"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 ఏప్రి, 2013

కొలను ..

కొలను .. 
అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో 
ఊరి చివరో కాదు.. 
కొలను అనగానే 
వికసించిన కమలాలు, 
బద్దకించి ముకుళించని  మొగ్గలు 
నిదానం గా చెరువులో తలలు ఒంచి 
నీరు తాగే పశువులు , 
బిందెలు నీటిలో ముంచి
ఊరి వార్తల ఊట విప్పి , 
ఊరించుకునే పల్లె స్త్రీలు ,
గోచి బిగించి, తల దించి 
బుడుమ్గమని మునిగే పల్లె 
పిలకాయలు, మడి తడి 
అంటూ అసింటా నీళ్ళు పట్టుకునే 
ఆ ఊరి పూజారి, ఆ కొలను వే ,
కాసింత అసింటా అయితే చాలు 
దేవుడి కి సరిపొతాయి.. 

ఆ కొలను గురించి కాదు .. 
ఊహు ఆ కొలను చిత్రం కాదు 
నేను మనసులో గీసిన బొమ్మ 
నా మనసు అనే కొలను.. 
అవును ఆ కొలను గురించే 
నేను చెప్పేది ,రాసేది . 
ఒక్క ఆలోచన ,మనసు కొలను 
లో ఎలా తమాషాగా రింగులు 
రింగులు తిరిగి, వృతాలు గీస్తుందో 
మనసు కొలను లో .. 
ఒక్క ఊహ ఎలా మనసు కొలను కి 
గిలిగింతలు పెట్టి, చిన్న చిన్న 
కెరటాలు ని పుట్టిస్తుందో ,కొలను 
ఉపరితలం మీద.. 

ఒక్క జ్ఞాపకం ఎలా మునిగి 
తేలుతుందో ,కొలను లోకి 
గిర గిర తిప్పి వేసిన గులక రాయి లాగ 
తేలుతుందో, మునుగుతుందో ఏమో 
ఆ రాయి ,బరువు, నునుపు ,గుండ్రం 
అన్ని కలగలిపి చెప్పే సత్యం .. 
నా మనసు కొలను లో ప్రతి 
జ్ఞాపకం కి ఒక చిరునామా ఉంది .. 
ప్రతి ఆలోచన కి ఒక వృత్త పరిధి ఉంది . 
ఊహల గిలిగింతలకి ఒక 
పరదా , సరదా , అలల తీరు ఉంది 

మనసు కొలను లోతు మటుకు 
వేల సంద్రాల లోతు కి ధీటు .. 
ఆ లోతు కొలతలు మటుకు నన్ను 
అడిగి ,నన్ను పిచ్చివాడిని చేయకండి 
ఆ కొలను లోతు మటుకు ,నన్ను 
ఎప్పటికి ,కొలత తీయమని .. 
అడగకండి ..ఎందుకంటే 
అది ఒక అసామాన్య కొలత . 
కొలను మనసు లోతుపాతులు 
అంతు చిక్కని అగాధాలు . 


కొలను .. 
అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో 
ఊరి చివరో కాదు.. 


4 కామెంట్‌లు: