"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 మార్చి, 2013

కవిత్వం ట...

కవిత్వం ట , నాలో ఎప్పుడు ఎలా పుట్టిందో చెప్పలేను 
నా చిన్నప్పుడు నాకు చాలా బాధ వస్తే ఒక పుస్తకం పట్టుకు ని చదువుకుంటూ కూర్చుంటే ,ఆ బాధ అంతా ఆ పుస్తకాల పుటలలో ఎప్పుడో ,ఎక్కడికో పారిపోయేది . 
ఓహో పుస్తకం కి ఇంత  మహత్యం ఉందా అని ఆ మాయ లో పడి పొయాను. 

రైలు ముందుకి పరుగెడు తూంటే , కిటికీ బయట కనిపించే చెట్లు పొలాలు ఆ రైలు కట్ట పక్క నిలుచుని చెయ్యి ఊపుతున్న ఆ పిల్లాడు ... నిజం గా వెనక్కి పరుగెత్తరు అని బుద్ధి చెపుతున్నా ,ఊహ మటుకు ,వెనక్కి ఎక్కడి కి ఏ ప్రపంచం లోకి మాయం అయిపోతారు ? అని ఆలోచనలే కవిత్వమ్. 

శ్రీ శ్రీ రాసిన మరో ప్రపంచం ఉంది ఉంటుంది అని గట్టిగా నమ్మి ఏదో ఒక జెండా పట్టుకుని ,ఎర్రెర్రని జెండా నచ్చింది అప్పట్లో , మాతో పాటూ ఈ ప్రపంచం ఎందుకు కదిలి రాదు మేము ఇంత గట్టిగా నినాదాలు ఇస్తున్నామే 
అని నిర్ఘాంత పోయి , అసలేం కావాలి ఈ సమాజం కి అని ఆలోచనలే కవిత్వమ్. 

చలం పుస్తకాలు చదివి ఆ మాయ లో, ఆ ప్రేమ మాయ లో పడి , అబ్బ ఈ పువ్వు ఎంత బాగుందో ? ఈ పిట్ట భలే పాట పాడుతోందే అని ,ప్రకృతి మాయ ఒక్కటే నిజం, మిగిలినదంతా మాయ,అని గట్టిగా నమ్మి , జీవితం అంతా ప్రేమ ,అదొక్కటే నిజం అని కళ్ళు తెరచి కలలు కనడమే ..కవిత్వమ్.

కుటుంబం , వారి సంక్షేమం ,వారి మంచి చెడ్డలు కి అంకితం అయిపోయే సరికి బాహ్య ప్రపంచం తో సంబంధం ఏదయినా మిగిలింది అంటే ,నా గురించి నేను వేసుకున్న ప్రశ్నలే కవిత్వమ్. 

ప్రపంచం బాధ నాది , అన్న శ్రీ శ్రీ ఇష్టమే నా బాధ ప్రపంచం ది అన్న దేవులపల్లి కూడా ఇష్టమే, పలుకు ,పదం లో నాట్యం , సంగీతం అన్ని కళలు చూపించే కవిత్వం అంటే కవిత్వమ్. 

మనం బయట ఉన్న లక్ష లాది మంది తో ఒక్క సారి ,ఒకే సారి వారధి వేయాలంటే , పదాలు అనే వంతెన ఒక్కటే మార్గం ,అనే మెలకువే కవిత్వం . 

మన చేతనా , మన స్పృహ ,మన ఆలోచన, మన వివేకం మన విచక్షణ , మన  ప్రేమ ,మన బాధ, మన లో మనం చేసే సంభాషణలు కవిత్వమ్. 

నువ్వు నిన్ను బయట పడేసుకుని లోపల అంతా శూన్యం ఆవరించు కోవడం , అది ఒక బాధో ఒక సంతోషమో ,తెలియని స్థితి లో వేలాడడం కవిత్వమ్. 

నిన్ను నువ్వు పోగొట్టుకుంటూ ఏదో పొందావని భ్రమ పడడం కవిత్వమ్. 

నీ శ్వాస నిన్ను బ్రతికిస్తుంది .. 
నీ పదం నిన్ను బతక నిస్తుంది .
నీ కవిత్వం నీకు రూపం పోస్తుంది . 
ఒక గ్లాసు లోపోస్తే గ్లాసు రూపం . 
ఒక సరస్సు లో ఒంపితే దాహం తీర్చే జలం .. 
ఒక నది లో కలసిందా ,ఇక పయనం సంద్రం వరకు .. 
జలం కి ఉన్న ప్రవహించే గుణం కవిత్వం కి ఉంది .. 

నా పదాల ఝరి  నన్ను ఏ తీరానికి తీరుస్తుందో .. 
నా కవిత్వం నన్ను ఏ ఒడ్డున తెచ్చి పడేస్తుందో 
నా కవిత్వం మరి ఎవరిని తాకి , ఎవరి పయనం లో కలుస్తుందో 
అలా ఊహిస్తూ ,పయనిస్తూ నిరంతరం ..ఈ పయనమే కవిత్వమ్. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి