"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 ఏప్రి, 2013

బొంత ...

అతుకుల బొంత ఒకటి తయారు చేస్తున్నాను 
నా చిన్నప్పటి ఒక రెండు జడల సన్న కాళ్ళ పిల్ల 
మల్లెపూలు కూడా నీకు బరువా ? పిల్లా అంటూ చేతి లోంచి 
నేలకి ఒరిగిన మల్లెపూలు ని దుమ్ము దులిపి, చెక్కుకు పోయిన 
నా మోకాలి చిప్పపై ఒఫ్ అంటూ ఊదిన తాతగారు ఒక 
మాసిపోతున్న తెలుపు నలుపు చిత్తరువు జ్ఞాపకం , 
ఇది ఒక మొదలు.. 

ఇంకా సూది దారం, తో గుచ్చి గుచ్చి, మెల్లగా బొంత కుట్టు 
మొదలుపెట్టాను, ఒక్కో కుట్టు కి ఒక జ్ఞాపకం వచ్చి ఒద్దికగా 
కూర్చుం టున్నాయి , బొంత ని అందం గా చేయాలని నా తాపత్రయమ్. 

పుస్తకాలు బరువుగా మేని ని ఒంచి, 
చదువు జీర్ణం చేసుకున్న పసితనం అది 
మరో ధ్యాస లేదు, మరో చనువు లేదు ,నాతో నేనే పరిచయం పెంచుకుంటూ 
మెల్లగా స్నేహం రుచి చూసి, ఆ మొహం లో పడి పోయాను గా 
ఆ జ్ఞాపకం ని మెత్తగా బొంత కుట్టు తో కుట్టేసా ..  

ఇంకా కొన్ని వైవిధ్యమైన ,రంగుల ,చిత్రాలు 
తళుక్కున మెరిస్తూ, నా అతుకుల బొంత లో జాగా కోసం పోటి పడు తున్నాయి. 
ఒక్కొక్కటి , నాణ్యం చూసి, అతకనా వద్దా అని ఆలోచించి 
కొన్ని బద్ధకించి కుట్టడం మానేసాను . 

స్నేహాల అతుకులు  మటుకు ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను కుట్టేయ్ అంటూ 
నా బొంత లో చోటు సంపాదించుకున్నాయి. 
అబ్బా ఎంత వెచ్చ గా ఉందొ నా అతుకుల బొంత వాటేసుకుంటే .. 
స్నేహం నా చుట్టూ చేతులు వేసినట్టు .. 

ఏదో వయసులో చిట్టి చిట్టి ఆకర్షణలు ,మాయం అయి ,ఒక తీవ్రమయిన 
కాంక్ష,  ఇలాగే అతని తో జీవించాలని అదే ప్రేమ అన్నారు, 
ఆ తీయని జ్ఞాపకాల తోరణాలు చిక్కగా అల్లిబిల్లిగా నా బొంత లో మెరుపుల్లా .. చిట్టి చిట్టి చేతుల ,మెత్తని స్పర్శ ని మరో అందమయిన బట్ట గా కుట్టేసా 
నా అతుకుల బొంత లో, 

ఏమిటో ,ఒక రంగు ఒక బొమ్మ లేదు, అన్ని రకాల వస్త్రాలతో ,
వైవిధ్యం గా, ప్రకృతి గీసే బొమ్మ లాగా తయారయింది ,ఆఖరికి ,
కుట్లు కుట్లు గా ,అతికిన బొంత ,లో కుట్టేసాను నా గుర్తులు ,నా జ్ఞాపకాలు ,
ఇప్పుడు ఇక నా ఖాళీ జీవితం అంతా మడిచి పెట్టి, పారేయొచ్చు ,
లేదా ,గంధం అక్షితలు చల్లి పరిమళం గా దాచుకొవచ్చు. 

నా జీవితం అంతా ఇలా అల్లి ,ఇలా కుట్టి, ఇలా విడమర్చి పరిచేసా 
నా జీవితం అతుకుల బొంత లా లేదే ,ఆశ్చర్యం అంతా ఒకే ఆకాశం లా 
చుక్కలు, మబ్బులు, చందమామ ని మోసే ఆకాశం అయిపోయిందే , 
నా చుట్టూ ,నన్ను తాకుతూ ఇంక ఎప్పటికి నా బొంతే ఇది. నా సొంతం . 






4 కామెంట్‌లు:

  1. అంటే మీ అందమైన బొంతలో ఎన్నో అద్భుతాలని చదవబోతున్నామన్నమాట. Sweet memories

    రిప్లయితొలగించండి
  2. థాంక్ యూ పద్మార్పితా !

    బొంత మీద మీదగ్గర ఏదయినా కవిత ఉందా మీ దగ్గర అని ఒకరు అడిగారు,

    సరే ఇదిగో నిముషాలలో కుట్టేస్తాను అని మొదలుపెడితే జ్ఞాపకాల పందిరి అయిపోయింది అది.

    కవి హృదయం నది లా ఎటు నించి ఎటు ప్రవహిస్తుందో ఎలా చెప్పగలం ?

    ధన్యవాదాలు మరి ఒక సారి,

    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. ఒక్కో కుట్టు కి ఒక జ్ఞాపకం వచ్చి ఒద్దికగా
    కూర్చుం టున్నాయి....బాగుంది మీ అందమైన బొంత.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్ యూ డేవిడ్
      ఎవరో అడిగారు, బొంత మీద కవిత ఉందా ? అంటూ
      ఇదిగో అంటూ కుట్టేసాను..
      బై ఆర్డర్ కుట్టిన కవిత బొంత ఇది.
      ఇలా రాయడం వీలవుతుందా లేదా అని నాకు నేనే ఒక పరీక్ష
      పెట్టుకున్నాను ..చాల సంతోషం ..మీకు నచ్చినందుకు .

      వసంతం.

      తొలగించండి