"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

5 మార్చి, 2013

ఒక్క అడుగు .. ముందుకు వేసాడు .

నిశ్శబ్దం అంత చెవులు నిండే శబ్దం అని 
అప్పుడే తెలిసింది, ధడేలమని ఒక 
తలుపు బలం గా మూసి ఆమె వెళ్లి పోయినప్పుడు 
నీరవం, నిశబ్దం అంటూ ఏవో పదాలు పెదవులు 
పలికాయి ,నిస్తేజం గా.. 

పెద్ద విషయమేమీ కాదు, ఇప్పుడు ఎందుకు నీకు 
ఈ ఉద్యోగాలు , ఊళ్ళేలడాలు ? అనేసాను . 
నా మనసులో ఇలాంటి వ్యాక్యం ఏర్పడుతుంది 
అని నిజం గా నాకూ తెలియదు. ఇంత వరకు. 

లోకం లో సహజం గా అనే మాటలు ,ఎప్పుడు 
ఎలా నాలో ఇంకి పోయాయో స్పాంజ్ లాగ 
ఏమో మరి నాకూ తెలియదు. ఆమె కి కోపం 
విరుచుకుపడి ,మాటలు కరువై, నువ్వు కూడా నా?
( యూ టూ బ్రూటస్ ) అన్న కత్తి లాంటి చూపు 
ఒకటి నామీదకి విసిరి, గాలి ని కోస్తూ ,వెళ్లి పోయింది 
తలుపు ఫెడేల్ మని  చెంప దెబ్బలా ...

దిక్కు తోచలేదు, కాసేపటికి ఆకలి వేస్తుంది ,
కుకర్  పెట్టిందో లేదో , చ ,ఇప్పుడు ఆకలి ఏంటి ?
ఇన్నాళ్ళు ,తను ఇంట్లో ఉండి ,సేవలు చేయించు కుంటూ 
హాయిగా ఉన్నాను, ఇప్పుడు ,పిల్లాడికి మూడేళ్ళు ఇక 
నేను ఉద్యోగం చేస్తాను అంది, ఒక్కటే మాట . 

నాలో ఎన్ని తుఫానులు రేపిందో? రేపట్నించి నేను 
నా కాఫే నేను పెట్టుకని ,తాళం వేసిన ఇంట్లో కి 
తాళం తెరుచుకుని రావాలి, వచ్చారా ? అంటూ 
టీ అందించే స్నేహ హస్తం ఉండదు యిక . 

నేను నా వంతుగా చేయాల్సిన పనులు ,అమ్మో 
ఎన్నొ.. నా బట్టలు నేను ఐరన్ చేసుకోవాలా ?
అంతకు ముందు ,ఉతకాలి కదా ఇప్పుడు 
బీరువా తలుపులు తెరవ గానే ,వాడి పారేసిన 
బట్టలు స్థానం లో , ఉతికి మడతల తో బట్టలు .. 

నా ఆఫీసు చిరాకులు ,పరాకులు ,రాని ప్రమోషను 
మీద ధుమ ధుమలు ఎవరి మీద చూపిస్తాను ?
తనే అలసిపోయి ఆఫీసు నించి వస్తే, ఇంత 
చదువు చదివాను ,ఇంట్లో కూర్చోడానికా ?
అవును ఇద్దరం ఒకే చదువు చదివాం కదా. 

ఏమ్బియే .. నాకన్నా గొప్ప మానేజరు ,ఇల్లు 
ఎంత చక్కగా మానేజ్ చేసింది ఇంత కాలం .. 
ఎంత ప్లాన్నింగ్, ఎంత సేవింగ్, ఎంత తెలివి 
అంతా నాకే సొంతం ..నా ఇంటికే, నా ఒక్కడికే 
అనే స్వార్ధం .ఎంత హాయిగా ఉందో ఇన్నాళ్ళు .. 

నేను ఇప్పుడు వెళ్లి ఆవిడని బతిమాలి ,,ఓహు.. 
మగవాడిని ..నాకే ,అయ్యో, ఇదేమిటి ? నేను 
ఇలా మాట్లాడుతున్నాను, నేను వేరు అనే కదా 
తను నన్ను ఇష్ట పడి ,ప్రేమించి ,పెళ్లి చేసుకుంది . 

ఏమో ఎక్కడి నించి వచ్చి కూర్చున్నాయో . ఈ 
మాటలు, ఈ భావాలు, అయ్యో నేను కూడా ఇంతేనా 
అందరి లా మగ వాడినా ? ఆమె కి ఎంత అసహ్యం 
అలాంటి వారు అంటే, ఇప్పుడు ఎలా ?

నా లో ఉన్న ఈ భాష, భావాలు ఊడపీకి 
పారేయడం ఎలా? 
ఆమె ని ఇంటికి ఆహ్వానించడం ..ఎలా ?
మా బాబు కి అమ్మని , నాకు సహచరి ని 
ఎలా ?? ఎలా ? తిరిగి తీసుకు రావడం ?

తల పట్టుకున్న అతనికి ఒక్కటే 
తోచింది, తన లో అణిగి ఉన్న ఏవో 
భావ జాలం ని పైకి లాగి నాలుగు 
ఝాడించాలి , ఆమె కాళ్ళు పట్టుకుని 
అయినా వెనక్కి పిలవాలి, ఈ ఇల్లు 
ఆమె లేకపోతే నాలుగు గదులు , అంతే 
ఇంటి గా మార్చే ఆమె కి స్వాగతమ్.. 
నేను ఆమె భర్త గా ఇంకాస్త మెరుగు పడాలి 
ఆమె భర్త స్థానానికి ఇంకా అర్హత సాధించాలి . 

ఈ మౌనం ,ఈ నిశ్శబ్దం తోసేసి 
ఆమె నవ్వుల కిల కిలల తో నింపాలి .. 
అతను పైకి లేచి, ఒక్క అడుగు వేసాడు . 
ఒక్క అడుగు .. ముందుకు వేసాడు .









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి