"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

3 మార్చి, 2013

రొట్టె నీతి లేదా ముష్టి విజయం

ఇద్దరం నడుస్తున్నాం .. మీనా బేకరి నుంచి --చేతి నిండా రొట్టెలు ,ముక్కలు కోసినవి .. సినిమా బొమ్మల మగజిన్స్ .. నోటి నిండా కబుర్లు . దాని గురించి ,దాని బాధ గురించి జోకులు .మధ్యలొ నోరు మూసి నొసలు తో వెక్కిరించాం ..కార్లు ,బస్సులు ,రిక్షాలు ,మనుషులు . అంతా రొద . రోడ్డు మీద కొచ్చాక ఉండదా? ( నూకలు మిగిలి) లోకం లో పుట్టి .. ఏంటో వెధవ లోకం అని తిట్టుకున్నట్టు --రోడ్డు మీద కొచ్చాక మరి నడవాలి --కార్లు, బస్సులు ,రిక్షాలు మనుషుల్లోంచి . కార్లు ,బస్సులు ,రిక్షాలు మనుషులు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయా? వాటిని పొమ్మనాలంటే ---రిక్షాలు ,కార్లు ,బస్సులు ,మనుషులు లేని లోకంలో నేను పుడితే .. ఎప్పుడయినా మనసులోని తిక్కను బయట పెట్టి ,ఎవరి మీదైనా అరవాలంటే మనిషి ఉండడు . బేరమాడ్డానికి రిక్షాలున్దవు. బురద నీళ్ళు చిమ్మడానికి కార్లు ఉండవు . వెయిట్ చెయ్యడానికి బస్సులు---------- అబ్బ! ఏమిటి గొడవ !బస్సులు ,రిక్షాలు ,కార్లు ,మనుషులని తిట్టుకుంటూ వాటిని బుర్రలోకెక్కిం చుకుని -----అసహ్యించుకునే వాటినే పట్టించుకుంటూ ----

  రిక్షా బెల్లు టింగు మంది .బస్సు హారన్ కయమంది.. కారు చక్రాలు బర్రు మంటూ ... ముష్టి వాడు అమ్మా! అంటూ శ్రుతి లో శ్రుతి కలుపుతూ .. దాని వాగుడు ఇంకా అవుతోంది . చేతులు ఆడ్డం లేదు .దుమ్ము రేగుతోంది ,ముక్కు మూసుకోడానికి చేతులు లేవు . రావు. 

అడుగు వెయ్యబోయిన కాలు ఆగింది. దాని కేక విని! అయ్యో ! అంది ! బుక్ షాప్ లో వేలాడుతున్న కాగడా మీద ప్రఖ్యాత సిని నటి .... పెళ్లి వార్త విందా?బిక్క మొహం వేసింది . అంత పెద్దదీ ! రొట్టెలు చెల్లా చెదరుగా మట్టిలో ? స్క్వేర్  లు ... చెల్లా చెదరుగా దుమ్ములో ... చూపుతో లెక్క పెడితే పన్నెండు వరకూ అందాయి. ముక్కలు రాష్ట్రాల్లాగ . నలుచదరం కాదు కాకపోతే రాష్ట్రాలు , అదుగో ఆ మధ్యకు విరిగింది కామోసు ! అబ్బ ! వెధవ బుర్ర  ఊరుకోదు.

దానికి సివిక్స్ లో మంచి మార్కులు వచ్చేవి. ఎలా డిసైడు అయిందో? --ఇంకా ఇవి పనికి రావా ? అంటూ అటూ ,ఇటూ చూసింది .ఎవరైనా పనికి వచ్చేలా చేస్తారేమోననని ! ఎవరూ డాష్ అయినా ఇవ్వలేదు .. కాలు జారితే బాధ్యత ఆడ దానిదే ! చేయి జారితే బాధ్యత దానిదే ! ఏ మగాడూ  '    చివల్రి ' నిరూపించుకుంటూ ముందుకు రాలేదు . చెట్టంత దానివి నువ్వున్నావు అంటూ నా వేపు చూస్తుందని తెల్సి నేను అటు వేపు తిప్పాను . వాతావరణం లో ఏదో 'లోపం ' కొట్టవచ్చినట్టు కనిపించింది . మరో రిక్షా టింగుమంది ! బస్సు బర్రుమంది . కారు కయ్యమంది ---విచ్చిన్నం కాని క్రియలు --ఆ ! అమ్మా ! అయ్యా !! కడుపు బాదుకునే ముష్టివాడి అరుపులు కడుపులో కూరుకుపోయి --అరుపుల నీడలు కళ్ళ ల్లోకి ప్రవహించి ఎదురుగా దూరి వాడు క్రింద పడ్డ నలుచదరా ల్లోకి ప్రాణం గ్రుచ్చి -------ఆ పన్నెండు నలుచదరాలు ప్రాణం వచ్చి వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళతాయి కాబోలు అని ఆసక్తి గా చూసాను ,కాని అద్దాల తలుపుల్లోంచి ,కన్నియ చేతుల్లోంచి ముష్టి వాడి చేతుల్లోకి వెళ్ళడానికి అవి  'రొట్టెలు '. అంటే ఇంగ్లీషు వాడు మనకి వదిలి పెట్టిన ' ఉపవాస విరుగుడి ' మినప కాని రొట్టెలు. రమ కేం చేయాలో తోచడం లేదు . రూపాయిన్నర లెక్క అని కాదు ,అవి అలా పడి పోయినప్పుడు ,ఏ విచిత్రమయిన సంఘటన జరక్కుండా ,సినిమా మలుపులు తిరక్కుండా వెళిపోతే ,తీరా తర్వాత జరిగితే ? 


రమ జీవితం లో రోడ్డు మీద ' రొట్టె మలుపు' లిఖింపబడాలి . వదలదు. కదిలింది .. ' అమ్మడూ ఒసేవ్ అమ్మడూ ! ఇటు తిప్పవే మొహమ్.. చూడు కావుడూ ! పోన్లే కామేశ్వరీ ! ఏం టెక్కే నీకు !పోయిన రొట్టెలు ఎలాగో పోయేయి ,నాకు ఒకటి అన్పిస్తున్నాది . ఈ రొట్టెలు ముష్టివాడికి ఇచ్చేద్దామే ! పాపం అరుస్తున్నాడే  ! అయ్యో ! వాడు ఆపసినా దీనికి అరుపులు వినబడుతున్నాయా ?అరుపులు వాడి ధర్మం .. ధర్మం ఆగిపోతే తమ లాంటి ధర్మపరులు వాటిని తమ ఊహా శక్తి తో నిలబెడ్తారు. నేను మాత్రం నిమిత్తమాత్రురాలిని --ఇవి నీకు దానం చేస్తున్నాం అని చెప్పక చెప్పాలా ?ముష్టి వాడితో మాటలేమిటి ? వచ్చి ఎగపడకుండా అలా కూర్చున్నాడేంటి ?ఎగపడి పీకుతూ ఊ ! సరేలే !!ఏంటా ఎగపడ్డం అంటూ ఏవగించుకుని పడే యొచ్చు. పరదేశపు ముష్టివాడిలా వీడికి క్రొత్త నీతి ఏంటి ?రమ కేమి నచ్చలే దు. నాకు వినోదం గా ఉంది . మనకు హాని కలక్కుండా ,మనసుకి బాధ అన్పించకుండా ఎవర్నైనా ,ఎవరైనా ఏడిపిస్తూంటే చూడ్డం --వినోదం గానే ఉంటుంది .నా బోంట్లకు మారీనూ ! పైకి వినోద చిహ్నాలు కన్పించకుండా సాధ్యమైనంత బిగపెట్టుకుని --దీనికింత తెగింపు ఎక్కడిదో --రొట్టెలు పడిపోయాయి .రూపాయిన్నర .. మీనా బేకరి రొట్టెలు. తీసుకుని ఎవరితో నైనా పంచుకుని తిను అంటూ వాడితో మాట్లాడేసింది . దీని దాతృత్వం ... ముష్టి వాడికి- ముష్టి వాడి దాతృత్వం ముష్టి వాళ్లకి .. దాతృత్వం -- ఈ దేశ నీతా? ! దానం చేయడానికి ' రమ'లు  పుచ్చుకోడానికి ముష్టి వాళ్ళు వెలగాలి ఈ రాజ్యం లో అంటూ .. అరుపులు లోలొన .. వాటిని అణిచి పెట్టి - ముష్టి వాడు మూగ వాడా?  సర్వాయవ ఆరోగ్య సంపన్నుడు కాపోటం వల్ల ఇలా రమ ముందు ,నా ముందు బ్రెడ్డు ముక్కాల ముందు దేవిరించకుండా --ఆకలి చూపు ఉంది .. కాని ఎగబడే ఇన్స్టింక్ట్ ఆకలికి చచ్చిందా? వినోదం ఓ పిసరు తగ్గి ఆశ్చర్యానికి చోటిచ్చింది .రమకేమీ అర్ధం కాకుండా ఉంది మరీ ! దెండాలు అమ్మాయి గారో ! పదికాలాల పాటు ! అంటూ అలవాటు చొప్పున  'ముష్టి ' (వాడి ) దీవెనలు వల్లించకుండా అలా క్రోధం గా చూస్తున్నాడేంటి ?రమ కేమి అర్ధం కాలేదు . నాకూ కావడం లేదు . ఇదంతా జరగడానికి ,ఆలోచించడానికి ... చాల కొద్ది నిముషాల మాత్రమే తీసుకుంది ... నిజానికి ,నేను రమ ఇబ్బందిగా ఫీలవుతున్నాం .లోలోన రోడ్డు మీద నిస్సహాయం గా నిల్చుండిపోయినందుకు ! ఇంకో నిముషం ఉంటే ,అందరూ మా చుట్టూ మూగిపోయి ఏ ఉపద్రవం వస్తుందోనని .భయం .( దాన ) కీర్తి కాంక్ష జడ పట్టి రమని లాగి ఇన్ని నిముషాలున్చింది , కాని ----
మళ్లీ వాడి వేపు చూసి ,దీనికీ మాట పడిపోయినట్టు మూగి వాడికి మాటలు అర్ధమవమేమో అన్నట్టు బ్రెడ్డు ముక్కలు వేపు సంజ్ఞ చేసి వాడి వేపు చేయి తిప్పి -- చాల అవస్థ పడింది . దీనికంత మొండిదనం ఏంటో ?

ఇంకా ఈ సంశయావస్థ ఎంత కాలం యేలునో ,బర్రున స్కూటరు వచ్చి ఆగింది . రమ నాన్నగారి కొలీగు మహేశం గారి పిల్ల కాకి దాని మీద. వాళ్ళిద్దరికీ పెళ్లి మాటలు తండ్రులు చేసుకుంటున్నారు .మాటలు కుదిరి సమ్మంధం రైటయితే ,మనవూ ,ఓ ట్రయలు వేద్దాము అన్న కండిషను మీద వీరిరువురు ప్రేమించుకోవడం ప్రారంభించారు . 
స్కూటరు హెడ్ లైట్ దాని మొహం మీద పడి ,వెలిగింది .. 
ఏంటి రమా ! షాపింగ్ నుంచా? నాకోసం కబురు పెట్ట లేకపోయేవా ? స్కూట రేసుకుని ----- మిగిలిన మాటలు నేను విన్లేదు . నేను విన్పించుకోలేనట్టు ఏవేవో మాట్లాడుకున్నారు .. ఓ రెన్నెముషాలు --అది నా వేపు తిరిగి సారీ ! కావుడూ ! పోన్లే కామేశ్వరీ ! అబ్బ , నీ పేరే అంత ..నేను ఉమా తో అలా చిన్న ట్రిప్పు కొట్టి వస్తాను . నువ్వు మా ఇంటికి వెళ్ళకుండా ,తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపో ! మా నానమ్మకి బ్రెడ్డు తర్వాతెస్తానని చెప్తావా? వద్దులే ! అంటూ పడిపోయిన వాటివేపు ఓ నిముషం చూసింది . దుమ్ములో కల్సి పోయిన  దాని కీర్తి కాంక్ష వెక్కిరించింది కాబోలు , కాంత్ ! పోనియ్యవోయ్ ! అంటూ వెనక సీటు ఎక్కి నాకు చేయి ఊపింది . .... ముక్కల్ని రోడ్డు కప్ప గించింది ఆఖరికి . 

నా కోసం ఏ స్కూటరు, సైకిలు మీద ఉమాకాంత్ లు, సూర్యకాంత్ లు  రారని నిర్ధారణ గ తెల్సిన కారణాన ముందుకడుగు వేసాను . ఇది తిరేగిస్తున్నట్టు అనవసరం గా రహస్యం ! ప్రేమికుల లక్షణాన్ని పాటిస్తున్నారు తు చ తప్పకుండా .. 

ఎందుకో ,ఈ రమ , దీని మాటలు, దీని ప్రేమ, దీని టెక్కు అన్ని నాకింత హేళన . కొంపదీసి అవునూ ! స్కూటరెక్కుతూ చేయి ఊపినప్పుడు దాని కళ్లల్లో ఆ నవ్వు కర్ధము ! దిగులు తో నిండి ,హీనం గా తోచింది నా మనసు నాకే ! 

చప్పున ఏదో గుర్తు వచ్చి, వెనక్కి తిరిగాను. పన్నెండో రొట్టె ముక్కను విజయగర్వం తో ఎత్తుకుంటూ వాడి మొహం లో ఆ ఆనందం నా దిగులుని రెట్టింపు చేసింది . ఏదో అర్ధమయింది ..ఏదో అర్ధమవలేదు.

18 -09 -1975.... రాసిన కాలం .. 


'


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి