"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

8 మార్చి, 2013

అనుభూతి ...

పొరలు పొరలు గా ,అరలు అరలు గా 
నా లోపల ఉన్న బుద్ధి నంతా తీసి ,
ఉల్లి పాయ తొక్కల్ని ఒలిచినట్టు ,
ఒక్క అనుభూతి మాత్రమే మిగలాలని 

బుద్ధి , ఆలోచన ,స్పృహ తో సంబంధం లేని 
అనుభూతి ,అంతే, ఒక పూరెక్క నీ మీద 
వాలితే ,అనుభూతి ... బుద్ధి ,స్పృహ తో 
సంబంధమే లేని అనుభూతి ని పొందాలని 

నా తాపత్రయం .. నువ్వు కోరుకుంటే 
నువ్వు కావాలి అంటే ,రానే రాదు.. 
నువ్వు ఎటో చూస్తున్నప్పుడు ,ఒక్క 
సూర్యుడి ఆఖరి కిరణం నీ మీద సూటి గా 
వాలి ,నిన్ను వెలిగించినప్పుడు ,వస్తుంది . 

నేను కళ్ళు తెరిచి ,తపస్సు చేసినా దొరకదు 
ఆ అనుభూతి, నేను మెలకువగా ,ప్రయత్నం గా 
వెదికితే దొరకదు , నేను తలకిందులు గా 
తపస్సు చేసినా , చేతి కి అందిన గాలి లా 

ఊరికే ,అలా తగిలి ,చేతి మీద చెమట గుర్తు 
గా మిగులుతుంది, నేను వెన్ను నిమిరే 
ఒక గాలి స్పర్శ ని గుర్తు పడతాను ,అది 
ఎప్పుడో ,అదాటున వస్తుంది, నేను ఆదమరచి 
నా పనిలో నిమగ్నమైనప్పుడు ... జలదరిస్తాను.. 

ఎప్పుడో ,ఎక్కడో ఇలాగే ఒకసారి నాకు దొరికింది 
ఈ అనుభూతి అనే దేజావు ... నాకు మిగిలిన 
అనుభూతి, జీవితమంతా దేని కోసమో అన్వేషణ .. 
ఇదేనేమో , ఈ అనుభూతి కోసమే నేమో అని ... 

పూవు కొమ్మ నించి రాలే ఏ క్షణం లోనో 
నేను చేయి పట్టి ,ఎదురు చూస్తాను ,
నేను ఎదురు చూసే ఏ క్షణం లోనో ,
మరో పూవు పండై ,పగిలి పోతుంది .. 

అలాంటి వ్యర్ధ నిరీక్షణ నాది.. 
అనుభూతి కోసమో ? మరి అలాంటిదే 
ఎప్పుడో కలిగిన ఒక అనుభూతి కోసమో 
ఏది నిజమో ? ఏది దేజావూ ????
ఏది నిజమైన అనుభూతి ?
అనుభూతి కోసమే అనుభూతి ఇది నిజం .. 
ఇది నిజం ... 






2 కామెంట్‌లు: