"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 మార్చి, 2013

నేను ...

నేను ... 
నేను అంటే ఏమిటి ? 
అంటూ ఎంతో శోధన 
కాసింత పదాలు 
కాసింత కవిత్వమ్.. 
అక్షరాలు మరి కొన్ని ... 

అవి కావు .. 
కాసింత నిప్పు, 
కాసింత భూమి, 
కాసింత గాలి ,
కాసింత ,వెలుగు 
కాసింత నీరు ట .. 

నా చుట్టూ ఓ పది మంది 
ఉంటారేమో , నా చుట్టూ 
ఓ నలుగురు అత్యంత 
ఆత్మీయులు ఉంటారా? 
నావి అంటూ ఏమున్నాయి అసలు ?

నావి అంటూ కొంత అభిజాత్యమ్.. 
నావి అంటూ కొంత అహంకారం 
నావి అంటూ కొంత కాదు కొండంతేమో 
అహంకారం ..నేను అనే అహమ్. 

నేను లేక పోయాక ఏం మిగులుతుంది ?
నేనుండే జాగా లో కాస్త గాలి, ఎడం,
కాస్త వెలుగు నా? కాదా చీకటేనా ?
అయ్యో వెలుగు ఉంటే  బాగున్ను . 

నేను అంటూ ఎవర్లోనయినా కొంత 
మిగులుస్తానా ? ఏమో .. 
ఎంత అత్యాశ ? నువ్వు ఇంకా నువ్వు 
పోయేక కూడా మిగిలాలని . 

నేను అనే ఊహే పోవాలి ట ,
తామరాకు మీద నీటి బొట్టు లా 
అంటి ముట్టక ఉండాలి ట ,అమ్మో 
నేను నావాళ్ళు అంటూ అందరిని 
కావలించుకుంటానే , వద్దు ,తప్పు ట . 

నువ్వు నిన్ను తప్ప ఎవరిని అంతగా 
ప్రేమించవు ట , వద్దు చెప్పొద్దు ,అబద్దం . 
నువ్వు నిన్నే కావలించుకుంటావు . 
పై పై కి ఎన్నోచెపతావు , కాని నీకు తెలియదా ?


ఏమో మరి అంటూ తప్పించుకోకు 
నువ్వు ముఖ్యం ,నేను అత్యంత 
ప్రాముఖ్యం , నా తరవాతే అందరూ . 
నీకు తెలియదూ లో లోపల . 

పై పై కి మటుకు , విశ్వం అంతా నాది 
విశ్వ ప్రేమ నాది అంటావు, సూది గుచ్చితే 
ఒచ్చే రక్తానికే హమ్మో అంటావు, ఒంట్లో 
రక్తం అంతా పోయినట్టు ,గొల్లు మంటావు . 

నేను .. నేనే ... అవును నేనే .. 
ఎవరిని కలపకు ,సరదాగా అలా 
షికారు వెళ్లినట్టు మనం అంటావు . 
నీకు తెలుసు కదా నేను అంటే నేనే 
ఉత్త నేను అని . 

నేను వెళ్లి పోయాక మిగిలిన జాగా 
అంటూ ఏమి ఉండదు లే .. 
అంతా పెద్ద గాలి లా ,ఊరికే అలా 
తిరుగుతూ ఉంటుంది, నిన్నటి వరకు 
నువ్వు తిరిగిన జాగా లో .. అంతే 

అదే ,అప్పుడయినా ఆ గాలి 
అందరిని స్పర్సిస్తే బాగుండును . 
ఇప్పుడు నేను చేయలేని పని 
అప్పుడు ,నా జాగా లో ఉన్న గాలి 
చేయ గలుగుతుందా ? 

అదే ,అంతే అంతా గాలి మయం 
ప్రాణ వాయువు ఉన్న సంచులం.. 
మనం అంటే ,నువ్వు ,నేను అందరం 
నేను అంటే ఇంకా ప్రత్యేకం ఏం ఉంది ?

నేను నేనే .. 
నేనే అనే ఊహ 
నేను అనే సత్యం . 
నా నొప్పి నాదే, 
మరి ఇంకా ఎందుకు అసత్యం 
నేను ,నువ్వు వేరు కాదని . 

ప్రేమ అంత అసత్యం మరోటి 
లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత 
మరేవరిని ప్రేమించవు.. ఇంకా ఎంత కాలం ?
ఈ ఆట ? నేను అనే సత్యం తెలిసినా 
తెలియనట్టు అబద్దం గెలుస్తుందనే ఆట .. 

ఇంకా చాలు ,
నేను అంటే నేనే .. 
తెలిసింది గా 
మరి కొన్ని అక్షరాలయినా 
విరజిమ్మి పో, నీ తరువాత 
మొలకెత్తి ,వృక్షాలవుతాయి 
అవును ... నేను ... తెల్సుకున్న 
సత్యం .. ఇది. ఇదే .. ఇంతే .. 
నేను ఒక పదార్దమే ... 
నేను ఒక ఊహే ,ఒక భ్రమే 
నేను ఒక మహా భ్రమ .. 
నేను ఒక యజ్ఞం ..మేము గా 
మారేనా ? యజ్ఞానికి సమిధి అయేనా ?

ఎప్పటికి అంతు చిక్కని 
ప్రహేళిక నేను ,అడ్డం , నిలువు 
సులువు లు తెలుసు ,గడులు 
అన్ని నింపి కూర్చున్నా ,అయినా 
ఈ ప్రహేళిక నిండదు ,ఒక్క గడి 
ఒక్క క్లూ దొరకదు, ఆ ఒక్కటి 
కోసం ,నా ప్రయత్నం అంతా .. 

నేను అంటే అప్పుడే తెలుస్తుంది . 
రోజు ,రోజు ఆ ఒక్క గడి నింపడానికే 
నా సమయం అంతా వృధా ,
నా సమయం అంతా ప్రయాస.. 

నేను అంటే నేను తెలుసుకున్న రోజు 
గొంతెత్తి అరుస్తాను, మీరు కూడా 
రండి, గొంతు కలపండి , నేను కి 
జయహో అని గొంతు కలపండి .. 

నేను ..నేను...  నేను 
మర్చిపో ... 
అప్పుడే నేను కనుక్కో .. 
అప్పుడే నువ్వు దొరికిపో .. 











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి