"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 మార్చి, 2013

అమ్మ -నాన్న-నేను

వీపు న ఒక చదువు సంచి, అన్ని పీరియడ్  వాచకాలు వాటి  నోట్ పుస్తకాలు ఇవి కాక ,ఇంటి పని ( హొమ్ వర్క్ ) నోట్ పుస్తకాలు ,ఒక కంపాస్ పెట్టె లో ఇంకు పెన్ను, మరో రెండు పెన్సిళ్ళు , వెరసి ఆ  బరువు కి వచ్చే గూని ,చిరు గూని కడ్డి శరీరం  . 
చేతిలో ఒక బుట్ట ,అందులో టిఫిన్ కారేజ్ హొర్లిక్ష్ సీసాలో నీళ్ళు , మంచి నీళ్ళు తాగడానికి .. కాలికి పల్చని చెప్పులు .. 
పడమట వీధిలో అద్దెకి ఉండే వాళ్ళం , మా బడి , అదే కాన్వెంటు బడి , ఊరి మధ్య లో ఉన్న రైలు పట్టాలు దాటి, ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసు వీధి నడిచి, విజవిహార్ సెంటర్ లో ఎడమ వేపు కి తిరిగితే ,అదే షరీఫ్ మందుల దుకాణం ,వెంబడి . ఇంకొంచం నడిస్తే వస్తుంది మా బడి . 
నేను ఏడో తరగతి ,అప్పటికి ఏలూరు వచ్చి ఒక ఏడాది దాటింది .. ఇప్పుడు ఉన్న ఓవర్ బ్రిడ్జి కి అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. 
మేము విశ్వ శాంతి హాల్ ,ఇప్పుడు ఉందో  లేదో మరి, వీధి లో అంటే వెనక వీధిలో ఒక అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం . ఆ ఇంటి  ఓనరు కి ఒక కిరాణా కొట్టు ఉంది , ఆ వీధి చివరే . 
ఆరుగురు పిల్లలు ,అమ్మ ,నాన్న, వచ్చే పోయే చుట్టాలు, ఆహా ఏం బేరం అనుకుని చాల మర్యాద ఇచ్చేవారు ,వారు.  అప్పుడు తెలియదు లెండి ఇలా అని . మా అమ్మ గారు ఇంక అట్టే సందేహించ కుండా , ఒక ఖాతా మొదలెట్టేసారు . 

ఎందుకో మరి, జూట్ మిల్ వాళ్ళు ఇచ్చిన మరో ఇంట్లోకి మారి పొయాము . అదే పడమట  వీధి లో ఇల్లు. 

నా కన్నా చిన్న వాళ్ళు అందరూ ఇంకా నత్తా ,నావా.. నేను ఒక్కర్తిని బడి కి వెళ్లి పోతూ ఉండే దాన్ని, అదినూ ఆంగ్ల మాధ్యమమ్.   ఎప్పుడూ తరగతి మొదటి రాంక్ నాదే .. 

నేను తీసుకు వెళ్ళే ఆ బుట్ట , లంచ్ బుట్ట లో అమ్మ ఒక చీటీ వేసేది ,రహస్యం గా, అంటే ఎవరి నించి రహస్యమో అప్పుడు నాకు తెలియదు. నెల మొదటి వారం లో తెచ్చిన పప్పు ,నూనె అప్పుడే అయిపోయాయా ? అనే నాన్న గారి నించి అని తరవాత తెలిసింది లెండి . 

ఖాతా కొట్టు ఏమో  మధు లతా సెంటర్ దగ్గర కిరాణా కొట్టు, మేం ఉండేది రైలు కట్ట కి అవతల .. 

రోజూ ఆ కట్ట దాటి, బడి కి వెళ్ళే ఇంటి పెద్ద పిల్ల నేను . 
అమ్మ నన్ను నమ్ముకుంది . 

ఇంక అప్పుడే వానా కాలం  బ్రిడ్జి కోసం తవ్విన పునాది గోతుల నిండా నీళ్ళు చేరేవి . తవ్వి పోసిన మట్టి అంతా బంద ,బంద అంటే బురద ,బురద, దాని మీద ఒక కాలు వేస్తె , ఒక పెద్ద మట్టి బూట్ లా తయారు అయేవి, నా పల్చని చెప్పులు. అడుగు తీసి, అడుగు వేస్తె , ఒక శిఖరం ఎక్కినట్టు ,ఇంత ఎత్తు గా అయిపోయే దాన్ని . 

నేను బడి వదల గానే , నా పుస్తకాల సంచి ఒక భుజానికి తగిలించి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ,ఆ తరగతి పుస్తకాలు చదివేసుకోనా, ఆ ఇంటి పని చేసేయనా ?  ఆ లెక్కల చాప్టర్ ముందే చేసేయాలి అందరి కన్నా ,ఇలాంటి 'చదువు ' ఆలోచనలతో ,చులాగ్గా , నడుచు కుంటూ, ఆ కిరాణా కొట్టు ,లో చీటీ ఇచ్చి, నేను ఫలానా రావు గారి అమ్మాయి ని అని తల దించుకుని చెపుతూ ఉంటే , అమ్మయ్య , నా ఖాతా కి ధోకా లేదు అనుకుని ,అలా కూర్చో అని మర్యాద చేసి,   హొర్లిక్ష్ సీసా ,వెడల్పు మూతి కదా, చులాగ్గా ఒక బట్ట తో తుడిచి అందులో ఒక కేజి ఏ ఏమో బాలాజీ నూనె పోసి, రెండు కేజీల కంది పప్పు , ఓ కాగితం పొట్లం లో కట్టి, పురికొస తాడు తో కట్టే వారు, అవును ,అప్పుడు ,ప్లాస్టిక్ సంచులు అవి...తెలియని రోజులు, చక్కగా, అమాయకం గా , భూమి కి మేలు చేసే రోజులు .. 

అవి నా లంచ్ సంచి లో సద్దుకుని, ఒక చేతిలో ఈ బరువులు, మరో చేతిలో నాకు ప్రాణమయిన  నా పుస్తకాల సంచి, తల కి నూనె పెట్టి, బిగించి వేసిన రెండు జడలు , సాయంత్రానికి , చెమ్మా గా మొహం మీదకి నూనె దిగి ,జడలు ఊడి పోయి, రిబ్బన్లు వేలాడుతూ, సద్దుకున్దామంటే ,చెయ్యి ఖాళి లేదు కదా. 

ఇంకా ఆ వీధులన్నీ దాటి, రైలు వస్తుందేమో అని, అటు ఇటు చూసుకుని , కట్ట దాటి, ఆ బురద , గట్టు మీద పడుతూ ,లేస్తూ మరో కాలవ ,ఏలూరు కా లవ బ్రిడ్జి దాటి, మరి కొంచం దూరం నడిచి, ఇంటికి చేరి సంచి లు రెండూ కింద పెట్టి, అమ్మా !! వచ్చానే అమ్మా అంటే ,

తెచ్చావా ? నూనె , కంది పప్పు తెచ్చావా? ఆ కొట్టు వాడు ఏమి అనకుండా ఇచ్చేడా ? మా నాన్న గారు వచ్చి తీరుస్తారు పాత బాకీ అని చెప్పావా ? 

అని ఊపిరి ఆడకుండా అడుగుతూ ఉంటే ,అమ్మా చెయ్యి నొప్పె .్‌మ్మ్ 
అని  మూలుగుతూ ఉంటే .. 

పోనీలే , రేపటికి పప్పు ఉంది, నీ పుణ్యమా అని . 
ఉండు మరి , నాలుగు పకోడీలు వేయిస్తాను ,అలసి పోయావు అనే అమ్మ 

నాకు బోలెడంత చదువు పని ఉంది అమ్మా, ముందు నన్ను చదువుకోని 
అనే పెద్దమ్మాయి .అంటే నేనే .. 
నెల కి సరి పడా తెచ్చి పడేసిన సరుకులు నెల ముందే ఎందుకు అయిపోతాయి ? అని నాన్నలకి తెలుస్తుందా? అమ్మ లకే కాని. 

పిల్ల ల ఆకలి తీర్చాలి అనుకునే అమ్మ లకే  కాని .



.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి