"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మార్చి, 2013

అఫీషయల్ కాలని జ్ఞాపకాలు - బడ్డీ కొట్టు .

మనకి ఎప్పుడో కలిగిన ఒక కష్టమో ,బాధే కాదు ఒక సుందర చిత్రం కూడా మనలో ఎన్నేళ్ళ యినా చెక్కినట్టు నిలిచిపోతుంది . అలాంటి ఒక జ్ఞాపకం .. 

నా  చిన్నప్పటి  అఫీషయల్ కాలని జ్ఞాపకాలు ఇవి. మా ఇల్లు రెండో వీధి లో , అలా కిందకి దిగితే అప్ మీద నించి. మా ఇల్లు  వర్ణించాను కదా ,కిందటి పోస్ట్ లో .. ఆ ఇంట్లో నే ... 

మా అత్త నాకు అక్షరా భ్యాసం చేసింది, అక్షరాలు వచ్చి రావడం తో నే ,ఇంటికి వచ్చే ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ లో గుర్తు పట్టడం , అలా కథలు చదివడం, ఆ మాయ లో పడి పోవడం తో నా సాహిత్య ప్రయాణం మొదలయింది . 
మా ఇంటికి ఉన్న దగ్గర దుకాణం ,అప్ మీద ఉన్న ఒక బడ్డీ కొట్టు .. 

ఆ కొట్టు యజమానురాలు, తెల్లగా, సౌజన్యం గా ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఆభరణం గా ధరించి, ఏమ్మా అమ్మలూ ! అంటూ నోరారా పలక రిస్తూ , సిగేరేట్ ,అగ్గిపెట్టె , అరటిపళ్ళ గెల ,సీసాలో చప్పరించే బిళ్ళలు , బిస్కెట్లు , ఒక మూల చిన్న గిన్నె లో ,తడిపి ఉంచిన తుని తమల పాకులు , ఆ పక్కనే ,కిళ్లి కట్టడానికి కావాల్సిన సామాన్ల డబ్బాలు, మూతలు పెట్టి, ఒక మూల చిన్న గల్లా పెట్టె .. 

ఇంతే కాదు.. ఎత్తుగా పరచిన ఆ కొట్టు కింద భాగం లో ఆమె ఇంటి సరంజామా , అంతా నాలుగు గిన్నెలు, రెండు పళ్ళాలు , గ్లాసులు, ఒక పీట ,ఒక వార , చిన్న నులక మంచం ..ఎత్తి పెట్టి .. 

ఆమె ఇల్లు , కొట్టు కలిపి ఆమె సంసారం అంతా ఆ చిన్న బడ్డి కొట్టే .. ఇంతే కాదు .. ఆ బడ్డి కొట్టు వెనకే ఒక చిన్న దడి కట్టి ఉండేది .ఆ దడి లోపల ఒక చిన్న తోట ..ఒక మందార చెట్టు, ఒక అరటి చెట్టు ఉన్న గుర్తు. 

ఎప్పుడు స్నానాలు అవి ఎలా చేసేదో కాని, సన్నగా రివట లాగుంది మొహాన సూర్య బింబం లాంటి పెద్ద బొట్టు తో కళ కళ లాడుతూ, ఎంత చక్కగా ఉండేదో .. మగవారయినా ,ఆడవారయినా ఒకటే పలకరింపు, ఏం అమ్మలూ అని . 

ఒక మగ సాయం  కాని  పిల్లలని కాని చూసిన గుర్తులేదు . ఏదయినా తెమ్మని పంపిస్తే పరుగెట్ట్టుకుంటూ వెళ్లి , అర్ధ రూపాయో ,ఏదో, చేతిలో ఉన్న డబ్బులు  ముందు ఆవిడ కి ఇచ్చేసి, తరవాత అడగడం ఇంకా గుర్తు. 

వస్తువు ముందు తీసుకుని , తరవాత డబ్బులు చేతిలో పెట్టాలి అనే జ్ఞానం అవి లేని అజ్ఞానపు, అమాయకపు ,మంచి రొజులు. 

ఎందుకు అలా పరుగులు తీస్తావు ? జాగ్రత్త సుమీ ,అంటూ హెచ్చరించిన మొదటి జ్ఞానపు తీయని మాట . 

ఎవరికయినా గుర్తుందా ? 13 నంబరు సిటి బస్సు ఆగే బస్సు స్టాప్ కూడా అదే..  నేను మా చిట్టి వలస వెళ్ళడానికి నా మూడో తరగతి లోనే , నా ఒంటరి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు , అక్కడే బస్సు ఎక్కి, ఎ వి ఎన్ కాలేజ్ డౌన్ లో బస్సు దిగి, పాత బస్సు స్టాండ్ కి నడుచు కుంటూ వెళ్లి, తగరపు వలస అని రాసి ఉన్న బస్ ఎక్కి, ఒక గంట ప్రయాణం చేసి  అక్కడ మళ్లి ,బస్సు దిగి , రిక్షా ఒకటి పావలా కి మాట్లాడుకుని, క్వార్టర్స్ లో ఉన్న మా అమ్మ దగ్గరికి వెళ్లి పోయే దాన్ని . ప్రతి శనివారమ్. మళ్లీ సోమవారం ఉదయం తిరుగు టపా .. 

ఆ అప్ అలా అలవాటు అయిన ఒక ప్రదేశం ... 

మా అత్త కి పెళ్లి అయి ,తను అత్తవారింటికి వెళ్లి పోతూ ఉంటే ,ఆ రిక్షా వెనక ఏడ్చుకుంటూ ,పరుగులు పెట్టి, ఆ అప్ వరకూ వెంబడించాను .. చివరికి ,మా అత్త మనసు కరిగి , మా మావయ్య గారిని ఒప్పించి నన్ను కూడా తన తో తీసుకు వెళ్ళిన ఆ చిన్నతనం మొండితనం .. బాల్యం లో పంతం పెట్టి ,ఎన్ని సాధించు కుంటామో ? 

మనం మరి పెళ్లి , అయాక ఎందుకో ఇలా మౌనమ్ గా...ఒదిగిపోయి .. మనకి కావాల్సింది మనమే సాధించు కోవాలి, ఎవరూ ఇవ్వరు ,అనే బేసిక్ ఫండా ఎదిగే క్రమం లో ఎప్పుడు మర్చి పొయామో ??? 

ఆ బడ్డి కొట్టు, ఆమె ధైర్యం, ఆమె చిన్న ప్రపంచం అంటే చిన్నప్పుడు నాకు గొప్ప అడ్మిరేషన్ .. ఇప్పటికి .. అలాగే మనసు లో చిత్రించబడి ఉంది దృడం గా .. ఎంత చిన్న ప్రదేశం చాలు, నిజం గా మనం హాయిగా బ్రతక డానికి .. మనం క్లుప్తం గా , తక్కువ గా బ్రతకడం అంటే ఏదో లోటు అని ఎందుకు అనుకుంటామో ? 

హృదయం విశాలం గా ఉండాలి, ఇల్లు కాదు. ఎంత గొప్ప మనిషో ఆవిడ .. 

విశాఖ ని వదిలి వెళ్లిపోయాం .నా బాల్యం ముగిసింది .                               ఏలూరు కి  వెళ్లిపోయాం .. 

అర్ధణా ,పావలా రోజులు అవి.. పోనీ ఎంతో కొంత ఇచ్చి .. ఆవిడ దగ్గర ,ఆ చిరునవ్వు. .సౌజన్యమ్ ..కొనుక్కొవల్సిన్ది.. 

బజారులో అన్ని దొరకవు అని తెలిసినా , ఒక చిన్న ఊహ .. నా పెదవుల మీద ఒక చిరు నవ్వు పూయించింది . 
అవును ,నేను కొనుక్కున్నాను .. నా జ్ఞాపకాల పెట్టె తెరిచి ఒక చిరునవ్వు అరువు తెచ్చుకున్నాను ..ఈ పూట కి . 

మరెన్నడూ ఆ పేట వేపు వెళ్ల లేదు నేను , బోసి పోయిన ఆ అప్ చూడ లేక..  















6 కామెంట్‌లు:

  1. ఇంకొక పక్క యునివర్సిటీకి వెళ్ళే బస్సు స్టాప్ ఉంటుంది కదా, కృష్ణ నగర్ లేడీస్ హాస్టల్ రామకృష్ణ మిషన్ యునివర్సిటీకి వెళ్ళే బస్సు. ఆ కార్నర్లో హోటల్ ఉందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu..
      అజంతా హోటెల్ ఉంది ..ఆ కలెక్టరాఫీస్ జుంక్షన్ లో ..నా మొదటి జ్ఞాపకాల పోస్ట్ లో రాసాను. అవును మేము కూడా ఆ బస్ లోనే యూనివెర్సిటి కి వెల్లే వాళ్లం. థాంక్స్ అండి నా పొస్ట్ చదివి మీ కామెంట్స్ రాస్తున్నందుకు ..
      వసంతం. .

      తొలగించండి
  2. మేం ఓల్డ్ తాలూకాఫీసు వద్ద ఉండే వాళ్ళం...అక్కడి నుండి లక్ష్మీ సినిమా హాల్ వరకూ నడచి వచ్చి 13 నంబర్ బస్ ఎక్కితే వాడు...పూర్ణా మార్కెట్ (ఎడమ వైపు) నుండి పోలీస్ బారక్స్ దగ్గర తిప్పి చౌల్ట్రీ కి తీసుకు వెళ్ళి మళ్ళీ పూర్ణా మార్కెట్ కుడి వైపుకు వచ్చే వాడు...అప్పుడు అక్కడి నుండి ఏవీఎన్ కాలేజీ అప్...బస్ వెనక్కు జారి పోతుందేమో అప్ మీద నుంచి అని భయం వెసేంత జనం...నిజంగా నేను బస్ అప్ ఎక్కేప్పుడు భయ పడే వాడిని ..వెనక్కు జారిపోతుందేమో నని...నాకు అప్పుడు..చిన్న వయసు...ఎనిమిది తొమ్మిదేళ్ల న్న మాట.....అటే ప్రయాణం...చేయాల్సి వచ్చేది...ఎక్కువగా డాక్టర్ సదాశివరావు గారి ఆసుపత్రికి వెళ్ళడానికే 13 ఎక్కే వాళ్ల మని గుర్తు ...టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేది ఆయన క్లినిక్....ఆయన తప్ప మరో డాక్టర్ కి ఎప్పుడూ చూపించ్కో లేదు నేను...మెడిసన్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఆయన దగ్గరకే వెళ్ళే వాడిని...నెలకు మూడు వారాలు మందులు మింగే వాణ్ణి...:) ఆ తర్వాత కాలేజీ చదువులకీ 13 బస్సే ఎక్కువ ఎక్కే వాళ్ళం.....భయంకరమైన రష్ అండీ బాబూ..13 bus లో...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. kvsv gariki

      అవునండీ , 13 నంబరు బస్సు నంబరు 7 బస్సు, 10 నంబరు బస్సు లు ఇవి మూడూ మూడే ఎప్పుడూ రష్ గానే ఉండేవి. 13 నంబరు బస్సు మీరు చెప్పినట్టే పూర్ణా మార్కెట్ పక్కనించి ఎ వి ఎన్ కాలెజ్ డౌన్ కి వచ్చి ,ఆ అప్ ఎక్కేది, చాలా స్టీప్ అప్ అది. మా నంబరు 10 బస్ కూడా , సెంచరి క్లబ్ , పాండురంగా పురం అప్ ఎక్కుతూ , భలె గమ్మత్తయిన ఫీలింగ్ కలిగేది. ఒక రోజు నించి అన్ని నంబర్లు ఏమిటొ 100 తో మొదలయేలా చేసేసారు , ఎవరో కొత్తగా వచ్చిన అఫీసరు. నాకెంత కోపం వచ్చిందో , మనకి అలవాటు అయిన నంబర్లు ఇవి.. ఎన్నో ఏళనించి ..
      ధన్యవాదలు ,మీ జ్ఞాపకాలు ఇక్కడ పంచుకున్నందుకు .

      వసంతం.

      తొలగించండి
  3. అవును ,నేను కొనుక్కున్నాను .. నా జ్ఞాపకాల పెట్టె తెరిచి ఒక చిరునవ్వు అరువు తెచ్చుకున్నాను ..ఈ పూట కి ......nice narration. superb

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు డేవిడ్ ...మీకు నచ్చినందుకు ..
      వసంతం.

      తొలగించండి