"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 మార్చి, 2013

నాకు ఇంకా ఎన్నో అవయవాలున్నయి...

అమ్మా చూడు రక్తం ,అంటూ పరుగెట్టు కుంటూ వచ్చి 
అమ్మ ఒడిలో వాలిపోయింది , 
ఎక్కడో చూడనీ , మోకాలు చెక్కుకు పోయిందే , 
ఉండుండు ,అంటూ ఓఫ్ అని ఊది, నొప్పి చేతితో 
తీసేసిన అమ్మ ... మా అమ్మ .. 

అమ్మా ,ఎక్కడినించో రక్తం కారుతోందే ? 
పరుగున వచ్చి ,ఎప్పట్లాగే  ఒళ్లో వాలబోయింది .. 
ఆ ,ఆ, ఉండు అంటూ, బెదురు మొహం తో అమ్మ 
తోసింది నన్ను ఒళ్లోంచి అమ్మ.. 

కడుపు లో ఎవరో కత్తి పెట్టి కెలికినట్టు ఒకటే నొప్పి 

మూడ్రోజులు బాధ , ఎవరితో చెప్పను ?
బడి కి వెళ్ళినా ,పాఠాలు వింటున్నా అదే నొప్పి . 
ఇంక మూడ్రోజులేనా ? అమ్మా అంటే ,
ఏదోలా నవ్వింది .. 

అడుగడుగునా బెదురూ, నన్నే చూస్తున్నారు అని 
సిగ్గు, ఎందుకో తెలియదు దుఖం , నాకే ఎందుకు 
ఈ నెలసరి బాధ ? నా ఒక్కరికేనా ? ఎవరి కి 
ఎవరికి చెప్పగలను ? ఇది ఒక శాపమా ?
ఇది నేను చేసిన ఏదయినా నేరానికి శిక్షా ?
పసి మనసులో ఆలోచనలు కి జవాబు ఎవరు చెప్పరు. 

ఒక నెల ఎందుకనో , నెల నెల వచ్చి పలకరించే 
ఈ చుట్టం నన్ను పలరించలేదు ,నేను 
ఎంత హాయిగా పక్షి లా ఎగరోచ్చు , నేనింక 
అని హాయిగా ఎగిరేను .. 

అమ్మ నన్ను ఒక మూల గది లోకి 
తీసుకు వెళ్లి , చూపుల్లో మా టేచెర్ చేతిలో స్కేల్ 
లాంటి చూపులతో ,చెప్పు ,నువ్వు ఏం చేసావు ?
నువ్వు ఎవరితో తిరిగేవు?
నువ్వు అంటూ ఏవేవో మాటలంది . 

స్కూల్ కి పారిపోదాం అనిపించింది .. ఆ రోజు . 
ఆ ఒక్క రోజు.  నాకు నొప్పి కలిగించే నా శరీరం లో 
మార్పులకి ఎవరో ఎలా బాధ్యులు ఎలా అవుతారు?
నా శరీరం ఇక నాది కాదా ? ఎవరో నన్ను , 
నా శరీరం ని వశ పర్చుకున్నట్టు తోచింది . 

ఇలా ఎన్నో నెలలు , భరించాను ఆ సృష్టి బాధ. 
ఇలా ఎన్నో నెలలు.. ఈ బాధ ఒక్క నెల రాకపోతే 
ఆహ్వానించడం నేర్చుకున్నాను, నా శరీరం మీద 
బాధ చేసే అధికారం ని అంగీకరించాను .. నేను 

తొమ్మిది నెలలు ,నాకు ఆ నెలసరి బాధ నించి విముక్తి 
అంటే ,నిజమే అనుకుని సంతోషించినంత సేపు పట్టలేదు . 
అన్నం వార్చే వాసన, వికారం, వంకాయ కూర అంటే 
కడుపులో తిప్పడం, నేను తినే ప్రతి వంటకం నాకు వికారం . 

నేను ఏం తిని బ్రతికానో? నువ్వు నీ కోసమే కాదు ,
నీలో పుట్టే మరో ప్రాణి కోసం కూడా తినాలి అనే వారిని 
చూస్తే , ఏడుపు, కోపం, అన్ని కలిపి కన్నీళ్ళు ఉప్పగా, 
నేను ఎలా బ్రతికి బట్ట కడతానా ? అని నా బాధ నాది. 

నొప్పి ని ఇంకా నొప్పి ని ఆహ్వానించు ,నొప్పులు రానీ ,
బిగ బెట్టకు, ఇంకా నొప్పులు రానీ , నొప్పి పడక తప్పదే 
ఈ ఆడ జన్మ కి ఈ నొప్పులే సార్ధకం అంటూ అమ్మలక్కల 
కబుర్లు కి కలిగిన విసుగు కి గట్టిగా మూలిగి , ఒక ప్రాణాన్ని 
ఈ భూమి మీదకి తెచ్చి పడేసాను, ఈ ఆడపిల్లకి తల్లిని నేను . 

నా చిన్న తల్లి పడే ఆ మూడ్రోజుల బాధ ని తల్చుకుని 
నాకేడుపు  వచ్చింది .. ఎందుకు ఎప్పుడు ఏడుపే వస్తుంది ?
ఎందుకు ఎప్పుడూ ఏడుపే వస్తుంది??
ఈ సృష్టి కార్యక్రమం అంతా మా మీదే పెట్టి , 
మీకేం కావాలి ? అని అడగని ఆ దేవుడో ,ఈ మగవాడో ?
ఎందుకు నిలదీయను? ఎందుకు ఇలా నిస్సహాయం గా నేను 
అన్ని భరిస్తాను, నువ్వు స్త్రీ , పుడమి, ఓర్పు అంటూ 
పేర్లు పెట్టి ,నా గొంతు లో మాటని గొంతు లోనే 
నులిపి వేసే ఆ శక్తీ ని ఎందుకు ప్రశ్నించను ?

సృష్టి ధర్మం , సృష్టి ధర్మం అంటారు .. 
సృష్టి మాకు ఒక్క అవయవమే , పిల్లలని 
పుట్టించే ఒకే ఒక్క అవయవమే ఇవ్వలేదు, 
బుద్ధి జ్ఞానం ,మాట్లాడేందుకు ఒక నోరు ఇచ్చింది 
సృష్టి , కాని, మిగిలిన అవయవాలు కేవలం 
పేరుకి, అందానికి, ఈ ఒక్క అవయవం మాత్రం 
సృష్టికి , సృష్టించడానికి , ఎంత అన్యాయమో కదా !

ఎవరూ అడగరేం? ఎవరూ మాట్లాడరేం? 
నాకు కనడానికి మాత్రమే కాదు, 
మాట్లాడడానికి కూడా హక్కున్ది. 
నాకు ఇంకా ఎన్నో అవయవాలున్నయి.. 
సృష్టి కోసం ఒక్క బిడ్డ సంచి ఏ కాదు. 
నాకు ఇంకా ఎన్నో అవయవాలున్నాయి .. 










2 కామెంట్‌లు:

  1. ఎప్పుడో లేబర్ రూం కవిత చద్దివాక ఎలా స్పందించాలో అర్థం కాలేదు...ఇప్పుడూ అదే పరిస్థితి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును నిజం. ఒక మగవాడి కి అసలు ఈ బాధ ఏమిటో అర్ధమవదు.
      ధన్యవాదాలు డేవిడ్ ..
      వసంతం.

      తొలగించండి