"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 మార్చి, 2013

అఫిషియల్ కాలని జ్ఞాపకాలు ... గవ్వల సంపద ...

చెప్పాలంటే చాలా ఉన్నాయి .. అందరికి అన్వయించుకునే జ్ఞాపకాలని అందులో ఎంచడం అంటే , సముద్రం ఒడ్డుకి తోయబడ్డ గవ్వల తరగ నించి , చక్కని నిండైన గవ్వలు ఎంచుకోవడం లాంటిది .. చెత్త, చెదారం, విరిగి పోయిన గవ్వలు, ఒక్కో కెరటం ఎంత ఇచ్చి పోతుందో ఒడ్డుకి .. 

మా పిల్లలందరికీ , ఆడుకునే మైదానం అంటూ ఏమి లేదు మా అఫిషీయల్ కాలని రెండో వీధిలో , రోడ్డే మా ఆటల మైదానమ్. ఆ ఇల్లు ఒకే వరస లో రైలు డబ్బా లా కట్టేసారు .. వీధి ఆవరణ అంటూ పెద్ద గా ఏమి లేదు, కాక పోతే ,ఆ మండువా ఇంటిలో , అందులో మా కొత్తమ్మ గారింట్లో స్తంభాలు ఉండేవి, నాలుగు స్తంభాలాట , నేల - గట్టు అంటూ ఏవో ఆటలు ఆడుకునే వాళ్ళం . ఇవన్ని కాదు కాని, సాయంత్రం బడి నించి రాగానే, స్కూల్ డ్రెస్ విప్పి పడేసి, మరో గౌను తొడుక్కుని, కాఫీ తాగేసి, అవును కాఫీ ఏ, పాలు అలాంటివి ,మా ఇంటా వంటా లేదు మరి.. పిల్లలందరం ... మా ఇంట్లో అద్దె కుండే పిల్లలం, మా అమ్ముమ్మ మనవరాల్లమ్.. అవును , మా ఇంట్లో ఆడ వారి సంఖ్యే మెజారిటి , అందరం,  ఎర్ర చీర పైకి ఎగ బెట్టి, పదండి రా పిల్లలూ అంటూ మా మంగత్త అమ్ముమ్మ ,మమ్మల్ని అందరిని వెంట వేసుకుని , అలా ,ఆ వీధి చివర గోలి భాస్కర రావు గారి ఇంటి ముందు , సందు లోకి తిరిగి, అలా నడుచు కుంటూ, వసంత బాల విహార్ , ముందు నించి, ఇంకా ముందు కి వెళ్లి ,కుడి వేపుకు తిరిగితే , కలక్టరాఫీసు డౌన్ వస్తుంది, దానికి ముందు ఉప్ప గాలి పెదవులని తాకుతుంది . 

ఇంక ఆ తర్వాత ,నడకే లేదు, అంతా పరుగులే, మా పిల్లల హోరా ? సముద్రం హోరా ? అని పోటి ఏ ఇంక. 
మా అమ్ముమ్మ ఉండండి , అంటూ ఏదో అప్పుడప్పుడు ఏదో మాట కలిపేది కాని, తను కూడా అప్పటికే మా పిల్లలలో ఒక పిల్ల అయిపొయెది. 

నావల్ కోస్టల్ బాటరీ గేట్ దాటి, ఇంకా ముందు కి వెళితే ,అడ్డ దిడ్డం గా పడేసిన పురాతన రాళ్ళు , ఆ రాళ్ళు దాటి, ముందుకు వచ్చేస్తాను అని బెదిరిస్తూ సముద్రమ్.. అవును ,ఇప్పుడు ఉన్న షోకులు ,రెండు రోడ్లు అవి ఏమి లేవు, ఉన్న దల్లా ఒక్కటే రోడ్డు . 

మేము ఆ పెద్ద రాళ్ళని ,అక్కడొక కాలు, ఇక్కడొక కాలు వేసి ,అవలీలగా దిగేసి పరుగున వెళ్లి ,ముందు కాళ్ళని తడుపుకుని , మెల్లగా ఒక పెద్ద కెరటం వచ్చి ,గౌను అంతా తడిపేసింది, ఇప్పుడెలా అంటూ , ఇంకా ఇసకలో కింద కూర్చో వడం .. అదేదో ఆహ్వానం ఇచ్చినట్టు . రా అమ్మా అని . 

మా అమ్ముమ్మ ఇలా రండర్రా అంటూ ,ఇంకొంచం ముందుకి తీసుకు వెళ్ళేది అక్కడ రాళ్లున్నాయి అని ఎవరో ఒకరు అరిచే వారు. ఇక్కడ చేపలున్నాయే అని పిలిచెది. అంతే అందరం , మా ఆట స్థలం అక్కడికి మార్చుసుకునే వాళ్ళం .. చుట్టూ ,నల్లటి రాళ్ళు, ఎన్ని యుగాల సాక్షి గానో, మధ్యలో చిన్న మడుగుల్లాంటి నీరు, అందులో కిరణాల స్పర్శ కి వెలుతురు తాగినట్టు , బుల్లి బుల్లి చేపలు .. వేగం గా అటు ఇటు తిరుగుతూ, స్టార్ లాగే ఉండే స్టార్ ఫిష్ , రంగులు రంగులు గా ,అవి అప్పుడే చలనం నేర్చు కున్నట్టు , స్పీడ్ గా తిరిగేస్తూ ఉంటే ,వాటిని మా గౌను మధ్యలో పట్టుకోవడం మా ఆటల్లో ఒకటి . 
పల్చని ఆల్చిప్పలు, రెండు కలిపి ఉండేవి దొరికితే , ఆ రోజు కి ఆ అమ్మాయికి ఆటల్లో ప్రైజ్ వచ్చినట్టే .. 

సముద్రం నీటి లో నాని, గౌను లనిండా ఇసక పోసుకుని ,చేతిలో విలువైన గుండ్రని , పల్చని , రంగు రంగుల గవ్వల సంపద కూడాబెట్టి , ఒక్కసారి సూర్యుడు అస్తమిస్తే వేగం గా పరుచుకునే సంధ్యా చీకట్లు ముదిరి , రాత్రి గా మారకముందే , ఎవరో అనే వారు ఇంక చాలు, ఆకలి వేస్తుంది అమ్మ తిడుతుంది ,అని.. 

నాకు మా అత్త గుర్తు రాగానే గుండె గుభేలు మనేది,  వేసుకున్న గౌను ఇసక ,ఉప్పు నీరు కలిసి రంగు మారి పోయి ఉంటుంది, ఇప్పుడెలా, గౌను లో మూట కట్టుకున్న అమూల్యమయిన గవ్వలు, ఇంకా లోపల నత్తలు కూడా ఉండేవి ,కొన్నిట్లో ,వాటిని ఎవరూ చూడకుండా ,డాబా మీదకి వెళ్లి ఆర పోసి రావాలి, అవి ఆరేక , ఇసక దులిపి ,గవ్వల అందాలని చూసి మురిసి పొవాలి. వీటి కి మాచింగ్ గా కొన్ని గుండ్రని రాళ్ళు కూడా ఏరేవారం , అవి ఏవో దేశాల నించి వచ్చిన రాజ కుమారుళ్ళా ,మహా సోకు గా ఉండేవి . 

మా అమ్ముమ్మ తో మేం బీచ్ కి వెళ్ళాం అని ,చూసుకున్న పెద్ద వాళ్ళు ,కారాలు మిరియాలు నూరుతూ ,మా అమ్ముమ్మ ని ఏమి అనలేక మా మీద ప్రతాపం చూపేవారు . 

అటు ,ఇటు చూసి, మా అత్త ఏ వంటిట్లోనో ,ఏదో పని లో ఉన్నప్పుడు ,చప్పున ఇంట్లోకి దూరి, ఆ తడి గౌను , నీళ్ళ కొట్టు ( బాత్రూం లు అనేవేమి లేవు ) విప్పి పడేసి, మరో కొత్త గౌను వేసేసుకుని ,ఆ గవ్వలు డాబా మీద ఆరేసి, గప్చిప్ గా ,గది లో కూర్చుని ,క్లాస్ పుస్తకం చేతిలో పట్టుకుని కూర్చుంటే , మా అత్త ఎక్కడినించో వచ్చి ,ఈ మంగత్త కి ఏళ్ళు వచ్చాయి కానీ అంటూ మొదలు పెడితే , నాకు భలే ఆశ్చర్యం గా ,వింత గా ఉండేది, మా అత్త నన్ను చూసి చూడ గానే ,ఎలా కనిపెట్టేసింది, నేను బీచ్ లో ఆడుకుని వచ్చాను అని.. 

అమ్మ ల దగ్గర నించి, అమ్మలా పెంచిన అత్త ల నించి రహస్యాలు ఏమీ దాచలేం .. అని నాకు అప్పుడు తెలియదు. 

పిల్లలు తప్పు చేసాం అనుకోగానే ,ముందు చేసే పని ,చదువుకుంటున్నట్టు పోస్ పెట్టడం కదా.. 
నాకు ఈ విషయం అమ్మ ని అయ్యాకే తెలిసింది . 
నా సంపద గవ్వలు, రాళ్ళు ,  ఎక్కడ, ఎప్పుడు, ఎలా పోయాయో గుర్తు లేదు , కాని , నా బాల్యం ఎప్పుడు పోయిందో చెప్పగలను. 
ఆ సంపద అంతా ఉత్త గుడ్డి గవ్వలే అని నేను తెలుసుకున్నప్పుడు ...ఇప్పుడిప్పుడే మళ్లీ  ఆ గవ్వల సంపద విలువ తెలుస్తోంది ..








4 కామెంట్‌లు:

  1. గవ్వలతో ఆడుకోలేదు కానీ బీచి ఒడ్డున మాత్రం తెగ తిరిగాను. ప్రొఫెసర్ జ్ఞానానంద గారు సాయంత్రం పూట రామకృష్ణ మిషన్ సర్కిల్ కి వచ్చేవారు. స్టూడెంట్లము ఆయన్ని తెగ ప్రశ్నలేసే వాళ్ళం. ఏమిటో పాత సంగతులు గుర్తు చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju ..garu,
      సంతోషం అండి, మీకు పాత జ్ఞాపకాలని గుర్తు వస్తున్నాయి అంటే నా జ్ఞాపకాలు ఫలం పొందినట్టే.. విశాఖ బీచ్ తో అనుబంధాలు ఎవరూ మర్చిపోలేరండి ..
      వసంతం

      తొలగించండి
  2. మంచి అమ్మమ్మ......
    పిల్లలు తప్పు చేసాం అనుకోగానే ,ముందు చేసే పని ,చదువుకుంటున్నట్టు పోస్ పెట్టడం కదా..
    నాకు ఈ విషయం అమ్మ ని అయ్యాకే తెలిసింది, అంతే కదా మరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హా హా హా ..నిజం ..మనం అబద్దాలు చెపుతున్నట్టు అమ్మ లకి ఎలా తెలిసి పొతుందో నాకు ఇప్పుడు తెలుసు, కొంచం ఒవర్ ఆక్షన్ ఉంటుంది .కదా, ఆత్రం లో , అమ్మల దగ్గర ఏమీ దాచలేరు, డేవిడ్ జాగ్రత్త మరి..థాంక్ యూ

      తొలగించండి