"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 మార్చి, 2013

మరి కొన్ని జ్ఞాపకాలు ..యుద్దం కబుర్లు

అఫిసియల్ కాలని రెండో వీధిలో వరసగా 16 -6 -16 నించి 20 వరకు మా ఇళ్ళే ఉండేవి . అమ్ముమ్మ ఇల్లు, కొత్తమ్మ గారిల్లు, సంపంగె చెట్టు ఇల్లు లేదా పుట్రేవు వారి ఇల్లు, ఆ పక్క మా తాత గారి ఇల్లు, ఆ పక్క చిన్నక్క - పెద్దక్క వారి ఇల్లు అంటే మా అత్త వాళ్ళ ఇల్లు . 
అందరూ చుట్టాలే, చుట్టు అందరూ అత్తలు, చిన్నాన్నలు, మామ్మలు, తాతలు . పిల్లల గుంపు కూడా ఎక్కువే, ఇళ్ళ లలో అద్దె కి ఉండే వారు కూడా మా చుట్టాలనే అనుకునేవారం ..చాల కాలం వరకు. 
అరవై రెండు లోనే అనుకుంటా చైనా తో మనకి యుద్ధం.. వచ్చింది , అంటే చిని ...భారత్ భాయి భాయి అని మన చాచా నెహ్రు గారు భుజాన చేయి వేసి సుహ్రద్భావం ప్రకటించినా ,వారు మాత్రం , మన భూభాగం ఆక్రమించు కోడానికే  ప్రయత్నించారు అని పెద్ద వాళ్ళు అనుకున్నారు . 

తుప్పు పట్టిన తుపాకీ ల తో, ఎలా యుద్ధం చేయాలో తెలియక ,లొంగి పోయి, మన భూభాగం పళ్ళెం లో పెట్టి అప్పచెప్పారని కూడా పెద్దలు అనుకుంటూ ఉంటే విన్న గుర్తు. 

మా పిల్లలకి మటుకు ఒకటే సరదా, బడి కి సెలవులు, నేను చాల చిన్నదాన్ని , విశాఖ పట్నం ఓడ రేవు పట్టణం కదా అందుకని, ఇక్కడ యుద్ధ జాగ్రత్తలు ఎక్కువే కనిపించేవి . అందులో భాగం గా, రాత్రి 
"బ్లాకు ఔట్ "అనే వారు. మనమే ఇంట్లో లైట్స్ ఆపేసి చీకటి చేసు కోవాలి .  పెందరాళే భోజనాలు చేసి, వంటిల్లు సర్దుకుని పెద్ద వాళ్ళు కూర్చునే వారు. రాత్రి ఎనిమిది కి ఒక సైరన్ వేసే వారు. అప్పుడు అందరూ లైట్స్ ఆపేసి, ఒక వేళ వేసుకున్నా ,చిన్న లైట్, అది బయటకి రాకుండా కిటికీలకి ఒక నల్లగుడ్డ కట్టేయాలి . బయటకి ఒక చిన్న లైట్ కనిపించినా , హొమ్ గార్డ్ వచ్చి ,ఇంటి ముందు ఒక ఈల వేసే వాడు . 

ఇంక కొవ్వొత్తులకి ఎంత డిమాండో , కొట్లు మీద దాడి మా పిల్లలు ,పొద్దున్నే మా పని నాలుగు కొవ్వుత్తులు కొనుక్కుని రావడం .. 

మొదటి సారి , ఈ బ్లాక్ లో అమ్మడం అంటే  ఏమిటో తెలిసింది మాకు, అయితే అప్పుడు ఈ పేర్లు తెలియవు. 

కొవ్వొత్తులు ధర అమాంతం పెంచేసారు. ఇంటికి వచ్చి కూరలు  అమ్మే వారు , ఊరు వదిలి పారి పోగా మిగిలిన కొద్ది మంది, అమాంతం ధరలు పెంచెసారు. రెండు పూటల రెండు కూరలు తినే అలవాటు ఉన్న వారు ఇప్పుడు రోజు కి ఒక్క కూర తో నే సరి పెట్టుకోవడం ..  అంటే ఆడ వారికి పని తగ్గిపోయింది కూరల బదులు,  నిలవ పచ్చళ్ళు, కంది గుండలు .. ఇలాంటివి తినడం , గుర్తుంది  .

చుట్టు పక్కల ఊళ్ళ లలో చుట్టాలు ఉన్న వారు ,విసాపట్నం వదిలి పారి పొయారు. రైల్వే స్టేషన్ కిట కిట లాడుతోంది ,ఏది దొరికితే అది ఎక్కి ,జనాలు పారి పోతున్నారు అని పెద్ద లు చెప్పుకోవడం గుర్తు. 

రాత్రి చీకట్లో , పాటలు పాడు కోవడం, మేమే ..  రేడియో కూడా లేని ఇల్లు అవి. పిల్లలకి సరదాగా  ఉండేది , ఎవరో ఒకరింట్లో కలిసి , కబుర్లు చెప్పుకుంటూ , ఆటలు ఆడుకుంటూ , చీకట్లో భలే బాగుండేది . 

ఒక రోజు కె జి హెచ్ ముందు మేము నడుస్తూ ఉంటే ,అంటే అవుట్ గేట్ ముందు ,అప్పుడు పద్మ విలాస్ అని ఒక హోటల్ ఉండేది, ఆసుపత్రి కి వచ్చిన రోగుల బంధువులు కోసం కాబోలు, వార్ సైరిన్ వినిపించింది , అంటే బాంబులు వేస్తారని హెచ్చరిక అన్న మాట . 

నేను మా అత్తా ఉన్నాం ,రోడ్డు మీద . మనం నడిచే ఫుట్ పాత్ మీద ట్రెంచ్ లు తవ్వి ఉండేవి ,అక్కడక్కడ, వెంటనే ఆ సైరన్ వినగానే , మనం ఆ ట్రెంచ్ లోకి దూరి ,పడుకోవాలి ,అది బోర్లా పడుకోవాలి,  నేను చిన్న పిల్లని కదా, మా అత్త నన్ను ముందు , పడుకో ,పడుకో అని తోసిన గుర్తు. తను కూడా నా మీదే , అది చాలా చిన్న ట్రెంచ్ , ఏదో యుద్ధం ఎప్పుడూ రాదు కదా ,ఏం చెయ్యాలో ,ఎలా చెయ్యాలో మన కి అప్పటికి అలవాటు లేదు మరి . మనలో మాట ,ఇప్పటికి అలవాటు లేదు, అహింస సూత్రం పాటించే దేశం కదా మరి.. మనం ఎవ్వరు మన మీద దాడి చేసినా , శాంతి శాంతి అంటాము , అంతే కదా ... 

ఒక పావు గంట అయ్యాక మరో సైరెన్ వినిపించింది, అది ఇంక మనం లేవచ్చు అని చెప్పడానికి .. నాకు అయితే ఒకటే ఉత్సాహం, అది ఒక దొంగ పోలిసు ఆట లాగ, మా అత్త మటుకు హడిలి పోయి, పద ,పద ,ఇంటికి అని పరుగున ఇంటికి వచ్చి పడ్డాం . 

ఇంతకి ఆ రోజు ఆ సైరెన్ అవి, మన జనాల యుద్ధ తయారీ చూడడానికే ఒక చిన్న టెస్ట్ అట .. అయ్యో ,అంతేనా ? నిజం గా శత్రు విమానాలు వచ్చి ,బాంబులు వేయారా అయితే ? అని నేను చాల నిరాశ పడి పోయాను . 
పిల్లలకి నిజానికి , అబద్ధానికి అంత తేడా తెలియదు, నిజం గా జరిగితే వచ్చే వినాశనం , అసలే తెలియదు. ఆ క్షణం లో కలిగే త్రిల్ , అదే గొప్ప ఉత్సాహం . 

ఇంక ఆ రాత్రి డి బి కె రైల్వేస్ లో పని చేసే మా తాత గారు , తన అనుభవాలు అంటే రెండో ప్రపంచ యుద్ధం ,జరిగినప్పటి మాటలు మాకు  కథలు కథలు గా చెప్పేరు . జర్మని మన దేశం మీద యుద్ధం ప్రకటించింది, ఎందుకంటే మనం బ్రిటిష్ వారికి అంటే అల్లిస్ కి మద్దతు గా నిలిచేం కద. ఇంకా విసాపట్నం ,సముద్ర తీరాన ఉండడం వల్ల ,బాంబింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని వార్తలు ప్రచారం అవడం తో, ఊరు ఊరంతా తరలి పోయింది, మా తాత గారు ,మరి కొన్ని కుటుంబాలు వారు మాత్రం ,ఏదయితే అది అవుతుంది అని  మొండి గా ఉండిపోయారు ట . 

కొట్లు మూసి పారి పోయారు, అందరి ఇళ్ళ లలోని వంట సామగ్రి ఒక చోట పోగేసి, రేషను గా అందరికి సమానం గా పంచుకుని తిన్నారుట .ఇళ్ళకి తాళాలు వేసుకుని పారిపొయినా పెరడులలోకి  గోడలు ఎక్కి ప్రవేశించి, అరటి గెలలు , వంకాయలు , ఏవుంటే అవి, దర్జాగా ఎత్తుకు వచ్చి , ఎలాగో రోజులు గడిపారు ట .. 
అలా యుద్ధ కథలు వింటూ గడిపాం ఆ రాత్రి. 
జర్మని వారు మా విసాపట్నం మీద వేసారు ట , బాంబులు, ఒక రాత్రి, పేలని ఒక బాంబు షెల్ల్ ,ఇప్పటికి ఒకటి విశాఖ ముసేయం లో పెట్టి ఉంది, ఆ నాటి కబుర్లకి, నిజంగా జరిగిన యుద్ధానికి  సాక్షి గా .. 

అవి రేషను రోజులు, కిరసనాయిలు దొరకడం అంటే ఎంత కష్టమో ? ఫోన్లు, రేడియోలు, కనీసం ఇంట్లో ఫాన్లు కూడా లేని రోజులు అవి. కరెంట్ ఖర్చు కేవలం రాత్రి నలభై వాట్ ల బల్బులు వెలిగించడానికే .. 

యాభై ఏళ్ళ లో చాల సాధించాం ! కరెంట్ ఖర్చు విపరీతం గా పెరిగింది, అప్పటి బ్లాకు అవుట్ బదులు ఇప్పుడు పవర్ కట్స్ చూస్తున్నామ్. బాగు ,బాగు. 

పాకిస్తాన్ తో యుద్ధం మరో కథ.. మరో సారి.. 

























2 కామెంట్‌లు:

  1. అవునా యుద్ద సమయంలో ఇంత కథ జరిగిందా....మీ బాల్యం నాకు ఎన్నొ కొత్త విషయాలను తెలుసుకునేలా చేసింది....అన్ని జ్ఞాపకాలను రాయండి ఇంకా తెలుసు కుందాం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు డేవిడ్ .అవును అందుకే నా జ్ఞాపకాలు రాస్తున్నాను .. నా బాధ ,ప్రపంచ బాధ కాబోదు అన్న జ్ఞానం నాకుంది ,అయినా ఏదో ఇవి ,ఈ పాత విషయాలలో కొంత జ్ఞానం ఉంది అనిపించి రాయడం మొదలుపెట్టాను, ఒక అనుమానం బాధించింది, ఏమిటి ఉపయోగం?అని.. ఇ
      ఇప్పుడు సమాధానం లభించింది.. ఇంకా రాస్తాను.. సరే మరి.
      వసంతం.

      తొలగించండి