"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మార్చి, 2013

ఒక పూవు వికసించింది...


 

ఒక పూవు వికసించింది .. 
ఒళ్ళంతా మెరుపు రంగు 
మధ్యలో పసుపు రంగు పుప్పొడి 
వికాసమే తన పేరు 
వినయమే లేని హొయలు 
గాలి స్పర్స కి పులకిస్తూ 
కొమ్మ నంటి పెట్టుకున్న 
తన ప్రాణ వాహిని ని 
అతలా కుతలం చేస్తూ 
ఒళ్లంతా మిడిసిపాటు .. 

ఒక్క క్షణం ఆగు తల్లి 
నువ్వింకా ఇప్పుడిప్పుడే 
పుట్టిన పుష్పానివి 
నీ మకరందం నీలో దాచుకో 
కొద్దిగా నైనా నీ వయ్యారం 
తగ్గించుకో ,అని తల్లి మొక్క 
ప్రతి క్షణం మందలిస్తునే ఉంది 

యవ్వన భారం, 
గర్వం ఎక్కడా తల కి ఎక్కనివ్వవు 
తల్లి చెప్పే పాత నీతులు . 
అమ్మా ,పుట్టినందుకు 
నీకు ఇలా పూవై పుట్టినందుకు 
నాకెంత గర్వమో ? 
అయినా పూవు ఉనికి కి అర్ధం 
తుమ్మెదని ఆకర్షించడమే కదా 

అంతే కదా ,నా అందానికి 
ఆకర్షింపబడని తుమ్మెద ఉందా ?
నా రంగు, మేని చమకు 
నా మత్తెక్కించే పరిమళం 
ఎక్కడెక్కడి తుమ్మెదలు 
ఘంకారం చేస్తూ నా వెనక పడవలసిందే .. 

తల్లి మొక్క నిట్టూర్చింది 
ఎన్ని చెప్పినా ,ఈ పూబాలలకి 
తల కెక్కే వయసా ఇది. 
కానున్నది కాక మానదు .. 
అంతా సృష్టి లీల .. 
నా పని , కొమ్మ కొమ్మ కు 
పూలని ఉత్పత్తి చేయడమే 
నా కొమ్మ లు పూలతో నిండి 
గాలి కి తలలూపుతూ . 
ఆహా ఎంత హాయి కదా .. 

ఈ పుడమి ని అందం గా 
తీర్చి దిద్దే బాధ్యత నాకు అప్పచెప్పిన 
నా పని. ఈ చిన్న ప్రదేశం లో 
నేను పెరిగి,మారాకులు వేసి 
భూమాత ఒడి లో వేళ్లుని 
ఇన్నాళ్ళకి ఒక పూబంతి ని కూడా 
కన్నాను నా కొమ్మ మీద 
నా జవసత్వాలు అప్పజెప్పి.. 

ఈ పూబాల ఎంత సొగసు గా ఉందొ ?
నా దృష్టే తగిలేలా ? అప్పటికి 
తన అమాయకత్వం ని కప్పి 
పుచ్చడానికి నేను నా ఆకుల మాటున 
కప్పెస్తున్నాను , ఈ పూ బాల ఎంత 
అమాయిక ? ఆకులని 
తోసుకుని , విరగబడి 
పుష్పించాను చూడండి అంటూ 
అందరి దృష్టి ఆకర్షిస్తుంది . 

చిట్టి పిల్లా, పూల బాలికా 
ఇటు రా,నిన్ను దాచని అంటూ 
నేను రోజూ కలవరం .. 
నిన్న వచ్చిన ఆ తోట మాలి కంటి 
నుండి , అమ్మా పువ్వు పూసిందే 
అంటూ వచ్చిన ఆ మానవ బాలిక 
నించి ఎంత కష్ట పడి దాచాను ?

కాసింత మొగ్గ లాగ ముకుళించుకో 
నువ్వు ఇంకా వికసించడానికి 
సమయం ఆసన్నం అవలేదు అంటే 
ఏమిటో ఈ పూబాల తొందర? 
ఎక్కడో తుమ్మెద ఘంకారం ,
ఆకర్షణ రొద చెవిన పడింది .. అమ్మో 
ఈ పూల బాల ని ఎలా ? ఎలా ?
ఈ పూట కి నా తల్లి రెక్కల కింద 
దాచి పెట్టడం? అయ్యో ఆ ఆకులు 
పండి, ఎర్రగా ,ఈ పూబంతి కి 
మరింత ఆకర్షణ అయి కూర్చున్నాయి 

ఇంతేనా ? నా అమ్మతనం , నా ప్రేమ 
ఈ యవ్వన ఆకర్షణ ఆపద
నించి రక్షించ లేవా ? సృష్టి ధర్మమే 
గొప్పదా? ప్రభూ ... నాకు నీ సందేశం ఇదేనా ??

తుమ్మెద ఘీంకారం 
ప్రభంజనం లా మదమెక్కిన ఏనుగు 
పద ఘట్టం లా దగ్గరవుతూ 
అమ్మ మనసు రెప రెప 
ఆ రోజు పూబాల మరింత ఎర్రగా , 
పూల లో పూలకే ముద్దు వచ్చేలా 
ఎంత అందం గా ఉందో ?

పసిడి కిరణాలని తన లోకి 
లాక్కుని , చెక్కిళ్ళు నునుపు గా 
చెక్కుకుంది, పక్క పూ బాల ల నిండి 
పుప్పొడి అరువు తీసి అద్దుకుంది , 
గాలి లోచెమ్మతనానికి ,తన 
పరిమళం సుతిమెత్తగా అద్దింది 
తుమ్మెద మరి ఏ పూల కొమ్మ 
వద్ద ఆగకుండా ,తిన్నగా తన 
వద్దకే వచ్చేలా తనువంతా మన్మధ 
బాణం చేసింది .. 

అమ్మ ,కొమ్మ ని చూసి 
నిట్టూర్చింది ,ఇంకా నేను చిన్న మొగ్గ ని 
కానమ్మ ,పూర్తిగా వికసించిన పుష్పాన్ని 
నా జన్మ ధన్యమయే క్షణం ఆసన్నమయింది 
ఇంక నన్ను ఏ శక్తి ఆపలేదు ..ఈ రోజు 
నన్ను సమర్పించుకునే రోజు .. నన్ను 
ఆశీర్వదించు అంటూ 
ఒక్క క్షణం రెప రెప లాడింది .. 

ఇంత లోనే ,వచ్చింది తుమ్మెద 
తన లో తీయని బాధకి సమయం 
ఆసన్నమయింది .. 
అని ఎవరో గుస గుస గా రహస్యం 
చెప్పేరు. పూబాల తన రెక్కలతో 
తనని కప్పుకుందాం అని ఒక్క క్షణం
తలబోసింది, ఆ తడబాటు సమయం 
చాలు ,గండు తుమ్మెద తనలోని 
తీయదనాన్ని లాక్కున్నట్టు 
ఒక తీయని బాధ ని అనుభవించింది .. 
అంతా కలిపి ఒక్క క్షణం ,ఒక లిప్త 
ఇంతేనా ? దీని కోసమేనా ? ఇంత 
ఎదురు చూపు, గగుర్పాటు . 

పూబాల డస్సి పోయింది, 
ఎన్నడూ లేనట్టు ,ఎండ తీక్షణం 
అనిపించింది, వాడి పోయానా ?
అని బెరుకు చొరబడింది .. 
అయ్యో ,అమ్మ కొమ్మ మాట 
విని ,మరో రెండు రోజులు 
ఆకుల చాటున గుట్టుగా 
ఉండ వలసినది అంటూ కొంత 
విలపించింది .. 

ఎదురుచూసినంత సేపు లేదు 
ఆ యవ్వన అనుభవం .. 
ఒకరు చెబితే వినే వయసా నాది 
నా యవ్వన ప్రభ కి అప్పుడే 
అంతం అయిపోయిన , కోల్పోయిన 
సుతారమయిన భీతి తో మేని 
వాడి పోయింది, రెక్కలు ముకిళించాయి 
ఎదురు చూపుల అలసట తీరింది 
అనుభవాల అలసట మొదలయింది .. 

అమ్మ వేపు దీనం గా చూసింది 
నన్ను నీలో దాచేసుకో అమ్మా 
అంటూ , ముకుళిత హస్తాలతో 
ప్రార్ధించింది .. 

చెట్టు కొమ్మ ఏమి చేయలేని 
నిస్సహాయత తో , వల వల 
గాలి తో ఊగింది, మరో పూబాల 
అమ్మ కొమ్మ కి దూరం అయేనా ?
ఏమో ? లేదా , పరాగ క్షణాల 
ఫలితం ,ఒక పండై పండేనా ?? 

తరం ,తరం నిరంతరం 
ఈ సృష్టి ఇలా అనంతం గా 
సాగిపోని , నాలుగు రోజులు 
విరగబాటు, కొన్ని క్షణాల హాయి 
వెనువెంట .. లయమో ? 
జననమో ? ఇదేనా ?? ఇంతేనా ??

మరో కొమ్మకి మరో పువ్వు పూసింది .. 




చలం ఓ పువ్వు పూసింది ..కి అనుసరణా ? అని అనుమానం వస్తే ,ఏమో నే మో అంత లేదేమో ?? అనే నా సమాధానమ్. 

2 కామెంట్‌లు:

  1. వసంత గారు అద్భుతం మీ కవిత్వం.....రాస్తూనే ఉండండి, ఆపకండి....మీ ఈ కవిత్వానికి కామెంట్ పెట్టాలంటే మొత్తం ఈ పోస్ట్ ను పేస్ట్ చెయాలి...అదే నా స్పందన అవుతుంది...really superb.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్ యూ సో మచ్.
      నాకు చాల సంతోషం గా ఉంది ,మీకు నచ్చినందుకు ..
      వసంతం.

      తొలగించండి