెప్పాగా, మేము వేరు ..
ఈ దేశం లో మరో దేశం మేము..
మా చుట్టూ కంచెలు వేసుకున్నాం 
చూడ లేదా? ఇంక దణ్ణం పొండి ..

మా ఆకుపచ్చ లాన్స్ 
మీ కాళ్ళ తో తోక్కేయకండి..
పొండి ,రాజకీయాలు ఇక్కడ 
మా దగ్గరకి రాకండి..

నా  క్యూట్ ఇంటి ని 
నన్ను వదిలేయండి ప్లీస్..
మేం మా దారిన మేం పోతాం..
మా జోలి కి రాకండి..

అంటూ ఒక స్వీట్ అమ్మ 
వేడుకుంది..సరే, పదండి..
ఓట్లు వేసే మామూలు జనం 
వద్దకు, పదండి..రాజకీయాలు 
కావాలి ట ..వాళ్ళకి..వాళ్ళకే..




4 కామెంట్‌లు: